గాజు గ్లాసు పవన్ చేజారిందా?
posted on May 17, 2023 @ 10:43AM
జనసేనకు కేంద్ర ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. 2019లో ఆ పార్టీకి అధికారికంగా కేటాయించిన గాజు గ్లాసు గుర్తును ఉపసంహరించుకుంది. ఈ సారి గాజు గ్లాస్ చిహ్నాన్ని ఫ్రీ సింబల్స్ జాబితాలో చేర్చడం ద్వారా జనసేనకు ఈసీ షాక్ ఇచ్చింది. ఏపీ నుంచి రెండు పార్టీలు మాత్రమే రాష్ట్ర స్థాయిలో అధికారికంగా గుర్తింపు పొందిన పార్టీలుగా ఈసీ పేర్కొన్న సంగతి తెలిసిందే. అవి అధికార వైసీపీ, విపక్ష తెలుగుదేశం పార్టీలు. దీంతో ఆ రెండు పార్టీల ఎన్నికల చిహ్నాలైన ఫ్యాన్, సైకిల్ గుర్తులను ఈసీ రిజర్వ్ చేసింది.
అదే సమయంలో అధికారిక గుర్తింపు పొందని జనసేనకు గత ఎన్నికల సమయంలో కేటాయించిన గ్లాసు చిహ్నాన్ని ఈ సారి ఫ్రీ సింబల్స్ జాబితాలో చేర్చింది. 2019 ఎన్నికలలో గుర్తింపు కోసం అవసరమైనన్ని ఓట్లు జనసేనకు రాకపోవడంతో ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది. కానీ జనసేనకు తమ పార్టీకే గాజు గ్లాసు గుర్తు కేటాయించాలని ఈసీని కోరే అవకాశం మాత్రం ఉంది. గత ఎన్నికల్లో జనసేన పార్టీ మొత్తం గాజు గ్లాస్ గుర్తు మీద పోటీ చేసినందున ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన తర్వాత తమ పార్టీ అభ్యర్థులందరికీ అదే గుర్తు కేటాయించాలని జనసేన కోరుకునేందుకు వెసులుబాటు ఉంది. అందుకు ఈసీ ఆమోదం తెలిపే అవకాశాలు కూడా ఉన్నాయి.
అయితే.. ఇక్కడో చిక్కు ఉంది. అలా కోరాలంటే జనసేన రాష్ట్రంలోని 175 స్థానాలలోనూ పోటీలో ఉండాల్సి ఉంటుంది. అయితే జనసేన, తెలుగుదేశంతో పొత్తులో భాగంగా కొన్ని స్థానాలలోనే పోటీ చేసే అవకాశాలు ఉండటంతో.. జనసేన పోటీలో లేని నియోజకవర్గాలలో గాజు గ్లాసు సింబల్ ను స్వతంత్రులెవరైనా కోరితే.. అక్కడ వారి విజ్ణప్తిని ఈసీ తిరస్కరించే అవకాశం ఉండదు.
అంటే జనసేన పోటీ చేసే స్థానాలలో ఈ పార్టీకి గాజు గ్లాసు గుర్తును ఈసీ కేటాయించినా, ఆ పార్టీ పోటీలేని నియోజకవర్గాలలో ఎవరైనా ఇండిపెండెంట్ అభ్యర్థికి ఆ గుర్తు కేటాయించే అవకాశాలు ఉన్నాయి. ఇది ఓటర్లలో ఒకింత అయోమయం ఏర్పడేందుకు వీలుంటుంది. అంటే తెలుగుదేశం పోటీ చేసే నియోజకవర్గాలలో ఇండిపెండెంట్ కు గాజు గ్లాసు గుర్తు కేటాయించిన సందర్భం ఉంటే ఓటర్లు అయోమయానికి గురయ్యే అవకాశాలు ఉంటాయి. ఇది అంతిమంగా తెలుగుదేశం, జనసేనకు నష్టం చేకూరుస్తుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.