అందరి దేవుడిపై ఎందుకీ వివాదం?
కొందరుంటారు.. సరుకుండదు కానీ, చరిత్ర పుటల్లో ఎక్కి పోవాలని తెగ ఉబలాట పడిపోతుంటారు. సెలబ్రిటీలుగా చెలామణి కావాలని, పత్రికల్లో, మీడియాలో కనిపించి పైకేగిరిపోవాలని తెగ సందడి చేస్తుంటారు. సెలబ్రిటీ స్టేటస్ కోసం చిత్ర విచిత్ర విన్యాసాలు చేస్తుంటారు. సినీ నటి కరాటే కళ్యాణి ఆ కోవకు చెందిన నటి అవునో కాదో కానీ, ఆమె నటిగాకంటే వివాదాల ద్వారానే నలుగురు నోళ్ళలో నానుతున్నారు. మీడియా దృష్టిని ఆకర్షిస్తున్నారు అనేది మాత్రం నిజం. అయితే ఆమె ప్రస్తావించే లేదా ప్రశ్నించే అంశాలు అన్నీ అలాంటివేనా, సెలబ్రిటీ స్టేటస్ కోసమేనా అంటే, అవునని అనలేము కానీ, అమె రచ్చ చేసిన వివాదాలు చాలా వరకు అనవసర వివాదాలుగానే మిగిలి పోవడం మాత్రం నిజమని అంటారు.
సరే, కరాటే కల్యాణి గతాన్ని కాసేపు పక్కన పెట్టి ప్రస్తుతానికి వస్తే, రాముడు, కృష్ణుడి వంటి పౌరాణిక పాత్రలు పోషించి తెలుగువారి గుండెల్లో నిజంగా దేవుడిగా కొలువుండిపోయిన మహా నటుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు శత జయంతి ఉత్సవాలను ఆమె వివాదంగా మార్చారు. విశ్వ విఖ్యాత నట సార్వభౌముడి శత జయంతి ఉత్సవాలను ప్రపంచ వ్యాప్తంగా తెలుగువారు ఘనంగా నిర్వహించుకుంటున్నారు. ఇదే క్రమంలో ఖమ్మంలో 54 అడుగుల ఎత్తయిన ఎన్టీఆర్ విగ్రహాన్ని నిర్మించారు. మే 28న ఆయన శత జయంతి సందర్భంగా ఆయన మనవడు జూనియర్ ఎన్టీఆర్ చేతుల మీదుగా ఆవిష్కరించేందుకు ఏర్పాట్లు చేశారు. కానీ ఈ విగ్రహం కృష్ణుడి రూపంలో ఉండటం పట్ల కల్యాణి అభ్యంతరం వ్యక్త చేశారు. కృష్ణుడికి రూపం లేదా.. మానవ రూపంలో కొలవాలా? అని ప్రశ్నించారు. మీడియాలో రచ్చ చేశారు.
ఈ విషయంలో ‘విశ్వ హిందూ పరిషత్, ఇస్కాన్’తదితర హిందూ ధార్మిక సంస్థలు సంస్థలు కరాటే కళ్యాణికి మద్దతుగా నిలిచాయి. కాగా ఈ వివాదంపై విచారించిన హైకోర్టు తాజాగా స్టే విధించింది. కృష్ణుడి రూపంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటును వ్యతిరేకిస్తూ హైకోర్టులో 14 రిట్ పిటిషన్‌లు దాఖలయ్యాయి. శ్రీ కృష్ణ జేఏసీ, అదిభట్ల కళాపీఠం, భారతీయ యాదవ సంఘం పిటిషన్లు దాఖలు చేశాయి. ఈ పిటిషన్లను విచారణకు స్వీకరించిన హైకోర్టు వారి వాదనలను విన్నది. పిటిషనర్ల వాదనలను విన్న హైకోర్టు విగ్రహ ఏర్పాటుపై స్టే విధించింది. అయితే కృష్ణుడి విగ్రహమైనా లేదంటే ఎన్టీఆర్ విగ్రహమైనా పెట్టుకోవచ్చని.. కానీ కృష్ణుడి రూపంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహం పెట్టడానికి వీల్లేదని హైకోర్టు పేర్కొంది. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులను హైకోర్టు ఆదేశించింది. ఇది ఒక విధంగా సముచిత నిర్ణయమే అనిపించుకుంటుంది.
అందుకే, కరాటే కళ్యాణి ఎందు కోసం ఈ అంశాన్ని తెరపైకి తెచ్చారు అనే విషయం పక్కన పెడితే, కృష్ణ పరమాత్మ రూపంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటును తాము ఎందుకు వ్యతిరేకిస్తున్నామో వివరిస్తూ కళ్యాణి చేసిన వాదన కొంత ఆలోచింప చేసే విధంగా ఉందని ఎన్టీఆర్ అభిమానులు కూడా కొంతవరకు అంగీకరిస్తున్నారు. ముఖ్యంగా ..‘మానవ రూపంలో కృష్ణుడిని పెడితే రేపు రాజకీయ కారణాలతో కృష్ణుడి రూపంలోని ఎన్టీఆర్ పోస్టర్‌ను దగ్ధం చేస్తే ఎవరిని దగ్ధం చేశారని అనుకోవాలి. ఈ విగ్రహం 400 ఏళ్లు ఉంటుందని అంటున్నారు. యాభై, ఆరేళ్ల తర్వాత ఫ్యూచర్ జనరేషన్.. తననే కృష్ణుడు అనుకోరా? ఆయనే భగవద్గీత చెప్పారంటే ఎవరు జవాబుదారీ? అంటూ ప్రశ్నించారు.
