15 ఏళ్లుగా తేలని ఆయేషా మీరా హత్య కేసు

అప్పట్లో తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఆయేషామీరా హత్యకేసులో సీబీఐ దర్యాప్తును ముమ్మరం చేసింది. 2007లో జరిగిన ఈ హత్యకేసులో అభియోగాలు ఎదుర్కొని నిర్దోషిగా విడుదలైన సత్యంబాబును అరెస్ట్ చేయాల్సిన కారణాల గురించి ఆరా తీస్తోంది. ఈక్రమంలోనే హైదరాబాద్ నగర కమిషనరేట్ సీఏఆర్ హెడ్ క్వార్టర్స్ జాయింట్ కమిషనర్ శ్రీనివాసులు నుంచి సీబీఐ అధికారులు గురువారం పలు వివరాలు సేకరించారు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో హైదరాబాద్ లోని సీబీఐ కార్యాలయంలోకి వెళ్లిన శ్రీనివాసులు రాత్రి 8 గంటలకు బయటికి వచ్చారు. ఆయన నుంచి 8 గంటలపాటు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని దుర్గా లేడీస్ హాస్టల్లో ఆయేషామీరా హత్య జరిగిన సమయంలోనే నందిగామ పరిసరాల్లో మరిన్ని నేరాలు నమోదయ్యాయి. ఆ సమయంలో శ్రీనివాసులు నందిగామ డీఎస్పీగా ఉన్నారు. నందిగామ ప్రాంతంలో జరిగిన వరుస నేరాలను దర్యాప్తు చేసేందుకు అప్పటి తూర్పుగోదావరిజిల్లా అదనపు ఎస్పీగా ఉన్న ఎ.వి.రంగనాథ్(వరంగల్ ప్రస్తుత కమిషనర్)ను అక్కడికి పంపించారు. దర్యాప్తులో భాగంగా అప్పటికే మరో కేసులో అరెస్ట్ అయి జైల్లో ఉన్న సత్యంబాబును విచారించి.. ఆయేషామీరా హత్య కేసుతో సంబంధమున్నట్లు పోలీసులు భావించి అరెస్ట్ చేశారు. ఈ వ్యవహారాల్ని శ్రీనివాసులు సైతం పర్యవేక్షించారు. అయితే ఆయేషామీరా హత్యకేసులో సత్యంబాబును నిర్దోషిగా విడుదల చేసిన నేపథ్యంలో హత్య ఎవరు చేశారని తేల్చేందుకు సీబీఐ మరోసారి దర్యాప్తు ఆరంభించింది. ఇందులో భాగంగానే అప్పటి కేసుకు సంబంధించి శ్రీనివాసులు నుంచి సీబీఐ అధికారులు వాంగ్మూలం సేకరించారు. ఘటన సందర్భంలో.. కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి కోనేరు రంగారావు మనవడి పేరు అప్పట్లో వార్తల్లోకి ఎక్కింది. రాజకీయ వత్తిడి కారణంగా అతని పేరు..ఆ తర్వాత అటకా ఎక్కిందన్న ఆరోపణలు ఉన్నాయి. కూతురిని పోగొట్టుకున్న అయేషా తల్లిదండ్రులు దాదాపు 15 ఏళ్లుగా కడుపు కోతను అనుభవిస్తూ కూడా న్యాయం కోసం పోరాడుతున్నారు.

ఓఆర్ఆర్ టెండర్ గోల్ మాల్.. కేసీఆర్ సర్కార్ పై మరో మరక

ఢిల్లీ లిక్కర్ కుంభకోణం .. టీఎస్పీఎస్సీ పేపర్ లేకేజి కుంభ కోణం.. ఇప్పుడు ..తాజాగా ఓఆర్ఆర్ కుంభకోణం. తెలంగాణలో జరిగిన కుంభకోణాలు ఇంకా ఉన్నా..ఈ మూడు కుంభకోణాల్లో ..ఒక కామన్ త్రెడ్’ కనిపిస్తుంది. అవును ఈ మూడు మేజర్ కుంభకోణాల్లో ముఖ్యమంత్రి .. ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు ఆరోపణలు ఎదుర్కుంటున్నారు. ఆఫ్కోర్స్  మిషన్ కాకతీయ, మిషన్ సిసన్ భగీరధ, మొదలు, కాళేశ్వరం ప్రాజెక్ట్, ధరణి పోర్టల్ వంటి ప్రాజెక్టులు, పథకాలలో అవినీతికి సంబందించి వచ్చిన ఆరోపణలు అన్నిటిలో ముఖ్యమంత్రి కుతుమాబ్ సభ్యుల పేర్లు ప్రముఖంగా వినిపించిన మాట నిజమే అయినా ఈడీ, సీబీఐ ఎంట్రీతో ఈ కేమూడు కేసులు రాజకీయంగానూ ప్రధాన్యత సంతరించుకున్నాయి. నిజమే అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి ఆరోపణలు రావడం పెద్ద విశేషం కాదు. ఇంచు మించుగా 25 సంవత్సరాలకు కొంచెం అటూ ఇటుగా  ముఖ్యమంత్రి, ప్రధాని వంటి కీలక పదవుల్లో ఉన్నా, కుటుంబ సభ్యులు ఎవరినీ, అధికారం గడప దాక కూడా రానీయని  ప్రధాని మోడీ పైనే ఆరోపణలు వచ్చినప్పడు, పీవీ, మన్మోహన్ వంటి పెద్ద మనుషులకే అవినీతి మరకలు తప్ప నప్పుడు ... తెలంగాణలో ఏకంగా ఐదారుగురు కుటుంబ సభ్యులు అధికార పదవులు అనుభవిస్తున్న ముఖ్యమంత్రి కల్వకుట్ల చంద్రశేఖర రావు ఫ్యామిలీ పై ఆరోపణలు రావడం విశేషం కాదు. అలాగే దళిత బంధు పథకం లబ్దిదారుల నుంచి మూడేసి లక్షలు (30 శాతం) లంచాలు పుచ్చుకున్న ఎమ్మెల్యేల చిట్టా చేతిలో  పెట్టుకుని కూడా ... చర్యలు తీసుకోని ముఖ్యమంత్రి కేసీఅర్ కుటుంబ సభ్యులపై చర్యలు తీసుకుంటారు అనుకోవడం కుదిరే వ్యవహారం కాదు.  నిజమే కావచ్చును తన  కొడుకు , కూతురు సహా ఎవరిపై అవినీతి ఆరోపణలు వచ్చినా ఉపేక్షించేది లేదని ముఖ్యమంత్రే స్వయంగా శాసన సభలో ప్రకటించి ఉండవచ్చును  కానీ  దళిత ముఖ్యమంత్రి హామీ లాగా అది జరగలేదు కాబట్టి దాని గురించి ఇప్పుడు మాట్లాడవలసిన అవసరం లేదు.  అయితే ఇప్పడు  ఓఅర్ఆర్ విషయంలో తీగలాగితే డొంకంతా కదిలింది అన్నట్లు. ఈ వ్యవహారంలో అటు నుంచి బీజేపీ ఇటు నుంచి కాంగ్రెస్ నాయకులు చేస్తున్న విమర్శలు చేస్తున్న సవాళ్ళు సర్కార్ ను ఇరకాటంలోకి నెట్టేస్తున్నాయి. అంతే కాదు  మళ్ళీ ఈ గోల్ మాల్ వ్యవహారంలోనూ మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత హస్తం ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతో పాటు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన రావు కేటీఆర్, కవితపై  రోపణలు చేయడమే కాకుండా  ఈ విషయంలో కేంద్ర దర్యాప్తు సంస్థల విచారణ కోరుతున్నారు. రాష్ట్రపతి దృష్టికి తీసుకు వెళ్లేందుకు సిద్దమయ్యారు.  ఇందుకు సంబంధించి తాజగా, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క హైదరాబాద్ నగరం చుట్టూ 158 కిలోమీటర్ల మేర ఉన్న ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్ఆర్)ను 30 సంవత్సరాల పాటు ప్రైవేట్ కంపెనీకి కట్టబెట్టడం సరైన పద్ధతి కాదని  అన్నారు.  ప్రైవేటు కంపెనీకి లీజు ఇచ్చే విషయంపై కోర్టుకు వెళ్తామన్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు కూడా లేఖ రాస్తామని స్పష్టం చేశారు.  మరో వంక రాష్ట్రప్రభుత్వం ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులపై అవినీతి ఆరోపణలు వచ్చినా ముఖ్యమంత్రి స్పందిచక పోవడం, అదే సమయంలో దళిత బంధు పథకం లబ్దిదారుల ఎంపికలో ఎమ్మెల్యేలు అవినీతికి పాల్పడుతున్నారని స్వయంగా ముఖ్యమంత్రి వారిని హెచ్చరించిన నేపధ్యంలో  ప్రభుత్వం ఇంకా పలచనవుతోందని, అవినీతి ముద్ర ముఖ్య్మగా కేసీఆర్ ఫ్యామిలీ అవినీతి ప్రధాన ఎన్నికల అంశం మారే అవకాశం ఉందని అంటున్నారు.

ఏపీఎస్ ఆర్టీసీలో మల్టీ సిటీ జర్నీ రిజర్వేషన్ విధానం

రైల్వే, విమాన ప్రయాణికులు తమ గమ్యస్థానానికి నేరుగా సర్వీసులు లేకపోతే.. మధ్యలో వేరొక చోట రైలు లేదా విమానం మారి ఎలా ప్రయాణిస్తారో అలాంటి ఏర్పాట్లను ఏపీఎస్ ఆర్టీసీలో అమల్లోకి తెస్తున్నారు. ఆర్టీసీ బస్సులో దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు నేరుగా బస్సు లేకపోతే మధ్యలో వేరొక నగరం, పట్టణంలో బస్సు మారి వెళ్లేందుకు ఒకే టికెట్ తీసుకునే విధానాన్ని అందుబాటులోకి తెస్తున్నారు. మల్టీ సిటీ జర్నీ రిజర్వేషన్ పేరిట దీనిని రూపొందించారు. ఉదాహరణకు అనంతపురానికి చెందిన ఓ ప్రయాణికుడు   శ్రీకాకుళానికి వెళ్లేందుకు నేరుగా బస్సు ఉండదు. కొత్త విధానంలో అనంతపురం నుంచి విజయవాడకు ఒక బస్సులో వచ్చి, విజయవాడ నుంచి  శ్రీకాకుళానికి  వేరొక సర్వీసులో వెళ్లేందుకు ఒకే టికెట్ తో రిజర్వేషన్ చేసుకునే సదుపాయం ఉంటుంది. ఇలా రెండు బస్సుల్లో ప్రయాణించేందుకు రిజర్వేషన్ చేసుకున్నాసరే కేవలం ఒక్కసారి మాత్రమే రిజర్వేషన్ ఛార్జి తీసుకోనున్నారు. ప్రయాణికుడు తొలుత ఒక బస్సులో వెళ్లి ఓ పట్టణం లేదా నగరంలోని వేరొక బస్సులోకి మారేందుకు 2 నుంచి 22 గంటల గడువునిచ్చారు. ఆ సమయాల్లో ఉన్న సర్వీసులలో ముందుగానే రిజర్వేషన్ చేసుకోవచ్చు. మొత్తంగా 137 మార్గాల్లో ఈ విధానాన్ని తొలిసారి అమలుచేయనున్నారు. యూటీఎస్ మొబైల్ యాప్ ద్వారాగానీ, ఆర్టీసీ ఆన్లైన్ పోర్టల్ ద్వారాగాని ఈ రిజర్వేషన్లు చేసుకునేందుకు వీలుంది. దేశంలోని ప్రభుత్వరంగ ఆర్టీసీల్లో  ఏపీలోనే ఈ విధానం తొలిసారి అమలు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఒకటి, రెండు రోజుల్లో ఈ విధానం ప్రారంభం కానుంది. ఎన్ని సంస్కరణలు తెచ్చినా చాలా కాలంగా ఆర్టీసీ నష్టాల్లోనే ఈదుతోంది.. ఒకే టిక్కెట్.. రెండు బస్సులలో ప్రయాణం..ఆర్టీసీని లాభాల బాట పట్టించడంలో సహాయకారిగా ఉంటుందా అనేది కాలమే నిర్ణయించాలి.

