అభివృద్ధికి ఆమడ దూరంలో ఆంధ్రప్రదేశ్
posted on May 18, 2023 @ 5:23PM
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఇరుగు పొరుగు రాష్ట్రాలే కాదు. ఒకప్పుడు కలసి ఉన్న ఒకే రాష్ట్రం. అలాంటి సమైక్య రాష్ట్రం ప్రత్యేక పరిస్థితుల్లో విడిపోయినపుడు అభివృద్థి పథంలో సాగేందుకు పోటీ పడాలి. 1960లో విడిపోయిన మహారాష్ట్ర, గుజరాత్ లు, 1966లో విడిపోయిన పంజాబ్, హర్యానాలు అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నాయి. అయితే 2014లో విడిపోయిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో 2019 వరకూ పోటీతత్వం కనిపించినా 2019 నుండి అభివృద్ధి కోసం పోటీ పడటం కాదు కదా కనీసం అభివృద్ధి కోసం మాట్లాడే సాహసం కూడా ఏపీ చేయడం లేదు. 2014 నుండి 2019 వరకూ ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు ప్రభుత్వం పెట్టుబడులను ఆకర్షించి పరిశ్రమల స్థాపనకు పెద్ద పీట వేసింది.
2019 నుండి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో చీకటి యుగం ప్రారంభం అయ్యింది. మరో వైపు తెలంగాణలో పెట్టుబడుల వరద పెరిగింది. 2019 వరకూ విదేశీ పెట్టుబడులు ఎఫ్ డీఐలలో మొదటి ఐదు స్థానాలలో కనిపించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇప్పుడు 14వ స్థానానికి దిగజారింది. మొదటి పదిస్థానాలలో కనిపించని తెలంగాణ ఇప్పుడు 7వ స్థానంలో వెలిగిపోతోంది. ఇందుకు కారణంగా తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్ అని చెప్పక తప్పదు. ఎప్పుడు ఎక్కడ పెట్టుబడుల కోసం వెళ్లాలన్నా ఓపిగ్గా వెళ్లి ప్రజంటేషన్ ఇచ్చి తెలంగాణకు పెట్టుబడులు తీసుకురావడంలో కేటీఆర్ చూపుతున్న చొరవను చూసైనా ఆంధ్ర మంత్రి అమర్నాథ్ కళ్లు తెరవాలి. ఆంధ్రప్రదేశ్ కు పెట్టుబడులు తీసుకురావడం అన్న మాట పక్కన పెడితే ఆంధ్రప్రదేశ్ నుండి వెళ్లిపోతున్న పరిశ్రమలను కూడా ఆపలేకపోవడం అమర్నాథ్ పనితనానికి ఉదాహరణ. ఒక వైపు ప్రపంచ దేశాలన్నీ తిరుగుతూ తెలంగాణ భారత దేశానికి ముఖద్వారం అంటూ బ్రాండ్ హైదరాబాద్ ను, బ్రాండ్ తెలంగాణను కేటీఆర్ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుంటే.. దావోస్ లో చలి ఎక్కువగా ఉంటుందని, ప్రపంచ పెట్టుబడి దారుల్ని ఆంధ్రప్రదేశ్ కే రప్పిస్తానని వ్యర్థ ప్రేలాపనలు వల్లిస్తూ అమర్నాథ్ ఆంధ్ర రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను నాశనం చేస్తున్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో అలాంటి మంత్రిని మందలించి మిగిలిన రాష్ట్రాల మంత్రులు చేస్తున్న ప్రయత్నాలను అనుసరించమని కూడా జగన్ చెప్పకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. పోనీ విశాఖలో జరిగిన గ్లోబల్ ఇన్ వెస్ట్ మెంట్ సమ్మిట్ ఫలితాలు ప్రజలకు అందాయా అంటే అదీ లేదు. ఈ సమ్మిట్ లో 12లక్షల కోట్ల పెట్టుబడులు రానున్నాయని, నాలుగు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన జగన్ ఇంత వరకూ ఆ విషయంపై మళ్లీ నోరెత్తలేదు. అద్దె డ్రస్సులతో, సైడ్ ఆర్టిస్టులతో నడిచిన ఈ సమ్మిట్ పెద్ద బోగస్ అని తేలిపోయింది. 12 లక్షల కోట్ల పెట్టుబడి పెట్టడానికి వచ్చిన కంపెనీల ప్రతినిథుల మధ్య అన్నం కోసం తొక్కిసలాట జరగడంతో అది ఎంత మోసమో ప్రపంచానికి తెలిసిపోయింది.
తెలంగాణలో ప్రగతి పరుగులు తీయడం గురించి మాట్లాడుతూ ఏపీలో ఆ పరిస్థితి ఎప్పుడొస్తుందన్న మీడియా ప్రశ్నకు అమర్నాథ్ కోడి గుడ్డు పెట్టగలదు కానీ కోడిని పెట్టలేదుగా, గుడ్డు పెట్టాలి, పొదగాలి, పిల్లలు రావాలి పెరిగి పెద్దవవ్వాలి అంటూ చిత్రవిచిత్ర సమాధానం ఇచ్చి తాను స్వయంగా నవ్వుల పాలు కావడమే కాకుండా ఏపీ ప్రతిష్టను సైతం అపహాస్యం పాలు చేశారు. అదే విధంగా కాలుష్య కారక పరిశ్రమ అంటూ రాజకీయ కక్షతో వేధించి అమరరాజా బ్యాటరీస్ ను వేధించి రాష్ట్రం నుంచి తరిమేవరకూ నిద్ర పోలేదు. ఇక్కడ కాలుష్య కారక పరిశ్రమ అంటూ తరిమేస్తే.. తెలంగాణ రెండు చేతులతో ఆహ్వానించింది. ఏపీలో దశాబ్దాలుగా కాలుష్య ఆరోపణలు లేకుండా దివ్యంగా నడిచిన అమరరాజా బ్యాటరీస్ జగన్ సర్కార్ రాగానే కాలుష్య కారక పరిశ్రమ అయిపోయింది. అదే సమయంలో తెలంగాణలో ఆ సంస్థ 9500 కోట్ల పెట్టుబడితో బ్రహ్మాండంగా విస్తరిస్తోంది.
తాజాగా లండన్, అమెరికా పర్యటనలతో బిజీగా ఉన్న కేటీఆర్ వార్నర్ బ్రదర్స్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుని తెలంగాణ ప్రతిష్టను మరింతగా ఇనుమడింపజేశారు. ఘనత వహించిన ఆంధ్రప్రదేశ్ మంత్రి అమర్నాథ్ మాత్రం తన విలువైన సమయాన్ని జగన్ ను పొగడడానికి, ప్రతిపక్షాలను తిట్టడానికి మాత్రమే వినియోగిస్తూ రాష్ట్ర అభివృద్ధిని పూర్తిగా మరచిపోయారు.