నెల్లూరు వైసీపీలో మళ్లీ మొదలైంది!
posted on May 17, 2023 7:36AM
ఏమిటో... అదేమిటో ఈ అధికార ఫ్యాన్ పార్టీలో బాబాయి.. అబ్బాయిల గోల అలా ఇలా కాదు.. ఓ రేంజ్‌లో ఉందని.. ఇలా అయితే పార్టీ పరిస్థితి గాలిలో దీపంలా తయారవుతోందని అధికార వైసీపీలోని ఓ వర్గం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా నెల్లూరు నగర ఎమ్మెల్యే, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, ఆయన బాబాయి నెల్లూరు నగర పాలక సంస్థ డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ మధ్య విబేధాలు తలెత్తి... అవి తార స్థాయికి చేరడం... దీంతో ఈ పంచాయతీ కూడా ముఖ్యమంత్రి జగన్ వద్దకు చేరడం.. రెండు రోజుల క్రితం ఆ బాబాయి, అబ్బాయిలను.. తన వద్దకు పిలుపించుకొని... ఇద్దరి చేతులు కలిపి... విబేధాలు వదిలేయాలి.. పార్టీ గెలుపు కోసం కష్టపడాలని సూచించినట్లు ఓ టాక్ వైరల్ అవుతోంది.
అయితే నెల్లూరు నగర ఎమ్మెల్యేగా అనిల్ కుమార్ ఎన్నికైనా.. మంత్రిగా ఆయన బాధ్యతలు చేపట్టినా.. నియోజవర్గంలో పార్టీ పరంగా అబ్బాయి అనిల్ తరఫున అన్నీ బాబాయి రూప్ కుమార్ యాదవే చక్కదిద్దే వారని.. కానీ ఆయన నెల్లూరు నగరపాలక సంస్థకు జరిగిన ఎన్నికల్లో కార్పొరేటర్‌గా గెలిచి.. డిప్యూటీ మేయర్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత.. ఆయనకంటూ ఓ వర్గాన్ని ఏర్పాటు చేసుకోవడాన్ని గమనించి.. బాబాయిని దూరంగా ఉంచే ప్రయత్నాలు అబ్బాయి చేశారని.. అయితే తాజాగా రూప్‌కుమార్ కొత్త కార్యాలయం ఏర్పాటు చేసుకొని.. రాజకీయం చేయడంతో... ఈ బాబాయి అబ్బాయిల మధ్య పచ్చ గడ్డి వేయకుండానే భగ్గుమనే పరిస్థితి నెలకొందని పార్టీ వర్గాలే అంటున్నాయి. అంతేకాదు బాబాయితో కలిసేదే లేదు.. కావాలంటే పార్టీకి రాజీనామా చేయడానికైనా సిద్దమని సాక్షాత్తూ అబ్బాయి అనిల్ కుమార్ యాదవ్ ప్రకటించినట్లు ఓ వార్త అయితే అటు మీడియాలో ఇటు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీంతో పెన్నా నదీ తీర నగరంలో మళ్లీ గోల మొదలనే చర్చ పార్టీలో జోరందుకుంది.
మరోవైపు ఇప్పటికే నెల్లూరు జిల్లాలోని ముగ్గురు ఎమ్మెల్యేలను పార్టీ నుంచి సాగనంపి.. ఆ నియోజకవర్గంలో కొత్త ఇన్ చార్జ్‌లను నియమించి.. పార్టీ పరిస్థితిని స్థానికంగా చక్కదిద్దే కార్యక్రమానికి పార్టీ అధిష్ఠానం శ్రీకారం చుట్టిందని... అంతలోనే మళ్లీ అదే జిల్లాలో మరో పితలాటకం చోటు చేసుకోవడం చూస్తుంటే.. ఈ సారి జిల్లాలో పార్టీకి గట్టి దెబ్బ తప్పదనే అభిప్రాయాం పార్టీ వర్గాల్లో వ్యక్తమౌతోంది.
ఇంకో వైపు ముఖ్యమంత్రి జగన్ సొంత బాబాయి వివేకా హత్య కేసులో అబ్బాయి పాత్రపై సీబీఐ విచారణ జరుపుతోంది. ఆ క్రమంలో ఇప్పటికే కడప ఎంపీ, సీఎం జగన్ సోదరుడు అవినాష్ రెడ్డితోపాటు ఆయన తండ్రి వైయస్ భాస్కరరెడ్డిలు తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నారని.. ఇప్పటికే వైయస్ భాస్కరరెడ్డిని సీబీఐ అరెస్ట్ చేసి.. చంచల్‌గూడ జైలుకు తరలించిందని.. అయితే ఈ కేసులో రేపో మాపో కడప ఎంపీ అవినాష్ రెడ్డిని సైతం సీబీఐ అరెస్ట్ చేసే అవకాశం ఉందనే అభిప్రాయం బలంగా వ్యక్తమౌతోంది. ఆ తర్వాత ఈ హత్య కేసులో అసలు సిసలు సూత్రధారులు కూడా బయటకు వచ్చే అవకాశాలు లేకపోలేదనే చర్చ సైతం పార్టీ వర్గాల్లోనే నడుస్తోంది. అదీకాక ఎన్నికల సమీపిస్తున్నాయి.ప్రజల్లోకి వెళ్లాల్సిన సమయం అసన్నమైంది. అలాంటి వేళ ఈ బాబాయి అబ్బాయిల గోల.. పార్టీ పుట్టి ముంచే అవకాశాలు మెండుగా ఉన్నాయని... చర్చ వాడి వేడిగా సాగుతోంది.