ఏపీ-తెలంగాణ భవన్ ఆంధ్రకు... పటౌడీ హౌస్ తెలంగాణకు

దేశ రాజధాని ఢిల్లీలో తెలుగు రాష్ట్రాల ఉమ్మడి ఆస్తి ఆంధ్రప్రదేశ్-తెలంగాణ భవన్ పరిధిలోని 19.73 ఎకరాల విభజనకు సంబంధించి కేంద్ర హోంశాఖ తన ప్రతిపాదనను తెలియజేసింది. 12.09 ఎకరాల్లోని ఆంధ్రప్రదేశ్- తెలంగాణ ఉమ్మడి భవన్ ను (శబరి బ్లాక్, గోదావరి బ్లాక్, నర్సింగ్ హాస్టల్) పూర్తిగా ఆంధ్రప్రదేశ్ తీసుకోవాలని, పటౌడీ హౌస్లోని 7.64 ఎకరాలను తెలంగాణ తీసుకోవాలని ఏప్రిల్ 26న జరిగిన సమావేశంలో సూచించింది. ఆంధ్రప్రదేశ్- తెలంగాణ భవన్ విభజనపై కేంద్ర హోం శాఖ సంయుక్త కార్యదర్శి సంజీవ్ కుమార్ జిందాల్, సంయుక్త కార్యదర్శి జి.పార్థసారథి నేతృత్వంలో ఇరు రాష్ట్రాల అధికారులతో జరిగిన సమావేశం మినిట్స్ ను కేంద్ర హోంశాఖ విడుదల చేసింది. ఉమ్మడి ఆస్తి విభజనపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మూడు, తెలంగాణ ప్రభుత్వం రెండు ఆప్షన్లు ఇచ్చాయని తెలిపింది. ఆంధ్రప్రదేశ్ ఇచ్చిన ఆప్షన్లు: (ఏ) తెలంగాణకు శబరి బ్లాక్, పటౌడీ హౌస్ లో   సగభాగం.. ఏపీకి పటౌడీ హౌస్ లో మిగిలిన సగభాగం, గోదావరి బ్లాక్, నర్సింగ్ హాస్టల్ బ్లాక్. (బీ)ఏపీకి మొత్తం పటౌడీ హౌస్, శబరి బ్లాక్.. తెలంగాణకు గోదావరి బ్లాక్, నర్సింగ్ హాస్టల్. (సీ) తెలంగాణకు శబరి, గోదావరి బ్లాక్ లు.. ఆంధ్రప్రదేశ్ కు నర్సింగ్ హాస్టల్, పటౌడీ హౌస్. తెలంగాణ ఇచ్చిన ఆప్షన్లు: ఆప్షన్ (డీ): తెలంగాణకు శబరి బ్లాక్, గోదావరి బ్లాక్ లు, నర్సింగ్ హాస్టల్ (12.09 ఎకరాలు).. ఏపీకి పటౌడీ హౌస్ (7.64 ఎకరాలు). ఇది విభజన చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణల వాటాకు విరుద్ధంగా ఉంది. అయితే ఏపీ కోల్పోయేదానికి విలువ కట్టి ఆ మొత్తం తెలంగాణ చెల్లిస్తుంది. ఒకవేళ దీనికి అంగీకరించకపోతే ఏపీ ఇచ్చిన ఆప్షన్ (సీ)ని పరిశీలించాలి. ఆప్షన్ (ఈ) గోదావరి, శబరి బ్లాక్ లు, నర్సింగ్ హాస్టల్తో ఉన్న 12.09 ఎకరాలు ఆంధ్రప్రదేశ్కు.. 7.64 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న పటౌడీ హౌస్ తెలంగాణకు. ఈ ప్రతిపాదన ఆచరణీయంగా ఉందని ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి తెలిపారని మినిట్స్ లో పేర్కొన్నారు. ఆప్షన్ సీ, డీ, ఈలను పరిశీలించి రెండు రాష్ట్ర ప్రభుత్వాలు తమ అభిప్రాయాలను వారంలోపు పంపాలని కేంద్ర హోంశాఖ కోరింది. రెండు తెలుగు రాష్ట్రాల విభజన జరిగి.. దాదాపు దశాబ్దం కాలం తర్వాత.. భవనాలు, స్థలాల బట్వారా జరగనున్ను తరుణంలో.. కేంద్ర హోం శాఖ ప్రతిపాదనపై తెలంగాణ, ఆంధ్ర ఎలా స్పందిస్తాయో వేచిచూడాలి.

ఢిల్లీ నుంచి గంటల్లో వెనక్కి ఎందుకలా ? ఏం జరిగింది?

తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుట్ల చంద్రశేఖర రావు చాలా చాలా కాలం తర్వాత ఢిల్లీ వెళ్ళారు. ఆయన తెలంగాణ ముఖ్యమంత్రే ఆయినా, ఆయనకు రాష్ట్ర రాజదాని  హైదరాబాద్  కంటే దేశ రాజధాని ఢిల్లీ అంటేనే కొంచెం ఎక్కువ ఇష్టం. నిజానికి, ఒకానొక సందర్భంలో రాష్ట్ర రాజకీయాలు బోర్ కొడుతున్నాయి, అనే మాట ఆయన నోటి నుంచే వచ్చింది. అయన మనసులోని ఆ ఆలోచనకు కొనసాగింపుగానే కావచ్చును, ఆయన ఒక సుముహుర్తన టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్ గా మార్చేశారు. తెలంగాణ రాష్ట్ర సమితి ( టీఆర్ఎస్) భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) గా మారి జాతీయ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. బీఆర్ఎస్ అధ్యక్షుడిగా జాతీయ రాజకీయాలపై ఫోకస్ పెంచారు.  అందులో భాగంగానే, దేశ రాజధాని ఢిల్లీలోని, వసంత విహార్‌లో నిర్మించిన బీఆర్ఎస్ కేంద్ర కారాల్యయాన్ని ప్రారంభించారు.   అయితే చిత్రంగా ఢిల్లీ వెళ్ళిన ముఖ్యమంత్రి వెళ్ళినంత వేగంగా వెనక్కి తిరిగొచ్చారు. సహజంగా ముఖ్యమత్రి కేసీఆర్ ఎప్పుడు ఢిల్లీ వెళ్ళినా .చెప్పిన రోజుకు తిరిగొచ్చిన సందర్భాలు చాలా చాలా తక్కువ. అలాంటింది, బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం ప్రారంభోత్సవానికి ఇలా వెళ్లి అలా రావడం నిజ్జంగా  చాలా మందికి చాలా రకాలుగా అర్థమవుతోంది. పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో కంటి నొప్పికి, పంటి నొప్పికి ఢిల్లీ వెళ్లి రోజులు, వారాల కొద్దీ అక్కడే ఉండిపోయిన కేసీఆర్, ఏదో మొక్కుబడిగా, ఇంకా స్పష్టంగా చెప్పాలంటే, అయిష్టంగా ఢిల్లీ వెళ్లి రావడం పజ్లింగ్ గా ఉందని, కొందరు క్వశ్చన్ మార్క్ ఫేస్ పెడుతుంటే, మరి కొందరు.. ఇతకాలం ఢిల్లీ వెళ్ళక పోవడం, ఇప్పడు ఇలా వెళ్లి అలా వెనక్కి రావడం వెనక ఏదో ఉందని అంటున్నారు.  కేసీఆర్ అసలు ఢిల్లీలో ఉండేందుకే ఇష్టపడకపోవడం ఆ పార్టీ నేతల్ని కూడా ఆశ్చర్యానికి గురి చేసింది. నిజానికి రెండో తేదీనే ఆయన ఢిల్లీ వెళ్లాలని అనుకున్నారు. కానీ ఎందుకనో ఆగిపోయారు. ఢిల్లీలో పలు కీలక సమావేశాలు నిర్వహిస్తారని.. మేధావులతో చర్చలు జరుపుతారని.. పలువురు ప్రాంతీయ పార్టీల నేతలతో .. జాతీయ రాజకీయాలపై చర్చిస్తారని అనుకున్నారు. కానీ, అవేవీ లేవు సరికదా, కనీసం  మీడియాను కూడా  అడ్రెస్ చేయకుండా  మౌనంగా తిరిగొచ్చారు. కేసేఆర్ లో వచ్చిన ఈ మార్పుకు కారణం ఏమిటి? ఇప్పడు ఇదే పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్  గా ట్రెండవుతోంది.  నిజానికి ఢిల్లీ లిక్కర్ స్కాం  లో కేసీఆర్ కుమార్తె కవిత పేరు బయటకు వచ్చినప్పటి నుంచి, ముఖ్యమంత్రి ఢిల్లీకి దూరంగా, చాలావరకు మౌనంగా ఉంటున్నారు. జాతీయ రాజకీయ కార్యకలాపాలను కూడా చాలా వరకు మహారాష్త్రకు పరిమితం చేసుకున్నారు.కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తారని, జేడీఎస్ తరపున ప్రచారం చేస్తారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అలాగే, జాతీయ రాజకీయాల్లో ప్రతిపక్షాల ఐక్యత కోసం ఓ వంక నితీష్ కుమార్ మరో వంక  మమతా  బెనర్జీ, ఇటు నుంచి స్టాలిన్, అటు నుంచి కేజ్రివాల్ ఎవరి ప్రయత్నాలలో  వారున్నారు. కానీ, అందులో ఏ ఒక్కరు కేసీఆర్ ను కలవలేదు. కేసీఆర్ వారెవరినీ కలవలేదు. అసలు కేసీఆర్ పేరు జాతీయ రాజకీయాల్లో వినిపించడమే లేదు.   ఇప్పుడు ఢిల్లీ పర్యటన మొక్కుబడి తంతుగా ముగియడంతో, రీల్ వెనక్కి, ఫ్లాష్ బ్యాక్’లోకి తిరగడంతో, తెర  వెనక ఏదో జరుగుతోందనే అనుమనాలు మొదలయ్యాయి. ఏదో తెలియని భయం వెంటాడుతోందనే అనుమానాలు వినిపిస్తున్నాయి. అయితే, అసలు ఏమి జరిగింది? ఏమి జరుగుతోంది? అనేది మాత్రం ప్రస్తుతానికి మిస్టరీగా మిగిలింది.కానీ, కేసీఆర్  కు ఎక్కడ హెచ్చలోనే  కాదు, ఎక్కడ తగ్గాలో కూడా తెలుసు అంటారు ..  అందుకే ఇప్పడు తగ్గారు ..కానీ, ఇది వెనకడుగు అనుకోరాదని అనుకోరాదని అంటున్నారు.

మేనిఫెస్టో చించి వార్తల్లో నిలిచి..

