అయినను వెళ్లి రావలె హస్తినకు
posted on May 16, 2023 @ 2:25PM
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి మరోసారి ఢిల్లీ వెళుతున్నారు. గత పర్యటనలలా ఇదేమీ సిరికిం చెప్పడు అన్నట్లుగా హఠాత్తుగా, రహస్యంగా ఖరారు చేసుకున్న పర్యటన కాదు. ఈ నెల 27న జరగనున్న నీతి ఆయోగ్ సమావేశానికి హాజరయ్యేందుకు ఆయన హస్తిన వెళుతున్నారు. అయితే ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే.. స్వకార్యం కాకపోతే ఆయన ప్రపంచం తల్లకిందులైనా తాడేపల్లి ప్యాలెస్ దాటి అడుగు బయటపెట్టరు.
గత నీతి ఆయోగ్ సమావేశాలకు జగన్ హాజరు కాలేదు. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ వెళ్లే వారు. కానీ ఈ సారి మాత్రం జగన్ స్వయంగా ఆ సమావేశానికి హాజరవ్వాలని నిర్ణయించుకున్నారు. అయితే ఆ సమావేశానికి హాజరు కావడానికి 27వ తేదీ ఉదయం ప్రత్యేక విమానం ఎక్కినా సరిపోతుంది. కాకుంటే 26 రాత్రి బయలు దేరినా సరిపోతుంది. కానీ జగన్ మాత్రం 26వ తేదీ ఉదయానికే హస్తినలో వాలిపోతున్నారు. ఆయన పర్యటనకు నీతి ఆయోగ్ సమావేశం ఒక సాకు మాత్రమేననీ, అంతకు మించిన రాచకార్యం ఏదో వెలగబెట్టేందుకే ఆయన బగ్గనను పక్కన పెట్టి మరీ హస్తిన ప్రయాణం పెట్టుకున్నారనీ అంటున్నారు. కర్నాటక ఎన్నికల ఫలితం తరువాత బీజేపీ అగ్రనాయకత్వం జగన్ కి గతంలోలా అండగా నిలిచే అవకాశాలు దాదాపు మృగ్యం అని బీజేపీ వర్గాలే చెబుతున్నాయి. అయిననూ వెళ్లి రావలె హస్తినకు అన్నట్లుగా జగన్ ఏదో విధంగా బీజేపీ అగ్రనాయకత్వాన్ని ప్రసన్నం చేసుకోవాలన్న ఉద్దేశంతో ఉన్నారని అంటున్నారు.
జగన్ అధికార పగ్గాలు చేపట్టి నాలుగేళ్లయ్యింది. ఈ నాలుగేళ్లలో పలుమార్లు హస్తిన వెళ్లారు. కేంద్రంలోని పెద్దలందరినీ కలిశారు. కానీ అలా కలిసిన ఏ సారీ కూడా రాష్ట్ర ప్రయోజనాలు, విభజన హామీలపై కేంద్రాన్ని నిలదీసిన దాఖలాలు లేవు. ఆయన హస్తిన యాత్రలన్నీ పూర్తిగా వ్యక్తిగత అజెండాతోనే సాగాయన్న విమర్శలు ఉన్నాయి.
ఇక ఇప్పుడు ఎన్నికల ఏడాది. ప్రభుత్వంపై రాష్ట్రంలో సర్వత్రా వ్యతిరేకత వ్యక్తమౌతోంది. అన్ని వర్గాలూ ప్రభుత్వ తీరు పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్నాయి. రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధ్యాయులు ఆందోళన బాటలో ఉన్నారు. వైసీపీ గడపగడపకు, మా నమ్మకం నువ్వే జగన్ వంటి కార్యక్రమాల సందర్భంగా ప్రజల ముందుకు వెళ్లిన ప్రజా ప్రతినిథులకు వారి నుంచి నిరసనలు వ్యక్తమౌతున్నాయి. ఎమ్మెల్యేలూ, మంత్రులను ప్రజలు ఎక్కడికక్కడ నిలదీస్తున్నారు. ప్రజా వ్యతిరేకత ఏ స్థాయిలో ఉందో తెలియడానికి ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలను పరిశీలకులు ఎత్తి చూపుతున్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో మూడుకు మూడు స్థానాలనూ తెలుగుదేశం కైవశం చేసుకుంది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలో సొంత పార్టీ ఎమ్మెల్యేలు నలుగురు క్రాస్ ఓటింగ్ కు పాల్పడటంతో వైసీపీ గెలుపొందింది.
