తిట్ల పురాణాలను యికనైనా స్వస్తి పలుకుతారా?
posted on May 11, 2023 @ 12:59PM
తిట్ట పురాణాలే రాజకీయ విమర్శలుగా చెల్లుబాటు అవుతున్నాయి. రాజకీయాలలో భిన్నాభిప్రాయాన్ని హుందాగా వ్యక్తం చేయడమన్నది కనుమరుగైపోయింది. కొడాలి నాని మార్కు విమర్శలకే నాయకులు ప్రాధాన్యత యిస్తున్నారు. అయితే ఆ పరిస్థితి మారాలి. మారుతుందా అంటే తలసాని, రేవంత్ రెడ్డిల ఎపిసోడ్ లో తలసాని ఒక అడుగు వెనక్కు వేసి తన పిసుకుడు విమర్శను వెనక్కు తీసుకోవడం చూస్తే మారుతుందనే అనిపిస్తుంది. యింతకీ అసలీ పిసుడుకు విమర్శ, దానికి రేవంత్ రెడ్డి స్పందించిన తీరు రాజకీయాలలో భాషా దారిద్యం ఏ స్థాయికి వెళ్లిందో అర్ధమౌతుంది.
బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై విమర్శల వర్షం కురిపిస్తున్న పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి, బీజేపీ నేతలపై, తెలంగాణ సీనియర్ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ మాటలతో విరుచుకుపడ్డారు. పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి పేరెత్తకుండానే ఆ పొట్టోని నోటికి బట్టనే లేదు. ఎమ్మెల్యే లేదు. మంత్రులు లేదు. అందరినీ వాడు వీడు అని సంబోధిస్తున్నాడు. పిసికితే పోతాడు’’అని తలసాని చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. అందుకు అంతే దీటుగా రేవంత్ కూడ బదులిచ్చారు అది వేరే సంగతి. అయితే తలసాని తన వ్యాఖ్యలను వెనక్కు తీసుకుని తన మాట తూలుడును సద్దుకునే ప్రయత్నం చేశారు. తమ అధినేత కేసీఆర్ ను కించపరిచేలా విమర్శలు చేశారన్న ఆగ్రహంలో నిగ్రహం కోల్పోయి మాట తూలనని తలసాని హుందాగా అంగీకరించారు. బాధ్యతగల మంత్రిగా, రాజకీయ నాయకుడిగా నేను ఆవేదనతో , ఆగ్రహంతో చేసిన అనుచిత చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నానని ప్రకటించారు.
పార్టీలు వేరైనా ప్రత్యర్థులపై చేసే విమర్శలు అర్ధవంతంగా ఉండాలన్నదే తన అభిప్రాయమని చెప్పారు. వ్యక్తిత్వాన్ని వ్యక్తిని లక్ష్యంగా చేసుకుని విమర్శలు ఉండటం మంచిది కాదన్నది తన అభిప్రాయమనీ ఇకనైనా బాధ్యతగా మాట్లాడుతూ ఒకరినొకరు గౌరవించుకోవాని అన్నారు. అయితే తలసాని తనను పరోక్షంగా చేసిన వ్యాఖ్యలకు రేవంత్ రెడ్డి ఏమీ హుందాగా స్పందించలేదు. పేడ పిసికే అలవాటున్న తలసాని, పిసుగుడు గురించే మాట్లాడతారంటూ ఆయన కూడా మర్యాద గీతను దాటేశారు. ఆయన కూడా వెనక్కు తగ్గి తన అనుచిత వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆగ్రహంతో మాట తూలడం, ఆ తరువాత జరిగిన పొరపాటు తెలుసుకుని ఆ మాటను ఉపసంహరించుకోవడం రాజకీయాలలో గతం నుంచీ కూడా ఉంది. అయితే యిటీవలి కాలంలో అనుచిత వ్యాఖ్యలను సమర్ధించుకోవడం. మర్యాద గీతను ఎంత దాటితే అంత గొప్ప నేత అన్న భావన ఎక్కువ అవ్వడం కనిపిస్తోంది.
ముఖ్యంగా ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ నేతలు నోటికి పని చెప్పడం ద్వారానే తమ పార్టీ అధినేత ప్రాపకం పొందగలం అన్న భావనలో ఉన్నారని అనిపించక మానదు. ఏది ఏమైనా తలసాని తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుని ఆగ్రహంతో మాట తూలానని అంగీకరించడం హుందాగా ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ ప్రత్యర్థుల విమర్శలు ప్రతి విమర్శలూ మర్యాద గీత దాటిన సందర్బాలు చాలా అరుదు. అలా అరుదుగానైనా మాట జారిన నేత వెంటేనే వనక్కు తగ్గి క్షమాపణతోనో, తన వ్యాఖ్యల ఉపసంహరణతోనో దిద్దుబాటు చర్యలకు దిగేవారు. అయితే రాష్ట్ర విభజన తరువాత అటువంటి వాతావరణం పూర్తిగా మారిపోయిందని చెప్పాలి.
రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా బూతులూ, తిట్లే రాజకీయ విమర్శలు అనుకునే పరిస్థితి ఏర్పడింది. ఏపీలో వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని ఈ విషయంలో ప్రధమ స్థానంలో ఉండగా, తెలంగాణలో కూడా ఈ విషయంలో ఏమీ తక్కువ తినలేదు. ఈ నేపథ్యంలో మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్, తన వ్యాఖ్యలను ఉప సంహరించుకుని హుందాతనాన్ని చాటుకున్నారు. తెలుగు రాష్ట్రాలలో నేతలు యిక నుంచైనా మాటలు మీరే విషయంలో నియంత్రణ పాటించాలి. ఒక వేళ తూలినా.. హుందాగా ఆ విషయాన్ని అంగీకరించి ఉపసంహరించుకుంటే.. రాజకీయాలలో విలువలకు ఒక అర్ధం ఉంటుందని పరిశీలకులు అంటున్నారు.