మణిపూర్ లో మారణాయుధాలు చోరీ
posted on May 10, 2023 @ 3:44PM
దక్షిణాదిలో కర్నాటక ఎన్నికలలో మోడీ అమిత్ షా, ఈశాన్య రాష్ట్రాల ప్రత్యేక కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిలు క్షణం తీరికలేకుండా వ్యూహాలు రచిస్తుంటే, ఈశాన్యంలో మణిపూర్ పరస్పర దాడులతో అట్టుడుకుతోంది. యిప్పటికే అధికారిక లేక్కల ప్రకారం 60 మందికి పైగా మరణించగా వందల మంది గాయపడ్డారు. వేల కొలదీ యిళ్లు అగ్నికి ఆహుతి కాగా, 25కి పైగా చర్చిలు కూల్చివేయబడ్డాయి. యింత జరుగుతున్నా దేశ నాయకులకు యిది పట్టడం లేదు.
మణిపూర్ లో పెట్రేగిన హింస యింత వరకూ అదుపులోనికి రాలేదు. స్థానిక పోలీసు, సైనిక వ్యవస్థలు కొంత వరకూ పరిస్థితిని తమ అధీనంలోకి తెచ్చుకున్నాయి. అయినా యింకా ఎప్పుడు ఏమి జరుగుతుందో తెలియని పరిస్థితి కొనసాగుతోంది.
మణిపూర్ లో తాజా పరిస్థితిపై నోరు విప్పిన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కొన్ని షాకింగ్ నిజాలను మీడియాతో పంచుకున్నారు. గత కొద్ది రోజులుగా జరుగుతున్న దాడులలో 1041 తుపాకులు, 7450 రౌండ్ల బుల్లెట్లు మాయమయ్యాయని ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ చెప్పుకొచ్చారు. వీటిలో అత్యాధునిక ఏకే సిరీస్ రైఫిళ్లు, సెల్ఫ్ లోడెడ్ మ్యాగజైన్లు ఉన్నాయని ఆయన చెప్పారు.
జాతుల మధ్య జరుగుతున్న ఈ హిసాకాండలో వెయ్యికి పైగా తుపాకులు, ఏడున్నర వేల బుల్లెట్లు ప్రజలు లూటీ చేశారని ముఖ్యమంత్రి స్వయంగా అంగీకరించారు. ఆ ఆయుధాలు యిప్పుడు ఎవరి చేతికి చేరాయో తెలియని, యిది ఆందోళన కలిగించే అంశమని బీరేన్ సింగ్ చెబుతున్నారు. దానిపై మణిపూర్ లో నిరసన వ్యక్తమవుతోంది. నాలుగు దేశాలతో సరిహద్దును పంచుకుంటున్న ఈశాన్య రష్యాలలో పరిస్థితిపై దేశంలోనే కాక అంతర్జాతీయంగా కూడా అనేక ప్రశ్నలు ఉదయిస్తున్నాయి.
యిన్ని ఆయుధాలు నిజంగా భద్రతా సిబ్బంది నుండి ప్రజలు లూటీ చేశారా లేక ప్రభుత్వమే వాటిని దారి మరల్చిందా అన్న ప్రశ్న ప్రతిపక్షాల నుండి ఎదురౌతోంది. సమస్యాత్మక రాష్ట్రాలుగా చెప్పుకునే ఈశాన్య రాష్ట్రాల పట్ల యిలాంటి వైఖరి సరికాదనేది వారి వాదన. అల్లర్లలో మరణించిన వారికి 5లక్షలు ఎక్స్ గ్రేషియా, యిళ్లు కోల్పోయిన వారికి 2 లక్షలు నష్టపరిహారం, తీవ్రంగా గాయపడిన వారికి 2 లక్షలు, స్వల్పంగా గాయపడిన వారికి పాతిక వేల రూపాయల పరిహారాన్ని మణిపూర్ ప్రభుత్వం ప్రకటించింది.