ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటుపై స్టే!
posted on May 19, 2023 6:33AM
ఖమ్మంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు విగ్రహం ఏర్పాటుపై తెలంగాణ హైకోర్టు స్టే విధించింది. తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకు ఆ విగ్రహాన్ని ఏర్పాటు చేయరాదని ఆదేశాలు జారీ చేసింది. ఎన్టీఆర్ జయంతి మే 28వ తేదీ. ఈ నేపథ్యంలో ఖమ్మంలోని లకారం ట్యాంక్ బండ వద్ద 54 అడుగుల శ్రీకృష్ణుడి రూపంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు టీఆర్ఎస్ నాయకుడు, మంత్రి పువ్వాడ అజేయ్ కుమార్‌తోపాటు పలు సంస్థలు సంకల్పించాయి.
ఆ క్రమంలో ఈ విగ్రాహాన్ని ఆవిష్కరించేందుకు జూనియర్ ఎన్టీఆర్ ఖమ్మం రానున్నారు. అలాంటి వేళ.. శ్రీకృష్ణ జాక్, ఆదిభట్ల కళాపీఠం, భారతీయ యాదవ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తూ హైకోర్టులో 14 పిటిషన్లు దాఖలు చేశాయి. ఈ పిటిషన్లను స్వీకరించిన హైకోర్టు.. విగ్రహా ఏర్పాటుపై స్టే విధించింది. ఎన్టీఆర్ విగ్రహాన్ని శ్రీకృష్ణుడి రూపంలో ఏర్పాటు చేయడంపై యాదవ సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటుకు తాము వ్యతిరేకం కాదని.. కానీ శ్రీకృష్ణుడి రూపంలో ఏర్పాటు చేయడంపైన మాత్రమే తమ అభ్యంతరం అని అవి స్పష్టం చేస్తున్నాయి.
అదీ కూడా ఎందుకంటే.. ఎన్టీఆర్ జయంతి, వర్థంతి సందర్భంగా శ్రీకృష్ణుడి రూపంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించడం జరుగుతుందని.. ఇది ఓ విధంగా శ్రీకృష్ణుడి విగ్రహాన్ని అపవిత్రం చేయడమే అవుతుందని పిటిషన్ దారులు పేర్కొన్నారు. శ్రీకృష్ణుడి రూపం మినహా ఏ రూపంలో అయినా... ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవచ్చని సదరు పిటిషన్ దారులు అంటున్నారు.
మరోవైపు ఈ విగ్రహా ఏర్పాటుకు వ్యతిరేకంగా యాదవ హక్కుల పోరాట సమితి అద్యక్షురాలు, ప్రముఖ సినీ నటి కరాటే కళ్యాణి పోరాటం చేస్తున్నారు. అయితే ఆమె పోరాటంపై మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ క్రమంలో మా అధ్యక్షుడు మంచు విష్ణు.. కరాటే కల్యాణికి నోటీసులు జారీ చేసి.. మూడు రోజుల్లో ఈ అంశంపై వివరణ ఇవ్వాలని స్పష్టం చేశారు.