అవినాష్ కేసు.. మళ్లీ రేపు

కడప ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిలు పిటిషన్ విచారణను తెలంగాణ హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైఎస్ అవినాష్ రెడ్డి సీబీఐ తనను అరెస్టు చేయకుండా ముందస్తు బెయిలు పిటిషన్ దాఖలు చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే తెలంగాణ హైకోర్టు ఆయన ముందస్తు బెయిలు పిటిషన్ ను జూన్ 5కు వాయిదా వేసింది. అయితే అంత వరకూ అరెస్టు చేయవద్దంటూ సీబీఐని ఆదేశించలేదు. దీంతో అవినాష్ రెడ్డి అరెస్టు అనివార్యమంటూ ప్రచారం జరిగింది. ఈ క్రమంలో అవినాష్ సీబీఐ విచారణకు హాజరు కాకుండా తన తల్లి ఆరోగ్యం బాలేదంటూ కర్నూలులోని విశ్వ భారతి ఆస్పత్రిలో తన తల్లిని అడ్మింట్ చేసి ఈ నెల 19 నుంచి అక్కడే ఉంటున్నారు. కాగా ఈనెల 22న విచారణకు హాజరు కావాలంటూ సీబీఐ ఆయనకు మరోసారి  నోటీసులు జారీ చేసింది. అయితే తనకు పది రోజులు వ్యవధి కావాలంటూ ఆయన సీబీఐకి లేఖ రాయడమే కాకుండా తెలంగాణ హైకోర్టులో ఉన్న తన ముందస్తు బెయిలు పిటిషన్ ను వెకేషన్ బెంచ్ విచారించేలా  ఆదేశించాలనీ, అప్పటి వరకూ తనను సీబీఐ అరెస్టు చేయకుండా ఆదేశాలివ్వాలని సుప్రీం ను ఆదేశించారు. దీనిపై సుప్రీం కోర్టు గురువారం (మ 25)న అవినాష్ రెడ్డి బెయిలు పిటిషన్ విచారించి ఉత్తర్వులు ఇవ్వాలని తెలంగాణ హైకోర్టును ఆదేశించింది. అయితే అంత వరకూ అరెస్టు చేయకుండా సీబీఐని ఆదేశించేందుకు నిరాకరించింది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు అవినాష్ ముందస్తు బెయిలు పిటిషన్ తెలంగాణ హైకోర్టు విచారించింది.  వాదనలు పూర్తి కాకపోవడంతో విచారణను రేపటికి వాయిదా వేసింది. 

అవినాష్ తల్లి ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ బులిటెన్

కడప ఎంపీ అవినాష్ రెడ్డి తల్లి శ్రీలక్ష్మి ఆరోగ్యం పూర్తిగ కుదుటపడింది. ఈ నెల 19 నుంచీ ఆమె తీవ్ర అనారోగ్యంతో కర్నూలులోని విశ్వభారతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. సీబీఐ విచారణను ఎదుర్కొనవలసిన అవినాష్ రెడ్డి తన తల్లి అనారోగ్యం కారణంగా హాజరు కాలేనంటూ అదే ఆసుపత్రిలో ఉన్న సంగతి తెలసిందే. ఈ నేపథ్యంలో కర్నూలు విశ్వ భారతి ఆస్పత్రి వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో గురువారం (మే25) శ్రీలక్ష్మి ఆరోగ్య పరిస్థితి కుదుటపడిందంటూ విశ్వ భారతి ఆస్పత్రి వైద్యులు హెల్త్ బులిటిన్ విడుదల చేశారు.  ఆమెకు స్టంట్ వేయాల్సి రావచ్చనీ, అది కూడా ఇప్పుడే అవసరం లేదనీ, కావాలనుకుంటే హైదరాబాద్ లో స్టంట్ వేయించుకోవచ్చనీ పేర్కొన్నారు. స్టంట్ వేసినా రెండు రోజుల్లో డిశ్చార్జ్ అయిపోవచ్చని ఆస్పత్రి విడుదల చేసిన హెల్త్ బులిటిన్ పేర్కొంది. ఇలా ఉండగా వివేకానందరెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డి ముందస్తు బెయిలు పిటిషన్ ను సుప్రీం ఆదేశాల మేరకు గురువారం (మే25)విచారించి తీర్పు వెలువరించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో అవినాష్ తల్లి ఆరోగ్య పరిస్థితి పూర్తిగా కుదుటపడిందని ఆస్పత్రి హెల్త్ బులిటిన్ విడుదల చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. 

ముందస్తు బెయిలు అనుమానమే.. న్యాయనిపుణులు

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితుడుగా అభియోగాలను ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్ లభించే అవకాశాలు దాదాపు మృగ్యం అనే న్యాయ నిపుణులు చెబుతున్నారు. అవినాష్ ముందస్తు బెయిలు పిటిషన్ గురువారం (మే 25) తెలంగాణ హైకోర్టు వెకేషన్ బెంచ్ విచారించనుంది. ఈ కేసులో ఇప్పటికే  ముగ్గురు సహ నిందితులను సీబీఐ అరెస్టు చేసింది. ఈ పరిస్థితుల్లో అవినాష్ రెడ్డికి బెయిలు వచ్చే అవకాశాలు ఏ మాత్రం లేవన్నది న్యాయ నిపుణుల అభిప్రాయం.    వైఎస్ వివేక హత్యకు సూత్రధారులలో ఒకడిగా పేర్కొంటూ, కచ్చితంగా అరెస్టు చేస్తామని, చేయాలని సిబిఐ చెబుతున్న అవినాష్ రెడ్డికి హైకోర్టు వెకేషన్ బెంచ్ ముందస్తు బెయిల్  దొరకడం కష్టం అంటున్నారు. అదే సమయంలో తన తల్లి ఆరోగ్యం బాగాలేదని అవినాష్ చెప్పినా ముందస్తు బెయిలు ఇచ్చే అవకాశం అణుమాత్రం కూడా లేదనీ, కానీ మానవతా దృక్ఫథంతో అరెస్టయిన తరువాత బెయిలు మంజూరు చేసే అవకాశాలు ఉంటాయని నిపుణులు అంటున్నారు.   సుప్రీం కోర్టు దృష్టికి అవినాష్ తరఫు న్యాయవాదులు ఆమె తల్లి అనారోగ్యం విషయాన్ని తీసుకువెళ్లినా న్యాయస్థానం పట్టించుకోకపోవడాన్ని వారీ సందర్భంగా గుర్తు చేస్తున్నారు.   తెలంగాణ హైకోర్టులో ఒక జడ్జి విని, ఇంకా వినడానికి సమయం లేదని జూన్ 5వ తేదీకి కేసు వాయిదా వేశారు. అయితే, ఈనెల 25వ తేదీన నే కేసును విచారించి తీర్పును వెలువరించాలని వెకేషన్ కోర్టు బెంచ్ ను సుప్రీం ధర్మాసనం ఆదేశించింది. దీనితో జూన్ 5వ తేదీకి వాయిదా వేసిన కేసు ఇన్ వ్యాలీడ్ అవుతుందని వారు వివరిస్తున్నారు.     

