కొనుగోలు చేసిన భూములకే దిక్కూ దివాణం లేదు
posted on May 19, 2023 @ 1:49PM
ఖమ్మం జర్నలిస్తులకు 23 ఎకరాల భూమిని బిఆర్ఎస్ ప్రభుత్వం కేటాయించింది. రవాణా శాఖామంత్రి పువ్వాడ అజయ్ చేసిన వినతికి ముఖ్యమంత్రి కెసీఆర్ ప్రభుత్వం హడావిడిగా క్యాబినెట్ సమావేశం ఏర్పాటు చేసి దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలను కేటాయించాలని నిర్ణయించారు. పువ్వాడ అజయ్ మీడియాకు ఈ విషయాన్ని తెలిపారు. దాదాపు 15 సంవత్సరాల క్రితం రాష్ట్ర ప్రభుత్వానికి డబ్బులు చెల్లించి కొనుగోలు చేసిన 70 ఎకరాల భూములకు ఇంత వరకు మోక్షం రాలేదు. ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హాయంలో నిజాంపేటలో 32 ఎకరాలు, పేట బషీరాబాద్ లో 38 ఎకరాల భూమిని కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. వ్యవసాయ భూములు అయిన నిజాంపేటలో అప్పటి ప్రభుత్వం నిర్ణయించిన మార్కెట్ ధరకు 1100మంది జర్నలిస్ట్ లు చెల్లించారు. అదే పేట్ బషీర్ బాద్ స్థలాలను చదరపు అడుగుల లెక్కన ప్రభుత్వానికి ఈ జర్నలిస్ట్ లు చెల్లించారు.
కోర్టులో 15 ఏళ్ల పాటు కేసులు నడిచాయి. ప్రభుత్వానికి డబ్బులు చెల్లించి కొనుగోలు చేసిన ఇట్టి భూములను జవహార్ లాల్ నెహ్రూ హౌసింగ్ సొసైటీకి అప్పజెప్పాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్ వి రమణ తీర్పు చెప్పారు. 9 నెలల క్రితం ఈ తీర్పు వెలువడినప్పటికీ బీఆర్ఎస్ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు లేదు. ఏడేళ్ల క్రితం మధ్యంతర ఉత్తర్వుల్లో ఈ భూములను జవహార్ లాల్ నెహ్రూ హౌసింగ్ సొసైటీకి అప్పజెప్పాలని తీర్పు చెప్పింది. అయితే ఇట్టి భూములను డెవలప్ చేసుకోవచ్చని, ఇళ్ల నిర్మాణాలను మాత్రమే చేపట్టవద్దని మధ్యంతర ఉత్తర్వుల్లో పేర్కొంది.
ముఖ్యమంత్రి కెసీఆర్ మధ్యంతర ఉత్తర్వులపై స్పందిస్తూ హైదరాబాద్ లో భూములు కరువయ్యాయా బొచ్చెడు భూములు సుప్రీం తుది తీర్పు వచ్చాక హైదరాబాద్ జర్నలిస్ట్ లను చూసి ఈర్శ్య పడేలా పెద్ద జర్నలిస్ట్ కాలనీ ఏర్పాటు చేస్తామని హామి ఇచ్చారు. యూ ట్యూబ్ చానళ్లలో కెసీఆర్ ఇచ్చిన హామీలు ఇప్పటికీ దొరుకుతాయి. ప్రధాన న్యాయమూర్తి ఇచ్చిన తీర్పుకు ఇంతవరకు దిక్కు, దివాణం లేదు.
కాగా టియుడబ్ల్యుజె ఆధ్వర్యంలో ఇందిరాపార్క్ వద్ద గురువారం చేపట్టిన మహాధర్నాలో వైఎస్ రాజశేఖరెడ్డి తనయ వైఎస్ షర్మిల పాల్గొని బీఆర్ఎస్ ప్రభుత్వానికి కమిషన్లు అందకపోవడం వల్లే 70 ఎకరాలను జర్నలిస్ట్ లకు ఇవ్వడం లేదని ఆరోపించారు. వైఎస్ఆర్ ప్రభుత్వం కేటాయించిన ఈ భూములను కమిషన్ల కోసం బిఆర్ ఎస్ ప్రభుత్వం విక్రయించాలని చూస్తోందన్నారు. కొనుగోలు చేసిన జర్నలిస్ట్ లకు దక్కేలా తమ పార్టీ పోరాడుతుందని షర్మిల హామీ ఇచ్చారు. ఎన్నికలకు కూత వేటు దూరంలో ఉన్న నేపథ్యంలో జర్నలిస్ట్ లు పోరాటస్పూర్తితో ఉద్యమిస్తే ఈ 70 ఎకరాలను సాధించుకోవడం పెద్ద కష్టమేమి కాదని న్యాయనిపుణులు అంటున్నారు. ప్రశ్నించడం తమ హక్కు అని జర్నలిస్ట్ లు మరచిపోవడం వల్లే బీఆర్ఎస్ ప్రభుత్వం ఇష్టారాజ్యంగా వ్యవహారిస్తోంది. కోర్టు దిక్కారణ కేసు వేస్తే వీలయినంత త్వరగా భూములు వచ్చే అవకాశముందని సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ఒకరు అన్నారు. సంప్రదింపులు, లాబీయింగ్ చేసి ఈ భూములను పొందడం సాధ్యం కాదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
మెజారిటీ జర్నలిస్ట్ లు కోర్టు దిక్కారణ కేసు బిఆర్ఎస్ ప్రభుత్వంపై వేయడానికి సిద్దమైనట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ప్రదాన కార్యదర్శి శాంతకుమారి, మేడ్చెల్ కలెక్టర్ ను జవాబుదారి చేస్తూ కంటెప్ట్ వేస్తామని జర్నలిస్ట్ నాయకుడొకరు వెల్లడించారు.