వివేకా హత్య కేసులో మళ్లీ అదే వరస
posted on May 16, 2023 @ 6:14PM
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో కీలక అంశంగా మారిన వివేకా హత్య కేసు నాలుగేళ్లుగా నలభై మలుపులు తిరిగింది. ఇంకా తిరుగుతూనే ఉంది. విచారణ ఏ రాష్ట్రంలో జరగాలి, ఎవరు విచారణాధికారిగా ఉండాలి, ఎప్పుడు ఎవరిని అరెస్టు చేయాలి, ఎవరిని విచారించాలి, ఇలా ఒకటి కాదు, రెండు కాదు ఎన్నో అంశాలు ఈ కేసులో చోటు చేసుకున్నాయి.
తెలంగాణ హై కోర్టు, సుప్రీం కోర్టులు కలగజేసుకోవాల్సి వచ్చింది. ఇంత ప్రాముఖ్యత ఉన్న కేసు ఇటీవలి కాలంలో లేదనే చెప్పాలి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను ఇంతగా ప్రభావితం చేస్తున్న వివేకా కేసు కర్నాటక ఎన్నికల తరువాత కొత్త కోణం తీసుకోనుందని తెలుస్తోంది. న్యాయస్థానాలు విధించిన గడువు జూన్ 30వ తేదీతో ముగియనుండడంతో సీబీఐ దూకుడు పెంచింది. ఈ సారి విచారణను సమగ్రంగా నిర్వహించేందుకు అదనపు సిబ్బందిని రంగంలోకి దించింది. కడప జిల్లాలో, పులివెందుల పట్టణంలో దాదాపు ప్రతి వ్యక్తిని సీబీఐ పలకరించింది.
2019 మార్చి4 15వ తేదీ జరిగిన వివేకా హత్యపై స్థానికులు అందించిన సమాచారాన్ని సీబీఐ క్షుణ్ణంగా పరిశీలిస్తోంది. వివేకా వాచ్ మెన్ నుండి, అవినాష్ రెడ్డి వ రకూ ఎవరినీ వదలకుండా సాక్ష్యాలు సేకరిస్తోంది. తాజాగా విచారణకు హాజరు కావాలన్న నోటీసుపై అవినాష్ రెడ్డి వాయిదా కోరడంతో తిరిగిా 19వ తేదీన హాజరు కావాల్సిందిగా తిరిగి నోటీసులు జారీ చేసింది. గతంలో వివేకా కుమార్తె సునీత, అల్లుడు రాజశేఖర్ ను సీబీఐ విచారించింది.
తాజాగా అవినాష్ విచారణకు గడువు కోరడంతో సీబీఐ మరోసారి సునీత, రాజశేఖర్ లను విచారణకు రావాల్సిందిగా పిలిచింది. వివేకా హత్య కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డిని విచారించేందుకు కేసుకు సంబంధించిన ఏ చిన్న క్లూను కూడా సీబీఐ వదలడం లేదనే చెప్పాలి. రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత ఉండటంతో అవినాష్ ను అరెస్టు చేస్తే జరిగే పరిణామాలను కూడా సీబీఐ పరిశీలిస్తోంది.
ఇప్పుడు అవినాష్ ను అరెస్టు చేసేందుకు న్యాయ సంబంధమైన అవరోధాలు లేకపోయినప్పటికీ కేసు ప్రాధాన్యత దృష్ట్యా పకడ్బందీగా వ్యవహరించాలని సీబీఐ భావిస్తోందని తెలుస్తోంది. ఏది ఏమైనా రానున్న రోజులు అవినాష్ రెడ్డికి కొంత ఇబ్బంది కలిగిస్తాయని కడప వాసులు గుసగుసలాడుకుంటున్నారు.