పరిధిమీరొద్దు.. అనుచిత దూకుడు వద్దు.. ఈడీకి సుప్రీం సూచన
posted on May 17, 2023 @ 9:51AM
రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిరపరచాలన్న దురుద్దేశంతో పాటు రాజ కీయ ప్రేరేపిత కుట్రలో భాగంగా మనీలాండరింగ్ చట్టాన్ని అడ్డు పెట్టుకుని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు దూకుడుగా వ్యవహరిస్తున్నారంటూ ఛత్తీస్ గఢ్ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు స్పందించింది. భయోత్పాత వాతావరణాన్ని సృష్టించకండి. మీరు ఈ విధంగా ప్రవర్తిస్తే నిజాయితీగా జరిగిన లావాదేవీలపై కూడా అనుమా నాలు తలెత్తుతాయంటూ జస్టిస్ ఎస్. కె. కౌల్, జస్టిస్ ఎ. అమానుల్లా ధర్మాసనం ఈడీ అధికారులకు సూచించింది.
రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదనలు విని పిస్తూ.. ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్ సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభు త్వాన్ని మద్యం కుంభకోణం కేసులో ఇబ్బందులకు గురిచేయాలనే ఉద్దే శంతో రాష్ట్ర అధికారులపై ఈడీ తీవ్ర ఒత్తిడి తెస్తోందన్నారు. వారి కుటుంబ సభ్యులను కూడా బెదిరించి తాము చెప్పిన విధంగా వాంగ్మూలం ఇవ్వా లంటోందని, దీంతో అధికారులు ఛత్తీస్ గఢ్ ఎక్సైజ్ శాఖలో పనిచేయబోమని ప్రభుత్వానికి చెబుతున్నారని ధర్మాసనానికి విన్నవించారు.
అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్న తరుణంలో ఈడీ దూకుడు పెంచిందని ఆయన ఆరోపించారు. ఈడీ తరఫున హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్. వి. రాజు ఈ ఆరోపణలను తోసిపుచ్చారు. 2019-2022 మధ్య కాలంలో మద్యం వ్యాపారంలో రూ.2వేల కోట్ల మేర అవినీతి జరిగిందంటూ వచ్చిన ఆరోపణలపై ఈడీ దర్యాప్తు చేస్తోందని ధర్మాసనానికి తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తన అధీనంలోని దర్యాప్తు సంస్థలను దుర్వినియోగపరుస్తూ బీజేపీయేతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల ప్రభుత్వాలపై కేసులు నమోదు చేయడంతో పాటు వేధింపులకు గురిచేస్తోందని గత నెలలో సుప్రీంకోర్టును ఛత్తీస్ గఢ్ ఆశ్రయించిన సంగతి విదితమే. మనీలాండరింగ్ చట్టంలోని పలు నిబంధనల చెల్లుబాటును ఆ పిటిషన్ లో సవాల్ చేసింది.
కేంద్రం కనుసన్నలలో దర్యాప్తు సంస్థలు పని చేస్తున్నాయనీ, బీజేపీయేతర ప్రభుత్వాలను, ప్రతిపక్ష నేతలను టార్గెట్ చేస్తూ.. వేధింపులకు గురిచేస్తున్నాయని గత కొంత కాలంగా ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు చేసిన ఈ వ్యాఖ్య ప్రాధాన్యత సంతరించుకుంది.