తెలుగుదేశంతో పొత్తు.. ఇప్పుడు బీజేపీ అవసరం!
posted on May 16, 2023 @ 10:36AM
కర్నాటక పరాజయంతో బీజేపీకి దిమ్మ తిరిగి బొమ్మ కనిపించిందని పరిశీలకుల విశ్లేషణ. అందుకే ఏపీలో ఆ పార్టీ కొత్త పల్లవి అందుకుంది. తెలుగుదేశంతో కలిసి ఎన్నికల బరిలోకి దిగాలన్న తమ మిత్రుడు పవన్ కల్యాణ్ ప్రతిపాదనను హైకమాండ్ పరిశీలిస్తోందంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు బీజేపీ ఏపీ నాయకులు. మరీ ముఖ్యంగా ఇంత కాలం బీజేపీ రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీతో అంటకాగుతోందన్న అభిప్రాయం బలంగా ఏర్పడేందుకు దోహదపడిన జీవీఎస్ నరసింహం, సోము వీర్రాజులే కొత్త పల్లవి అందుకున్నారు.
కర్నాటకలో బీజేపీ పరాజయానికి ముందు వరకూ వీరి వాణి, బాణి ఇలా లేదు. కుటుంబ పార్టీలు, అవినీతి పార్టీలతో పొత్తుకు నో అంటూ వచ్చారు. కర్నాటకలో బీజేపీ ఘోర పరాజయంతో వారికి వాస్తవం తెలిసి వచ్చి తెలుగుదేశం పార్టీతో పొత్తు గురించి మాట్లాడుతున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అసలు వాస్తవం ఏమిటంటే.. ఏపీలో బీజేపీతో పొత్తు ఇటు తెలుగుదేశంకైనా అటు జనసేనకైనా తెల్ల ఏనుగు లాంటిదే. ఒక గుది బండ లాంటిదే. పొత్తులో భాగంగా ఆ పార్టీకి రెండో మూడో సీట్లు కేటాయించాల్సి ఉంటుంది. బీజేపీకి రాష్ట్రంలో కనీసం ఒక శాతం ఓటు స్టేక్ కూడా లేని పరిస్థితుల్లో ఆ పార్టీకి ఒక సీటు కేటాయించడం కూడా జనసేన, తెలుగుదేశం పార్టీలకు ఏ మంత ప్రయోజనం చేకూర్చే అంశం కాదు. అయినా కేంద్రంలో అధికారంలో ఉందన్న ఒకే ఒక కారణంతో ఆ పార్టీని జట్టులో చేర్చుకున్నా.. ముందుగా బీజేపీ రాష్ట్రంలో వైసీపీతో అంటకాగడం లేదన్న విషయాన్ని నిరూపించుకోవలసి ఉంటుంది.
నేరుగా చెప్పకపోయినా తెలుగుదేశం ఏపీ అధ్యక్షుడు అచ్చన్నాయుడు ఆ మాట అనేశారు. వైసీపీతో బీజేపీ అంటకాగుతోందన్న మాట మేం అనడం లేదు.. జనం అంటున్నారు అన్న అచ్చెన్నాయుడు, బీజేపీ వైసీపీకి దగ్గరగా ఉందన్న భావన జనంలోంచి పోగొట్టుకోవలసి బాధ్యత బీజేపీదే అని కూడా అన్నారు. వాస్తవానికి రాష్ట్రంలో జనం దృష్టిలో బీజేపీ పలుచన కావడానికి ఉన్న కారణాలలో వైసీపీ అక్రమాలు, అన్యాయాలు, అస్తవ్యస్త నిర్ణయాలు ఇలాఅన్నిటికీ, అన్ని విధాలుగా కేంద్రంలోని మోడీ సర్కార్ సహాయ సహకారాలు అందిస్తోందన్న భావన జనంలో ఏర్పడటానికి తమ పార్టీ తీరే కారణమన్న బాధ ఏపీ బీజేపీలోని ఒక వర్గంలో బలంగా ఉంది. అందుకే పలు సందర్బాలలో బీజేపీ రాష్ట్ర నాయకత్వంపై పార్టీ అధిష్ఠానానికి ఫిర్యాదులు కూడా చేసింది. అయినా అధిష్ఠానం వైఖరిలో మార్పు రాకపోవడంతో కొందరు బహిరంగంగానే పార్టీ హైకమాండ్ తీరును విమర్శిస్తుంటే.. కన్నా వంటి వారు ఏకంగా పార్టీకి గుడ్ బై చెప్పేసి తమ దారి తాము చూసుకున్నారు. తాజాగా విష్ణుకుమార్ రాజు ఒక చానెల్ తో మాట్లాడుతూ పార్టీ తీరును ఎలాంటి శషబిషలూ లేకుండా ఎండగట్టి.. హై కమాండ్ నుంచి నోటీసులు కూడా అందుకున్నారు.
