ఇంటర్మీడియేట్ లోనూ మార్కులకు బదులు గ్రేడ్లు!
posted on May 11, 2023 @ 11:19AM
పదో తరగతి తరహాలోనే ఇంటర్మీడియేట్ లోనూ మార్కులకు బదులు గ్రేడ్లు ఇస్తే బెటరని తెలంగాణ సర్కార్ యోచిస్తోంది. మార్కుల పోటీతో విద్యార్థులపై తీవ్ర ఒత్తిడి ఉండడం, పలువురు ఆత్మహత్యలకు పాల్పడుతున్న నేపథ్యంలో గ్రేడ్ పాయింట్ యావరేజ్(జీపీఏ) ఇస్తే కొంతవరకైనా మానసిక ఒత్తిడి తగ్గుతుందని తెలంగాణ భావిస్తోంది. కొన్నేళ్ల నుంచి జేఈఈ మెయిన్, నీట్ ర్యాంకుల్లో ఇంటర్ మార్కులకు వెయిటేజీ లేదు. ఈసారి నుంచి ఎంసెట్ కూ శాశ్వతంగా వెయిటేజీ తొలగించారు.
ఈ క్రమంలో ఇంటర్లో మార్కుల బదులు గ్రేడ్లు ఇస్తే మన విద్యార్థులకు ఇతర రాష్ట్రాల్లో ఉన్నత విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు ఏమైనా సమస్య వస్తుందా? అన్న కోణంలో ఆయా అంశాలపై అధ్యయనం చేసి నివేదిక సమర్పించేందుకు నిపుణుల కమిటీని నియమించాలని బీఆర్ఎస్ సర్కార్ భావిస్తోంది. రాష్ట్ర, జాతీయ ప్రవేశ పరీక్షల్లో ఇంటర్ మార్కులకు వెయిటేజీ లేదని ఇంటర్ విద్య ఐకాస ఛైర్మన్ డాక్టర్ పి. మధుసూదన్ రెడ్డి అంటున్నారు.
ఎస్ఐటీలు, ఐఐటీల్లో చేరేటప్పుడు కనీసం 75% మార్కులు అడుగుతారని, అలాంటప్పుడు కొన్ని సమస్యలు తలెత్తే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో దోస్త్ ద్వారా డిగ్రీ ప్రవేశాలకూ ఇంటర్ మార్కులే ఆధారంగా ఉన్నందున నిపుణుల కమిటీ వేస్తే ఏదో ఒక పరిష్కారం లభించే అవకాశం ఉందని అంటున్నారు.
ఇప్పుడు ఇంటర్ మార్కుల కంటే జేఈఈ, నీట్ ర్యాంకులు వస్తాయో? రావో? అన్న దానిపైనే అధికంగా ఒత్తిడి ఉందనడంో సందేహంల లేదు. అనేక కారణంల వలన సరిగ్గా సాగని విద్యా సంవత్సరం, స్మార్ట్ ఫోన్ రంగప్రవేశం లాంటివి విద్యార్థుల ఏకాగ్రతకు భంగం కలిగించే అంశం. ఫలితంగా.. వారు పరీక్షలను ఒత్తిడి లేకుండా ఎదుర్కోలేక పోతున్నారు. ఈ నేపథ్యంలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు పదో తరగతి తరహాలోనే ఇంటర్ లోనూ మార్కులకు బదులు గ్రేడ్లు ఇవ్వాలనే తెలంగాణ సర్కారు ఆలోచన కార్యరూపం దాలిస్తే బాగుంటుందని విద్యార్థుల తల్లిదండ్రులే కాదు, విద్యారంగ నిపుణులూ అంటున్నారు.