అక్కడ పొగడ్తలు.. ఇక్కడ తెగడ్తలు.. బీజేపీ డ్యుయెల్ రోల్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి విషయంలో బీజేపీ చిత్ర విచిత్ర వేషాలు వేస్తోంది. కేంద్రంలోని మోడీ సర్కార్ జగన్ ప్రభుత్వానికి ఏ చిన్న ఇబ్బందీ రాకుండా అన్ని విధాలుగా జాగ్రత్తగా చూసుకుంటోంది. అడగకుండానే ఏళ్ల తరబడి పెండింగ్ లో ఉన్నా.. ససేమిరా ఇవ్వనంటున్న బకాయిలను జగన్ కు వెసులుబాటు కలిగే విధంగా ఎన్నికల సంవత్సరంలో విడుదల చేసేసింది. పార్లమెంటు వేదికగా ఎప్పుడూ రుణగొణ ధ్వనేనా అని స్వయంగా విత్తమంత్రి వైసీపీ ఎంపీలపై చిరాకు పడ్డారు. అటువంటి పరిస్థితి నుంచి ఇంకా అప్పు కావాలా అని అడిగి మరీ మంజూరు చేసేస్తున్నారు.  అదే సమయంలో ఏపీ బీజేపీ మాత్రం జగన్ సర్కార్ పై చార్జిషీట్లు పెడుతూ.. ప్రభుత్వం అన్ని రంగాలలోనూ విఫలమైందంటూ విమర్శలు గుప్పిస్తోంది. వెంటనే ఆయనేమైనా నొచ్చుకుంటారేమోనని తెలంగాణ బీజేపీ చేరికల కమిటీ అధ్యక్షుడు ఈటల రాజేందర్ పేదలకు లక్షల ఇళ్లు కట్టిస్తూ జగన్ ప్రజారంజకంగా పాలిస్తున్నారంటూ పొగడ్తల వర్షం కురిపించేస్తున్నారు. మా ముఖ్యమంత్రి బ్రహ్మాండం. పేదల పాలిటి పెన్నిధి అని చాటుకోవడానికి వైసీపీ కార్యకర్తలకు ఈటల  మాటలు బ్రహ్మాండంగా ఉపయోగపడుతున్నాయి. ఈటల వ్యాఖ్యలను వైసీపీ సోషల్ మీడియా వైరల్ చేసుకుంటోంది.  ఎందుకంటే  కొద్ది రోజుల కిందటే ఏపీ బీజేపీ నిర్వహించిన ప్రజా చార్జిషీట్‌ ఉద్యమంలో జగనన్న ఇళ్ల నిర్మాణాలపై కేంద్రానికి ఫిర్యాదు చేశారు ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు. కేంద్ర నిబంధనల ప్రకారం ఇళ్ల నిర్మాణం జరగడం లేదని  విమర్శలు గుప్పించారు.  ఇళ్ల నిర్మాణానికి కేంద్రం నిధులు ఇస్తున్నప్పటికీ.. ప్రధాని ఆవాస్ యోజన అని బోర్డు పెట్టడం లేదంటూ మండిపడ్డారు.  కేంద్ర మంత్రి స్వయంగా వచ్చి ఏపీలో ఇళ్ల పరిస్థితి చూడాలని కోరారు. రోజుల వ్యవధిలో అదే బీజేపీకి చెందిన తెలంగాణ నాయకుడు ఈటల రాజేందర్ జగన్ ను ఆకాశానికెత్తేస్తూ వ్యాఖ్యలు చేశారు.    వెంకయ్య నాయుడు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ కు ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద 10 లక్షల ఇళ్లు మంజూరైతే   వైసీపీ ప్రభుత్వం ఇప్పటి వరకు  కేవలం 30 వేల ఇళ్లను మాత్రమే పూర్తి చేసిందని సోము వీర్రాజు అంటే.. జగన్ సర్కార్ పేదలకు లక్షల ఇళ్లు కట్టించి ఇచ్చేసిందని ఈటల పొగిడేస్తున్నారు.   జగన్ విషయంలో ఏపీ బీజేపీ ఒకలా, తెలంగాణ బీజేపీ మరోలా మాట్లాడడం వెనుక మర్మమేమిటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.  

వద్దు వద్దంటున్నా వస్తే ఇదే గతి!

వద్దు వద్దంటున్నా వస్తున్న నేతలకు చిత్తూరు జిల్లాలో రెండు గ్రామాల ప్రజలు కీలెరిగి వాత పెట్టిన చందంగా గుణపాఠం చెప్పారు. సమస్యలు పరిష్కరించకుండా.. గడపగడపకూ మన ప్రభుత్వం అంటూ వచ్చి మీకు ఈ నాలుగేళ్లలో ఇంత సొమ్ము పందేరం చేశాం, అంత సొమ్ము పందేరం చేశామంటూ గొప్పలు చెప్పుకుంటున్న నేతలకు ఇప్పటి వరకూ సమస్యలపై నిరసన గళం ఎత్తి ప్రశ్నించిన జనం ఇప్పుడు ఏకంగా ఆ కార్యక్రమాన్నే బహిష్కరిస్తున్నారు. వారు వచ్చే సమయానికి తమ ఇళ్లకు తాళాలు వేసుకుని వెళ్లిపోతున్నారు. ఇటువంటి అనుభవమే డిప్యూటీ సీఎం నారాయణ స్వామికీ, ఎమ్మెల్యే ఎమ్మెస్ బాబుకూ ఎదురైంది.   రావద్దు బాబోయ్ అని జనం నిరసనలు వ్యక్తం చేస్తున్నా అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు గడపగడపకు మా ప్రభుత్వం అంటూ  వస్తుండటంతో  జనం ఇక ఇళ్లకు తాళాలు వేసుకుని పారిపోవడమొక్కటే మార్గమని డిసైడైనట్లు ఉన్నారు. తాజాగా వైసీపీ ఎమ్మెల్యే ఎమ్మెస్ బాబు గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమాన్ని పూతలపట్టు మండలం పేట అగ్రహారం గ్రామస్తులు బహిష్కరించారు. ఆయన వస్తున్న విషయాన్ని తెలుసుకుని తమ ఇళ్లకు తాళాలు వేసుకుని గ్రామం నుంచి బయటకు వెళ్లి పోయారు. ఇదే అనుభవం ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామికీ ఎదురైంది. ప్రభుత్వం పట్ల ప్రజలలో వెల్లువెత్తుతున్న ఆగ్రహం, అసంతృప్తికి ఈ సంఘటనలు నిదర్శనమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. పూతలపట్టు మండలం పేట ఆగ్రహారానికి ఎమ్మెల్యే ఎమ్మెస్ బాబు వచ్చే సరికి అక్కడ అన్ని ఇళ్లూ తాళాలు వేసి ఉన్నాయి. దీంతో ఎమ్మెల్యే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ పథకాలను వాడుకుంటూ ప్రభుత్వ కార్యక్రమాన్ని ఎలా బహిష్కరిస్తారంటూ రుసరుసలాడారు. సిగ్గూ శరం రోషం ఉంటే తీసుకున్న పథకాలను వాపసు చేయండని ప్రజలకు సవాల్ విసిరారు. అంతే కాదు .. ఇక ముందు పేట అగ్రహారం వాసులకు ప్రభుత్వ పథకాలు వంద శాతం అందవని ప్రకటించారు. అయినా ప్రభుత్వ పథకాలు ఎమ్మెల్యేలు, అధికార పార్టీ నాయకుల ఇష్టాయిష్టాల మేరకు అందేవి కావనీ, అవి ప్రజల హక్కు అనీ ఎమ్మెల్యేకు తెలియదా అని పరిశీలకుల ప్రశ్నిస్తున్నారు. తమ విధానాలను వ్యతిరేకించే వారికి పథకాలు అందనీయను అనడం అహంకారమే అవుతుందంటున్నారు. సరే అదలా ఉంచితే.. ఎమ్మెల్యే వెళ్లిపోగానా స్వగృహాలకు తిరిగి వచ్చిన జనం తమ ఇళ్లను, ఎమ్మెల్యే తిరిగిన వీధులను పసుపు నీళ్లతో ప్రక్షాళన చేసుకున్నారు. ఇక ఏపీ డిప్యూటీ సీఎం  నారాయణ స్వామికీ ఎదురైంది.  డిప్యూటీ సీఎం నారాయణ స్వామి చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే.  నియోజకవర్గ పరిధిలోని పాచిగుంట గ్రామంలో ఆయన బుధవారం ( మే24) గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. అయితే ఆయన గ్రామానికి వచ్చే సమయానికి గ్రామస్తులు తమ ఇళ్లకు తాళం వేసుకుని బయటకు వెళ్లిపోయారు. పాతిక గడప ఉన్న ఆ గ్రామంలో ఇద్దరు ముగ్గురు వినా ఎవ్వరూ డిప్యూటీ సీఎం వచ్చే సమయానికి లేకుండా వెళ్లిపోయారు. ప్రభుత్వ తీరుకు ప్రజలు ఈ విధంగా నిరసన తెలిపారు.  చిత్తూరు జిల్లాలో ఒకే రోజు ఇద్దరు వైసీపీ నేతలకు ఇదే మర్యాద జరగడాన్ని బట్టి చూస్తే ప్రభుత్వంపై ప్రజాగ్రహం ఏస్థాయిలో ఉందో అర్ధమౌతుంది. అయితే ప్రజాగ్రహాన్ని చల్లార్చడానికి చర్యలు తీసుకోవలసిన అధికార పార్టీ నేతలు..   మా కార్యక్రమాలను బహిష్కరించిన మీకు ప్రభుత్వ పరంగా ఎటువంటి పథకాలు అందవంటూ హెచ్చరించడం.. ఇప్పటి దాకా తీసుకున్న పథకాలను వాపసు చేయండంటూ మండిపడటం విచిత్రంగా ఉందని పరిశీలకులు అంటున్నారు. తమ గడపగడపకూ కార్యక్రమాన్ని బహిష్కరించిన కుటుంబాలను ప్రభుత్వ పథకాల నుంచి తొలగించాలని వలంటీర్లకు, అధికారులకు డిప్యూటీ సీఎం ఆదేశాలు జారీ చేయడమే కాకుండా ఆయా కుటుంబాలకు నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. అంతే కాదు.. ఈ నాలుగేళ్లలో ఆయా కుటుంబాలకు ప్రభుత్వ పథకాల ద్వారా ఎంత సొమ్ము వారి అక్కౌంట్లలో జమ అయ్యిందో వివరాలు తీయండి అంటూ వాలంటీర్లకు ఆదేశించారు. ప్రభుత్వం నుంచి లబ్ధి పొందుతూ ప్రభుత్వ కార్యక్రమాలను బహిష్కరిస్తే చర్యలు తప్పకుండా ఉంటాయని హెచ్చరించారు.  

