పెట్టుబడులు ఎవరికో మరి
posted on May 10, 2023 @ 5:57PM
రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ మరోసారి రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించే పనిలో పడ్డారు. రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టడానికున్న అవకాశాలు, తెలంగాణ సర్కార్ పారిశ్రామిక వేత్తలకు వేస్తున్న రెడ్ కార్పెట్ గురించి వివరించడానికి మంత్రి కేటీఆర్ ఈ సారి యూకే కు బయల్దేరారు.
మే 11, 12 తేదీల్లో లండన్‌లో జరగనున్న ‘ఐడియాస్ ఫర్ ఇండియా’ సదస్సు రెండో ఎడిషన్‌లో మాట్లాడాల్సిందిగా తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కెటి రామారావును గ్లోబల్ అడ్వైజరీ సంస్థ ఈపీజీ ఆహ్వానించింది.రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించే లక్ష్యంతో కేటీఆర్ యూకే పర్యటన ఈ నెల 13 వ తేదీ వరకు కొనసాగనుంది. పర్యటనలో భాగంగా కేటీఆర్ ఆయా దేశాల పారిశ్రామికవేత్తలు, వాణిజ్య సంఘాలతో భేటీ కానున్నారు. రాష్ట్రంలో పెట్టుబడుల అనుకూలతల గురించి ఆయన వివరించనున్నారు.అయితే గతేడాది మే లో మంత్రి కేటీఆర్ రాష్ట్రంలో పెట్టుబడులు ఆకర్షించడానికి లండన్ లో పర్యటించారు. ఈ పర్యటనలో భారత హైకమిషన్ సమావేశంతో పాటు ప్రవాస భారతీయలు, యూకే ఇండియా బిజినెస్ కౌన్సిల్ ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశాల్లో ఆయన పాల్గొన్నారు. పలు ప్రతిష్టాత్మక సంస్థల అధిపతులతో ఆయన భేటీ అయ్యారు.అయితే ఈ పర్యటన మంచి ఫలితాలను ఇచ్చింది. లండన్ కు చెందిన పలు కంపెనీలో మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చాయి. దీంతో ఈ సారి కేటీఆర్ యూకే పారిశ్రామిక వేత్తలను టార్గెట్ చేశారు.
తెలంగాణాకు పెట్టుబడులు తేవాలన్న లక్ష్యంతో యూకే బయలు దేరిన కెటీఆర్ ఇక్కడి ప్రభుత్వ స్థలాలను పెట్టుబడిదారులకు కట్టబెట్టడానికే ఈ పర్యటన అని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.
తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మంగళవారం బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావుకు ఒక సవాల్ చేశారు. దమ్ముంటే భూకబ్జాలు, ఖరీదైన ప్రభుత్వ భూములను కార్పొరేట్ ఆస్పత్రికి విక్రయించడం తదితర ఆరోపణలన్నీ అవాస్తవమని నిరూపించాలని సూచించారు. గాంధీభవన్‌లో విలేకరులతో మాట్లాడిన రేవంత్ రెడ్డి ఢిల్లీ మద్యం కుంభకోణంలో నిందితులకు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన భూముల వివరాలను కూడా వెల్లడిస్తానని చెప్పారు. నిబంధనలను తుంగలో తొక్కి బిల్డర్లకు అనుమతులు ఇస్తున్నారని, బహుళ అంతస్తుల భవనాలకు అనుమతులివ్వడమేంటని కేటీఆర్‌ను ప్రశ్నించారు. ఈ నేపథ్యంలోనే కెటీఆర్ యుకె పర్యటన వివాదాస్పదం కానుందని విశ్లేషకులు అంటున్నారు.