రాజమండ్రి@ 49 డిగ్రీల ఉష్ణోగ్రత.. నిప్పుల కొలిమిలా ఏపీ
posted on May 16, 2023 @ 5:49PM
ఏపీలో భానుడు నిప్పులు చెరుగుతున్నాడు. నడి వేసవిలో అకాల వర్షాలతో చల్లబడిన వాతావరణం ఒక్క సారిగా మారిపోయింది. సూర్యుడు నిప్పులు చెరుగుతున్నాడు. గత నాలుగు రోజులుగా ఏపీ నిప్పుల కుంపటిని తలపిస్తోంది. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదౌతున్నాయి. మంగళవారం అయితే ఏపీయా ఎడారా అనిపించేలా ఎండ మండిపోయింది.
ముఖ్యంగా రాజమహేంద్రవరంలో అత్యథికంగా 49 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇటీవలి కాలంలో ఏపీలో ఈ స్థాయిలో ఉష్ట్రగ్రతలు నమోదైన సందర్భం లేదని స్థానికులు చెబుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎండలకు వడగాల్పులు తోడకావడంతో జనం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
విజయనగరం, మన్యం, అల్లూరి, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, ఉభయగోదావరి జిల్లాల్లోని పలు ప్రాంతాలలో 45 డిగ్రీలకు మించి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అలాగే ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, ఎస్ పీఎస్ఆర్ నెల్లూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 47 డిగ్రీల వరకూ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
ఈ హీట్ వేవ్ మరో నాలుగు రోజులు కొనసాగుతుందని వాతావరణ శాఖ పేర్కొంది. సాధ్యమైనంత వరకూ అత్యవసర పని ఉంటే తప్ప ఎండ సమయంలో బయటకు రావద్దని ప్రజలను హెచ్చరించింది.