రాజకీయాల్లో బీఆర్ఎస్ జీరోయేనా?

కర్నాటక ఎన్నికల ఫలితాలతో కేసీఆర్ బీఆర్ఎస్ పూర్తిగా డీలా పడిపోయింది. అడుగు ముందుకు వేయలేని నిస్సహాయ స్థితికి చేరుకుంది. కేంద్ర సర్కార్ అంటే ఒంటి కాలిమీద లేచే  తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత నోటి వెంట ఇప్పుడు కేంద్ర సర్కార్ ను పల్లెత్తు మాట అనడం లేదు. ఇంత కాలం తన ప్రధాన ప్రత్యర్థి బీజేపీయే అంటూ వచ్చిన ఆయన ఇప్పుడు తన విమర్శలను కాంగ్రెస్ పైకి ఎక్కుపెడుతున్నారు. జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పాలనీ, తెలంగాణ మోడల్ అంటూ ప్రధాని మోడీ గుజరాత్ మోడల్ ను అనుకరిస్తూ కేసీఆర్ దేశమంతా చుట్టేసినా పెద్దగా ఫలితం లేకపోయింది. జాతీయ రాజకీయాలలోకి తొలి అడుగులు వేయడానికి ప్రయత్నించిన సమయంలో కనీసం ఆయనను కలిసిన స్టాలిన్, మమత, నితీష్ వంటి నేతలు ఇప్పుడు ఆయనను పట్టించుకోవడం లేదు. వారి వారి బీజేపీయేతర పార్టీల ఐక్యతా యత్నాలకు కేసీఆర్ ను కనీసం పలవను కూడా పిలవడం లేదు. బీజేపీకి వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో విపక్షాలు నిర్వహిస్తున్న కార్యక్రమాలకు తెలంగాణ ముఖ్యమంత్రి, భారత రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ కు కనీసం ఆహ్వానం కూడా అందడం లేదు. ఇక కర్నాటక అసెంబ్లీ ఎన్నికలలో జేడీఎస్ కు సహకారం అందిస్తున్నామంటూ బీఆర్ఎస్ హడావుడి చేసింది. హంగ్ ఏర్పడితే  జేడీఎస్ కింగ్ మేకర్ అంటూ చెప్పుకొచ్చింది. అయితే తీరా ఎన్నికల వేళ బీఆర్ఎస్ కాడె వదిలేయడంతో ఎన్నికలలో జేడీఎస్ చతికిల పడింది. ఆ విషయాన్ని కర్నాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి ఎన్నికల ఫలితాలకు ముందే మీడియా సమావేశంలో వెల్లడించి పరోక్షంగా కేసీఆర్ పై విమర్శలు గుప్పించారు. దీంతో కేసీఆర్  జాతీయ స్థాయిలో ఒంటరి అయిపోయినట్లైందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  కర్నాటక ఫలితాల ముందు వరకూ బీఆర్ఎస్ తో కలిసి అడుగులు వేస్తాయని భావించిన ప్రాంతీయ పార్టీలూ  ఇప్పుడు దూరం జరుగుతున్నాయి. అదే సమయంలో కాంగ్రెస్ లో జత కలిసేందుకు తహతహలాడుతున్నాయి. దీంతో కేసీఆర్ ఇప్పడు జాతీయ రాజకీయాలలో పెద్ద జీరోగా మిగిలిపోయారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  డీఎంకే, తృణమూల్ కాంగ్రెస్, జేడీయూ, ఆర్జేడీ, ఎస్పీ, జేఎంఎం, ఆమ్​ ఆద్మీ వంటి పార్టీలతో పాటు కమ్యూనిస్టు పార్టీలు కూడా కాంగ్రెస్ తో పొత్తుతోనే బీజేపీని దీటుగా ఎదుర్కోగలమన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాయి.  కేసీఆర్ తో గతంలో భేటీ అయిన చిన్నచిన్న పార్టీలు కూడా ఇప్పుడు ఆయనకు దూరం జరుగుతున్నాయి.  టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా మార్చనప్పుడు కేసీఆర్ కు వెన్నంటి ఉన్న జేడీఎస్ కుమారస్వామి వంటి వారు సైతం కేసీఆర్ తీరు పట్ల గుర్రుగా ఉన్నారు.  

తెలంగాణ ఎంసెట్​ ఫలితాలు విడుదల

 తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. హైదరాబాద్‌ మాసబ్‌ట్యాంక్‌లోని జేఎన్‌ఏఎఫ్‌ఏయూ ఆడిటోరియంలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గురువారం (మే 25)ఉదయం ఎంసెట్ ఫలితాలను విడుదల చేశారు.   ఈ నెల 10 నుంచి 14 వరకు ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మా విభాగాల్లో ఎంసెట్ పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే. ఈ ఏడాది రికార్డు స్థాయిలో సుమారు 3 లక్షలకు పైగా విద్యార్థులు ఎంసెట్‌ పరీక్షకు హాజరయ్యారు.  కాగా అగ్రికల్చర్ విభాగంలో 86 శాతం, ఇంజినీరింగ్‌ విభాగంలో 80 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఇంజినీరింగ్ విభాగంలో బాలుర ఉత్తీర్ణతా శాతం 79 కాగా బాలికలు 82 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఇక  అగ్రికల్చర్ విభాగంలో బాలుర ఉత్తీర్ణతా శాతం 84 కాగా బాలికల ఉత్తీర్ణతా శాతం 87. ఇక త్వరలో అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభించనున్నట్లు మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు.  