 కర్ణాటకలో ఈ నెల 10న అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. అయితే కాంగ్రెస్ , బీజేపీలు తమ తమ మేనిఫెస్టోలో విడుదల చేశాయి. మేనిఫెస్టోలో బూటకపు హామీలు, వాగ్దానాలు ఉంటే ప్రత్యర్థుల చేతికి కొబ్బరి చిప్ప దొరికినట్టే.  ఆరోపణలు ,  ప్రత్యారోపణలు  షరా మామూలే. కానీ ప్రత్యర్థి పార్టీ మేనిఫెస్టో ను ఏకంగా చింపి వేయడం అరుదు. గురువారం అదే జరిగింది. కాంగ్రెస్ ముఖ్యమంత్రి యడ్యూరప్ప మంత్రి వర్గంలో డిప్యూటి సీఎంగా పని చేసిన ఈశ్వరప్ప  కాంగ్రెస్ మేనిఫెస్టోను చించివేశారు. ఆయన ముఖ్యమంత్రి యడ్యూరప్ప మంత్రివర్గంలో కీలక బాధ్యతలు నిర్వహించారు .  భజరంగ్ దళ్ విద్వేషపూరిత ప్రసంగాలు చేస్తున్న కారణంగా ఆ సంస్థను తాము అధికారంలో రాగానే నిషేధిస్తామని కాంగ్రెస్ ఎన్నికల వాగ్దానంలో పేర్కొంది.  సీనియర్ బీజేపీ నేత అయిన ఈశ్వరప్పకు ఇది రుచించలేదు. హడావిడిగా మీడియాను పిలిచి మేనిఫెస్టోను చించి వేసి వార్తల్లో నిలిచారు. భజరంగ్ దళ్ కాంగ్రెస్ పార్టీని తూర్పారబట్టింది. కానీ బిజేపీ ఒక అడుగు ముందుకు వేసి ఏకంగా మేనిఫెస్టోను చించివేయడం చర్చనీయాంశమైంది.  ఎమర్జెన్సీ సమయంలో ఆయన బళ్లారి జైల్లో గడిపారు. ఎమర్జెన్సీ అయిపోయాక ఆయన రాజకీయాల్లో చురుకుగా పాల్గొన్నారు. షిమాగో నియోజకవర్గంలో భారతీయ జనతాపార్టీ తొలిసారి విజయం పొందడానికి ఈశ్వరప్ప ప్రధాన కారణం. ప్రభుత్వ ప్రాజెక్టుల్లో కమీషన్లు కావాలని  కాంట్రాక్టర్లను ఈశ్వరప్ప వేధించేవారని ఆరోపణలు ఉన్నాయి. విహెచ్ పి, ఆర్ ఎస్ ఎస్ లలో ఆయన ముఖ్య భూమిక వహించారు. రైట్ వింగ్ సంస్థలతో ఆయన దశాబ్దాల పాటు మమేకం అయి పని చేశారు. మధుర, కాశీ టెంపుల్స్ విధ్వంసం జరిగినప్పుడు ఈశ్వరప్ప విద్వేష ప్రసంగాలను చేసినట్టు ఆరోపణలున్నాయి. 

ఏపీలో ఆలయాల రక్షణ గాలిలో దీపమేనా ?

ఏమి జరుగుతోంది... ఎందుకిలా జరుగుతోంది...? ఆంధ్ర ప్రదేశ్ లో  హిందువులకు రక్షణ కరవవుతోంది, అనే ఆవేదన నిజం అవుతోందా? సర్కార్ ప్రభువుల అండ చూసుకుని అన్యమత ప్రచారం, మత మార్పిడి’ జోరుగా సాగుతున్న విషయం,అద్దంలో ముఖంలా అందరికి కనిపిస్తోంది. రాష్ట్రంలో అనేక గ్రామాలకు గ్రామాలు క్రైస్తవ గ్రామాలుగా బోర్డులు తగిలించుకుంటున్నాయి. క్రైస్తవ గ్రామాల సంఖ్య పెరుగతున్న విషయం పలు సందర్భాలాలో చేర్చకు వస్తూనే వుంది.  క్రైస్తవులే లేని గ్రామాల్లో చర్చిలు వెలుస్తున్నాయి. పాస్టర్లు వచ్చి యధేచ్చగా మత ప్రచారం చేస్తున్నారు.నిబంధనలకు వ్యతిరేకంగా సాగుతున్న మత ప్రచారం, మత మార్పిడికి సంబంధించి (బాప్టిజం) క్రతువులు యధేచ్చగా జరుగుతున్నాయి.ఇందుకు సంబంధించి అనేక గ్రామాల్లో ప్రజలు ఆందోళనలకు దిగుతున్నారు. ఫిర్యాదులు చేస్తున్నారు. అయినా అధికారులు పట్టించుకోవదమే లేదు.    అదలా ఉంటే ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన నాలుగేళ్లలో 250కి పైగా దేవాలయపై గుర్తు తెలియని వ్యక్తులు దాడులు చేశారు. విగ్రహాలను ద్వంసం చేశారు. రధాలను తగుల పెట్టారు. హుండీలను పగ కొట్టి దోచుకున్నారు. ఆభరణాలను దొంగిలించారు. చివరకు పూజారులను హత్య చేశారు. దేవాలయాలలో అన్యమత ప్రార్ధనలు చేశారు. ఒక్క మాటలో చెప్పాలంటే, హిందువుల మనోభావాలను భయంకంగా దెబ్బతీశారు.ఇక దేవాలయ సంపద దోపిడీ గురించి అయిత చెప్పనే అక్కరలేదు. తిరుమల నుంచి శ్రీశైలం వరకు ప్రధాన హిందూ దేవాలయాలలో ధర్మ విరుద్ద కార్యకలాపాలు యధేచ్చగా సాగుతున్నాయి.  ఇప్పడు శ్రీశైలం క్షేతంలో అదే జరిగింది.కొద్ది రోజుల క్రితం పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల ఏడు కొండలపి పై డ్రోన్స్ కలకలం సృష్టించిన విషయం, మరవక ముందే ఇప్పడు తాజగా పవిత్ర శైవ క్షేతం శ్రీశైలంలో ఏకంగా చార్టర్ ఫ్లైట్ కలకలం సృష్టించింది. మల్లన్న ఆలయ పరిసరాల్లో  గుర్తు తెలియని చార్టర్ ఫ్లైట్ చక్కర్లు కొట్టిందని ప్రత్యక్షంగా చూసిన భక్తులు చెపుతున్నారు. శ్రీశైలం క్షేత్రం చుట్టూ చార్టర్ ఫ్లైట్ చక్కర్లు కొట్టినట్లు స్థానికులు చెబుతున్నారు. అంతేకాదు ఇప్పటికే పలు మార్లు ఆలయ పరిసరాలలో డ్రోన్ చక్కర్లు కొట్టగా.. ఇప్పటి వరకు దాని ఆచూకీని ఆలయ సిబ్బంది కనిపెట్టలేదని చెబుతున్నారు. డ్రోన్ ను చూసిన సిబ్బంది దానిని కిందకు దించేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఇప్పుడు శ్రీశైలం ఆలయ పరిసరాలతో పాటు.. మల్లన్న ఆలయం చుట్టూ చార్టర్ ఫ్లైట్ చక్కర్లు కొట్టడంతో   స్థానికులు, భక్తులు భయబ్రాంతులకు గురవుతున్నారు. పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి శ్రీశైలం ఆలయ శిఖర ప్రాంతం నో ఫ్లయింగ్ జోన్ అంటే ఆ ప్రాంతంలో విమానాలు ఎగరరాదు,   అన్న నిబంధన వుంది. అయితే ఇప్పుడు నో ఫ్లయింగ్ జోన్ ప్రాంతంలో చార్టర్ ఫ్లైట్ చక్కర్లు కొట్టడంతో ఆలయ అధికారులు ఏమి చేయాలో తెలియక, తెలిసినా ఏమీ చేయలేక గుండె బరువును గుండెలోనే దాచుకుంటున్నారు.   అయితే ఇక్కడ ప్రధానంగా వస్తున్న ప్రశ్న హిందువుల మనోభావాలను దెబ్బ తీసే విధంగా  గుర్తు తెలియని వ్యక్తులు దాడులు చేస్తున్నా, ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం ఇంతవరకు కనీసం ఒక్కరంటే ఒక్కరిని ఎందుకు అరెస్ట్ చేయడం లేదు. వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా  సోషల్ మీడియా  పోస్టుల పెట్టిన వారిని వెంటాడి వేటాడి అరెస్ట్ చేస్తున్న పోలీసు యంత్రాంగం దేవాలయలపై దాడులు చేస్తున్న  గుర్తు తెలియని వ్యక్తులను ఎందుకు గుర్తించలేక పోతున్నారు? ఎందుకు అరెస్ట్ చేసి శిక్షించడం లేదు? ఇంతకు ముందు ఎప్పుడూ లేని విధంగా ఇప్పుడే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాతనే దేవాలయాలు దుండగుల టార్గెట్  ఎందుకయ్యాయి ? అందుకే ఏపీలో ఏమి జరుగుతోంది?  ఎందుకిల జరుగుతోంది? అనే భేతాళ ప్రశ్నలు పదే పదే వినిపిస్తున్నాయి. ఏపీలో దేవాలయాల రక్షణ గాలిలో దీపమేనా, అనే ఆందోళన వ్యక్తమవుతోంది. అవును, ఆయనెవరో అనంట్లుగా, వైసీపీ ప్రభుత్వ చర్యలు, వినాశకాలే విపరీత బుద్ధి అనే నానుడిని గుర్తు చేస్తున్నాయి అంటున్నారు.

కేసీఆర్ వన్ టూ వన్ క్లాసు

బీఆర్ఎస్ అధ్యక్షుడు జాతీయ రాజకీయాలలో బిజీగా ఉన్నప్పటికీ తెలంగాణలో గత ఎన్నికల్లో గెలుపొందిన 30 మందిపై నిఘా పెట్టినట్లు తెలుస్తోంది. పార్టీ ప్లీనరీ సమావేశాల్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసిన ప్రసంగం బీఆర్ఎస్ ను ఇబ్బందుల్లో  పెట్టింది. స్వంత పార్టీ ఎమ్మెల్యేలు దళిత బంధులో స్కీంలో మూడేసి లక్షల రూపాయాల కమిషన్లు తింటున్నారని, తన వద్ద ఆ ఎమ్మెల్యేల జాబితా ఉందని హెచ్చరించడం ప్రతి పక్షాలకు ఆయుధం దొరినట్టయ్యింది. నాలుక కరచుకున్న కేసీఆర్ బహింగ ప్రదేశాల్లో స్వంత  పార్టీ ఎమ్మెల్యేలను, నేతలను తిట్టకూడదని డిసైడ్ అయ్యారు. నాలుగు గోడల మధ్య క్లాసు తీసుకోవాలని కేసీఆర్ ఆలోచిస్తున్నారు. ఢిల్లీలో కేంద్ర కార్యాలయం ప్రారంభించిన తర్వాత కేసీఆర్ స్వంత పార్టీ నేతలతో సమావేశమయ్యారు. అవినీతి ఎమ్మెల్యేల భరతం పట్టడానికి త్వరలో హైదరాబాద్ రానున్నట్లు వారితో అన్నట్టు తెలిసింది.  జాతీయ రాజకీయాల్లో పడి రాష్ట్రాన్ని నిర్లక్ష్యం చేస్తే అసలుకే మోసం వస్తుందని కేసీఆర్ భావిస్తున్నారు.  ఈ 30 మందితో ఒకేసారి కాకుండా వన్ టూ వన్ క్లాసు తీసుకోవాలని  కేసీఆర్ యోచన. ఈ 30 మందికి వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఇవ్వకూడదని కేసీఆర్ నిర్ణయించినట్టు వినికిడి. మూడు నెలల్లో ఆ ఎమ్మెల్యేలు ప్రవర్తన మార్చుకుంటే సరేసరి లేదంటే టికెట్లు లేనట్టేనని కేసీఆర్ భావిస్తున్నారు. అవినీతికి పాల్పడిన ఎమ్మెల్యేల జాబితాలో ఆలేరు, పాలేరు, మునుగోడు, పటాన్ చెరు, ఖైరతాబాద్, వరంగల్ ఈస్ట్, మెదక్, స్టేషన్ ఘన్పూర్,  జనగామ, మంచిర్యాల, ఆందోల్ ఉన్నాయి. ప్రస్తుతం ఎంఎల్సీలు ఉన్న కౌశిక్ రెడ్డి, పోచంపల్లి , శంభీపూర్ రాజు తదితరులను అసెంబ్లీ పంపించాలని కేసీఆర్ ప్లాన్. 30 మందిలో ప్రవర్తన మారని  ఎమ్మెల్యేల స్థానే ప్రత్యామ్నాయ అభ్యర్థుల ఎంపిక మీద కేసీఆర్ సీరియస్ గా ఉన్నారు. స్పీకర్ పోచారం తనయుడు పోచారం భాస్కర్ రెడ్డి, లెజిస్లేటివ్ కౌన్సిల్ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తనయుడు గుత్తా అమిత్ రెడ్డి తదితరులకు టికెట్లు ఇచ్చే ఆలోచనలో కేసీఆర్ ఉన్నారు. వయసురీత్యా స్పీకర్ రాజకీయాల నుంచి  తప్పుకుని తన కొడుకుకు అవకాశం కల్పించాలని ఆలోచిస్తున్నారు. హుజూరాబాద్ లో కౌశిక్ రెడ్డి పేరు దాదాపు ఖరారు అయ్యింది. బీజేపీ ఎమ్మెల్యే ఈటెల మీద కౌశిక్ రెడ్డి తో పోటీ చేయించాలని కేసీఆర్ నిర్ణయానికి వచ్చారు. 

