కునో పార్కులో మరో చీతా మృతి
posted on May 10, 2023 @ 4:04PM
మధ్యప్రదేశ్ లోని కునో నేషనల్ పార్క్ లో మరో చీతా ప్రాణాలు వదిలింది. దక్షిణాఫ్రికా నుంచి తీసుకొచ్చిన చీతాల్లో ఒకటైన ఆడ చీతా దక్ష మృతి చెందింది. పార్క్ లో ఇతర చీతాలతో జరిగిన ఘర్షణలో తీవ్రంగా గాయపడిన దక్ష చికిత్స పొందతూ చనిపోయినట్లు అటవీశాఖ అధికారులు ధృవీకరించారు. దక్ష మృతిలో కునో నేషనల్ పార్కులో లో 40 రోజుల వ్యవధిలో ఇది మూడో చీతా చనిపోయినట్లైంది.
నమీబియా నుంచి తీసుకొచ్చిన చీతాల్లో ఒకటైన సాశా అనే ఆడ చీతా ఈ ఏడాది మార్చి 27న చనిపోయింది. భారత్ కు రాకముందు నుంచే మూత్రపిండ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆ చీతా.. మరింత అస్వస్థతకు గురై మృతిచెందింది.
ఆ తర్వాత దక్షిణాఫ్రికా నుంచి తీసుకొచ్చిన చీతాల్లో ఒకటైన ఉదయ్ అనే మగ చీతా.. ఈ ఏడాది ఏప్రిల్ 23న అనారోగ్యానికి గురై చనిపోయింది. ప్రాజెక్ట్ చీతా భాగంగా ఇండియాకు 20 చీతాలు తీసుకొచ్చారు. 2022 సెప్టెంబర్ 17న నమీబియా నుంచి 8 చీతాలను, 2023 ఫిబ్రవరి 17న సౌతాఫ్రికా నుంచి 12 చీతాలు తీసుకొచ్చారు. వీటిలో మూడు చీతాలు చనిపోయాయి.
ప్రాజెక్టు చీతాలో భాగంగా వీటిని దక్షిణాఫ్రికా, నమీబియాల నుంచి తీసుకువచ్చిన చీతాలను ప్రధాని నరేంద్ర మోడీ ఎంతో ఆర్భాటంగా మధ్యప్రదేశ్ కునో పార్కులో వదిలిన సంగతి విదితమే. వీటిలో ఒక్కొక్క చీతా మరణిస్తుండటంతో పార్కు అధికారులు ఏం చేయాలో అర్థం కాక, తలలు పట్టుకుంటున్నారు.