మహానాడుపైనే అందరి దృష్టీ

తెలుగుదేశం పార్టీని విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు స్థాపించి.. తెలుగుదేశం పిలుస్తోంది రా.. కదిలి రా అని పిలుపు ఇవ్వగానే.. తెలుగు నేలపైన ఉన్న ప్రజలంతా ప్రభంజనంలా కదిలారు. అంతే పార్టీ స్థాపించిన జస్ట్ 9 నెలల్లోనే అత్యధిక అసెంబ్లీ స్థానాలు గెలుచుకొని.. తెలుగువాడిలోని వాడిని.. వేడిని..చురుకుని.. చమక్కుని డిల్లీలోని హస్తం పార్టీ అధిష్టానానికి తగిలేలా.. తెలిసేలా చేయడమే కాదు.. అప్పటి వరకు రాష్ట్రంలో ఏ నిర్ణయం తీసుకోవాలన్నా.. హైదరాబాద్‌లోని హస్తం పార్టీ ముఖ్యమంత్రులు.... ఢిల్లీ అధిష్టానానికి తెలిపి... వారి నిర్ణయం వచ్చే వరకు చేతులు కట్టుకొని చేష్టలుడిగి... ఆధిష్టానం నిర్ణయం కోసం వెయిటింగ్‌ చేయడం.. అలాగే ఢిల్లీ నుంచి వచ్చిన ఆధిష్టానం దూతలు.. సీల్డ్ కవర్‌ ముఖ్యమంత్రుల పేర్లు ప్రకటించడం.. అదే విధంగా అంతర్గత ప్రజాస్వామ్యనికి కేరాఫ్ అడ్రస్ అయిన కాంగ్రెస్ పార్టీ నేతల్లో రేగిన అసమ్మతి రాగాన్ని సవరించేందుకు ఢిల్లీ నుంచి భాగ్యనగరానికి చేరిన దూతలు... కూల్ కూల్ అంటూ అసమ్మతి నేతలను కూల్ చేయడం వంటి వగై రాజకీయాలకు హోల్‌సేల్‌గా చెక్ పెట్టిన ఒకే ఒక్కడు.. మూడుక్షరాల మహాశక్తి ఎన్టీఆర్.  ఆ యుగ పురుషుడు ప్లస్ శక పురుషుడి జయంతిని పురస్కరించుకుని తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం వేదికగా.. మే 27వ తేదీన పసుపు పార్టీ పండుగ.. మహా పండగ.. మహానాడు ప్రారంభం కానుంది. మరోవైపు ఆ కథానాయకుడు ప్లస్ మహానాయకుడు శత జయంతి వేడుకలు  రాజమహేంద్రవరంలో జరిగే  మహానాడు వేదికగా ముగియనున్నాయి. ఆ క్రమంలో ఈ మహానాడుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్నగారి ఆత్మబంధువులు.. లక్షలాదిగా తరలిరానున్నారు.  అందుకోసం ఏర్పాట్లు వాయువేగంతో జరుగుతున్నాయి.  ఇంకోవైపు.. ఈ ఏడాది చివర లేకుంటే.. వచ్చే ఏడాది మొదట్లో ఎన్నికలు జరగనున్నాయనే ఓ ప్రచారం  జోరుగా సాగుతున్న వేళ సైకిల్ పార్టీ నిర్వహిస్తున్న మహానాడుపై అటు అన్ని వర్గాల ప్రజలే కాదు.. ఇటు వివిధ రాజకీయ పార్టీలు, నేతలల్లో సైతం  ఆసక్తి నెలకొంది. ఈ వేడుక వేదికగా ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేయనున్నారని.. అందులోభాగంగా అన్న గారు స్థాపించి పార్టీ అధికారంలోకి వస్తే.. ప్రజల కోసం చేపట్టే సంక్షేమ పథకాలను  ఈ వేదికపై నుంచి ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. అలాగే జగన్ గద్దెనెక్కిన తర్వాత.. అంటే ఈ నాలుగేళ్లలో రాష్ట్రంలో చోటు చేసుకున్న పరిణామాలపై పార్టీ అధినేతతో పాటు ఆ పార్టీ కీలక నేతలు సైతం విమర్శనాస్త్రాలు సందించేందుకు తమ మాటలకు పదును పెడుతోన్నట్లు సమాచారం.  ఇప్పటికే సీఎం  జగన్‌   ప్రజా వ్యతిరేక విధానాలపై టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు బాదుడే బాదుడు,ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమాలతో  ప్రజల్లో  దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. మరోవైపు ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యవగళం పేరుతో చేపట్టిన పాదయాత్ర.. ఇటీవల 100 రోజులు పూర్తి చేసుకొని.. నిర్దేశించుకొన్న లక్ష్యం దిశగా  అశేష జనాదరణతో ముందుకు సాగుతోంది. ఈ మహనాడు వేదికగా ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు.. సమరశంఖం పూరించి.. వచ్చే ఎన్నికల్లో అధికారం అందుకొనే దిశగా ఈ దర్శనికత కలిగిన అధినేత ఆడుగులు వేయనున్నాయనే ఓ చర్చ సైతం సైకిల్ పార్టీ శ్రేణుల్లో ఊపందుకొంది.

ఎంతైనా అవినాష్ రెడ్డి అదృష్టవంతుడు

ఏదీ ఏమైనా కడప ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డి అదృష్టవంతుడే అంటూ సామాజిక మాధ్యమంలో ఓ రేంజ్ లో ట్రోల్ అవుతోంది.   అవినాష్ రెడ్డి జైల్లో ఉంటే తన తండ్రి భాస్కరరెడ్డితో ఉంటాడని... అదే జైలు బయట ఉంటే తన తల్లి శ్రీలక్ష్మీతో ఉంటాడని.. అయినా ఎక్కడ ఉన్నామా? అన్నది ముఖ్యం కాదని.. తల్లిదండ్రులతో ఉన్నామా? లేదా? అన్నదే ముఖ్యమంటూ నెటిజన్లు.. పోకిరి సినిమాలో  బాగా బాపులర్ అయిన డైలాగ్.. ఎప్పుడు వచ్చామన్నది కాదన్నయ్యా.. బుల్లెట్ దిగిందా? లేదా? తరహాలో కామెంట్ చేస్తున్నారు.   అవినాష్  అరెస్ట్ చేసేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ  కర్నూలులోని విశ్వభారతీ ఆసుపత్రి చుట్టూ కాలు కాలిన పిల్లిలా చక్కర్లు కొడుతూ,  కర్నూలు జిల్లా ఎస్పీతో భేటీ అయి.. అవినాష్ రెడ్డి లొంగిపోవాలని చెప్పాలంటూ ఆ  దర్యాప్తు సంస్థ అధికారులు బాబ్బాబు అంటూ బతిమాలడం చూస్తుంటే.. అవినాష్ రెడ్డి అదృష్టవంతుడు అని పక్కాగా కన్‌ఫర్మ్ అవుతోందని నెటిజన్లు వ్యాఖ్యలు చేస్తున్నారు. అంతేకాదు సీబీఐ దూకుడుకు కళ్లెం వెయ్యగల మోనగాళ్లు ఈ దేశంలో  ఎక్కడైనా ఉన్నారంటే.. అది కేవలం ఆంధ్రప్రదేశ్‌లోని అధికార పార్టీ శ్రేణులే అన్నది సుస్పష్టమని తాజా పరిణామాల నేపథ్యంలో అర్థమవుతోందని వారు అంటున్నారు. ఇక  జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో కోడికత్తి దాడి జరిగితే.. తనకు ఆంధ్రప్రదేశ్‌ పోలీసులపై నమ్మకం లేదంటూ... పక్క రాష్ట్రం తెలంగాణలోని హైదరాబాద్‌కు ఆగమేఘాల మీద వచ్చేశారని.. అలాంటి వ్యక్తి నేడు అదే రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండగా.. సదరు పోలీసులు ఆయన నమ్మకం కోసం శాయ శక్తులా శక్తివంచన లేకుండా కష్టపడి పని చేసుకొంటూ.. ఫ్యాన్ పార్టీ రెక్కలే కాదు.. వైసీపీకి కళ్లు, చెవులు అన్నీ అయిన.. జగన్ పార్టీ శ్రేణులపై ఈగ కూడా వాలనివ్వకుండా  కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారని వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. అలాంటిది ఆంధ్రుల తొలి రాజధాని.. నేడో రేపో న్యాయ రాజధానిగా రూపుదిద్దుకొనున్న కర్నూలు నగరంలో.. అదీ విశ్వ భారతి ఆసుపత్రిలో చికిత్స పొందుతోన్న తల్లిని జాగ్రత్తగా కాపాడుతోన్న  అవినాష్ రెడ్డిపై సీబీఐ నీడ కాదు కదా.. ఈగ సైతం వాలకుండా పార్టీ కేడర్‌ కంటికి రెప్పలా కాపాడుకుంటుంటే.. ఆ క్యాడర్ కు పోలీసులు రక్షణ కవచంగా నిలిచారని  సెటైర్లు వేస్తున్నారు.   మరోవైపు వైయస్ వివేకా హత్య కేసులో కడప ఎంపీ  అవినాష్ రెడ్డి తండ్రి వైయస్ భాస్కరరెడ్డిని సీబీఐ గతంలో అరెస్ట్ చేసి.. చంచల్‌గూడ జైలుకు తరలించిందని.. ఇదే కేసులో  అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసేందుకు సీబీఐ తన వంతు ప్రయత్నాలు చేస్తున్నా.. అవినాష్ రెడ్డి మాత్రం.. ముందస్తు ప్రణాళికలతో సీబీఐకి చిక్కకుండా తిరుగుతున్నారని అంటున్నారు.  అయినా ప్రజల పన్నుల రూపంలో చెల్లించిన సొమ్మును జీతాలుగా తీసుకునే ఈ పోలీసులు.. ఇలా విశ్వభారతీ ఆసుపత్రికీ, అందులో ఉన్న అధికార పార్టీ ఎంపీ ప్లస్ ముఖ్యమంత్రి కజిన్  అవినాష్ రెడ్డికి, ఆయన తల్లితోపాటు ఆసుపత్రి వద్ద ఉన్న పార్టీ కేడర్‌కు రక్షణగా ఇలా చెమటోడ్చి.. కష్ట పడడం చూస్తుంటే..  అనినాష్ రెడ్డి నిజంగా అదృష్టవంతుడేనని నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా స్పష్టం చేస్తున్నారు.

జర భద్రం.. ఇది రోహిణి కార్తె!