ఖమ్మం.. రాజకీయానికి కోటగుమ్మం

తెలుగు రాష్ట్రాల రాజకీయాలు.. అన్నీ ఉమ్మడి ఖమ్మం జిల్లా చుట్టునే తిరుగుతున్నాయి. టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు.. గత ఏడాది ఖమ్మంలో నిర్వహించిన శంఖారావం సభ సూపర్ డూపర్ సక్సెస్ అయింది. ఇక బీఆర్ఎస్ అధ్యక్షుడు, తెలంగాణ సీఎం కేసీఆర్.. టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్‌గా మార్చిన తర్వాత ఖమ్మం వేదికగా నిర్వహించిన తొలి సభ సైతం విజయవంతమైంది. వచ్చే ఎన్నికల నాటికి   ఖమ్మం వేదికగా.. భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు బీజేపీ ప్రణాళికలు రచిస్తోంది. మరోవైపు.. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాడిన తర్వాత రెండుసార్లు జరిగిన ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాలో సత్తా చాటిన టీఆర్ఎస్.. ఖమ్మం జిల్లాలో మాత్రం చతికిల పడింది. ఈ రెండు ఎన్నికల్లో ఒక్క టీఆర్ఎస్ అభ్యర్థి మాత్రమే గెలుపొందారు. ఈ నేపథ్యంలో పలు పార్టీల నుంచి గెలిచిన ఎమ్మెల్యేలను ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో ఆకర్షించి.. కారు పార్టీలోకి తెచ్చుకున్నారు కేసీఆర్. అయితే వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా జిల్లాలోని అన్ని స్థానాల్లో అభ్యర్థులు గంపగుత్తగా గెలవాలని బీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారు. మరోవైపు.. కేసీఆర్ పార్టీ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గెలవకుండా.. ఎన్ని ప్రయత్నాలు చేయాలో.. అన్ని చేస్తామని ఇప్పటికే ఆ పార్టీ బహిష్క్రృత నేత, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి భీష్మ ప్రతిజ్జ చేసి.. ఆ దిశగా ఆయన వడివడిగా అడుగులు వేస్తున్నారు.  ఇంకోవైపు వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు  షర్మిల సైతం ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పాలేరు నుంచి పోటీ చేస్తా.. నేను రాజన్న బిడ్డనే కాదు.. పాలేరు బిడ్డను కూడా అంటూ ఆ పార్టీ కార్యాలయంతోపాటు తన నివాసానికి శంకుస్థాపనకు వేసిన రాయి సాక్షిగా  ప్రకటించేశారు. ఇక మే 28న విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ జయంతి. ఆయన శతజయంతి సంవత్సరం ఆ రోజుతో ముగియనుంది. ఈ నేపథ్యంలో 54 అడుగుల అన్న ఎన్టీఆర్ విగ్రహాన్ని.. జూనియర్ ఎన్టీఆర్ ఆవిష్కరించనున్నారు.   అయితే తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ప్రస్తుతం ఉమ్మడి ఖమ్మం జిల్లా వేదికగా... ఇంత హాట్ హాట్‌ టాపిక్‌గా ఎందుకు మారింది. అదీ తల పండిన రాజకీయ పార్టీల నేతలు, అధినేతలు.. ఈ ఖమ్మం వేదికగా ఎందుకు బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు. అలాగే  వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు  షర్మిల....సైతం ఖమ్మం జిల్లానే ఎందుకు టార్గెట్ చేసుకొన్నారూ అంటే రాజకీయ విశ్లేషకులు తమదైన శైలిలో విశ్లేషణలు చేస్తున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాపై పక్కనే ఉన్న ఆంధ్ర రాష్ట్ర ప్రభావం చాలా ఉందని వారు పేర్కొంటున్నారు. అంతేకాదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తర్వాత.. అప్పడే జరిగిన ఎన్నికలు అంటే 2014 ఎన్నికల్లో సదరు జిల్లాలో టీడీపీ, కాంగ్రెస్ పార్టీ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు సత్తా చాటాయని... అంతేకానీ ప్రత్యేక తెలంగాణ తీసుకు వచ్చానని చెప్పుకొన్న టీఆర్ఎస్ పార్టీని సదరు జిల్లా ప్రజలు ఆదరించలేదని.. అలాగే 2018 ఎన్నికల వేళ సైతం టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు పలు స్థానాల్లో సత్తా చాటాయని.. ఇక అధికార టీఆర్ఎస్ పార్టీ ఒక స్థానానికి మాత్రమే పరిమితమైందని వారు పేర్కొంటున్నారు. మరోవైపు తెలంగాణ రాష్ట్రంలోని ఈ ఖమ్మం జిల్లాకు అటు ఆంధ్రప్రదేశ్, ఇటు ఒడిశా, మరోవైపు చత్తీస్‌గఢ్ సరిహద్దు రాష్ట్రాలుగా ఉన్నాయని.. అదేవిధంగా జిల్లాలోని పలు ప్రాంతాలోని వారిపై ఆంధ్రవారి ప్రభావం అధికంగా ఉంటుందని వారు చెబుతున్నారు.  జిల్లాలో ఓ వైపు రేవంత్ రెడ్డి సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ దూసుకుపోతోంటే.. మరోవైపు కాసాని జ్జానేవ్వర్ సారథ్యంలో టీ టీడీపీ సూపర్ స్పీడ్‌గా వెళ్లోంటే.. ఇంకోవైపు గులాబీ బాస్ కేసీఆర్ సైతం.. కారు గెలుపు కోసం పక్కా ప్రణాళికలు సిద్దం చేసుకొంటున్నారు. ఈ సారి ఎన్నికల్లో తెలంగాణలో ఎలాగైనా పాగా వేయాలని బావిస్తున్న బీజేపీ.. ఆ దిశగా తీవ్రంగా కృషి చేస్తోంది. ఇక బీఎస్పీ, వైఎస్సార్టీపీ సైతం ఈ ఎన్నికల్లో ఈ జిల్లాపై ఎంతో కొంత ప్రభావం చూపించనున్నాయి. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలో గెలిచిన అభ్యర్థుల పార్టీనే హైదరాబాద్‌లో అధికార పీఠాన్ని హస్తంగతం చేసుకునే అవకాశం లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు తమదైన శైలిలో విశ్లేషణ చేస్తున్నారు.

కేసీఆర్ పెర్షియన్ వద్దనుకున్నారా? 

బీఆర్ఎస్ జాతీయ రాజకీయాల్లో వచ్చిన తర్వాత ఢిల్లీలో స్వంత భవనం  నిర్మించుకుంది. కేంద్ర ప్రభుత్వం కేటాయించిన ఈ స్థలాన్ని  అందుబాటులో తేవడానికి కేవలం 20 నెలల సమయమే పట్టింది. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలనుకున్న బీఆర్ఎస్ ఇప్పటి వరకు అద్దె భవనంలో కొనసాగింది.  ప్రస్తుతం ఉన్న స్వంత భవనం విభిన్నంగా  ఉంది. ఇంతకుమునుపు తెలంగాణలో బీఆర్ఎస్ నిర్మించిన భవనాలు పెర్సియన్ స్టైల్ లో ఉండేవి. బంజారాహిల్స్ లోని పార్టీ కార్యాలయం కావొచ్చు. తెలంగాణా సచివాలయం పెర్సియన్ స్టైల్లో కట్టినవే. ముస్లింలు అత్యధికంగా ఉన్న హైదరాబాద్ లో పెర్షియన్ స్టైల్ ఉంటే ప్రజల ఆదరాభిమానాలు చూరగొనొచ్చు     కానీ ఢిల్లీలో నిర్మించిన బీఆర్ఎస్ భవనం పెర్షియన్ స్టైల్ లో లేదు. నాలుగు ఫోర్ల ఈ భవనం పూర్తి వాస్తుతో నిర్మించారు. ఉత్తర భారతంలోఈ స్టైల్ చెల్లు చీటి అని కేసీఆర్ ముందే గ్రహించి పెర్షియన్  స్టైల్  ఆలోచన ఉపసంహరించుకున్నట్లు తెలుస్తోంది.  ఈ భవనాన్ని కేసీఆర్ ప్రారంభించారు. సాంప్రదాయ పూజలు నిర్వహించారు. ఈ భవన నిర్మాణ సమయంలో కేసీఆర్ పూర్తి వాస్తు నియమ నిబంధనలు పాటించారు. కేసీఆర్ కు ముందు నుంచి వాస్తుకు ప్రాధాన్యతనిస్తారు. ఈ భవన నిర్మాణ సమయంలో ఎంత బిజీగా ఉన్నప్పటికీ కేసీఆర్ ఢిల్లీలోని వసంత్ విహార్ కు వచ్చి వాస్తు దోషాలను ఎప్పటికప్పుడు తెలుసుకునేవారు. వాస్తు దిశగా నిర్మాణం జరగాలని తగిన సూచనలు చేసేవారు. దేశ వ్యాప్తంగా గుర్తింపు పొందిన వాస్తు నిపుణులను ఢిల్లీకి రప్పించుకుని నిర్మాణ పనులను పర్యవేక్షించేవారు.  జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలనుకున్న కేసీఆర్ వాస్తు విషయంలో  ఏ మాత్రం కాంప్రమైజ్ కాలేదు. 2024 లోక సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బిజేపీ యేతర ఫెడరల్ ఫ్రంట్ తీసుకురావడానికి కేసీఆర్ తీవ్రంగా శ్రమిస్తున్నారు. 

బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం ప్రారంభోత్సవానికీ మీడియాకు నో ఎంట్రీ!

