111 జీవో రద్దు వెనక రహస్యం ఏమిటి ?
posted on May 19, 2023 @ 10:35AM
తెలంగాణ రాష్ట్రం దశాబ్ది ఉత్సవాలకు సిద్దమవుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా దశాబ్ది ఉత్సవాలను అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో 21 రోజులపాటు నిర్వహించాలని రాష్ట్ర మంత్రి వర్గం నిర్ణయించింది. నూతనంగా నిర్మించిన బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరిగిన తొలి మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ప్రజల భాగస్వామ్యంతో.. ప్రజల మధ్య చేపట్టే ఈ ఉత్సవాల్లో గ్రామ, నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో ఏయే రోజుల్లో ఏయే కార్యక్రమాలు చేపట్టాలన్నదీ మంత్రి వర్గ సమావేశంలో చర్చించి ఖరారు చేశామని మంత్రి హరీష్ రావు మీడియాకు తెలిపారు.
ఈ సమావేశంలో, మరి కొన్ని కీలక నిర్ణయాలు కూడా తీసుకున్నారు. అయితే నూతన సచివాలయంలో జరిగిన తొలి మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న ఇతర నిర్ణయాలు అన్నీ ఒకెత్తు అయితే, జీవో 111 పూర్తిగా రద్దు చేస్తూ మంత్రివర్గం తీసుకున్న నిర్ణయం ఒక్కటీ ఒకెత్తుగా రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. అలాగే ప్రతిపక్ష పార్టీలు జీవో 111 రద్దు వెనక కుట్ర ఉందని ఆరోపిస్తున్నాయి. ముఖ్యంగా ముఖ్యంత్రి కుటుంబ సభ్యుల ప్రయోజనాలను కాపాడేందుకే రాష్ట్ర ప్రభుత్వం జీవో 111 రద్దు నిర్ణయం తీసుకుందని కాంగ్రెస్, బీజేపీ సహా ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి.
ఆప్రాంతంలో ముఖ్యమంత్రి కుటుంబానికి ఉన్న వేలాది ఎకరాల పంట భూములను రియల్ ఎస్టేట్ భూములుగా మార్చేందుకే రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని సీఎల్పీ నేత భట్టివిక్రమార్క ఆరోపించారు. అంతే కాదు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చట్టవిరుద్ధం, సుప్రీం కోర్టు మార్గదర్శకాలకు విరుద్ధమని పేర్కొన్నారు. హిమయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ వంటి సహజ జలవనరులపై ప్రాభవం చూపే ఏ నిర్ణయం తీసుకోరాదని సుప్రీం కోర్టు స్పష్టమైన మార్గదర్శకాలను నిర్దేశించిందని భట్టి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి ప్రస్తావించిన ప్రత్యామ్నాయ జలవనరులు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులని అంటూ సహజ జలవనరులను కాపాడవలసిన ప్రభుత్వమే కంచే చేను మేసిన చందంగా 111 జీవో రద్దు చేసిందని భట్టి ఆరోపించారు.
మరోవంక బీజేపీ నాయకుడు మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ ప్రభాకర్ లక్షలాది ఎకరాల భూములపై ప్రభుత్వం కన్ను పడిందని ఆరోపించారు. మంత్రి కేటీఆర్ ఫార్మ్ హౌస్ తో పాటుగా ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు, అధికార పార్టీ నాయకులు, మంత్రుల భూములను రియల్ ఎస్టేట్ గా మార్చేందుకే ప్రభుత్వం 111జీవో రద్దు చేసిందని ప్రభాకర్ ఆరోపించారు. కాగా, 84 గ్రామాల ప్రజల అభ్యర్థన మేరకు.. ఆ జీవోను పూర్తిగా ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకున్నమని ప్రభుత్వం చెప్పడం పచ్చిఅబద్ధమని కాంగ్రెస్ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ ఆరోపించారు. ఆ ప్రాంతంలో లక్షల ఎకరాల భూములు అసలు యజమానుల స్వాధీనంలో లేవని ఎప్పుడోనే చేతులు మారాయని దయాకర్ అన్నారు.
అదలా ఉంటే జంట జలాశయాల వెంబడి 111 జీవో ఎత్తివేత ద్వారా రూ.5-6 వేల కోట్ల ఆదాయాన్ని సమకూర్చుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోందని, అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. 111 జీవో పరిధిలో ఉన్న వ్యవసాయ భూములను నివాస, నివాసేతర భూములుగా మార్చడం ద్వారా ఈ ఆదాయం వస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. 111 జీవో పరిధిలో ఉన్న 84 గ్రామాల్లో ప్రభుత్వ భూములు పోను సుమారు లక్ష ఎకరాల ప్రైవేటు భూములు ఉంటాయని ప్రభుత్వం అంచనా వేసింది. అన్నీ వ్యవసాయ భూములుగానే రికార్డుల్లో ఉన్నాయి. ఇక్కడ ఒక ఎకరం వ్యవసాయ భూమిని రికార్డుల్లో ఇతర అవసరాలకు ఉద్దేశించిన భూమిగా మార్చాలంటే ప్రభుత్వానికి రూ.12 లక్షలు కట్టాలి. 50 వేల ఎకరాలు కన్వర్షన్‌కు వచ్చినా ఏకరాకు రూ.12 లక్షల చొప్పున మొత్తం ప్రభుత్వానికి రూ.6 వేల కోట్లు వస్తాయని గురువారం కేబినెట్ సమావేశంలో చర్చ జరిగినట్లు సమాచారం. అయితే అదే సమయంలో ఈ జీవో రద్దు న్యాయ సమీక్షకు నిలుస్తుందా అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
111 జీవోను పూర్తిగా ఎత్తివేస్తున్నట్లు ప్రకటించిన ప్రభుత్వం తరువాత వచ్చే న్యాయపరమైన చిక్కులపై సరైన కసరత్తు చేసినట్లుగా కనిపించడం లేదు. సుప్రీంకోర్టు ఆదేశానుసారంగానే జంట జలాశయాల పరిధిలో 111 జీవో అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ జీవోను రాష్ట్రమంత్రివర్గం పూర్తిగా రద్దు చేయడంతో భవిష్యత్తులో న్యాయపరమైన చిక్కులు వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. 111 జీవోకు సంబంధించి ఎన్జీటీతో పాటు పలు కోర్టుల్లో వివాదాలు నడుస్తున్నాయి. జీవో సవరించాలంటూ కొందరు గ్రీన్ ట్రిబ్యూనల్, హైకోర్టులో వేసిన కేసులు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయి. గ్రీన్ ట్రైబ్యునల్ ఆదేశాల మేరకు జీవో సవరణకు సంబంధించి ఉన్నత స్థాయి కమిటీ కూడా వేశారు. దాని నివేదిక రాలేదు. దానిపై హైకోర్టు కూడా ఆరా తీసింది. జీవోకు తూట్లు పొడుస్తున్నారంటూ 2000లో కొందరు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇందులో సుప్రీంకోర్టు ప్రభుత్వానికి అక్షింతలు వేసింది. మరింత పకడ్భందీగా అమలు చేయాలని ఆదేశించింది. ఈ నేపద్యంలో 111 జీవో రద్దు న్యాయసమీక్షకు ఎంతవరకు నిలుస్తుంది అనేది చెప్పలేంని అంటున్నారు.