వేసవి కాలం.. అదీ రోహిణి కార్తెలో కాచే ఎండలకు రోళ్లు సైతం పగిలిపోతాయంటారు. సంక్రాంతి వెళ్లిన తర్వాత శివరాత్రి మహా పర్వదినంతో అప్పటి వరకు పులిలా పంజా విసిరిన చలికి చెక్ పడి పోతుంది. ఆ తర్వాత నుంచి భానుడు.. తన భగ భగలను రోజు రోజుకు కొద్ది కొద్దిగా డోస్ పెంచుకొంటూ పోతాడు. మామూలుగా ఎండా కాలం.. అంటేనే మండే కాలం.. ఆ కాలంలో వేడిని తట్టుకోవడం ఆ సూర్యభగవానుడికి తప్పించి.. మానవ మాత్రులకు   సాధ్యం కాదన్న సంగతి అందరికీ అనుభవైకవైద్యమే. అన్నిటికంటే ముఖ్యంగా వేసవి కాలం చివరి  పక్షం రోజుల్లో.. అంటే రోహిణికార్తెలో సూర్యప్రతాపం తారస్థాయికి చేరుతుంది. ప్రచండ భానుడి విజృంభణ మామూలుగా ఉండదు. వేసవి కాలం ముగిసి.. వర్షా కాలం ప్రారంభానికి కొద్ది రోజుల ముందు ప్రభాకరుడు ప్లస్ దివాకరుడు అయిన ప్రత్యక్ష నారాయణుడు తన ప్రతాపాన్ని వేడిమి రూపంలో ప్రదర్శించి వెళ్లిపోతాడు.  ప్రతి ఏడాది మే చివరి వారంలో ఈ రోహిణి కార్తె ప్రారంభమవుతుందన్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ ఏడాది సైతం మే 25వ తేదీ అంటే గురువారం ప్రారంభమై... జూన్ 8వ తేదీ వరకు కొనసాగుతుంది. అంటే ఈ పక్షం రోజులూ... వేడి గాలులు అధికం కావడం.. ఎండలు ప్రచండంగా కాయడం.. ఉక్కపోతలు.. దాహార్తి, వడదెబ్బలు, మరణాలు.. సంభవిస్తాయి. అలాంటి సమయంలో ప్రతి ఒక్కరు ఆరోగ్యం పట్ల శ్రద్ద తీసుకోవాలి. ఇంటి పట్టునే ఉండాలి.. అత్యవసరమైతే తప్ప.. బయటకు రాకూడదు. అలాగే మట్టి కుండలోని నీటినే తాగాలి. మజ్జిగ, పళ్ల రసాలు, కొబ్బరి నీళ్లు, నిమ్మరసం, రాగి జావ, ఎలక్ట్రాల్ పౌడర్ వంటివి   విరివిగా తీసుకోవాలి.   ఇక వేసవి కాలంలో మసాలా దట్టించిన ఆహార పదార్ధాలు, వేపుళ్ళు, పచ్చళ్ళుతోపాటు అయిల్‌లో రంగరించి వండిన ఆహార పదార్ధాలకు సాధ్యమైనంత దూరంగా ఉండడం ప్రతి ఒక్కరికీ శ్రేయస్కరం. ఇక ఈ రోహిణి కార్తెలో ప్రతి ఒక్కరు తప్పకుండా రెండు పూటలా స్నానం చేయాలి. అలాగే అందరు కాటన్ వస్త్రాలు.. అవి కూడా తెల్లని రంగుతోపాటు తేలికపాటి రంగులు కలిగిన వాటినే ధరిస్తే వేడి నుండి వెంటనే ఉపశమనం లభిస్తుంది. అలాగే శారీరక వేడి సైతం తగ్గుతుంది. మరోవైపు మనం నివసించే ఇళ్లలోనే కాదు.. మన వీధుల్లో సైతం మొక్కలు నాటి.. వాటి ద్వారా సూర్యుని వేడితో.. భూతాపం పెరగకుండా కట్టడి చేయవచ్చు. ఆ క్రమంలో ప్రతి ఒక్కరు విరివిగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని సమాజ హితం కోసం చేపట్టాల్సి ఉంటుంది.  అలాగే చిన్నపిల్లలకు ఇంటి ఉష్ణోగ్రత తీవ్రతను బట్టి తడి గుడ్డతో వారి శరీరాన్ని తుడిచి బట్టలు మార్చడం చెప్ప తగ్గ సూచన. వేసవి కలంలో ముదురు రంగు దుస్తులు ధరించకపోవడం ప్రతి ఒక్కరికి శ్రేయస్కరం. మరీ ముఖ్యంగా పశుపక్ష్యాదులకు, జంతువులకు డాబాలపైన లేకుంటే రహాదారుల పక్కన పాత్రల్లో నీరు ఉంచితే.. వాటి వల్ల.. మనము సైతం.. ఎంతొకొంత పరోపకారం చేసిన వారమవుతాము.  ఇక భూమి మీద వృక్ష జాతిని పెంచడం ద్వారా పర్యవరణాన్ని పరిరక్షించుకొంటే.. భవిష్యత్తులో సూర్యుడి భగభగలు కొంతలో కొంత అయిన తగ్గిడం ద్వారా.. మానవుడే కాదు.. భూతపం సైతం తగ్గుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. అలా కాకుండా.. కూలర్లు, ఏసీలు, స్ల్పిట్ ఏసీలు మనకు ఉన్నాయనుకొంటే మాత్రం.. రోహిణి కార్తి వేసవి కాలంలోనే కాదు.. ఏడాది పొడుగునా ఉంటుందనడంలో ఎటువంటి సందేహం లేదు. అంతేకాదు.. భవిష్యత్తు తరాలను సైతం అలవిమాలిన చర్మ రోగాల బారిన పడేలా చేసిన వారం అవుతాము. అందుకే.. వర్షకాలంలో అయిన మొక్కలు నాటండి.. వచ్చే ఏడాది ఈ వేడి.. కాస్తా అయిన తగ్గుతుందని మనకు కనపడని, వినపడని ఓ హెచ్చరికను ఆ మార్తండుడు ప్రజలు ఇచ్చినట్లుగా వేసవిలో వచ్చే రోహిణి కార్తెను అర్థం చేసుకోవాల్సి ఉంటుందన్నది మాత్రం సుస్పష్టం.

సీబీఐ VS అవినాష్ రెడ్డి.. మోడీ ప్రతిష్ఠ దిగజారుడు!

