కమలంలో కర్ణాటక గుబులు
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు తెలంగాణ రాజకీయాలపై ఎలాంటి ప్రభావం చూపుతాయి? రాష్ట్ర రాజకీయ సమీకరణాలు మారిపోతాయా? ఇంతవరకు ఒక లెక్క ఇకపై మరో లెక్కన రాజకీయ ముఖ చిత్రమే మారి పోతుందా? అంటే పరిశీలకులు ఇలాంటి ప్రశ్నలకు ఇప్పిటికిప్పుడు సమాధానం చెప్పడం కొంత సాహసమే అంటున్నారు.
అయితే బీఆర్ఎస్ మొదలు బీజేపీ వరకు ప్రధాన రాజకీయ పార్టీలలో కర్ణాటక ఎన్నికల ఫలితాలపై విభిన్న కోణాల్లో చర్చ అయితే జరుగుతోంది. కర్ణాటకలో అనూహ్య విజయం సొంతం చేసుకున్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు తెలంగాణలోనూ హస్తం పార్టీదే గెలుపని ధీమా వ్యక్తపరుస్తున్నాయి. మరో వంక అధికార బీఆర్ఎస్ నాయకులు,కర్ణాటక కర్ణాటకే తెలంగాణ తెలంగాణే అంటూ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ.. ముచ్చటగా మూడవ సారి మళ్ళీ తమదే విజయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సర్వేలనీ తమకే అనుకూలంగా ఉన్నాయని, ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా 100 నుంచి 105 నియోజక వర్గాల్లో కారు జోరుకు తిరుగుండదని పార్టీ వేదిక నుంచి ప్రకటించారు.
అలాగే కర్ణాటకలో అధికారం కోల్పోయిన బీజేపీ నాయకులు కూడా తెలంగాణలో మాత్రం అధికారం తమదేనని అంటున్నారు. అయితే ఆరేడు నెలల తర్వాత జరిగే ఎన్నికల ఫలితాల సంగతి ఎలా ఉన్నా, కర్ణాటక ఓటమి తర్వాత తెలంగాణ బీజేపీలో అసమ్మతి రాగాలు అధికమయ్యాయి. నిజానికి బీజేపీలో అంతర్గత కలహాలు కొత్తకాదు. ముఖ్యంగా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బండి సంజయ్ వ్యవహార సరళి విషయంలో పార్టీ నాయకులలో చాలా కాలంగా అసమ్మతి వ్యక్తమవుతూనే వుంది.అవును, ఇతర పార్టీల నుంచి వచ్చిన (బయటి) నాయకులే కాదు, ఒరిజినల్ బీజేపీ నేతల్లోనూ బండి నాయకత్వాన్ని వ్యతిరకించే నేతలు లేక పోలేదు. అయితే ఇంతకాలం అసంతృప్తి గరళాన్ని గొంతులో దాచుకుని గుంభనంగా ఉన్న నాయకులు, ఇప్పుడు కర్ణాటక ఫలితాల తరువాత అసమ్మతి గళం విప్పుతున్నారు.
ముఖ్యంగా మాజీ మంత్రి హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్, కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మరీ బీజేపీలో చేరిన మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటి రెడ్డి వెంకట రెడ్డి మరొ కొందరు ‘బయటి’ నాయకులు బీజేపీలో కొనసాగే విషయంలో పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది. నిజానికి బీజేపీలో ‘బయటి’ నేతలకు ప్రాధాన్యత ఉండదని, అందుకే బీజేపీలో ‘బయటి’ నేతలు అట్టే కాలం నిలవ లేరని అంటారు. అందుకే ఈటల, కోమటిరెడ్డితో పాటుగా మరికొందరు ముఖ్యనేతలు కాంగ్రెస్ వైపు చుస్తున్నారనే ప్రచారం జరుగుతోంది.
నిజానికి బీజేపీ ఎమ్మెల్యేలు ముగ్గురిలో ఏ ఒక్కరూ ఒరిజినల్ బీజేపీ నాయకులు కాదు. గోషామహల్ ఎమ్మెల్యే టీడీపీ నుంచి బీజేపీలోకి వచ్చారు, అయన మళ్ళీ టీడీపీలోకి వెళుతున్నారని ఇటీవల ప్రచారం జరిగింది. అయితే, ఆయన బీజేపీ తనపై విధించిన సస్పెన్షన్ ఎత్తివేసినా, వేయక పోయినా, టికెట్ ఇచ్చినా ఇవ్వక పోయినా కాషాయా ధ్వజం వదిలేది లేదని స్పష్తం చేశారు. దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన రావు బీఆర్ఎస్ నుంచి బీజేపీ లోకి వచ్చారు, ఆయన కూడా పార్టీ మారుతున్నారని ప్రచారం జరిగినా, ఆయన ఆ వార్తలను ఖండించడమే కాకుండా, పార్టీ ఆదేశిస్తే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు..ఎవరిపై పోటీ చేసందుకు సిద్దమని ప్రకటించారు. తాజాగా ఈటల రాజేందర్ విషయంలోనూ అలాంటి వదంతులే షికారు చేస్తున్నాయి. అయితే ఢిల్లీ నుంచి వచ్చిన రాజేందర్ ఆ వదంతులను ఖండించారు. అయినా ఆ ప్రచారం అయితే అలానే సాగుతోంది. ఏది ఏమైనా కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రభావం అరు నెలల తర్వాత జరిగే అసెంబ్లీ ఎన్నికలపై ఏ విధంగా ఉంటుందనేది ఇప్పుడే ఉహించడం కొంచెం చాలా కష్టమనే రాజకీయ పరిశీలకులు అంటున్నారు.