ఢిల్లీలో బీఆర్‌ఎస్‌ పార్టీ కేంద్ర కార్యాలయం ప్రారంభమైంది. అనుకున్న ముహూర్తానికే అంటే సరిగ్గా మధ్యాహ్నం 1:05 గంటకు బీఆర్‌ఎస్‌ అధినేత , తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. గురువారం ఉదయం నుంచి పార్టీ కార్యాలయంలో పూజలు కొనసాగాయి. అనంతరం సరిగ్గా మూహూర్త సమయానికి సీఎం కేసీఆర్‌ను పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. కార్యాలయం ప్రారంభోత్సవం అనంతరం మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలతో కేసీఆర్‌ తొలి సమావేశం నిర్వహించారు. ఢిల్లీలో బీఆర్‌ఎస్‌ కేంద్ర కార్యాలయం ప్రారంభోత్సవ వేళ బీఆర్‌ఎస్‌ భవన్‌లో పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి, ఎంపీ సంతోష్‌ కుమార్‌ , ఎంపీ వెంకటేశ్‌ నేత పూజలో పాల్గొన్నారు. భవనం ప్రారంభోత్సవానికి ముందు అక్కడ నిర్వహించిన సుదర్శన పూజ, హోమం, వాస్తు పూజల్లో కేసీఆర్‌ పాల్గొన్నారు. ఆ తర్వాత భవన్‌ శిలాఫలకాన్ని కేసీఆర్‌ ఆవిష్కరించారు . అనంతరం మధ్యాహ్నం సరిగ్గా  1:05 గంటలకు కేసీఆర్ రిబ్బన్‌ కట్‌ చేసి భవన్‌లోకి ప్రవేశించారు .భవన్‌లో దుర్గామాత అమ్మవారికి కేసీఆర్‌ ప్రత్యేక పూజలు చేశారు.అనంతరం భవనంలోని మొదటి అంతస్తులో ఏర్పాటు చేసిన తన ఛాంబర్‌కు కేసీఆర్‌ వెళ్లి  ఆసీనులయ్యారు. ఈ సందర్భంగా కేసీఆర్‌కు పార్టీ నాయకులు శుభాకాంక్షలు తెలిపారు.ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రులు కేటీఆర్‌, ప్రశాంత్‌ రెడ్డి, శ్రీనివాస్‌ గౌడ్‌, ఎంపీలు కేశవరావు, వెంకటేశ్‌ నేత, సంతోష్‌ కుమార్‌తో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఢిల్లీ బీఆర్‌ఎస్‌ భవన్‌కు పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ గురువారం మధ్యాహ్నం చేరుకున్నారు. ఈ సందర్భంగా కేటీఆర్‌కు పార్టీ కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. ఇక భవనంలోని ఓ అంతస్తులో అమ్మవారి విగ్రహానికి పూజలు నిర్వహించారు.  అనంతరం పార్టీ నాయకులతో కలిసి కేటీఆర్‌ ఫోటోలు దిగారు. పలువురు నాయకులు కేటీఆర్‌తో సెల్ఫీలు తీసుకున్నారు.  ఢిల్లీ వసంత్‌ విహార్‌లో బీఆర్‌ఎస్‌ ఆఫీసు నిర్మాణానికి 2021, సెప్టెంబర్‌ 2న సీఎం కేసీఆర్‌ భూమి పూజ చేశారు. మొత్తం నాలుగు అంతస్థులతో 11 వేల చదరపు అడుగుల స్థలంలో దీనిని నిర్మించారు. లోయర్‌గ్రౌండ్‌లో విూడియా హాల్‌, సర్వెంట్‌ క్వార్టర్స్‌ ఉన్నాయి. ఇక గ్రౌండ్‌ ఫ్లోర్‌లో క్యాంటీన్‌, రిసెప్షన్‌ లాబీ, 4 ప్రధాన కార్యదర్శుల చాంబర్‌లు, మొదటి అంతస్థులో బీఆర్‌ఎస్‌ జాతీయ అధ్యక్షుడు కేసీఆర్‌ చాంబర్‌, ఇతర చాంబర్స్‌, కాన్ఫరెన్స్‌ హాల్స్‌, 2వ, 3వ అంతస్థుల్లో మొత్తం 20 గదులు ఉన్నాయి. వీటిలో పార్టీ ప్రెసిడెంట్‌ సూట్‌, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ సూట్‌పోగా మిగతా 18 ఇతర రూములు అందుబాటులో ఉంటాయి. జీ ప్లస్‌ త్రీ విధానంలో భవన నిర్మాణం జరిగింది. లోయర్‌ గ్రౌండ్‌, గ్రౌండ్‌, మొదటి, రెండు, మూడు అంతస్తులతో కలిపి మొత్తం 5 అంతస్తులతో భవనాన్ని నిర్మించారు. 2, 3 అంతస్తుల్లో ఢిల్లీలో పార్టీకి సంబంధించిన కార్యక్రమాలకు వచ్చే కార్యకర్తలు, నాయకులు బస చేసేందుకు 18 గదులతో పాటు రెండు ప్రత్యేక సూట్‌ రూమ్‌లు నిర్మించారు. సూట్‌ రూమ్‌లో పార్టీ అధ్యక్షుడు, పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు బస చేసేందుకు ఏర్పాట్లు జరిగాయి. కాగా.. ఈ కార్యక్రమాన్ని కవరేజ్‌ చేయడానికి వచ్చిన విూడియాకు మాత్రం బీఆర్‌ఎస్‌ కార్యాలయంలోకి ప్రవేశించేందుకు అనుమతి ఇవ్వలేదు. అధికారుల ఆదేశాల మేరకు విూడియాను బీఆర్‌ఎస్‌ పార్టీ ఆఫీస్‌ ముందు నుంచి పోలీసులు బయటకు పంపించివేశారు. పార్టీ  కార్యాలయ ప్రాంగణంలో కూడా విూడియా వాళ్ళు ఎవరూ ఉండవద్దంటూ హుకుం జారీ చేశారు. పైనుంచి ఆదేశాలు వచ్చాయని... అందుకోసమే విూడియాకు నో ఎంట్రీ అని ముఖ్యమంత్రి సెక్యూరిటీ సిబ్బంది చెబుతోంది.  

161వ స్థానానికి పడిపోయిన భారత్‌

ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉంగే మీడియా రాను రాను నైతిక విలువలను కోల్పోతుంది. ఒక వ్యక్తి లేదా సంస్థకో తాబేదారుగా వ్యవహరిస్తూ  ప్రజల ఆదరణ కోల్పోయే స్థితికి చేరుకుంటుంది. సెక్యులర్ దేశంగా ఖ్యాతిగడించి ప్రజాస్వామిక విలువలను కాపాడుతున్నట్లు అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన  భారత్ క్రమంగా తన గ్రాఫ్ పడిపోతుందని రుజువయ్యింది.  ప్రెస్ ఫ్రీడమ్ డే సందర్భంగా అంతర్జాతీయంగా జరిగిన అధ్యయనంలో ఇది రుజువయ్యింది.  మొత్తం 180 దేశాల్లోని పాకిస్తాన్‌ 150వ స్థానంలో తాలిబన్‌ల స్వాధీనంలో ఉన్న ఆఫ్ఘనిస్తాన్‌ కూడా 152వ స్థానంలో ఉంది. 2014లో ప్రధాని మోడీ అధికారం చేపట్టిన అనంతరం నుండి జర్నలిస్టులపై దాడులు పెరిగిపోయాయని ఆర్‌ఎస్‌ఎఫ్‌ పేర్కొంది.   మీడియా  స్వేచ్ఛలో భారత్‌ 161 స్థానానికి పడిపోయింది. గతేడాది 150 స్థానంలో నిలవగా.. 11 స్థానాలు దిగజారి 161 ర్యాంకుకు చేరింది. మొత్తం 180 దేశాల్లోని పరిస్థితులను అధ్యయనం చేసి పారిస్‌కు చెందిన స్వతంత్ర ఎన్‌జిఒ రిపోర్టర్స్‌ వితౌట్‌ బోర్డర్స్‌ (ఆర్‌ఎస్‌ఎఫ్‌)  గ్లోబల్ ప్రెస్ ఫ్రీడమ్ ఆఫ్ ఇండెక్స్ ని విడుదల చేసింది. ఈ సూచిలో  బంగ్లాదేశ్‌ 163 స్థానంలో ఉండగా, పాకిస్తాన్‌ భారత్‌ కన్నా మెరుగ్గా 150వ స్థానంలో నిలవడం గమనార్హం. తాలిబన్‌ల స్వాధీనంలో ఉన్న ఆఫ్ఘనిస్తాన్‌ కూడా 152వ స్థానంలో నిలిచింది. భూటాన్‌ 90 వ ర్యాంకు సాధించగా, శ్రీలంక 135వ ర్యాంకు సాధించినట్లు ఆర్‌ఎస్‌ఎఫ్‌ తెలిపింది. భారత్‌ 161 స్థానానికి పడిపోవడంపై ఆర్‌ఎస్‌ఎఫ్‌ ఈ వివరణనిచ్చింది. 2014లో ప్రధాని మోడీ అధికారం చేపట్టిన అనంతరం నుండి జర్నలిస్టులపై దాడులు పెరిగిపోయాయని ఆర్‌ఎస్‌ఎఫ్‌ పేర్కొంది. మీడియాలో రాజకీయ పక్షపాత ధోరణి, మీడియా యాజమాన్యాలు ఏకీకృతం కావడం ఇవన్నీ భారత్‌లో మీడియా స్వేచ్ఛను అడ్డుకుంటున్నాయని తెలిపింది.దేశంలోని హిందీ భాషలో మూడొంతుల మంది పాఠకులకు కేవలం నాలుగు వార్తాపత్రికలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ప్రాంతీయ భాషల విషయానికొస్తే.. కోల్‌కతాలో ఆనంద్‌ బజార్‌ పత్రికా, ముంబయిలో లోక్‌మత్‌, దక్షిణాదిలో మలయాళ మనోరమ లు ప్రచురితమవుతున్నాయి. టివి రంగంలోనూ ఈ మీడియా యాజమాన్యాలు ఏకీకృతం కావడం కనిపిస్తుంది. అలాగే ఆల్‌ ఇండియా రేడియా (ఎఐఆర్‌) నెట్‌వర్క్‌ నుండి అన్ని రేడియో స్టేషన్‌ల్లోనూ వార్తలు ప్రసారమవుతాయి. ఈ కంపెనీలకు, మోడీ ప్రభుత్వానికి మధ్య బహిరంగంగా పరస్పర ప్రయోజనకరమైన సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇది ఇంకా కొనసాగుతోంది. సుమారు 80 కోట్ల మంది అనుసరించే 70 మీడియా నెట్‌వర్క్‌లు అంబానీ నేతృత్వంలోని రిలయన్స్‌ ఇండిస్టీస్‌ గ్రూప్‌ అధీనంలో ఉన్నాయి. ఇటీవల ఎన్‌డిటివిని అదానీ స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే.మోడీ అధికారం చేపట్టిన అనంతరం పలువురు జర్నలిస్టులు వేధింపులను ఎదుర్కొంటున్నారు. దేశద్రోహం, పరువునష్టం, కోర్టు ధిక్కారం, జాతీయ భద్రత చట్టాలతో పాటు తిరుగుబాటుదారులన్న ముద్ర వేస్తోంది. అలాగే మీడియాలో ఉన్నత కులాలకు చెందిన పురుషులు జర్నలిజంలో సీనియర్‌ పదవులను కలిగి ఉండటం లేదా మీడియా ఎగ్జిక్యూటివ్‌లుగా ఉంటున్నారు. ఇది మీడియా కంటెంట్‌లో ప్రతిబింబిస్తుంది. సాయంత్రం వేళల్లో వచ్చే ప్రధాన చర్చా కార్యక్రమాల్లో పాల్గనేవారిలో 15 శాతం కంటే తక్కువ మంది మహిళలు ఉన్నారు. భారత్‌లో జర్నలిస్టుల భద్రతకు ఎలాంటి చర్యలు లేవు. ప్రతి ఏడాది సగటున నలుగు రు జర్నలిస్టులలో ముగ్గురు హత్యకు గురవుతున్నారు. మీడియా రంగానికి ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన దేశాల్లో భారత్‌ కూడా ఒకటని ఆర్‌ఎస్‌ఎప్‌ స్పష్టం చేసింది.వరల్డ్ ప్రెస్ డే ప్రతీ సంవత్సరం జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. సమాజంలో ప్రెస్ ఫ్రీడమ్ ఆవశ్యకతను నొక్కి చెబుతోంది. మానవ హక్కుల ఉల్లంఘన, వార్తలను ముద్రించడంలో పక్షపాతం, బంధుప్రీతి తదితర అంశాలపై ఆర్ఎస్ఎఫ్ అధ్యయనం చేసింది. 