పార్టికీ రాష్ట్రంలో బలం లేదన్న విషయం అందరికీ తెలిసినా, నిన్న మొన్నటి వరకూ సైద్ధాంతిక నిబద్ధత ఉన్న పార్టీగా ప్రజలలో ఏదో మేరకు కొద్ది పాటి గౌరవమైనా ఉండేది. కానీ జగన్ రాష్ట్రంలో అధికార పగ్గాలు చేపట్టిన తరువాత రాష్ట్ర బీజేపీ తీరుతో జనంలో ఆ కొద్ది పాటి గౌరవం కూడా సన్నగిల్లింది. సైద్ధాంతిక నిబద్ధతను బీజేపీ రాష్ట్ర నాయకత్వం గాలికొదిలేసిందనీ.. జగన్ భజనలో తరించి సొంత లాభం కొంత చూసుకుంటోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వైసీపీ అడ్డగోలు రుణాలకు కేంద్రం నిబంధనలకు తిలోదకాలిచ్చేసి మరీ పచ్చజెండా ఊపడం, అలాగే వైసీపీ సర్కార్ రాజ్యాంగాన్ని పట్టించుకోకుండా, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా తీసుకుంటున్న చర్యలకు వత్తాసు పలకడం వంటి చర్యలతో కేంద్రంలోని మోడీ సర్కార్ జగన్ కు అండగా నిలుస్తోందన్నది జనం అభిప్రాయం.
జనం ఇంతగా వ్యతిరేకిస్తున్న జగన్ సర్కార్ భుజాన మోస్తున్నదని జనం భావిస్తుంటే.. అటువంటి బీజేపీతో పొత్తుకు తెలుగుదేశం పార్టీ ఏలా ముందుకు వస్తుందన్నది ఆ పార్టీ నాయకులు అంటున్న మాట. జగన్ ప్రభుత్వంపై తమకు ఎలాంటి ప్రత్యేక ప్రేమ, అపేక్ష లేదని ప్రజలకు అర్దమయ్యేలా బీజేపీ ఇప్పటికైనా చర్యలకు ఉపక్రమిస్తే.. అప్పుడు పొత్తు విషయం ఆలోచిస్తామని తెలుగుదేశం నాయకులు పరోక్షంగానైనా విస్పష్టంగా చెబుతున్నారు. బీజేపీ వైసీపీతో అంటకాగుతోందన్నది ప్రజాభిప్రాయం అని తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అనడం వెనుక అర్దం అదేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇప్పుడు తెలుగుదేశం, జనసేనతో కలవాలన్నది బీజేపీ ఛాయిస్ గా ఎంత మాత్రం లేదు. ఆ పార్టీకి నెససిటీ అంటే అవసరం. బీజేపీని కలుపుకోవాలా వద్దా అన్నది తెలుగుదేశం ఛాయిస్. రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రంలోని మోడీ సర్కార్ నుంచి ఎటువంటి సహాయ సహకారాలూ అందడం లేదనీ, అందవని నిర్ధారణ అయ్యేలా బీజేపీ తీరు మారడాన్ని బట్టే ఆ పార్టీతో ఎన్నికల పొత్తు పెట్టుకోవాలా వద్దా అన్న విషయంలో తెలుగుదేశం నిర్ణయం ఉంటుందని అంటున్నారు.