ఓడలు బళ్లయ్యాయా?..
posted on May 16, 2023 @ 10:54AM
ఒకే ఒక్క ఫలితం దేశ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చేస్తోందా? బీజేపీ వ్యతిరేక శక్తులన్నీ ఏకతాటిపైకి వచ్చేందుకు కర్నాటక ఫలితం దోహదం చేసిందా? మరీ ముఖ్యంగా ఏ మాత్రం స్టేక్ లేని ఏపీలో నిన్న మొన్నటి వరకూ అంతా మేమే, అన్నీ మేమే అన్నట్లుగా వ్యవహరించిన బీజేపీ ఇప్పుడు అంతా మీరే, అన్నీ మీరే అన్నట్లుగా తెలుగుదేశంవైపు జాలి చూపులు చూస్తోందా? అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు.
కేంద్రంలో అధికారంలో ఉన్నామన్న ధీమాతో.. దర్యాప్తు సంస్థలు చేతిలో ఉన్నాయన్న ధైర్యంతో తెలుగుదేశం పార్టీని అన్ని విధాలుగా ఇరుకున పెట్టేందుకు విశ్వయత్నం చేసిన బీజేపీ ఇప్పుడు త్వమేవ శరణం నాస్తి అన్నట్లుగా కాపాడాలంటూ బేల మాటలు మాట్లాడుతోందా? అంటే ఔననే అంటున్నారు పరిశీలకులు. నిన్న మొన్నటి వరకూ తెలంగాణలో అధికారం ఖాయం.. ఏపీలో మేం సహకరిస్తేనే తెలుగుదేశం పార్టీకి అధికారం అన్న ధోరణితో వ్యవహరించిన బీజేపీ ఇప్పుడు తెలంగాణలో అధికారం చేజిక్కించుకోవాలంటే తెలుగుదేశం సహకారం అనివార్యం అన్న పరిస్థితిలో పడింది. అలాగే కేంద్రంలో మోడీ నాయకత్వంలో ముచ్చటగా మూడో సారి ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే.. దక్షిణాది నుంచి కొన్ని పార్లమెంటు స్థానాలు తప్పని సరిగా గెలుచుకోవాల్సిన అవసరం ఉందని గుర్తించింది.
అందుకే ఏపీలో తెలుగుదేశంతో పొత్తు కోసం తహతహలాడుతోంది. నిన్న మొన్నటి వరకూ తెలంగాణలో ఎవరి మద్దతు అవసరం లేదు..ఒంటరిగానే వంద స్థానాల్లో గెలుస్తామంటూ విర్రవీగిన బీజేపీ.. ఇప్పుడు తెలంగాణలో అధికారం దక్కాలంటే.. ఆ రాష్ట్రంలో బలంగా ఉన్న తెలుగుదేశం పార్టీ మద్దతు అవసరం అని భావిస్తోంది. తెలంగాణలో సహకారం అందిస్తే.. ఏపీలో అండగా ఉంటామని నేరుగా కాకపోయినా ప్రతిపాదనలు పంపుతోంది. అయితే ఏపీలో తెలుగుదేశం పార్టీకి బీజేపీ మద్దతు అవసరమా? అన్న ప్రశ్నకు మాత్రం ఆ పార్టీ నేతల వద్ద సమాధానం లేకుండా పోయింది.
ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలోనూ బీజేపీకి తెలుగుదేశం మద్దతు, ఆసరా అవసరమని ఆ పార్టీ హైకమాండ్ గుర్తించింది. అందుకే నేరుగా కాకపోయినా పరోక్షంగానైనా తెలుగుదేశంతో పొత్తు విషయాన్ని సీరియస్ గా పరిశీలిస్తున్నామంటూ ఫీలర్స్ పంపుతోంది. సార్వత్రిక ఎన్నికల ముందు కర్నాటక లో తగిలిన ఎదురు దెబ్బ బీజేపీ ఆత్మ విశ్వాసాన్ని గట్టిగానే దెబ్బతీసిందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు.
అంతే కాకుండా.. వరుస పరాజయాలతో డీలా పడిన కాంగ్రెస్ కు కర్నాటక విజయం ఒక జీవన్ టోన్ టానిక్ లా పని చేస్తోందని అంటున్నారు. బీజేపీయేతర పార్టీలన్నీ కాంగ్రెస్ నాయకత్వంలో ఐక్యంగా వచ్చే ఎన్నికలలో పోటీ చేయాలన్న దిశగా అడుగులు వేస్తున్నాయి. దేశంలోని ప్రాంతీయ పార్టీలను కబలించడమే ధ్యేయంగా గత ఎనిమిదేళ్లుగా సాగిన బీజేపీ మనుగడ ఇప్పుడు ఆ ప్రాంతీయ పార్టీల దయాదాక్షిణ్యాలపై ఆధారపడిన పరిస్థితి వచ్చింది.