ఆ తరువాత ఓ నలుగురు ఎమ్మెల్యేలను పార్టీ నుండి సస్పెండ్ చేసి చర్యలు తీసుకున్నామని వైసీసీ చెప్పుకుంది కానీ, అసంతృప్త ఎమ్మెల్యేల సంఖ్య పదుల సంఖ్యలోనే ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. వారి విశ్లేషణలను పక్కన పెడితే స్వయంగా వైసీపీ నాయకులే అసంతృప్తి నివురుగప్పిన నిప్పులా ఉందని అంగీకరిస్తున్నారు. గతంలోలా ప్రభుత్వంలో పార్టీలో జగన్ మాటే శాసనం అన్న పరిస్థితి కనిపించడం లేదు. గతంలో ఉన్న ధీ మా ఇప్పుడు సీఎం జగన్ లో ఏ మాత్రం కనిపించడం లేదు. గతంలోలా పార్టీ ఎమ్మెల్యేలు జగన్ ఏది చెబితే దానికి జీహుజూర్ అనే పరిస్థితి కూడా పూర్తిగా మారిపోయింది. జగన్ పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు, మంత్రులతో భేటీలో అసంతృప్తులను బుజ్జగించడానికే ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు. వైనాట్ 175 అన్నజగన్ ఇప్పుడు అధికారంలోకి వస్తే చాలన్నట్లుగా మాట్లాడుతున్నారు. విపక్షం అధికారంలోకి వస్తే సంక్షేమం ఆగిపోతుందంటే ప్రజలను బ్లాక్ మెయిల్ చేయడానికి సైతం వెనుకాడటం లేదు. ఎన్ని చేసిన ప్రజా వ్యతిరేక పవనాల ఉధృతి రోజు రోజుకూ పెరుగుతున్న సంకేతాలు కనిపిస్తుండటంతో ఇక నాలుగేళ్లుగా ఎన్నడూ రాష్ట్ర ప్రయోజనాల గురించి పట్టించుకోని, విభజన హామీల గురించి కేంద్రాన్ని నిలదీయని జగన్ ఇప్పుడు నీతి ఆయోగ్ సమావేశం పేరుతో హస్తిన యాత్ర పెట్టుకుని.. అదీ ఒక రోజు ముందు ఢిల్లీలో వాలి.. ప్రధాని, మోడీలను కలిసి విభజన హామీలపై ఏదో ఒక ప్రకటన చేయమని బతిమాలుకునే అవకాశం ఉందన్నది పరిశీలకుల విశ్లేషణ.
అలా ఏమైనా ప్రకటన చేయించుకుంటే.. అది ఎన్నికల ప్రచారంలో బ్రహ్మాండం బద్దలు కొట్టేశామని ప్రచారం చేసుకోవడానికి ఉపయోగిస్తుందన్నది జగన్ భావనగా చెబుతున్నారు. ఎందుకంటే.. నాలుగేళ్ల పాలనలో ఇది సాధించాం అని చెప్పుకోవడానికి ఏమీ లేకపోవడం తో ఏం చెప్పి ఓట్లు అడగాలన్న ఇబ్బందిని అధిగమించడానికి ఇదే మార్గంగా వైసీపీ అధినేత భావిస్తున్నారని అంటున్నారు. ఇక వివేకా హత్య కేసులో అవినాష్ ను సీబీఐ మరోసారి విచారణకు పిలిచింది. వాస్తవానికి ఆయన ఈ రోజు విచారణకు హాజరు కావాల్సి ఉండగా ముందుగా నిర్ణయించుకున్న షెడ్యూల్ ప్రకారం ఉన్న కార్యక్రమాల కారణంగా రాలేనని లేఖ రాసి నాలుగు రోజులు వ్యవధి కోరారు. జగన్ హస్తిన వెళ్లే వరకూ ఆయన వాయిదాల మీద వాయిదాలు కోరే అవకాశం ఉందనీ, అరెస్టును తప్పించుకోవడానికి ఆయన పూర్తిగా జగన్ మీదే ఆధారపడ్డారనీ అంటున్నారు. గత జనవరిలో కూడా వివేకా హత్య కేసులో అవినాష్ కు సీబీఐ సమన్లు జారీ చేయగానే జగన్ హస్తిన వెళ్లి వచ్చారు. ఆ తరువాత ఈ కేసు దర్యాప్తులో సీబీఐ దూకుడు తగ్గింది. కర్నాటక ఎన్నికల ఫలితం వెలువడిన రెండో రోజునే సీబీఐ అవినాష్ కు మరోసారి నోటీసులు జారీ చేసింది. మళ్లీ జగన్ హస్తిన పర్యటన పెట్టుకున్నారు. ఈ సారి ఏం జరుగుతుందో చూడాల్సిందే మరి అంటున్నారు పరిశీలకులు.