ఇక్కడ స్విచ్.. అక్కడ లైటు!
posted on May 16, 2023 @ 4:26PM
ఇక్కడ స్విచ్ వేస్తే అక్కడ లైట్ వెలుగుతుందన్నట్లు వివేకా హత్య కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డికి సీబీఐ నోటీసులు వస్తే.. జగన్ లో ఫ్రస్ట్రేషన్ పీక్స్ కు చేరుకుంటుంది. అవినాష్ రెడ్డికి సీబీఐ నోటీసులు రావడానికీ జగన్ ఫ్రస్ట్రేషన్ కీ సంబంధం ఏమిటన్న లాజిక్కులు వెతకడం అనవసరం. ఎందుకంటే ఆ సంబంధం ఏమిటన్నది గూగుల్ లుక్ ఔట్ ద్వారా సీబీఐ ఎప్పుడో బయటపెట్టేసింది.
వివేకా హత్య జరిగిన తరువాత అవినాష్ ఎవరెవరికి ఎన్నెన్ని సార్లు ఫోన్ చేశారన్న విషయాన్ని సీబీఐ తన దర్యాప్తు ద్వారా బట్టబయలు చేసేసింది. అవినాష్ రెడ్డికి సీబీఐ ఈ ఏడాది జనవరి చివరిలో విచారణకు హాజరు కావాలంటూ తొలి సారి నోటీసులు జారీ చేసినప్పుడు జగన్ తన అధికారిక కార్యక్రమాలన్నిటినీ రద్దు చేసుకుని తాడేపల్లి ప్యాలెస్ కే పరిమితమయ్యారు. అవినాష్ సీబీఐ విచారణకు హాజరు కావడానికి ఒక రోజు ముందు ఆయన సిరికిం చెప్పడు.. అన్న చందంగా హుటాహుటిన హస్తినకేగారు. అర్ధరాత్రి కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. ఏం మంతనాలు జరిపారన్నది షరామూమూలుగానే ఎవరికీ చెప్పరు. రాష్ట్ర సమస్యలపై చర్చించామని ఫొటో స్టాట్ కాపీలాంటి ప్రకటన ఒకటి సీఎంవో నుంచి విడుదల అవుతుంది. అంతే. అటు నుంచి సానుకూల స్పందన అన్న ముక్తాయింపు యథాప్రకారంగా ఉంటుంది.
సరే అదలా ఉంచితే.. జగన్ పర్యటన తరువాత వివేకా హత్య కేసులో సీబీఐ దర్యాప్తు వేగం మందగించింది. అంతేనా.. అప్పటి వరకూ వివేకా హత్య కేసు దర్యాప్తు అధికారిగా ఉన్న రామ్ సింగ్ ను సీబీఐ తప్పించింది. ఆయన స్థానంలో కొత్త దర్యాప్తు అధికారి వచ్చారు. ఇక ఆ తరువాత కూడా అవినాష్ కు మరో మూడు సార్లు విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు జారీ చేసింది. అవినాష్ ముందస్తు బెయిలు కోసం తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అరెస్టు నుంచి రక్షణ పొందారు. అయితే వివేకా కుమార్తె తెలంగాణ హైకోర్టు అవినాష్ కు బెయిలిస్తూ జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులను సవాల్ చేస్తూ సుప్రీంను ఆశ్రయించారు. సుప్రీం కోర్టు తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను కొట్టివేసింది. ఆ తరువాత ముందస్తు బెయిలు పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు కూడా బెయిలు పిటిషన్ పై తీర్పును వాయిదా వేస్తూ అవినాష్ ను అరెస్టు చేయడానికి ఎటువంటి అడ్డంకులూ లేవనీ, అరెస్టు చేసి విచారించాలనుకుంటూ నిరభ్యంతరంగా ఆ పని చేయవచ్చనీ విస్పష్టంగా చెప్పింది. దీంతో వివేకా హత్య కేసులో అవినాష్ అరెస్టుకు చట్ట పరంగా ఎటువంటి రక్షణ కవచాలూ లేవు అయినా సీబీఐ అవినాష్ అరెస్టు దిశగా ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు.
ఇక ఈ మధ్యలో అవినాష్ కు సీబీఐ నుంచి తాఖీదులు వచ్చిన ప్రతిసారీ జగన్ విపక్షాలపై విమర్శల దాడిని తీవ్రం చేయడం అన్నది ఒక ఆనవాయితీగా మారిపోయింది. వివేకా హత్య కేసులో సీబీఐ దర్యాప్తు వేగం మందగిస్తే జగన్ మౌనమునిలా మారిపోవడం.. అవినాష్ వైపు సీబీఐ ఒక అడుగు వేస్తే.. జగన్ విపక్షాలపై విమర్శలతో విరుచుకు పడటం ఈ మూడు నెలల కాలంలో ఒక ఆనవాయితీగా మారిపోయింది. తాజాగా అవినాష్ ను విచారణ రావాల్సిందిగా ఆదేశిస్తూ సీబీఐ నోటీసులు జారీ చేసింది. ఆ నోటీసుల మేరకు మంగళవారం (మే16) అవినాష్ హైదరాబాద్ లోకి సీబీఐ కార్యాలయంలో హాజరు కావాల్సి ఉంది. అయితే అవినాష్ హాజరు కాలేనంటే లేఖ రాస్తే అందుకు సీబీఐ సమ్మతించిందనుకోండి అది వేరే సంగతి.
కానీ.. జగన్ అదే రోజు అంటే మంగళవారం (మే16) బాపట్లలోని నిజాంపట్నంలో సీఎం జగన్ వైఎస్సార్ మత్స్యాకార భరోసా నిధులను మత్స్యకారుల ఖాతాల్లో జమ చేశారు. ఆ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన ప్రసంగించారు. అది ప్రభుత్వ కార్యక్రమం అయినా ఆయన దానికి పార్టీ ప్రచార సభగా మార్చేసి విపక్షాల మీద విమర్శల దాడికి ఉపయోగించుకున్నారు.
దత్తపుత్రుడు అంటూ పవన్ పై పాత విమర్శనే మళ్లీ కొత్తగా చేశారు. చంద్రబాబు చెప్పిన దానికి తలవూపడడే పవన్ పని అని ఎద్దేవా చేశారు. పొత్తులు, విడిపోవడాలు, విడాకులు అంటూ చాలా చాలా మాటలు మాట్లాడారు. మొత్తంగా అవినాష్ సీబీఐ విచారణ అంశాన్ని డైవర్ట్ చేయడం కోసమే తీవ్ర స్థాయిలో ఆరోపణలు గుప్పించారు. గతంలో కూడా వివేకా హత్య కేసులో సీబీఐ స్పీడు పెరిగిన ప్రతి సారీ జగన్ ఫ్రస్ట్రేషన్ పీక్స్ చేరిందని ఈ సందర్భంగా పరిశీలకులు గుర్తు చేస్తున్నారు.