కడప ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్టు విషయంలో  సీబీఐ నిస్సహాయత, చేతకాని తనం ఆ దర్యాప్తు సంస్థ ప్రతిష్టనే కాదు.. ఏపీ ముఖ్యమంత్రి జగన్ ప్రతిష్టనూ.. అంతకంటే ఎక్కువగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వ ప్రతిష్టనూ, ప్రధాని మోడీ ఇమేజ్ నూ కూడా దారుణంగా దెబ్బతీస్తున్నది.  అవినాష్ రెడ్డి విషయంలో సీబీఐ చేతకాని తనంతో వ్యవహరించడానికీ, నిస్సహాయంగా మిగిలిపోవడానికీ కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ సర్కార్ జగన్ సర్కార్ కు ఇస్తున్న వత్తాసే కారణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అవినాష్ రెడ్డి విషయంలో సీబీఐ వ్యవహరిస్తున్న తీరు.. ఆ దర్యాప్తు సంస్థపై జనానికి  ఇంత కాలం ఉన్న విశ్వాసాన్ని  దెబ్బతీశాయి.   కేంద్ర సహకారం లేకపోతే, ఒక ఎంపి ఇంత అరెస్టు చేయడానికి అడుగుముందుకు వేయకుండా ఇన్ని పిల్లిమొగ్గలు వేస్తుందా అన్న ప్రశ్న సామాన్య జనం నుంచే వస్తున్నది. నిజమే వివేకా హత్య కేసు దర్యాప్తు చేస్తున్న సీబీఐ కడప ఎంపీ అవినాష్ రెడ్డి విషయంలో వ్యవహరిస్తున్న తీరు బీజేపీ ఇమేజ్ ను దేశ వ్యాప్తంగా డ్యామేజీ చేసింది. మద్యం కుంభకోణం కేసులో ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష సిసోడియాను రెండో ఆలోచన లేకుండా అరెస్టు చేయగలిగిన సీబీఐ.. కడప ఎంపీ విషయంలో ఎందుకు మీన మేషాలు లెక్కపెడుతోందన్న ప్రశ్నకు సమాధానం చెప్పుకోలేక కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తడబడుతోంది. సీబీఐ దర్యాప్తులో జోక్యం చేసుకోబోం అంటూ గప్పాలు కొట్టి సమర్ధించుకోవడానికి ప్రయత్నిస్తున్నా.. ఈ విషయంలో బీజేపీ డైలాగులతో ప్రజలను నమ్మించడంలో విఫలమైందనే పరిశీలకులు అంటున్నారు. అవినాష్ కు సీబీఐ అరెస్టుకు మధ్య ఉన్నది కేంద్రంలోని మోడీ సర్కారేనని జనం నమ్ముతున్నారు.  జయలలిత,శిబుసోరేన్, జగన్, గాలి జనార్దన్‌రెడ్డి వంటి  అరెస్టు చేసిన సీబీఐ..  ఒక సాధారణ ఎంపీని అరెస్టు చేసేందుకు, ఒక  జిల్లా ఎస్పీని  బతిమిలాడుకున్న వైనం చూస్తుంటే కేంద్ర దర్యాప్తు సంస్థ కాళ్లూ చేతులూ కట్టేసిందెవరో తెలుసుకోవడానికి పెద్దగా పరిశోధనలు చేయాల్సిన అవసరం లేదు.  కేంద్రంలోని బీజేపీ సర్కారు సహకారం లేకపోతే, అవినాష్ రెడ్డి ఇప్పటికే అరెస్టై మూడు నెలలు దాటి ఉండేదని పరిశీలకులు అంటున్నారు.  ఏపీలో బీజేపీకి ఎటూ స్టేక్ లేదు. బతిమలాడుకుంటే పొత్తలో భాగంగా  ఒక వేళ ఉంటే గింటే.. ఒకటో రెండో ఎంపీ స్థానాలు, మూడో నాలుగో అసెంబ్లీ స్థానాలూ పోటీకి దక్కే అవకాశం ఉండొచ్చు. వాటిలో కూడా గెలిచే అవకాశాలు అంతంత మాత్రమేనని  పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అందుకే ఏపీలో జగన్ ప్రభుత్వం తీవ్ర ప్రభుత్వ వ్యతిరేకతను ఎదుర్కొంటున్నా, బీజేపీ మాత్రం నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అన్నట్లుగా వ్యవహరిస్తోందని పరిశీలకులు అంటున్నారు.  

సెంట్రల్ విస్తా.. ఒక వాస్తు తంత్రం

కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ అట్టహాసంగా ప్రారంభించిన సరికొత్త పార్లమెంట్ భవనం సెంట్రల్ విస్తా చుట్టూ వివాదాలు ముసురుతున్నాయి.  పాత పార్లమెంటు భవనం 1927లో ప్రారంభం కాగా, మరో వందేళ్లకు భారత పార్లమెంట్ తన అడ్రస్ మార్చుకోనుంది. సెంట్రల్ విస్తా విషయంలో దాదాపు ప్రతి అంశం వివాదాలకు కారణం అవుతోంది. సెంట్రల్ విస్తా మొత్తం ప్రాజెక్ట్ 2026 నాటికి పూర్తి కానుంది. ప్రస్తుతానికి పార్లమెంట్ సభ్యుల సమావేశాలు జరిగే లోక్ సభ, రాజ్య సభ సముదాయాలను పూర్తి చేశారు. ఈ భవనాలను ఈ నెల 28వ తేదీన ప్రారంభించాలని మోడీ భావిస్తున్నారు. మే 28 సావర్కార్ జయంతి అయినందున ఆ రోజు  ప్రారంభోత్సవం జరపరాదన్న వాదన బలంగా వినబడుతోంది. బ్రిటిషర్ల కాలు మొక్కి శిక్ష నుంచి తప్పించుకున్న సావర్కార్ అసలు దేశ భక్తుడే కాదని వీరి వాదన. కానీ బీజేపీ మాత్రం సావర్కార్ ను మచ్చ లేని దేశ భక్తుడిగా గుర్తిస్తోంది.  ఇది ఒక అంశం అయితే, సెంట్రల్ విస్తాకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేత  ప్రారంభోత్సవం జరిపించాలంటూ 19 ప్రతిపక్ష పార్టీలు కేంద్ర ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చాయి. ఇంకా కొన్ని రాజకీయ పక్షాలు స్పందించాల్సి ఉంది.  అయితే సెంట్రల్ విస్తాను ప్రధాని మోడీ మాత్రమే ప్రారంభిస్తారనని అది కూడా సావర్కార్ జన్మదినం రోజైన మే 28వ తేదీనే జరుగుతుందని బీజేపీ చెబుతోంది.  ఇదిలా ఉంటే రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఇంత వరకూ ఆహ్వానం కూడా పంపించలేదని ప్రతిపక్షాలు వాదిస్తున్నాయి. ప్రస్తుత పార్లమెంటు భవనం 1911 నుంచి 1932 వరకూ నిర్మాణం జరుపుకుంది.  కాగా 1927లో  నిర్మాణం కాకముందే అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం హౌస్ ఆఫ్ పార్లమెంట్ ను ప్రారంభించింది. బ్రిటిష్ ఇంజనీర్లు ఎడ్వర్డ్  లూత్సాన్, హెర్బెర్ట్ బెకర్ లు భారత పార్లమెంట్ భవనాన్ని డిజైన్ చేసి నిర్మించారు. భారతదేశ ఆధినిక చరిత్ర ఈ పార్లమెంట్ భవనంతో ముడివేసుకుంది. అంబేడ్కర్, నెహ్రూ, ఇందిరాగాంధీ, పటేల్, వాజ్ పేయి, జగ్జీవన్ రామ్, పీవీ నరసింహారావు, నీలం సంజీవరెడ్డి, వీవీగిరి, అబ్దుల్ కలాం, సర్వేపల్లి , జాకీర్ హుస్సేన్, రాజీవ్ గాంధీ వంటి దిగ్గజాలు ఆధునిక భారతదేశానికి దిశానిర్దేశం చేశారు. అలాంటి ప్రపంచంలోనే అత్యద్బుతమైన పార్లమెంట్ భవనాలలో ఒకటిగా చెప్పుకునే భారత పార్లమెంట్ భవనం ఇక ముందు ఆ ఖ్యాతిని కోల్పోనుంది. ప్రస్తుత భవనం నిర్మించి శతాబ్దం కావస్తున్న నేపథ్యంలో మరో భవనాన్ని మోడీ సర్కార్ నిర్మిస్తోంది.   ఖర్చు విషయం పక్కన పెడితే చారిత్రక ప్రాధాన్యతను మనం కోల్పోతున్నమన్నది వాస్తవం. ప్రపంచంలో  అతి పురాతన ప్రజాస్వామ్య దేశం అమెరికాలోని పార్లమెంట్ భవనానికి 230 సంవత్సరాలు పూర్తయ్యాయి. అంతటి అమెరికా కూడా చారిత్రక మూలాలను వదల కుండా ఇప్పటికీ  కేపిటల్ హిల్ ను తమ పార్లమెంట్ భవనంగా గౌరవిస్తోంది.  ఇంకా సెంట్రల్ విస్తా గురించి చూస్తూ గుజరాత్ కు చెందిన విమల్ పటేల్ అనే వాస్తు శిల్పి అధీనంలో సెంట్రల్ విస్తా రూపొందుతోంది. ఈ భవన సముదాయం వాస్తుతంత్ర విధానంలో నిర్మితం అవుతోందని విమల్ పటేల్ బృందం చెబుతోంది. ఇదిలా ఉండగా,  సెంట్రల్ విస్తా వాస్తుపై పండితులు పెదవి విరుస్తున్నారు.  86 ఎకరాల్లో నిర్మితం అవుతున్న ఈ ప్రాజెక్ట్ వాస్తుకు పూర్తి విరుద్ధమని వారి వాదన. త్రికోణ ఆకారంలో నిర్మితం అవుతున్న సెంట్రల్ విస్తా చివరికి నష్టాలను కలిగిస్తుందని  లెక్కలు వేస్తున్నారు. ఒరిస్సా  భువనేశ్వర్ లోని బ్రహ్మేశ్వర దేవాలయం వాస్తు సెంట్రల్ విస్తాలో కనిపిస్తుందని  దేవాలయాల వాస్తు మరో నిర్మాణానికి పెట్టడం అరిష్టమని పండితులు వాదిస్తున్నారు. ఏది ఏమైనా సెంట్రల్ విస్తా బీజేపీ నాయకత్వానికి మరో తలనొప్పిగా మారిందని చెప్పక తప్పదు.

