అవినాష్ కు చెలగాటం.. సీబీఐకి ప్రాణ సంకటం!
posted on May 16, 2023 @ 3:18PM
వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డికి సీబీఐ నోటీసులు జారీ చేయడం ఆయన వ్యవధి కావాలని కోరడం.. సీబీఐ అవినాష్ కోరినట్లుగా వ్యవధి ఇవ్వడం గత కొన్ని నెలలుగా నిరాటంకంగా సాగుతోంది. ఈ వ్యవహారం మొత్తం పిల్లికి చెలగాటం, ఎలక్కి ప్రాణ సంకటం అన్న సామెత గుర్తుకు వస్తోంది. అయితే ఇక్కడ పిల్లి అవినాష్ అయితే సీబీఐ ఎలుక అన్నట్లుగా ఉంది.
సీబీఐ నిస్సహాయతను ఆసరాగా చేసుకుని అవినాష్ రెడ్డి ఆ దర్యాప్తు సంస్థతో తన ఇష్టారీతిగా ఆటలాడుకుంటున్నారు. ఈ తతంగం గత జనవరి నుంచి ప్రారంభమైంది. గత జనవరి నుంచి ఇప్పటి వరకూ సీబీఐ నాలుగు మార్లు అవినాష్ ను విచారించింది. ముందస్తు బెయిలు కోసం అవినాష్ దాఖలు చేసుకున్న పిటిషన్ పై దాఖలు చేసిన కౌంటర్ లో అవినాష్ ను అరెస్టు చేస్తామని విస్పష్టంగా చెప్పింది. కోర్టులు అవినాష్ కు ఇచ్చిన బెయిలు రక్షణను తొలగించేసినా.. కేంద్ర దర్యాప్తు సంస్థ ఆయనను అరెస్టు చేయడానికి ముందుకు రావడం లేదు. తాజాగా సీబీఐ జారీ చేసిన నోటీసుకు ప్రతిగా అవినాష్ రెడ్డి నాలుగు రోజులు గడువు కావాలంటూ లేఖ రాసి దర్జాగా పులివెందులకు బయలుదేరి వెళ్లిపోయారు. ఆ తరువాత అవినాష్ కోరిన వ్యవధి ఇచ్చేది లేదు.. వెంటనే హాజరు కావాల్సిందేఅంటూ సీబీఐ హుకుం జారీ చేసింది. అంతలో ఏమైందో ఏమో గంట వ్యవధిలోనే అవినాష్ కోరినట్లు నాలుగురోజులు కాకుండా మూడు రోజులు గడువు ఇచ్చి ఈ నెల 19న హాజరు కావాల్సిందిగా మరో నోటీసు ఇచ్చింది.
అసలు సీబీఐ విషయంలో మొదటి నుంచీ కూడా అవినాష్ రెడ్డి ఆడింది ఆట పాడింది పాటగా నడుస్తోంది. సీబీఐ కార్యాలయంలో విచారణను ఎదుర్కొని బయటక వచ్చి అదే దర్యాప్తు సంస్థపై ఇష్టారీతిన ఆరోపణలు చేసినా సీబీఐకి చీమ కుట్టినట్టు ఉండదు.
పార్టీ కార్యక్రమాలు ఉన్నాయి.. మీరు కోరినట్లు విచారణకు హాజరు కావడానికి కుదరదంటూ అవినాష్ పదే పదే విచారణకు హాజరు కాకుండా అవాయిడ్ చేస్తున్నా.. సీబీఐ మాత్రం జీహుజూర్ మీకు కుదిరినప్పుడే రండి అన్నట్లు గడువు ఇస్తూ వస్తోంది. ఈ వ్యవహారమంతా సీబీఐ ప్రతిష్టను మంటగలపుతోంది, పరువును గంగలో కలిపేస్తోంది. సీబీఐ స్వతంత్రంగా వ్యవహరించడం లేదన్న అనుమానాలకు తావిస్తోంది. ఆ దర్యాప్తు సంస్థ విశ్వసనీయతనే దెబ్బతీస్తోందని పరిశీలకులు అంటున్నారు.