ఆంధ్రలో అటకెక్కిన ఆరోగ్యశ్రీ
posted on May 18, 2023 @ 3:21PM
ఆంధ్రప్రదేశ్ లో అన్ని సేవలు ఒక ఎత్తైతే ఆరోగ్య శ్రీ ఒక్కటే ఒక ఎత్తు. వైసీపీ ప్రభుత్వం ఫ్లాగ్ షిప్ గా చెప్పుకునే డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్య శ్రీ బకాయిలు చెల్లించలేదంటూ ఆరోగ్య శ్రీ ఆస్పత్రులు రోడ్డెక్కాయి. మే 19వ తేదీ నుంచి అన్ని సేవలూ నిలిపివేస్తున్నట్లు ఆరోగ్య శ్రీ ఆస్పత్రల నెట్ వర్క్ ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చింది.
ఆరోగ్యశ్రీ ఆస్పత్రుల నెట్ వర్క్ అసోసియేషన్ లెక్కల ప్రకారం ప్రభుత్వ బకాయిలు 2000 కోట్లకు పైమాటే. ఇలాంటి సందర్భంలో ఆరోగ్య సేవలు అందించడం తమ వల్ల కాదని అసోసియేషన్ తేల్చి చెప్పింది. మొత్త 30 విభాగాలలో 2059 వ్యాధులు ఆరోగ్య శ్రీ పరిధిలోకి రావడంతో దాదాపు అందరూ ఈ సేవలను వినియోగించుకుంటున్నారు.
తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికీ ఏడాదికి 5లక్షల రూపాయలు మించకుండా ఆరోగ్యశ్రీ సేవలను ప్రభుత్వం అందిస్తోంది. అన్ని ఆస్పత్రులలో ఆరోగ్య శ్రీ పేషెంట్ల సంఖ్య విపరీతంగా పెరగడంతో బిల్లులు కూడా గణనీయంగా పెరిగిపోయాయి.
గతంలో సమ్మె నోటీసు ఇచ్చిన నెట్ వర్క్ హాస్పటల్స్ అసోసియేషన్ ప్రభుత్వ హామీతో వెనక్కు తగ్గింది. కానీ కేవలం 20 కోట్ల రూపాయలే ప్రభుత్వం విడుదల చేయడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో సేవలు బంద్ చేస్తున్నామని నెట వర్క్ అసోసియేషన్ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈవోకు నోటీసులు అందజేశారు.