ప్రభుత్వ భూములు ప్రయివేటు వ్యక్తుల చేతుల్లో
posted on May 10, 2023 @ 12:45PM
ప్రభుత్వ భూములను ప్రయివేటు వ్యక్తులకు అప్పగించడానికి బీఆర్ఎస్ ప్రభుత్వం ఆసక్తి చూపుతుందని కాంగ్రెస్ లెజిస్లేటివ్ నేత మల్లు భట్టి విక్రమార్క ఆరోపిస్తున్నారు. మల్లు భట్టి విక్రమార్క చేపట్టిన యాత్ర రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గానికి చేరుకుంది. ఈ సభలో మల్లు బీఆర్ఎస్ చేస్తున్న కబ్జాలను తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అధికారంలోకి వచ్చే ముందు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, మూడు ఎకరాల భూమి ఇస్తామని ఆశ చూపి ఇల్లు ఇవ్వకపోగా.. గత ప్రభుత్వాలు పంపిణీ చేసిన భూములను బలవంతంగా తిరిగి బీఆర్ఎస్ ప్రభుత్వం లాక్కుంటుందన్నారు.రాజ్య హింస భయంకరమైన పరిస్థితులు ఎలా ఉంటాయో ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో చూస్తున్నామన్నారు. ప్రశ్నిస్తే కేసులు, నిలదీస్తే నిర్బంధం, ఎదురు తిరిగితే లాఠీ చార్జీలు, హక్కుగా ఇచ్చిన భూమిలో కట్టుకున్న ఇళ్లను కూల్చివేస్తూ రాజధాని నడిబొడ్డున రాజహింస, భయంకరమైన పరిస్థితి ఎలా ఉంటుందో బీఆర్ఎస్ ప్రభుత్వం చూపిస్తుందన్నారు.
‘‘ఒక్క ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోనే రూ.5 లక్షల కోట్ల విలువైన సుమారు 10 వేల ఎకరాల భూమిని బీఆర్‌ఎస్ ప్రభుత్వం కబ్జా చేసింది. హైదరాబాద్ చుట్టుపక్కల పేదల భూములను కూడా 25 లక్షల కోట్ల రూపాయలతో లాక్కుంది. పేదల నుంచి లాక్కున్న భూములను ధనవంతులు, కార్పొరేట్ల కంపెనీలకు, హెచ్‌ఎండీఏ లేఅవుట్ల రూపంలో వేలానికి ఇచ్చారని కాంగ్రెస్ నేత ఆరోపించారు.కోరి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో నిశ్శబ్దంగా, మౌనంగా, కనిపించకుండా ప్రభుత్వం రాజ్య హింస చేస్తుంది’’అని భట్టి విక్రమార్క ఆరోపించారు. భట్టి చేపట్టిన యాత్రకు మహేశ్వరం నియోజకవర్గంలో మంచి రెస్పాన్స్ వచ్చింది.