బండి సెల్ ఫోన్ కేసీఆర్ చేతుల్లో?
posted on May 10, 2023 @ 3:15PM
తెలంగాణ బిజేపీ చీఫ్ బండి సంజయ్ సెల్ ఫోన్ ముఖ్యమంత్రి కెసీఆర్ ఎత్తుకెళ్లారని ప్రస్తుతం హాట్ టాపిక్ అయ్యింది. తనను అరెస్ట్ చేసిన పోలీసులే తన సెల్ ఫోన్ ఎత్తుకెళ్లి ముఖ్యమంత్రి చేతిలో పెట్టారని వార్తలు వినిపిస్తున్నాయి. సిద్దిపేట వరకు వచ్చే వరకు సెల్ ఫోన్ ను భధ్రంగానే ఉంచారని అక్కడి నుంచే మాయమైందని సంజయ్ అనుమానం వ్యక్తం చేశారు. కరీంనగర్ టూటౌన్ పోలీసులు తనను కస్టడీలోకి తీసుకున్న మరుసటి రోజు బండి సంజయ్ ఈ షాకింగ్ కామెంట్స్ చేశారు.
తన సెల్ ఫోన్లో కాల్ లిస్ట్ చూడటానికే కేసీఆర్ పోలీసుల చేత ఈ దొంగతనం చేయించారని బండి సంజయ్ ఆరోపించారు. తనను కస్టడీలో తీసుకుని సెల్ ఫోన్ ను కేసీఆర్ మాయం చేయించారని ఆయన ఆరోపిస్తున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు చాలామంది తనతో టచ్ లో ఉన్నట్లు బండి సంజయ్ చెప్పారు. పదవ తరగతి ప్రశ్నాపత్రం లీకేజీ విషయంలో తన పాత్ర ఉందని కేసీఆర్ ప్రచారం చేశారని బండి గుర్తు చేస్తున్నారు. వరంగల్ సీపీ తన కాల్ లిస్ట్ బయటపెట్టడాన్ని సీరియస్ గా తీసుకున్న బండి త్వరలో సీపీ మీద పరువు నష్టం కేసు వేస్తానన్నారు. రానున్న అసెంబ్లీ, లోకసభ ఎన్నికల్లో తెలంగాణలో బిజేపీ, బీఆర్ఎస్ మధ్యే పోటీ ఉంటుందని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. దళిత బంధులో నిధులు దుర్వినియోగం అవుతున్నాయని, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు మూడు లక్షల కమిషన్ అందుతుందని పార్టీ అధినేత ఇచ్చిన స్టేట్ మెంట్ రాజకీయాల్లో అప్పట్లో చర్చనీయాంశమైంది. ఆ 30 మంది ఎమ్మెల్యేలకు టికెట్లు రావని కేసీఆర్ ఇప్పటికే ఖరా ఖండిగా చెప్పారు. ఇక్కడ టికెట్లు రాకపోతే బిజేపీలో చేరతారు అని ఊహించే కేసీఆర్ ఈ సెల్ ఫోన్ మాయం చేశారనే వార్తలు వినిపిస్తున్నాయి. 30 మంది ఎమ్మెల్యేలు బండి సంజయ్ తో టచ్ లో ఉన్నట్లు వార్తలు ఎక్కువయ్యాయి. బీఆర్ఎస్ తో పాటు ఇతర పార్టీలకు చెందిన నేతల పేర్లను తెలుసుకోవడానికే సెల్ ఫోన్ మాయం అయినట్లు కూడా వార్తలు వస్తున్నాయి.