అమ్మ భువనేశ్వరి!
posted on May 16, 2023 @ 12:28PM
తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్ర వంద రోజులు పూర్తయిన సందర్బంగా ఆయన తల్లి భువనేశ్వరి సోమవారం కుమారుడితో అడుగు కలిపి నడిచారు. అంతకు ముందు రోజు మాతృ దినోత్సవం సందర్భంగా ఆదివారం లోకేష్ క్యాంప్ సైట్ వద్ద లోకేష్ తల్లి ఆశీర్వాదం తీసుకున్నారు. కుమారుడి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.
అంతే కాకుండా పాదయాత్రలో లోకేష్‌కు వెన్నుదన్నుగా నిలుస్తున్న యువగళం దళాన్ని భువనేశ్వరి పేరుపేరునా పలకరించి, వారికి కృతజ్ఞతలు చెప్పారు. భోజన విరామ సమయంలో భువనేశ్వరి యువదళం సభ్యులకు స్వయంగా వడ్డించారు. ఆ సందర్భంగా లోకేష్ పాదయాత్రలో పాల్గొనేందుకు నెలల తరబడి కుటుంబాలను విడిచి రావడం ఎంతో గొప్ప విషయమనీ, మీకూ, మిమ్మల్ని పంపించినందుకు మీ కుటుంబాలకు కృతజ్ఞతలు అంటూ ఉద్వేగంగా మాట్లాడారు.
మీ ప్రేమ లోకేష్‌కు ఉండాలి. మీ సేవలు అమూల్యం. మీ రుణం ఎలా తీర్చుకోవాలో అర్ధం కావడం లేదు. ఇంతమంది అభిమానులను సంపాదించుకున్నందుకు లోకేష్ అదృష్టవంతుడని పేర్కొన్నారు. సహజంగా ఎప్పుడూ తెరపైకి రాని భువనేశ్వరి, తన కుమారుడు లోకేష్ పాదయాత్ర వందరోజుల సందర్భంగా బయటకు వచ్చి, పాదయాత్రలో పాల్గొని, వాలంటీర్లు, లోకేష్ బృందానికి స్వయంగా భోజనం వడ్డించడం అందరినీ ఆకర్షించింది.