నిజమే, విశ్వహిందూ పరిషత్, అంతర్జాతీయ ఇస్కాన్ సంస్థ వంటి పలు ధార్మిక సంస్థలు సైతం కృష్ణ భగవానుని మానవ రూపంలో చూపడం కొందరి మనోభావాలను అయినా హర్ట్ చేస్తుంది. ఎన్టీఆర్ కేవలం కృష్ణుడు, రాముడు పాత్రలే కాదు, రావణ బ్రహ్మ పాత్రను అంతకంటే అద్భుతంగా పోషించారు. దుర్యోధన, దుశ్శాసన పాత్రలూ పోషించారు. సాంఘిక చిత్రాల విషయానికి వస్తే ఇక చెప్పనే అక్కరలేదు. అన్నిటినీ మించి రాజకీయ రంగు పులుముకున్న ఈ వివాదానికి..ఇక్కడితో చుక్క పెట్టడమే ఉత్తమం, అనే అభిప్రాయం కూడా లేకపోలేదు. నిజానికి ఎన్టీఆర్ అందరి వాడు. సినిమా నటుడిగానే కాదు, రాజకీయ నాయకునిగానూ ఆంధ్రుల ఆరాధ్య దైవంగా గుర్తింపు పొందిన మహా మనిషి. మహోన్నతుడు. ఆయన అభిమానులకే కాదు, కోట్లాదిమంది తెలుగు వారికి ఆయనే ఓ దేవుడు. ఆయన్ని మరో దేవుని రూపంలో నిలపడం అవసరమా? ముఖ్యంగా అన్న ఎన్టీఆర్ శతజయంతి వేడుకల సందర్భంగా అంతటి మహా నటుడు, మహా నేతను వివాదాల వేదిక ఎక్కించడం అవసరమా?
సరే .. ఆ విషయంతో ప్రత్యక్షంగా సంబంధం లేకున్నా ... దేవుని రూపానికి సంబంధించి గతంలోనూ కొంత ఆసక్తికర చర్చ జరిగింది. దేవుని రూపం ఏది? హిందూ దేవీ దేవతలు ఏ రూపంలో ఉంటారు? కృష్ణుడి రూపం ఇది, రాముడి రూపంఇది.. విష్ణువు ఇలా ఉంటారు.. వెంకన్న స్వామి రూపం ఇది ..శివన్న చిత్రమిది ..పార్వతమ్మ .రూపం ఇది ..విఘ్నేశ్వరుని ఆకారమిది.. ఇదిగో ఇలా ఉంటారు దేవుళ్ళు అని ఎవరు చెప్పారు ..ఎవరు నిర్దారించారు.. అంటే ..చిత్రకారుడు రవివర్మ గుర్తుకొస్తారు. అవును..ఒకప్పుడు, (ఇప్పుడు కూడా) మనదేశంలో క్యాలెండర్ లేని ఇల్లు ఉండదు. అన్ని రంగాల్లోనూ అనూహ్య మార్పులు వస్తున్నప్పటికీ ఈ క్యాలెండర్ కళకు ఆదరణ తగ్గలేదు. అందుకే నేటికీ. కొత్త ఆంగ్ల సంవత్సరం రాగానే ఇళ్లలోనూ, కార్యాలయాల్లోనూ గోడలపై కొత్త క్యాలెండర్లు దర్శనమిస్తాయి. వారి వారి అభిరుచిని బట్టి ప్రకృతి చిత్రాలు, పక్షులు, దేవుళ్ళు – దేవతలు, సినీతారలు ఇలా ఎన్నో రకాల క్యాలెండర్లు గోడలపై అలంకరించుకుంటారు.
ఈ క్యాలెండర్ కళకు ఆద్యుడిగా భారతీయ చిత్రకళా రత్నం రాజా రవివర్మను చెప్పుకోవచ్చు. ప్రజల మనసులోని భావాలు, ఆసక్తిని గమనించిన రవివర్మ క్యాలెండర్ పై దేవుళ్ళ బొమ్మలు వేస్తే ప్రజలు ఆదరిస్తారని గ్రహించి, 1892లో నాటి బొంబాయిలో లిథో గ్రఫీ ప్రెస్స్ ను జర్మనీ నిపుణుల సహకారంతో నెలకొల్పాడు.
ఆ ప్రెస్ లో ఆయన చిత్రించిన ప్రఖ్యాత శ్రీరామ పట్టాభిషేకం, లక్ష్మీ సరస్వతి, వినాయకుడు, దుర్గాదేవి తదితర చిత్రాలు వేల సంఖ్యలో ముద్రించి దేశం నలుమూలలా అమ్మకాల జరిపించాడు. అణా కే ఒక వర్ణచిత్రం దొరికేది ఆ రోజుల్లో.ఆ విధంగా ఆయన చిత్రాలన్నీ ప్రజల పూజా మందిరాల్లో కొలువైనాయి. ఇప్పటికీ ఇళ్లలోనే కాదు దేవాలయలోనూ రవివర్మ చిత్రించిన చిత్రాలే శిల్పాలుగా పూజలందుకుంటున్నాయి, అయితే రవివర్మ అదృష్టం ఏమంటే ఆ రోజుల్లో కరాటే వుందో లేదో కానీ, కరాటే కల్యాణి వంటి కళాకారులు మాత్రం లేరు. అలాగే, ఇప్పటికీ వినాయక చవితి పందిళ్ళలో వినాయకుడిని మానవ రూపంలోనే కాదు,అనేక రూపాల్లో చివరకు కరోనా ఆకృతిలోను పూజించారు. భక్తీ ముఖ్యం కానీ దేవుని రూపం, ఆకారం కాదు కదా ..