మణిపూర్లో ప్రజ్వరిల్లిన హింసాకాండ!

మణిపూర్‌ రాజధాని నగరం ఇంఫాల్‌లో హింస ప్రజ్వరిల్లింది. అనేక వాహనాలను తగులబెట్టారు, ప్రార్థనా స్థలాలకు నిప్పు పెట్టారు. దీంతో పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు సైన్యాన్ని పిలిచారు. ముఖ్యంగా చురాచాంద్‌పూర్‌, ఇంఫాల్‌ నగరాల్లో హింసాకాండ పెచ్చువిూరింది. ఈ పరిస్థితి గురించి ముఖ్యమంత్రి బిరేన్‌ సింగ్‌తో కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా చర్చించారు. మెజారిటీగా ఉన్న మెయిటీలను షెడ్యూల్డు తెగల కేటగిరీలోకి తేవాలనే డిమాండ్‌ను ఎస్టీలు వ్యతిరేకిస్తున్నారు. ఈ నిరసనలకు ది ఆల్‌ ట్రైబల్‌ స్టూడెంట్స్‌ యూనియన్‌ మణిపూర్‌ నాయకత్వం వహిస్తోంది. అయితే  వారికి సంఘీభావం తెలుపుతున్న నిరసనకారులే ఈ హింసాకాండకు పాల్పడుతున్నారనే ఆరోపణలను ఈ సంఘం ఖండించింది. బుధవారం (మే 3)నిర్వహించిన సంఘీభావ ప్రదర్శనలో వేలాది మంది గిరిజనులు పాల్గొన్నారని, ఈ ప్రదర్శన ప్రశాంతంగా ముగిసిందని తెలిపింది. తమ ప్రదర్శన అనంతరం కొందరు వ్యక్తులు చురాచాంద్‌పూర్‌లోని ఆంగ్లో-కుకీ వార్‌ మెవెూరియల్‌ గేటుకు నిప్పు పెట్టడం వల్లనే హింస ప్రజ్వరిల్లిందని అంటున్నారు. ఇంఫాల్‌, తదితర ప్రాంతాల్లో గిరిజనుల ఇళ్లను, ప్రార్థనా స్థలాలను తగులబెట్టారనీ, ఇంత జరుగుతున్నా పోలీసులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించారని, ప్రేక్షక పాత్ర పోషించారనీ విమ్శించారు.   ఈ హింసాకాండలో కొందరుర మరణించారు. చాలా మంది గాయపపడ్డారు. పరిస్థితి చాలా ఆందోళనకరంగా  ఉంది. కేంద్రం జోక్యం చేసుకోవలసిన అవసరం ఉంది.  మణిపూర్‌ ముఖ్యమంత్రి ఎన్‌ బిరేన్‌ సింగ్‌  ఈ హింసాకాండపై స్పందించారు.  సమాజంలోని రెండు వర్గాల మధ్య అపార్థాలే ఆ హింసాకాండ ప్రజ్వరల్లడానికి కారణమని అన్నారు.  ఇరు వర్గాలతోనూ సంప్రదింపులు జరిపి,  దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న వారి సమస్యలకు పరిష్కార మార్గం కనుగొంటాని హామీ యిచ్చారు.  మెయిటీలకు ఎస్‌టీ హోదాను ఇవ్వాలనే డిమాండ్‌ను వ్యతిరేకిస్తున్నవారు స్పందిస్తూ, మణిపూర్‌ జనాభాలో మెయిటీలు 53 శాతం మంది ఉన్నారని, వారిని ఎస్టీల్లో చేర్చడం వల్ల తమకు ఉద్యోగావకాశాలు, విద్యా సంస్థల్లో ప్రవేశాలు తగ్గిపోతాయని వాపోతున్నారు. మెయిటీలు ముఖ్యంగా ఇంఫాల్‌ లోయలో ఎక్కువగా ఉన్నారు. రాష్ట్ర జనాభాలో గిరిజనులు 40 శాతం మేరకు ఉంటారు. నాగాలు, కుకీలు కూడా గిరిజనులే. కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా గురువారం మణిపూర్‌ ముఖ్యమంత్రి బిరేన్‌ సింగ్‌కు ఫోన్‌ చేశారు. రాష్ట్రంలో పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. ఇదిలా ఉండగా, పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు సైన్యం, పారామిలిటరీ దళాలను వెూహరించారు. భారత వాయుసేన ప్రత్యేక విమానంలో రాపిడ్‌ యాక్షన్‌ ఫోర్స్‌ సిబ్బందిని తరలించారు. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. హింసాకాండ నేపథ్యంలో మణిపూర్‌ ప్రభుత్వం రాష్ట్రంలోని ఎనిమిది జిల్లాల్లో కర్ఫ్యూ విధించింది. రానున్న ఐదు రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్నెట్‌ సేవలను నిలిపివేస్తున్నట్లు పేర్కొంది. వాట్సాప్‌, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా   పుకార్లు వ్యాపించకుండా నిరోధించేందుకే ఈ చర్యలు తీసుకున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.   పరిస్థితిని అదుపుచేసేందుకు సైన్యం కవాతు నిర్వహిం చింది. అన్ని వర్గాలకు చెందిన దాదాపు 7,500 మంది పౌరులను సురక్షిత ప్రాంతాలకు తరలించేం దుకు ప్రయత్నిస్తున్నారు. ఈ సహాయ కార్యక్రమాల్లో భారత సైన్యం, అస్సాం రైఫిల్స్‌ సిబ్బంది పాల్గొంటున్నారు. మయన్మార్‌, బంగ్లాదేశ్‌ల నుంచి పెద్ద ఎత్తున చట్టవిరుద్ధంగా మణిపూర్‌ రాష్ట్రంలోకి వలస వస్తున్నారు. వీరివల్ల తమకు సమస్యలు ఎదురవుతున్నాయని మెయిటీలు వాదిస్తున్నారు. తమకు ఎస్టీ హోదా కల్పించాలని డిమాండ్‌ చేస్తున్నారు. వీరికి ఇంఫాల్‌ లోయలోని రాజకీయ నాయకులు బహిరంగంగానే మద్దతు ప్రకటిస్తున్నారు. ప్రముఖ క్రీడాకారిణి మేరీ కోమ్‌    నా రాష్ట్రం తగులబడుతోంది. దయచేసి సహాయపడండి అని ట్వీట్ చేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర వెూదీ, పీఎంఓ, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, వివిధ విూడియా సంస్థలకు ఈ ట్వీట్‌ను ట్యాగ్‌ చేశారు. ఆమె ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ మణిపూర్‌ దుస్థితిని వివరించారు. అందరికీ రక్షణ కల్పించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను తన హృదయాంతరాళాల్లోంచి కోరుతున్నానని చెప్పారు.  

తెలంగాణ ఆ త్మ గౌరవానికి ప్రతీక ‘నీరా’ అట 

ప్రకృతి సిద్ధంగా లభిస్తున్న నీరాను నగరవాసులకు అందించే నీరా కేఫ్ ను ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా.. నీరా అంటే ఆల్కహాల్ అని దుష్ప్రచారం ఉందని..ఇది దేవతలు తాగే వేదామృతమన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. తరతరాల నుంచి వస్తున్న గీత వృత్తి అని.. తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీక నీరా కేఫ్ అని అన్నారు ఆయన.హుస్సేన్ సాగర్ తీరాన ప్రారంభమైన ‘నీరా’ కేఫ్ 2020 ఆగస్టులో శంఖుస్థాపన జరిగింది. అప్పట్లో ఈ కార్యక్రమానికి సీనియర్ అధికారులు, కేటీఆర్, దానం నాగేందర్, తలసాని తదితరులు హాజరయ్యారు. నీరా వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలను అధికార పార్టీ ప్రభుత్వం పెద్ద ప్రచారమే చేసింది. నీరా తాగితే ఒంట్లో ఎనర్జీ వస్తుందని చెప్పి హుస్సేన్ సాగర్ తీరాన కేఫే ప్రారంభించి వ్యాపారం చేస్తుంది తెలంగాణ ప్రభుత్వం. ప్రతి పక్షాలు నీరా అమ్మకాలను కమర్షియల్ చేయడం సహేతుకం కాదని వాదిస్తున్నాయి. బెల్ట్ షాపులతో విసిగి వేసారిన ప్రజలకు నీరా కేఫేలు మరిన్ని ఇబ్బందులు పెట్టొచ్చని పలువురు అంటున్నారు.  నీరా ఆల్కాహాల్ కాదని బీఆర్ఎస్ శ్రేణులు ప్రచారం చేసుకుంటున్నాయి. ఖర్చూర చెట్ల కు సూర్యోదయం ముందు కట్టిన కుండలలో నీరా పడితే  కిరణ జన్య సంయోగ క్రియ జరిగి నీరా తయారవుతుందని, దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేదని బీఆర్ఎస్ శ్రేణులు అంటున్నాయి. నీరా తాజాగా ఉన్నప్పుడే ఔషధ విలువలు ఉంటాయని, ఫ్రిజ్లో స్టోర్ చేసుకుని తాగితే ఆరోగ్యానికి మంచిది కాదని ఆయుర్వేద నిపుణులు హెచ్చరిస్తున్నారు. నీరాతో బై ప్రొడక్టులు తయారవుతున్నాయని తెలంగాణ ప్రభుత్వం ప్రచారం చేసుకుంటుంది. మెగ్నీషియం, కాల్షియం, ఐరన్ , పాస్పరస్, పొటాషియం, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. నీరా ను ప్రమోట్ చేయడం వల్ల కల్లు గీత కార్మికులకు ఉపాధి అవకాశాలు మరింత మెరుగవుతాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ దిశగా అడుగులు వేస్తున్నారు.  రానున్న ఎన్నికల్లో గౌడ కులస్థుల వోట్లను పొందడానికి నీరా దోహదపడుతుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. తెలంగాణ సమాజం యొక్క సెంటి మెంట్లు  నీరా, కల్లు వంటి పానీయాలతో ముడి పడి ఉందని కేసీఆర్ విశ్వాసం. ఉపాధి కోల్పోతున్న కల్లు గీత కార్మికులకు నీరా అమ్మకాలతో ఉపాధి అవకాశాలు పెరుగుతాయని తద్వారా రాజకీయ ప్రయోజనాలు పొందవచ్చని బీఆర్ఎస్ భావిస్తుంది. 

