కేసీఆర్ కు కాంగ్రెస్ ఆహ్వానం.. వెడతారా?
posted on May 19, 2023 @ 10:04AM
కర్ణాటక ముఖ్యమంత్రిగా శనివారం (మే20)న సిద్దరామయ్య ప్రమాణ స్వీకారం చేయనున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఆహ్వానం అందింది. ఆయనకే కాకుండా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, బీహార్ సీఎం నితీష్ కుమార్ సహా.. బావసారూప్యత కలిగిన, ఇంకా స్పష్టంగా చెప్పాలంటే బీజేపీయేతర పార్టీల నేతలకు అందరికీ కాంగ్రెస్ ఆహ్వానం పంపింది. ఇతర నేతల సంగతి అలా ఉంచితే కాంగ్రెస్ ఆహ్వానాన్ని మన్నించి కేసీఆర్ బెంగళూరు వెడతారా? వెళ్లరా? అన్నదానిపై రాజకీయ వర్గాల్లో తీవ్ర ఆసక్తి వ్యక్తమౌతోంది.
సిద్ద రామయ్య ప్రమాణ స్వీకారోత్సవానికి కేసీఆర్, మమతాబెనర్జీ, నితీష్ కుమార్ లకే కాకుండా, బీహార్ ఉపముఖ్యమంత్రి, ఆర్జేడీ అగ్రనేత తేజస్వి యాదవ్, హేమంత్ సోరెన్, సీతారాం ఏచూరి, ఉద్ధవ్ ఠాక్రే, శరద్ పవార్, ఫరూక్ అబ్దుల్లా, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్‌లతో పాటు ఇతర ప్రతిపక్ష పార్టీలకు కూడా ఆహ్వానం అందింది. శనివారం (మే 20) మధ్యాహ్నం 12.30 గంటలకు బెంగళూరులో సీఎంగా సిద్దరామయ్య ప్రమాణ స్వీకారోత్సవం జరుగనుంది.
కర్ణాటకలో బీజేపీకి జరిగిన పరాభవాన్ని సెలబ్రేట్ చేసుకోడానికి కేసీఆర్ .. ప్రమాణస్వీకారం కార్యక్రమానికి హాజరవుతారా.. లేక అక్కడి విజయంతో ఇక్కడ ప్రధాన ప్రత్యర్థిగా కాంగ్రెస్ అవతరించిన నేపథ్యంలో డుమ్మా కొడతారా అన్నది ఆసక్తికరంగా మారింది. దీంతో కేసీఆర్ ఏం చేస్తారన్నదానిపై అందరి దృష్టీ కేంద్రీకృతమై ఉంది.