పోలీసులు ఇలా.. సీబీఐ అలా..! ..ఏపీలోనే ఎందుకిలా?

చిన్న పాటి నిరసన సైతం జరిగే అవకాశం ఇవ్వకుండా  ఏపీ పోలీసులు ప్రజలను ఆంక్షల పేరుతో అడుగు బయటపెట్టనీయకుండా ఆపేస్తున్నారు..ఒక వేళ ఎవరైనా ధర్మాగ్రహం ప్రదర్శిస్తే.. కేసులు, జైళ్లు అంటూ వేధింపులకు గురి చేస్తున్నారు. వృద్ధులు, మహిళలు, పిల్లలు అన్న తేడా కూడా లేకుండా లాఠీలకు పని చెబుతున్నారు. తాజాగా గుంటూరు జిల్లా తాళ్లూరులో కూడా పోలీసులు తమ విశ్వరూపం చూపారు. ఆర్5 జోన్ కు వ్యతిరేకంగా నిరసన దీక్షకు దిగిన తెలుగుదేశం శ్రేణులను, అమరావతి రైతులను అనుమతి లేదంటూ విచక్షణా రహితంగా కొట్టారు.  తుళ్లూరు దీక్షా శిబిరాన్ని పోలీసులు తమ అధీనంలోకి తీసుకున్నారు. రైతులు నిరసన  దీక్షా శిబిరం వద్ద వందల సంఖ్యలో  పోలీసులు మోహరించారు. ర్యాలీలు, నిరసనలకు అనుమతి లేదంటూ.. రైతులను పోలీసులు అరెస్టు చేశారు. మహిళలు, వృద్ధులు అని కూడా చూడకుండా పోలీసులు  లాగి పడేశారు. అ రైతులు, మహిళలను బలవంతంగా వాహనాలు ఎక్కించి తుళ్లూరు పీఎస్‌కు తరలించారు. అదే సమయంలో ఎలాంటి ముందస్తు అనుమతి తీసుకోకుండా నాలుగు రోజులుగా కర్నూలులో వైసీపీ శ్రేణులు, అవినాష్ మద్దతుదారులు విశ్వభారతి ఆస్పత్రి వద్ద బైఠాయించి ఆ దారిలో రాకపోకలకు అంతరాయం కలిగిస్తున్నా, ఆస్పత్రిలో రోగులకు ఇబ్బందులు ఎదురౌతున్నా కర్నూలు పోలీసులు చోద్యం చూస్తున్నారు. పైపెచ్చు ఆస్పత్రిలో తలదాచుకున్న అవినాష్ కు సీబీఐ నుంచి రక్షణ కవచంలా నిలబడ్డారు.  ఒక వైపు  ఏపీ పోలీసులు సామాన్యుల విషయంలో నిబంధనలను పట్టించుకోకుండా లాఠీలతో, కేసులతో అరెస్టులతో బీభత్సం సృష్టిస్తుంటే.. మరో వైపు కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ తన ప్రతిష్ట మంట కలిసే విధంగా నత్తతో పోటీ పడుతూ అడుగులు వేస్తోంది. తమ నోటీసులను ధిక్కరించి, అనుచరులను అడ్డంగా పెట్టుకుని ఆస్పత్రిలో తలదాచుకున్న కడప ఎంపీ అవినాష్  రెడ్డి నీడను కూడా తాకలేని నిస్సహాయత ప్రదర్శిస్తోంది.   ఇంత నిస్సహాయత వ్యక్తం చేస్తున్న సీబీఐ కేసులు ఎలా దర్యాప్తు చేస్తోందా అన్న అన్న అనుమానాన్ని పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు. ఏపీలో సీబీఐ పప్పులు ఉడకవా అని ప్రశ్నిస్తున్నారు. జగన్మాయ సీబీఐని కమ్మేసిందా అన్న అనుమానాలను సామాన్యజనం సైతం అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

సీఎం వస్తున్నారహో.. ఏపీలో కొత్త రాచరికం!

రాజులు పోయారు.. రాచరికపు వ్యవస్థ  పోయింది.  కానీ ఏపీలో మాత్రం కొత్త రాచరిక వ్యవస్థ దివ్యంగా అలరారుతోంది. ముఖ్యమంత్రి జగన్ పర్యటనలు నాటి ఆడంబరాలను గుర్తుకు తేవడమే కాదు.. రాచరికపు దర్పాన్నీ, సామాన్యులను ఇక్కట్ల పాలు చేసే అహంకారాన్నీ ప్రతి బింబిస్తున్నాయి.  కొన్ని గంటల సీఎం పర్యటన కోసం ఏళ్ల నాటి చెట్లను నరికేస్తున్నారు.  ఆయన పర్యటన మార్గంలో ట్రాఫిక్ ను స్తంభింప చేస్తున్నారు. దుకాణాలను మూసేస్తున్నారు. ఆంక్షల పేరుతో  గంటల తరబడి సామాన్యులకు నరకం చూపిస్తున్నారు. అందుకే సీఎం పర్యటన అంటే జనం బెంబేలెత్తిపోతున్నారు.  తాజాగా ఏపీ సీఎం గుంటూరులో పర్యటించారు. ఆయన పర్యటన సందర్భంగా విధించిన ఆంక్షలు సామాన్యులకు చుక్కలు చూపాయి.  పశ్చిమ ఎమ్మెల్యే మద్దాళి గిరిధర్ మాతృమూర్తి మరణించడంతో ఆయన్ను పరామర్శించేందుకు సీఎం బయలుదేరారు. ఈ సందర్భంగా పోలీసులు  విధించిన ట్రాఫిక్ ఆంక్షలు గుంటూరు వాసులను నానా ఇబ్బందులకూ గురి చేశాయి. పోలీసు కవాతు మైదానం, కలెక్టరేట్ కూడలి, కంకరగుంట బ్రిడ్జి, నగరంపాలెం కూడలి, పట్టాభిపురం, శ్యామలానగర్ తదితర ప్రాంతాల్లో పెద్దసంఖ్యలో బారికేడ్లను పెట్టారు. సీఎం ఉదయం 8 గంటలకు గుంటూరు వస్తారనే సమాచారంతో భారీగా పోలీసులు మోహరించారు. సుమారు 9.30 గంటలకు ముఖ్యమంత్రి హెలికాప్టర్ పోలీసు కవాతు మైదానాన్ని చేరుకుంది. అక్కడినుంచి సీఎం కాన్వాయ్ ప్రయాణించే మార్గాల్లో ట్రాఫిక్ ను నిలిపేశారు. ముఖ్యమంత్రి తన పర్యటన ముగించుకొని తిరిగి పోలీసు కవాతు మైదానానికి సుమారు పదిన్నరకు చేరుకున్నారు. ఈ పర్యటన కోసం దాదాపు 4 గంటలపాటు నగరవాసులు ఇబ్బంది పడ్డారు. ఈ ప్రాంతాల్లో ఉన్న ఆయా ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల ఉద్యోగులు క్షణమో యుగంలా గడిపారు. ఆయా మార్గాలను ఉన్నపళంగా మళ్లించడంతో స్థానికులు అష్టకష్టాల పాలయ్యారు. ఇక కొవ్వురులో కూడా ఇదే తంతు. కొవ్వురులో సీఎం పర్యటన నేపథ్యంలో ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. కేజీఎం పాఠశాల సమీపంలో హెలిప్యాడ్ నుంచి సభా ప్రాంగణానికి రెండు కి.మీ. పరిధిలో పలుచోట్ల చెట్ల కొమ్మలు తొలగించారు.