అకాల వర్షాలతో అన్నదాత అలో లక్ష్మణా!

అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకుంటామని తడిసిన ధాన్యాన్ని కూడా మద్దతు ధరలకే కొంటామని  తెలంగాణ ప్రభుత్వం చెబుతోంది. ఒక్క గింజ కూడా వదలకుండా కొనుగోలు చేయాలని సంబంధిత శాఖ అధికారులకు కేసీఆర్  అయినా రైతులకు భరోసా కలగడం లేదు. గత అనుభవాలు వారికి ప్రభుత్వ ప్రకటనలపై నమ్మకం లేకుండా చేసింది. అందుకు తగ్గట్టే యిప్పటికింకా  క్షేత్రస్థాయిలో అధికారులు పర్యటించి...పంట నష్టం అంచనా వేసే కార్యక్రమం యింకా ప్రారంభమే కాలేదు.   తడిసిన ధాన్యం కొనుగోళ్లకు ఇరు రాష్టాల్లో ముందుగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. వరి, మక్క,జొన్న తదితర పంటలను తక్షణమే కొనుగోలు చేయాలి. ధాన్యం సేకరణలో తడిసిన ధాన్యం సేకరణకు ప్రాధాన్యం ఇవ్వాలి. ఈ విషయంలో అవసరమైతే నిబంధనలు సడలించైనా సేకరణ ప్రారంభించాలి. అకాల వర్షాలకు కల్లాలే కాదు  రైతుల కళ్లు కూడా నీటితో నిండిపోయాయి. అకాల వర్షాలు అన్నదాతలను ఆగంఆగం చేశాయి. చేతి కందిన పంటలను దారుణంగా దెబ్బతీశాయి. అటు నేలవాలిన పంటలు, ఇటు ధాన్యం కుప్పల్లో వస్తున్న మొలకలు చూసి రైతాంగం బెంగటిల్లుతోంది. అన్న దాతను ఆదుకునే దిశగా తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు యింత వరకూ ఒక్క అడుగు కూడా వేయలేదు. అటు కేంద్రమూ ముందుకు రాలేదు. రాష్ట్రప్రభుత్వాలైతే ఆదుకుంటామంటూ ప్రకటనలైనా చేశాయి. కేంద్రం నుంచి ఆ మాత్రం భరోసా కూడా రాలేదు.  ఇక రాష్ట్ర ప్రభుత్వాల ప్రకటనలు రైతన్నకు భరోసా, ఆత్మస్థైర్యం యివ్వవు. వారికి సాయం అందితేనే భరోసా వస్తుంది. ఆత్మస్థైరం వస్తుంది. నష్టపరిహారం యిచ్చి తడిసిన ధాన్యం కొనుగోలు చేస్తే సరిపోదు.. మళ్లీ పంట వేయడానికీ రైతుకు సహాయం అందాలి.   ప్రభుత్వాధినేత ప్రకటనలు యింకా   కార్యరూపం దాల్చలేదు. రైతుకు సహాయం అందడం లేదు. కానీ రాజకీయ విమర్శల వేడి మాత్రం అకాల వర్షాల సాక్షిగా అగ్నిపర్వతం బద్దలై లావా ప్రవహించినట్లు ప్రవహిస్తోంది. కల్లాలలో ధాన్యం నీటిలో ఉండగానే రాజకీయ విమర్శల జోరు జడివానగా మారి రైతు ఆశను చంపేస్తోంది. రైతు కష్టంలో ఉన్నప్పుడైనా రాజకీయాలను పక్కన పెట్టి ఆదుకునే విషయానికే పరిమితం కావాలి. తెలంగాణలో అధికార బీఆర్ఎస్ నేతలూ, మంత్రులూ అకాల వర్షంతో అన్నదాత కుదేలైనా కేంద్రం స్పందించడం లేదంటూ బాధల్లో ఉన్న రైతుల ముందే విమర్శల పురాణం విప్పుతున్నారు. ఏపీలో అయితే ముఖ్యమంత్రి సమయం అంతా సమీక్షల్లోనే గడిపేస్తున్నారు. అన్నదాతను ఆదుకోవాలనీ, ఏ ఒక్క రైతూ కూడా  బాధపడకూడదనీ ప్రకటనలు గుప్పిస్తున్నారు. అధికారులకు ఆదేశాలు జారీ చేసేస్తున్నారు.  అయితే  రైతులను ఆదుకునే దిశగా ఒక్క అడుగూ పడిన దాఖలాలు లేవ.  

మరాఠీలకు ప్రాంతీయవాదం అంటే మమకారం 

జాతీయ రాజకీయాల్లో అడుగు పెట్టిన బీఆర్ఎస్ కు పొరుగురాష్ట్రమైన మహారాష్ట్రలో చేదు అనుభవం ఎదురైంది. ఇటీవల మహరాష్ట్ర ఔరంగా బాద్ లో బీఆర్ ఎస్ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ సభకు ప్రచారం కూడా భారీగానే  కల్పించింది బీఆర్ఎస్. మరాఠా పత్రికలకు లక్షలాది రూపాయల యాడ్స్, జర్నలిస్ట్ లకు రాచమర్యాదలు చేసింది. ఈ వార్త సేకరించడానికి వచ్చే రిపోర్టర్లలో కొందరికి ఫ్లయిట్ ఖర్చులు కూడా బీఆర్ఎస్ భరించింది. వారికి రాచమర్యాదలు చేసింది. ఇటీవలె మహరాష్ట్రలో బోకర్ అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ ఎన్నికలు జరిగాయి. బీఆర్ఎస్ అభ్యర్థులు ఈ ఎన్నికలో భారీ ఓటమిని చవి చూశారు. డైరెక్టర్ పదవులను ఆశించిన బీఆర్ఎస్ అభ్యర్థులు ఆదిలోనే భంగపడ్డారు. ఒక్క సీటు కూడా బీఆర్ఎస్ గెలుచుకోలేకపోయింది.  మొత్తం 18 స్థానాలకు గాను కాంగ్రెస్ 13, బీజేపీ 3, ఎన్సీపీ 2 గెలుచుకుంది. ఈ ఓటమికి బలమైన కారణం ఒకటుంది. ఛత్రపతి శివాజీ ఝాన్సీ లక్ష్మీభాయ్    పుట్టిన గడ్డ  అది.  వందల సంవత్సరాల నుంచి మరాఠీల రక్తం దేశభక్తి, ప్రాంతీయ భక్తి ఉన్నట్లు రుజువయ్యింది. చారిత్రక ఆధారాలు కూడా ఉన్నాయి. హిందుత్వవాదంను సమర్ధించే పార్టీలు అక్కడ మనుగడ సాగిస్తాయని లోకోక్తి. శివసేన అయినా బీజేపీ అయినా అధికారాన్ని పంచుకున్నాయి. కానీ ప్రాంతీయేతర పార్టీలను మరాఠా గడ్డ మీద కాలు మోపనీయలేదు.  మరాఠీలు మాత్రమే ముఖ్యమంత్రి పదవులను అలంకరించారు. సుదీర్ఘకాలం పాటు కాంగ్రేస్ పార్టీలో పదవులు అనుభవించిన శరద్ పవార్ మరాఠీయుడు. అతను నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ  నేతగా ప్రస్తుతం చక్రం తిప్పుతున్నారు. కాంగ్రెస్ నేత అశోక్ చవాన్ మరాఠీయుడు. భోకర్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి పాలవ్వడానికి అశోక్ చవాన్ ముఖ్య కారణం. మరాఠా గడ్డ మీద బీఆర్ఎస్ ఎంట్రీని అతను ఏ మాత్రం సహించలేకపోయారు. మార్కెట్ కమిటీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ చేయడం ఏమిటి? మరాఠీలు పునరాలించుకోవాలని అశోక్ చవాన్ స్థానికులను అనేక మీటింగ్స్ లో ప్రశ్నించారు. ఒక సారి బీఆర్ఎస్ ప్రవేశిస్తే  మన ప్రాంతం ప్రమాదంలో పడినట్టేనని ప్రచారం చేశారు. ఈ మేరకు పావులు కూడా కదిపారు. ఒక్క వోటుకు 10 వేల రూపాయల పెట్టి కొనుగోలు చేసినట్టు బీఆర్ ఎస్ పై ఆరోపణ ఉంది.  భోకర్  మార్కెట్ కమిటీ  ఎన్నికల్లో ఓటమి చెందిన బీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా  తీసుకుంది. భోకర్ లో ప్రాబల్యం ఉన్న నాగ్ నాథ్ ఓడిపోవడాన్ని బీఆర్ఎస్ జీర్ణించుకోలేకపోయింది. నాగ్ నాథ్ ను కేసీఆర్ ఓదార్చారు. వెంటనే మరాఠా బీఆర్ఎస్ శ్రేణులతో సమావేశమయ్యారు. మొదటి ఓటమి విజయానికి తొలి మెట్టు కావాలని శ్రేణులకు పిలుపునిచ్చారు. బీఆర్ఎస్  నాయకులు జిల్లా పరిషత్ , మున్సిపాలిటీ ఎన్నికలలో పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు.  బీఆర్ఎస్ నేతలు  పెద్ద పెద్ద కలలే కన్నారు. కాంగ్రెస్ , బీజేపీలకు ప్రత్యామ్నాయ పార్టీలను అధికారంలో తీసుకురావడానికి బీఆర్ఎస్ అధినేత కాళ్లకు చక్రాలు కట్టుకుని దేశమంతా పర్యటించాలని, తాను ప్రధాని కావాలని ఉవ్వీళ్లూరారు.  ఎవరూ ఊహించనీ విధంగా భోకర్ మార్కెట్ కమిటీ ఎన్నికలలో బీఆర్ఎస్ తొలి సారి  పోటీ చేసి ఒక్క స్థానం కూడా గెలుచుకోలేకపోయింది. మహరాష్ట్రలోని  బోకర్ మాజీ సీఎం, కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. భోకర్ తాలూకాలోని నంద, రాతి, కిని, పలాజ్ దివిసి గ్రామాలు నిర్మల్ తదితర జిల్లా సరిహద్దులను పంచుకుంటున్నాయి. భోకర్ భైంసా పట్టణానికి  35 కిలో మీటర్ల దూరంలో ఉంది. ఈ గ్రామాల్లో తెలుగు ప్రజలు ఎక్కువ ఆవాసమున్నారు.  సాక్షాత్తు ఇక్కడ ముఖ్యమంత్రి కేసీఆర్ బహిరంగ సభ నిర్వహించారు. పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నప్పటికీ ఎటువంటి ప్రయోజనం లేకపోయింది. భోకర్ ఎన్నికలలో బీఆర్ఎస్ ఓటమిని ఆ పార్టీ ఎమ్మెల్యేలకు తీవ్ర నిరాశను మిగిల్చింది. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి ఈ ఓటమితో కలత చెందారు. తెలంగాణలో అమలవుతున్న అన్ని సంక్షేమ పథకాలను మహరాష్ట్రలో అమలు చేస్తామని కేసీఆర్ హామి ఇచ్చినప్పటికీ ఈ ఎన్నికలో వర్కవుట్ కాలేదు. 

మహా సీఎం అజిత్ పవార్?.. రాజీనామా కారణమదేనా?

