దేవుడిని తలుచుకుంటే గుర్తకు వచ్చేది ఎన్టీఆరే!
ఎన్టీఆర్ ఆయన కుటుంబానికే సొంతం కాదనీ, ఆయన తెలుగువారి ఆస్తి అని తెలుగుదేశం అధినేత చంద్రబాబు అన్నారు. కూకట్ పల్లి కైతలాపూర్ మైదానంలో శనివారం (మే20) జరిగిన ఆయన శత జయంతి సభలో ప్రసంగించిన చంద్రబాబు ప్రపంచ వ్యాప్తంగా తెలుగువారందరికీ ఎన్టీఆర్ ఆరాధ్యుడన్నారు.
అమెరికాలో ఎన్టీఆర్ జయంతిని తెలుగు హెరిటేజ్ డేగా జరుపుకుంటారనీ, తెలుగు జాతికి ఎన్టీఆర్ తెచ్చిన ఖ్యాతికి, గుర్తింపునకు ఇంకేం నిదర్శనం కావాలన్నారు. ఒక సాధారణ కుటుంబంలో పుట్టి, సాధారణ జీవితం గడిపారనీ, ప్రతి రోజు తల్లి పాలు పితికి ఇస్తే వాటిని టీ దుకాణాలకు పోసి వచ్చేవారు. ఆ తర్వాత విజయవాడ నుంచి గుంటూరు వెళ్లి చదువుకుని సాయంత్రానికి తిరిగి వచ్చి మళ్లీ పనులు చేసుకునేవారు. ఉమ్మడి మదరాసు రాష్ట్రంలో ఆయనకు రిజిస్ట్రార్ ఉద్యోగం వచ్చింది. అయితే లంచాలు తీసుకోవడం నచ్చక ఆ ఉద్యోగం వదిలేసి సినిమాల్లో నటించేందుకు మద్రాస్ వెళ్లారు.
ఒక శ్రీకృష్ణుడిగా, ఒక వెంకటేశ్వరస్వామిగా ఇలా ఆయన పోషించిన ప్రతి పాత్రా కూడా భవిష్యత్తులో మరెవ్వరూ చేయలేనంత ప్రతిభామంతంగా నటించారని చంద్రబాబు చెప్పారు. మానవత్వం మూర్తీభవించిన వ్యక్తి ఎన్టీఆర్ అని చెప్పిన చంద్రబాబు రాయలసీమలో కరవు వస్తే జోలె పట్టి విరాళాలు సేకరించారు. చైనా యుద్ధం, దివి సీమ ఉప్పెన సమయంలోనూ రాష్ట్రమంతా తిరిగి జోలెపట్టి విరాళాలు సేకరించారు. తనను 40 ఏళ్ల పాటు ఆదరించిన ప్రజల కోసం రాజకీయ పార్టీ పెట్టారు. ఇవాళ దేశంలో అమలవుతున్న అనేక సంస్కరణలకు ఎన్టీఆరే ఆద్యుడని చెప్పారు.
ఎన్టీఆర్ జీవితచరిత్రను ఐదు నిమిషాల పాటు మనసులో స్మరించి మీరు ఏ సంకల్పం అయినా చేయండి... ఆ సంకల్పం జయప్రదం అవుతుందని చంద్రబాబు పేర్కొన్నారు. ఎన్టీఆర్ అనేవి కేవలం మూడు అక్షరాలు మాత్రమే కాదని, ఓ మహాశక్తి అని చంద్రబాబు అభివర్ణించారు. కాగా ఎన్టీఆర్ శత జయంతి వేడుకలకు సినీ, రాజకీయ రంగాలతో పాటు పలు రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు. టీడీపీ అధినేత చంద్రబాబు, నందమూరి బాలకృష్ణ, నారా భువనేశ్వరి, దగ్గుబాటి పురందేశ్వరి, నారా బ్రాహ్మణి, వసుంధర, వామపక్ష నేతలు సీతారాం ఏచూరి, డి. రాజా,తెలంగాణ తెలుగుదేశం కాసాని జ్ఞానేశ్వర్, నటులు మురళీమోహన్, జయప్రద, జయసుధ, ప్రభ, అల్లు అరవింద్, అశ్వినీదత్, విజయేంద్రప్రసాద్, వెంకటేశ్, కర్ణాటక అగ్రహీరో శివరాజ్ కుమార్, రామ్ చరణ్, నాగచైతన్య, శ్రీలీల, సుమంత్, అడివి శేష్, సిద్దు జొన్నలగడ్డ ఈ వేడుకల ప్రారంభం వేళ వేదికపై ఉన్న ఎన్టీఆర్ ప్రతిమకు ప్రముఖులు నివాళులు అర్పించారు.
కాగా ఈ సందర్భంగా ఎన్టీఆర్ శకపురుషుడు పుస్తకాన్ని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆవిష్కరించి ప్రసంగించారు. హైదరాబాద్ లో ఎన్టీఆర్ శత జయంతి జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. నీతి నిజాయతీ, క్రమశిక్షణకు నిలువెత్తు రూపం ఎన్టీఆర్ అన్నారు.రాజకీయాలలోకి క్రమశిక్షణ తెచ్చిన మహోన్నతుడు, పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేసి, ఎన్నో సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన జనం మనిషి ఎన్టీఆర్ అని దత్తాత్రేయ అన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జాతీయ కార్యదర్శి రాజా మాట్లాడుతూ జాతీయ రాజకీయాలలో కూడా ఎన్టీఆర్ తనదైన ముద్ర వేశారన్నారు. పేదల కష్టాలు తెలిసిన నేత, సామాజిక న్యాయం కోసం పాటుపడిన వ్యక్తి అని కొనియాడారు. దేవుడిని ఎప్పుడు తలచుకున్నా గుర్తుకు వచ్చేది ఎన్టీఆర్ మాత్రమేనని సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. రాజ్యాంగ హక్కులను కాపాడేందుకు ఎన్టీఆర్ చివరి వరకూ కృషి చేశారన్నారు. ఈ కార్యక్రమంలో ఇంకా పలువురు ఎన్టీఆర్ గోప్పతనం గురించి, ఆయనతో తమకు ఉన్న అనుబంధం గురించి వివరించారు.