సీబీఐ విచారణకు అవినాష్ మళ్లీ డుమ్మా.. ఈ సారి అమ్మ అనారోగ్యం సాకు
posted on May 19, 2023 @ 11:58AM
వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వివేకానందరెడ్డి సీబీఐ విచారణకు మళ్లీ డుమ్మా కొట్టారు. ఈ సారి తన తల్లి ఆరోగ్యం బాలేదంటూ సీబీఐ విచారణకు హాజరు కాలేదు. విచారణకు హాజరు కవాల్సిన సమయంలో ఆయన హైదరాబాద్ నుంచి పులివెందుల బయలుదేరి వెళ్లారు. అంతకు మందు ఈ రోజు సీబీఐ అవినాష్ ను అరెస్టు చేయడం ఖాయమన్న వార్తల నేపథ్యంలో అటు సీబీఐ కార్యాలయం వద్ద, ఇటు హైదరాబాద్ లోని అవినాష్ ఇంటి వద్ద కూడా హై డ్రామా నడిచింది. సీబీఐ కార్యాలయం వద్ద పెద్ద సంఖ్యలో పోలీసులు మోహరించగా, అవినాష్ నివాసం వద్దకు ఆయన అనుచరులు భారీ సంఖ్యలో చేరుకున్నారు.
సీబీఐ కార్యాలయం వద్ద భారీగా పోలీసులు మోహరించడంతో అవినాష్ అరెస్టు ఖాయమనీ అందుకే భద్రత కట్టుదిట్టం చేశారనీ అంతా భావించారు. మరో వైపు అవినాష్ నివాసం వద్ద ఆయన అనుచరులు పెద్ద ఎత్తున మోహరించారు. నివాసంలో అవినాష్ న్యాయనిపుణులతో చర్చించి తల్లి అనారోగ్యం కారణంగా విచారణకు హాజరు కాలేనన్న సమాచారాన్ని తన న్యాయవాది ద్వారా సీబీఐకి పంపించారని సమాచారం. కాగా అవినాష్ హైదరాబాద్ నుంచి పులివెందులకు బయలు దేరుతున్న సమయంలో ఆయన అనుచరులు అక్కడ ఉన్న మీడియా ప్రతినిథులపై దాడికి పాల్పడ్డారు.
కాగా ఈ నెల 16న కూడా సీబీఐ విచారణకు హాజరు కాకుండా తన నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలకు హాజరు కావాల్సి ఉందని సమాచారం ఇచ్చారు. దీంతో సీబీఐ శుక్రవారం (మే 19)న విచారణకు రావాల్సిందిగా మరో నోటీసు ఇచ్చింది. వాట్సాప్ ద్వారా నోటీసు ఇవ్వడమే కాకుండా అదే నోటీసును పులివెందులలోని ఆయన నివాసంలో డ్రైవర్ కు అందజేసింది.
దీంతో అవినాష్ ఏదో సాకు చెప్పి విచారణకు రాకుండా తప్పించుకోవడాన్ని సీబీఐ సీరియస్ గా తీసుకుందని అందరూ భావించారు. దాంతో 19న అవినాష్ అరెస్టు ఖాయమన్న భావన సర్వత్రా వ్యక్తం అయ్యింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు కూడా తన తల్లి అనారోగ్యం కారణం చెప్పి అవినాష్ సీబీఐ విచారణకు డుమ్మా కొట్టడంతో ఇప్పుడు సీబీఐ ఏం చేస్తుందన్న ఆసక్తి, ఉత్కంఠ సర్వత్రా వ్యక్తం అవుతోంది.