మరాఠా యోధుడు, రాజకీయ వ్యూహాల దురంధరుడు ఉరుములేని పిడుగులా సొంత పార్టీ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధ్యక్ష పదవికి రాజీనామా చేసేశారు. పార్టీ శ్రేణులు ఆయనే కొనసాగాలని చేసిన డిమాండ్ లను కూడా పట్టించుకోకుండా తన వారసుడి ఎంపిక కోసం ఒక కమిటీని కూడా వేసేశారు.  అయితే ఎన్సీపీ అధ్యక్ష రేసులో శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలె ముందు వరుసలో ఉన్నారు. ఈ వ్యవహారంపై గత రెండు రోజులుగా దేశ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. చెప్పా పెట్టకుండా శరద్ యాదవ్ ఎందుకింత హఠాత్తుగా పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారన్నదానిపై చర్చోపచర్చలు జరుగుతున్నాయి. అయితే మహారాష్ట్ర రాజకీయాలను దగ్గరగా పరిశీలిస్తున్న వారు మాత్రం ఒక మహా ఎత్తుగడతోనే శరద్ పవార్ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారంటున్నారు. ఆయన రాజీనామా.. తదననంతర పరిణామాలపై పక్షం రోజుల కిందటే సుప్రియా సూలే హింటిచ్చారు. మహా, జాతీయ రాజకీయాలలో రానున్నరోజుల్లో రెండు భూకంపాలు సంభవిస్తాయని ఆమె చెప్పారు. అవేమిటన్నదానిపై విశ్లేషకులు యిప్పుడు క్లారిటీ యిస్తున్నారు.   కర్నాటక ఎన్నికల తరువాత మహారాష్ట్ర రాజకీయాలలో పెను మార్పులు సంభవించనున్నాయంటున్నారు. సార్వత్రిక ఎన్నికలలో  గెలిచి మోడీ ముచ్చటగా మూడో సారి కేంద్రంలో మోడీ  నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలన్న పట్టుదలతో పావులు కదుపుతున్న బీజేపీ.. మహాలో  షిండే ప్రభుత్వ తీరు పట్ల గత కొంత కాలంగా ఒకింత అసంతృప్తితో ఉంది. ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఫడ్నవీస్ కు ముఖ్యమంత్రి పగ్గాలు అప్పగించాలన్న యోచనలో ఉంది. యిది పసిగట్టిన షిండే.. ప్రతి వ్యూహాలతో ఉద్ధవ్ థాక్రేకి దగ్గరయ్యేందుకు ప్రయత్నాలు చేశారు. శరద్ పవార్ ఎన్సీపీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయడానికి ఈ నేపథ్యమే కారణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఆయన బీజేపీకి దగ్గరవుతున్నారని అంటున్నారు. అందుకు గత కొంత కాలంగా ఆయన ప్రకటనలనే సాక్ష్యంగా చూపుతున్నారు. అదానీ వ్యవహారంలోనూ, మోడీ విద్యార్హతలపై తలెత్తిన వివాదంలోనూ ఆయన విపక్ష గళానికి భిన్నంగా తన వాణిని వినిపించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆయన కమలం గూటికి దగ్గరౌతున్నారన్న అనుమానాలు అందరిలోనూ వ్యక్తమయ్యాయి. యిదిలా ఉండగా.. తన సమీప బంధువు అజిత్  పవార్ సీఎంగా మహాలో బీజేపీ సర్కార్ ఏర్పాటుకు ఆయన రాజీనామా నాంది అని అంటున్నారు. సెక్యులర్ నేతగా జాతీయ స్థాయిలో గుర్తింపు ఉన్న శరద్ పవార్ తాను అధ్యక్షుడిగా ఉండగా తానే ఏర్పాటు చేసిన పార్టీ బీజేపీతో జట్టు కట్టిందన్న అపప్రదను మూటగట్టుకోవడం ఎందుకన్న భావనతోనే తాను రాజీనామా చేసి ఆ స్థానంలో తన కుమార్తెను కూర్చోపెట్టి క్రతువు కానిచ్చేద్దామని నిర్ణయించుకున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మొత్తం మీద వచ్చే సార్వత్రిక ఎన్నికలలో విపక్షాల ఐక్యతను ముందుండి నడిపిస్తారనుకున్న శరద్ పవార్ యూటర్న్ తీసుకుని బీజేపీ పంచన చేరడం రాజకీయంగా సంచలనం సృష్టిస్తుందనడంలో సందేహం లేదు.

కర్ణాటకంలో కాసుల గలగల

విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు చేస్తున్న పిల్లలను పెద్దలు డబ్బులేమైనా చెట్లకు కాస్తున్నాయని అనుకుంటున్నావా..అని  హెచ్చరిస్తారు. అంటే డబ్బులు చెట్లకు కాయవు, కష్టపడి సంపాదించాలని చెప్పడం అన్న మాట. కానీ, అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న కర్ణాటకలో.. డబ్బులు , అది కూడా కాస్తా కూస్తా కాదు కోట్ల రూపాయలు చెట్లకు కాస్తున్నాయి!  అదేంటీ అని ఆశ్చర్యపోతున్నారా? అవును మరి.. మైసూరులో సోదాలకు వెళ్లిన ఐటీ అధికారులకు ఓ చెట్టుపై కోటి రూపాయలు కన్పించాయి. అధికారుల కళ్లు గప్పేందుకు ఓ కాంగ్రెస్‌ నేత కుటుంబసభ్యులు చేసిన ప్రయత్నం బెడిసికొట్టి ఈ సొమ్ము బండారం బయటపడింది.  అదలా ఉంటే ఈ ఎన్నికల్లో, ఎలాగైనా గెలిచి తీరాలనే పట్టుదలతో ఉన్న ప్రధాన పార్టీలు, బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్  ధనబలం ఉన్నవారితో పాటుగా, నేర చరితులకు పెద్దపీట వేశాయని, అసోసియేషన్‌ ఆఫ్‌ డెమోక్రటిక్‌ రిఫార్మ్స్‌ సంస్థ (ఏడీఆర్) తాజా నివేదిక వెల్లడించింది. ఈ వైఖరి గత ఎన్నికలతో పోలిస్తే మరింత పెరిగిందని ఏడీఆర్ ఆందోళన వ్యక్తంచేసింది. మే 10న జరగబోయే ఎన్నికలకు సంబంధించి ఆయా పార్టీ నేతలు సమర్పించిన ఎన్నికల అఫిడవిట్ల ఆధారంగా ఓ నివేదికను రూపొందించింది. మొత్తం 2,586 మంది అఫిడవిట్లను విశ్లేషించింది. ఈ తాజా నివేదిక ప్రకారం ఎన్నికలో పోటీ చేస్తున్నఅభ్యర్ధులలో 42 శాతం మంది కోట్లకు పడగలెత్తిన కోటీశ్వరులున్నారు. బరిలో నిలిచిన మొత్తం మొత్తం 2,586 మంది అభ్యర్థుల్లో 1087 మంది (42 శాతం) కోటీశ్వరులని ఏడీఆర్‌ నివేదిక తెలిపింది. 2018 ఎన్నికల్లో యిది 35 శాతంగా ఉందని ఏడీఆర్‌ తెలిపింది. ఒక్కో అభ్యర్థి సగటు ఆస్తి రూ.12.26 కోట్లుగా లెక్కగట్టింది. 2018 ఎన్నికల్లో ఈ సగటు రూ.7.5 కోట్లుగా ఉంది.  పార్టీల వారీగా చూస్తే, కాంగ్రెస్‌కు చెందిన వారు 97 శాతం మంది కోటీశ్వరులు కాగా.. బీజేపీ బరిలో నిలిపిన అభ్యర్థుల్లో 96 శాతం మంది కోటీశ్వరులు ఉన్నారు. జేడీఎస్‌ నుంచి పోటీ చేస్తున్న వారిలో 82 శాతం మంది కోటీశ్వరులున్నారు. ప్రధాన పార్టీల అభ్యర్ధులు మాత్రమే కాదు, స్వతంత్ర అభ్యర్ధులలోనూ కుబేరులకు కొదవ లేదని ఏడీఆర్ నివేదిక పేర్కొంది   ఏడీఆర్‌ విశ్లేషించిన జాబితాలో 901 మంది స్వతంత్రులున్నారు. వారిలో  215 మంది, అంటే 24 శాతం మంది  కోటీశ్వరులు. వ్యక్తిగత ఆస్తుల విషయానికొస్తే.. కాంగ్రెస్‌ అభ్యర్థి యూసఫ్‌ షరీఫ్‌ రూ.1633 కోట్లతో అగ్రస్థానంలో నిలవగా.. బీజేపీ అభ్యర్థి ఎన్‌ నాగరాజు రూ.1609 కోట్లతో రెండో స్థానంలో నిలిచారు.  కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ రూ.1413 కోట్లతో మూడో స్థానంలో నిలిచారు.  డబ్బు ఒక్కటే కాదు, బరిలో నిలిచిన అభ్యర్ధులలో నేర చరితులకూ కొదవలేదని, ఏడీఆర్ నివేదిక పేర్కొంది. నేర చరితులను బరిలో దించే విషయంలోనూ ప్రధాన పార్టీలు ఒకరితో ఒకరు పోటీ పడుతున్నాయని ఏడీఆర్ నివేదిక వెల్లడించింది. ప్రస్తుత ఎన్నికల్లో పోటీ చేస్తున్న వారిలో 22 శాతం మందిపై క్రిమినల్‌ కేసులు ఉన్నాయని ఏడీఆర్ వెల్లడించింది. 2018లో  క్రిమినల్ కేసులు ఉన్నవారి శాతం 15 అని తెలిపింది.  మొత్తం 2,586 మంది అభ్యర్థుల్లో 581 మంది క్రిమినల్‌ కేసులు ఉన్నాయని, ఇందులో 404 మందిపై తీవ్రమైన అభియోగాలు ఉన్నాయని పేర్కొంది. 49 మంది అభ్యర్థులు మహిళల విషయంలో నేరారోపణలు ఎదుర్కొంటుండగా..  అందులో ఒకరిపై అత్యాచారం, 8 మందిపై హత్య, 35 మందిపై హత్యాయత్నం అభియోగాలు ఉన్నాయని ఏడీఆర్‌ నివేదించింది. కాంగ్రెస్‌కు చెందిన అభ్యర్థుల్లో 55 శాతం మంది నేరారోపణలు ఎదుర్కొంటుండగా..  బీజేపీలో  43 శాతం మంది ఉన్నట్లు ఏడీఆర్‌ తెలిపింది. జనతా దళ్‌ సెక్యులర్‌కు చెందిన వారిలో 34 శాతం మందిపై నేరారోపణలు ఉన్నాయని ఏడీఆర్‌ పేర్కొంది. మరోవైపు ఈ ఎన్నికల్లో మహిళలపై వరాల జల్లు కురిపించిన పార్టీలు.. వారికి టికెట్లు కేటాయింపులో మాత్రం మొండిచేయి చూపించాయి. 2018 ఎన్నికల్లో 8 శాతం మంది మహిళలు పోటీ చేయగా.. ఈ సారి  వారి శాతం కేవలం 7 మాత్రమే. కేవలం 7 శాతం మందే బరిలో ఉన్నారు. నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ అత్యధికంగా 22 శాతం మందికి మహిళలకు టికెట్లు కేటాయించింది. బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీల్లో మొత్తం సీట్లలో కేవలం ఐదేసి శాతం మాత్రమే మహిళలకు కేటాయించాయి. జేడీఎస్‌ 6 శాతం మందికి టికెట్లు ఇచ్చింది. మొత్తానికి ఏడీఆర్ నివేదిక కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ..అతి పెద్ద ప్రజాసామ్య దేశంలో ప్రజాస్వామ్య విలువలు మరో ..పది మెట్లు దిగజారిన నిజాన్ని నివేదించింది.