ఈ సారి అరెస్టు తప్పదా?
posted on May 19, 2023 7:23AM
ఏపీ సీఎం జగన్ సొంత బాబాయ్, మాజీ మంత్రి వివేకా హత్య కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డి శుక్రవారం (మే 19) సీబీఐ ఎదుట విచారణకు హాజరు కానున్నారు. నేడు సీబీఐ హైదరాబాద్ లోని సీబీఐ కార్యాలయానికి ఉదయం 11 గంటలకు విచారణకు రావాలని మే 16న సీబీఐ నోటీసు ఇచ్చిన సంగతి తెలిసిందే. అంతకు ముందు అదే రోజు విచారణకు హాజరు కావాల్సిన అవినాష్ రెడ్డి పార్టీ కార్యక్రమాలున్నాయంటూ హాజరు కాలేననడంతో సీబీఐ ఆయనకు మూడు రోజుల వ్యవధి ఇచ్చి శుక్రవారం (మే19) హాజరు కావాలని మరో నోటీసు ఇచ్చింది.
ఆ నోటీసుకు అవినాష్ హాజరౌతానని బదులిచ్చి.. హైకోర్టులో తన ముందస్తు బెయిలు పిటిషన్ విచారణ పూర్తయ్యే వరకూ సీబీఐ అరెస్టు చేయకుండా ఆదేశాలివ్వాలంటూ సుప్రీంను ఆశ్రయించారు. అయితే ఆ విషయంలో సుప్రీం అవినాష్ కు ఎటువంటి ఊరటా ఇవ్వలేదు. దీంతో ఈ సారి సీబీఐ విచారణ అనంతరం అవినాష్ ను అరెస్టు చేయడం ఖాయమంటూ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. చాలా కాలంగా అంటే గత నాలుగు నెలలుగా సీబీఐ అవినాష్ రెడ్డిని విచారణకు పిలిచిన ప్రతి సందర్శంగాలో ఆయన అరెస్టుకు రంగం సిద్ధమైందంటూ వార్తలు వస్తూనే ఉన్నాయి.
అయితే ఆయన కోర్టుకు వెళ్లి ఆ అరెస్టును ఆపుకుంటూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అవినాష్ రెడ్డి మే 16న సీబీఐ విచారణకు హాజరు కాలేనంటూ.. సమాచారం ఇవ్వగానే సీబీఐ అలర్ట్ అయ్యింది. ఆయన నాలుగు రోజుల వ్యవధి అడిగితే మూడు రోజులు ఇచ్చి శుక్రవారం (మే19)న హాజరు కావాలని వాట్సాప్ ద్వారా అవినాష్ కు నోటీసు ఇవ్వడమే కాకుండా పులివెందులలోని ఆయన నివాసానికి వెళ్లిన సీబీఐ అధికారులు అక్కడ ఆయన లేకపోతే డ్రైవర్ కు నోటీసులు అందించారు. దీంతో ఈ సారి అవినాష్ విచారణకు హాజరు కాకుండా సాకులు చెప్పే అవకాశం ఇవ్వకూడదని, ఒక వేళ చెప్పినా సీబీఐ అందుకు అంగీకరించే పరిస్థితి లేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
అంతే కాకుండా అవినాష్ రెడ్డి సీబీఐ దర్యాప్తు సందర్భంగా లేవనెత్తిన వివేకా రాసిన లేఖ అంశంపై కూడా దృష్టి సారించిన సీబీఐ గతంలో వివేకా కుమార్తె సునీత, ఆమె భర్త రాజశేఖర్ లను విచారించినా, మరో మారు ఈ నెల 16న వారిరువురినీ హైదరాబాద్ లోని తన కార్యాలయానికి పిలిపించుకుని విశ్లేషించింది. అంతే కాకుండా వివేకా రాసినట్లుగా చెబుతున్న లేఖపై వేలిముద్రలు ఎవరెవరివన్న దిశగా కూడా దర్యాప్తు చేస్తున్నది. అందేరూ ఆ వేలి ముద్రలు ఎవరివో గుర్తించేందుకు నిన్ హైడ్రేట్ పరీక్షకు అనుమతి ఇవ్వాలని కోర్టులో సీబీఐ పిటిషన్ దాఖలు చేసింది.
ఈ నేపథ్యంలోనే శుక్రవారం (మే19) నాటి విచారణ అనంతరం సీబీఐ అవినాష్ ను అరెస్టు చేయడం ఖాయమన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమౌతోంది. ఇప్పటికే అవినాష్ రెడ్డి తండ్రి భాస్కరరెడ్డి అరెస్ట్ అయ్యారు. ఆ వెంటనే అవినాష్ రెడ్డి కూడా అరెస్ట్ అవుతారని అంతా భావించారు. స్వయంగా అవినాష్ కూడా తన అరెస్టు తప్పదని గ్రహించారు. అందుకే ముందస్తు బెయిల్ పిటిషన్ కోసం కోర్టును ఆశ్రయించారు. ఇక ఇప్పుడు కోర్టుల నుంచి అరెస్టు కాకుండా ఎలాంటి రక్షణా లేని పరిస్థితుల్లో.. చివరి ఆశగా సుప్రీంను ఆశ్రయించినా అక్కడా చుక్కెుదురవ్వడంతో ఇక అవినాష్ అరెస్టే తరువాయి అని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.