సీబీఐతో అవినాష్.. దాగుడుమూతా దండాకోర్
posted on May 19, 2023 @ 1:07PM
సీబీఐతో అవినాష్ మద్య దాగుడుమూతలాట ఆడుతున్నారా అన్నట్లుగా జరుగుతున్న పరిణామాలు కనిపిస్తున్నాయి. వివేకా హత్య కేసు దర్యాప్తులో భాగంగా ఇప్పటికే ఆరు సార్లు అవినాష్ రెడ్డిని విచారించిన సీబీఐ.. ఆయనను అరెస్టు చేసి విచారించాల్సిన అవసరం ఉందని కోర్టుకు కూడా తెలియజేసింది. కోర్టుల నుంచి ఆయనకు రక్షణ లేని పరిస్థితి ఎదురైన తరువాత కూడా అరెస్టు చేయకుండా తాత్సారం చేయడంతో సీబీఐ పైనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. టీవీ టాక్ షోలలో, సామాజిక మాధ్యమంలో అవినాష్ విషయంలో సీబీఐ ప్రత్యేక అభిమానం చూపుతోందన్న విశ్లేషణలు వెల్లువెత్తాయి. అవినాష్ తండ్రి భాస్కరరెడ్డిని అరెస్టు చేసిన సీబీఐ అవినాష్ విషయంలో ఎందుకు తాత్సారం చేస్తోంది? ఎందుకు మీనమేషాలు లెక్కిస్తోందన్న ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయన తన ముందస్తు బెయిలు పిటిషన్ విచారణ వేగంగా చేపట్టేలా తెలంగాణ హైకోర్టును ఆదేశించాలంటూ.. సుప్రీంను ఆశ్రయించినా ఫలితం లేకపోయింది. ఈ నేపథ్యంలోనే శుక్రవారం (మే 19)సీబీఐ విచారణకు ఆయన హాజరు అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. అవినాష్ అరెస్టు ఖాయమన్న అభిప్రాయం రాజకీయవర్గాల్లోనే కాకుండా జనబాహుల్యంలో కూడా వ్యక్తమైంది. అన్నిటికీ మించి కడప, పులివెందులలో కూడా అవినాష్ రెడ్డి అరెస్టే తరువాయి అన్న భావన వ్యక్తమౌతోంది. అందుకే శుక్రవారం (మే 19) ఉదయానికే పెద్ద సంఖ్యలో అవినాష్ మద్దతుదారులు, అనుచరులు, వైసీపీ శ్రేణులు హైదరాబాద్ లోని ఆయన నివాసానికి చేరుకున్నారు.
మరో వైపు సీబీఐ కార్యాలయం వద్ద పోలీసులు భారీగా మోహరించడంతో.. అవినాష్ అరెస్టయ్యే అవకాశాలు ఉన్నందునే భద్రత కోసం బందోబస్తు ఏర్పుట్లు చేశారన్న అభిప్రాయం వ్యక్తమైంది. ఇంతలోనే తల్లి ఆస్పత్రిపాలయ్యారంటూ అవినాష్ సీబీఐ విచారణకు డుమ్మా కొట్టి పులివెందులకు బయలు దేరి వెళ్లారు. ఈ సమాచారాన్ని ఓ లేఖ ద్వారా సీబీఐకి పంపారు. అయితే అవినాష్ విజ్ణప్తిని సీబీఐ అంగీకరించలేదు. ఇక పరిశీలకులు కూడా ఒక వేళ నిజంగా అవినాష్ రెడ్డి తల్లికి ఆరోగ్యం బాగాలేకపోయి ఉంటే.. ఆమెను హుటాహుటిన హైదరాబాద్ కో, బెంగళూరుకో తరలిస్తారు కానీ పులివెందుల ఆస్పత్రిలో ఎందుకు చేరుస్తారని పరిశీలకులు అంటున్నారు.
పులివెందులలో అవినాష్ రెడ్డి తల్లిని చేర్చారని చెబుతున్న దినేష్ ఆస్పత్రి ముఖ్యమంత్రి జగన్ రెడ్డి సతీమణి భారత తండ్రికి చెందిన ఆస్పత్రి అనీ, అది కేవలం పిల్లలు, గర్భిణులకు చెందిన ఆస్పత్రి అని చెబుతున్నారు. ఏది ఏమైనా అవినాష్ రెడ్డి మాత్రం వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తు కీలక దశకు వచ్చిన నేపథ్యంలో విచారణను తప్పించుకునేందుకు సీబీఐతో దాగుడుమూతలు ఆడుతున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. వివేకా తీరు.. సీబీఐ ఇంటిగ్రిటీనే ప్రశ్నార్థకం చేసేదిలా ఉందని అంటున్నారు.
దినేష్ హాస్పిటల్ అనేది భారతి తండ్రి హాస్పిటల్ దీనిలో చిన్న పిల్లలకు,గర్భిణీ మహిళలలకు తప్ప పులివెందుల లో కార్డియాలజస్ట్ సంబంధించిన హాస్పిటల్స్ లేవు ఇది డ్రామా