విశ్వనగరం కాదు ఉగ్ర నగరం!
posted on May 11, 2023 @ 1:33PM
హైదరాబాద్ నగరం ఉగ్రవాదులకు షెల్టర్ జోన్ గా మారిందా? విశ్వనగరం అంటూ బీఆర్ఎస్ ఒక వైపు గొప్పలు చెప్పుకుంటుంటే మరో వైపు రాష్ట్ర రాజధాని ఉగ్రనగరంగా మారుతోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ అయితే హైదరాబాద్ ప్రజలు బాంబులపై నివసిస్తున్నారని, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొందనీ ఆందోళన వ్యక్తం చేశారు.
ఉగ్ర లింకుల ఆరోపణలపై అరెస్టైన సలీం ఒవైసీకి చెందిన డెక్కన్ మెడికల్ కాలేజీలో శాఖాధిపతిగా పనిచేస్తుండాన్ని ప్రస్తావించిన ఆయన ఎంఐఎం పార్టీ ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తోందని ఆరోపించారు. 2016 జులైలో అరెస్టయిన ఐసిస్ ఉగ్రవాదులకు బెయిల్ ఇప్పిస్తానని, న్యాయపోరాటం చేస్తానని ఒవైసీ చేసిన ప్రకటనను కూడా ఆయనీ సందర్భంగా గుర్తు చేశారు. హైదరాబాద్ నగరం ఉగ్రవాదులకు షెల్టర్ గా మారిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నా.. దేశంలో ఎక్కడ ఏ ఉగ్ర ఘటన జరిగినా హైదరాబాద్ లింకులు బయటపడుతున్నా కేసీఆర్ ఎందుకు నిమ్మకు నీరెత్తినట్లు ఉంటున్నారని నిలదీశారు.
ఓటు బ్యాంకు కోసం, అధికారం కోసం బీఆర్ఎస్, కాంగ్రెస్ లు మజ్లిస్ పార్టీతో కుమ్మక్కయ్యానని బండి విమర్శిస్తున్నారు. హైదరాబాద్ లో హిజ్జు ఉత్ తహరీర్ (హెచ్ యుటి) ఉగ్ర సంస్థతో సంబంధాలున్న ఉగ్రవాదులు పట్టుబడటంతో మరోసారి హైదరాబాద్ కు ఉగ్ర లింకుల అంశం తెరపైకి వచ్చింది. రసాయన, జీవ ఆయుధాలతో దాడులు చేస్తూ భయోత్పాతం స్రుష్టిస్తున్న హెచ్ యుటి కావడం.. ఆ సంస్థతో లింకులున్నాయంటూ హైదరాబాద్ లో అరెస్టులు జరగడం సహజంగానే హైదరాబాదీయులను తీవ్ర ఆందోళనకు గురి చేసింది.
లుంబినీపార్క్, దిల్ షుక్ నగర్ పేలుళ్ల ఘటనల ను నగర వాసులు యింకా మరచిపోకముందే.. మరో సారి నగరంలో ఉగ్ర మూలాలు బయటపడటం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే పాకిస్తాన్, బంగ్లాదేశ్ కు చెందిన పౌరులు వీసా గడువు ముగిసినా హైదరాబాద్ లోనే మకాం వేసి ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి.