మీడియాపై అవినాష్ బ్యాచ్ దాడి.. ఖండించిన జర్నలిస్ట్ యూనియన్లు
posted on May 19, 2023 @ 1:54PM
కడప ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డి అనుచరులు మీడియాపై చేసిన దాడిని ఏపీయూడబ్ల్యూజే, ఏపీఈఎంజేఏ ఖండించాయి. ఈ దాడికి పాల్పడిన వారిని గుర్తించి వారిని అరెస్ట్ చేసి.. వారిపై హత్యాయత్నం కింద కేసులు నమోదు చేయాలని.. డిమాండ్ చేశాయి. ఒక సంచలన కేసులో జరుగుతున్న పరిణామాలను ప్రజలకు చెప్పడం మీడియా బాధ్యత అని యూనియన్ నాయకులు స్పష్టం చేశారు. రాజకీయ నాయకులు ఈ రకంగా బరి తెగించడం మంచి పద్దతి కాదన్నారు. ఇలా దాడుల ద్వారా మీడియాను అణిచివేయాలను కోవడం అవివేకమని ఆ జర్నలిస్ట్ యూనియన్లు పేర్కొన్నాయి. ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు ఐవి సుబ్బారావు, చంద్ జనార్థన్.. అలాగే ఎపి ఎలక్ట్రానిక్ మీడియా రాష్ట్ర అధ్యక్ష,కార్యదర్శులు ఏచూరి శివ, డాక్టర్ మురళీ మోహన్ ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు.
వివేకా హత్య కేసులో సీబీఐ విచారణకు కడప ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డి ఈ రోజు విచారణకు హాజరు కావాల్సి ఉంది... అయితే తన తల్లి శ్రీలక్ష్మీ అనారోగ్య కారణంగాచూపుతూ.. ఆయన హైదరాబాద్ నుంచి పులివెందులకు బయలుదేరారు. అయితే ఆ వాహనాన్ని అనసరిస్తూ.. కొన్ని మీడియా ఛానెళ్లకు చెందిన వాహనాలు వెంబడించాయి. ఈ నేపథ్యంలో సదరు వాహనాలపైనే కాకుండా.. సదరు చానెళ్లకు చెందిన జర్నలిస్టులపై అవినాష్ రెడ్డి అనుచరులు దాడికి దిగారు. అందుకు సంబంధించిన దృశ్యాలు అటు మీడియాలో ఇటు సోషల్ మీడియాలో వైరల్ అయినాయి.. అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ దాడిని జర్నలిస్ట్‌ల యూనియన్ సంఘాలు ముక్త కంఠంతో ఖండించాయి.
మరోవైపు మే 16న విచారణకు హాజరుకావాలంటూ వైయస్ అవినాష్ రెడ్డికి సీబీఐ వాట్సప్‌లో నోటీసులు జారీ చేసింది. కానీ తనకు నాలుగు రోజుల పాటు పార్టీ కార్యక్రమాలు ఉన్నాయని.. ఈ నేపథ్యంలో నాలుగు రోజుల తర్వాత వస్తానని చెప్పగా.. మే 19వ తేదీ విచారణకు హజరుకావాలంటూ.. అవినాష్ రెడ్డికి నోటీసులు ఇవ్వడమే కాకుండా.. పులివెందులకు వెళ్లి.. ఆయన నివాసం వద్ద ఉన్న ఆయన కారు డ్రైవర్‌కు నోటీసులు అందజేశారు సీబీఐ అధికారులు. దీంతో మే 19వ తేదీన ఆయన సీబీబీ విచారణకు అవినాష్ హాజరు కావాల్సి ఉంది. అయితే చివరి నిమిషంలో ఆయన కారు.. పులివెందులకు పయనం కావడంతో.. మీడియా వాహనాలు.. ఆయన వాహనాన్ని అనుసరించడంతో.. ఆయన.. సీబీఐ విచారణకు డుమ్మా కొట్టారనే ప్రచారం ఊపందుకొంది. అలాంటి వేళ.. మీడియా వాళ్లపై అవినాష్ అనుచరులు దాడులకు తెగబడ్డారు.