కర్నూలు అరాచకానికి సజ్జల సమర్ధన

కర్నూలు విశ్వభారతి ఆస్పత్రి వద్ద వైసీపీ మూకలు, అవినాష్ అనుచరుల అరాచకత్వాన్ని ఘనత వహించిన ప్రభుత్వ  ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సమర్ధించారు. మీడియా రాతల వల్లే వారు రెచ్చిపోయారంటూ భాష్యం చెప్పారు. అంతే కాదు మీడియా వార్తలు ఎలా రాయాలో జ్ణాన బోధ సైతం చేశారు. రెసిడెంట్ ఎడిటర్ గా, ఎడిటోరియల్ డైరెక్టర్ గా ఆయనకు ఉన్న అనుభవంతో ఆయన మొత్తం ఏపీలో మీడియా వార్తలు ఏవి రాయాలి, ఎలా రాయాలి అన్న ఆదేశాలు జారీ చేశారా అని రాజకీయవర్గాలలో చర్చ జరుగుతోంది. ఇంతకీ మీడియాలో సీబీఐ రంగంలోకి దిగింది. ఇక అవినాష్ రెడ్డిని అరెస్టు చేసి తీసుకుపోవడమే తరువాయి అంటూ రాయకపోతే.. అసలిదంతా జరిగేది కాదు కదా? అని సజ్జల వారు సెలవిచ్చారు. సీఎం క్యాంపు కార్యాలయంవద్ద మంగళవారం ( మే 22) మీడియాతో  మాట్లాడిన ఆయన వైకాపా అంటే కార్యకర్తలు, అభిమానులు లేని పార్టీ అనుకుంటున్నారా?   మీరు రాసే వార్తల్లో కుటుంబాన్ని పలుచన చేస్తున్నారు. తల్లి ఆరోగ్యం బాగోలేదంటే డ్రామా, నాట కాలంటారు.. వీటిని చూస్తే కడుపు మండకుండా ఉంటుందా?  మీ మీదా ఇలాగే రాస్తే ఊరుకుంటారా? ఇలా అభిమానులకు ఆవేశం వచ్చేలా మీడియా వ్యవహరించింది కనుకే దాడి జరిగింది. లేకపోతే జరిగి ఉండేది కాదు అంటూ మాట్లాడారు. తల్లి ఆరోగ్యం బాగోలేదని డ్రామాలాడుతూ అవి నాష్ తప్పించుకోవాలని చూస్తున్నారని రాస్తే ఎవరో ఒకరిద్దరు ఆవేశంతో ప్రతిస్పందించి దాడికి పాల్పడి ఉంటారు. వైసీపీ శ్రేణులన్నీ రియాక్ట్ అయితే పరిస్థితి ఇలా ఉండేది కాదు అంటూ హెచ్చరికలు సైతం జారీ చేశారు.  అయినా నిజంగా మీడియాలో పని చేసే వారిపై దాడి దాడి జరగలేదు అంటూ కొత్త భాష్యం చెప్పారు.   మీడియా స్వచ్ఛను.. పరిధిని ప్రశ్నిస్తూ   సజ్జల రామకృష్ణా రెడ్డి చేసిన వ్యాఖ్యలపై రాజకీయ వర్గాల్లో  చర్చ జరుగుతోంది.  దాడిని సమర్థిస్తూ సజ్జల మాట్లాడం ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు. గతంలో మాజీ సీఎం చంద్రబాబు పై రాళ్ల దాడి చేసిన వారిని సమర్థిస్తూ..అప్పటి ఏపీ డీజీపీ గౌతం సవాంగ్.. దాడి ..వైకాపా అభిమసులు, కార్యకర్తల భావప్రకటన అని సమర్థించారు.   డీజీపీ వ్యాఖ్యలు..తాడేపల్లి ప్యాలెస్ డైరెక్షన్ లోనే జరిగిందని అప్పుడు ప్రతిపక్షాలు విమర్శించాయి.  రాళ్ల దాడులను అప్పటి  డీజీపీ గౌతమ్ సావంగ్ భావప్రకటనాస్వేచ్ఛగా సమర్థిస్తే.. వ్యతిరేక వార్తులు చేస్తే దాడులు చేయరా అన్నట్లుగా ఇప్పుడు సజ్జల మాట్లాడుతున్నారు.  తాము చెప్పినట్లుగా, తమకు అనుకూలంగా మాత్రమే మీడియా వార్తలు ఉండాలని, లేకపోతే దాడులు కొనసాగుతాయనీ సజ్జల  అన్యాపదేశంగా మీడియాను హెచ్చరించారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

పొంగులేటి వర్సెస్ పువ్వాడ

ఖమ్మం పాలిటిక్స్ రసకందాయంలో పడింది.  బిఆర్ఎస్ నుంచి సస్పెండ్ కు గురైన  పొంగులేటి , మంత్రి పువ్వాడ అజయ్ మధ్య మాటలయుద్దం తారాస్థాయికి చేరుకుంటుంది. పొంగులేటి  ఓ బచ్చా అని పువ్వాడ వాఖ్యానించారు. పొంగులేటి డబ్బులు చూసుకొని విర్రవీగుతున్నారని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇక బీఆర్ఎస్ లో ఉంటూనే తన సొంత పార్టీ నేతలనే ఓడించాలని ఆయన కుట్ర చేశారని తీవ్ర ఆరోపణలు చేశారు. పొంగులేటి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని బిఆర్ఎస్ సస్పెండ్ చేసింది. ఆయనతో పాటు జూపల్లిని కూడా సస్పెండ్ చేసింది బిఆర్ఎస్ . కెసీఆర్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్న పొంగులేటి నోటికి తాళం వేయాలని బిఆర్ఎస్ నాయకత్వం నిర్ణయించింది. పొంగులేటికి కౌంటర్ ఇచ్చేందుకు పువ్వాడ సిద్దమయ్యారు.  పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఓ సిద్ధాంతం, విలువ లేని నేత అన్న పువ్వాడ పొంగులేటి తనకు తాను అతిగా ఊహించుకుంటున్నారని విమర్శించారు. ఏపార్టీలోకి వెళ్ళాలనేది తేల్చుకోలేని దుస్థితిలో పొంగులేటి ఉన్నారన్నారు. ఇక పేదలను పీడించుకొని తిన్న దోపిడీదారులే ఆయన పంచన చేరారని, ఖమ్మం రాజకీయాల్లో పొంగులేటి  ఒక బచ్చా అని పువ్వాడ ధ్వజమెత్తారు. పువ్వాడ కాంగ్రెస్ పార్టీలో చేరవచ్చని ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి.   ఖమ్మం జిల్లాలో కీలక నేత, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మంత్రి అజయ్ కుమార్‌పై మరోసారి తీవ్ర స్థాయిలో ఫైరయ్యారు. ఖమ్మంలో మంత్రి పువ్వాడ భూ ఆక్రమణలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.పువ్వాడపై బచ్చాగాడిని పెట్టినా గెలిపిస్తానని పొంగులేటి కౌంటర్ ఇచ్చారు. పొంగులేటి కాంగ్రెస్ పార్టీలో చేరితే ఖమ్మం జిల్లాలో తీవ్ర ప్రభావం చూపే అవకాశాలున్నాయి. 

నమ్మకమే వ్యాధిని తరిమికొడుతోంది

చేప మందులో శాస్ట్రీయత కంటే నమ్మకమే చేప ప్రసాద వితరణకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ చేసింది. దూద్ బౌలిలో చేప మందును తయారు చేసి వితరణ చేసే కార్యక్రమం చాలా సంవత్సరాలనుంచి  కొనసాగుతుంది. కొందరు హేతువాదులు చేప మందు మీద నానా యాగి చేశారు చేప మందులో వాడే మందుకు శాస్త్రీయత లేదని, అందులో వాడే ముడి సరుకులో ఎటువంటి పస లేదని కొందరు గతంలో న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించారు. కోర్టు జోక్యంతో చేప మందు కాస్తా చేప ప్రసాదంగా మారిపోయింది. కరోనా కారణంగా గత మూడేళ్ల నుంచి ఈ చేప ప్రసాద వితరణ ఆగిపోయింది. చేప మందు ప్రసాద వితరణలో నమ్మకమే వైద్యంగా మారింది.  అస్తమాను తగ్గించే ఉత్ప్రేరకాలు ఇందులో లేవని హేతువాదులు చాలాకాలంగా చెబుతూ వస్తున్నారు. ప్రజల నమ్మకమే పరమావధి అని బిఆర్ఎస్ సర్కారు భావించింది. మంత్రి తలసాని ఈ మేరకు ఓ ప్రకటన చేశారు. జూన్ 9న నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో చేప ప్రసాదాన్ని వితరణ చేస్తామన్నారు. ఒకప్పుడు రైల్వేశాఖ అస్సాం నుంచి వచ్చే ప్రయాణికుల కోసం ప్రత్యేక రైలు నడిపింది అంటే చేప ప్రసాదానికి ప్రాశస్త్యం అలాంటిది.  చేప ప్రసాదంలో బతకున్న కొర్ర మీను చేపపిల్ల నోట్లో చేప ప్రసాదాన్ని పెట్టి ఆ చేపను మన గొంతులో వేస్తారు. ఒకే వ్యక్తి వందలాది మందికి చేపపిల్లలను నోట్లో వేయడాన్ని పలువురు వ్యతిరేకించారు. నాన్ వెజ్ వాళ్లకు కూడా చేప ప్రసాదాన్ని ఈ యేడు కూడా ఇస్తున్నారు.