లకారం ట్యాంక్ బండ్ కు చేరిన ఎన్టీఆర్ విగ్రహం
posted on May 18, 2023 @ 4:15PM
విశ్వవిఖ్యాత నట సార్వభౌమ, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు శతజయంతి సంవత్సరం నేపథ్యంలో ఖమ్మంలో లకారం ట్యాంక్‌బండ్ వద్ద శ్రీకృష్ణుడి రూపంలో ఉన్న అన్నగారి భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేయతలపెట్టారు. ఈ విగ్రహాన్ని మే 28.. అయన జయంతి సందర్బంగా జూనియర్ ఎన్టీఆర్ ఆవిష్కరించనున్నారు. బేస్‌మెంట్‌తో కలిసి 54 అడుగులు ఎత్తు ఉండే ఈ విగ్రహం తల భాగం అయిదు అడుగులు, కాళ్ల భాగం అయిదు అడుగులు, ఇంకా మొత్తం శరీర భాగం ఎత్తు 45 అడుగులు ఉండనుంది.
తానా అసోసియేషన్‌తోపాటు పలువురు ప్రముఖుల సహకారంతో దాదాపు 4 కోట్ల రూపాయిల వ్యయంతో ఈ విగ్రహాన్ని నిర్మించారు. హైదరాబాద్ నగరంలోని హుస్సేన్ సాగర్‌లో బుద్దుడి విగ్రహాం వలే.. ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలన్నది సంకల్పం. ఈ విగ్రహ ఏర్పాట్లపై ఇప్పటికే మంత్రి, ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్.. జూనియర్ ఎన్టీఆర్‌తో చర్చించారు. మంత్రి అజయ్ కుమార్.. విగ్రహావిష్కరణకు సంబంధించిన ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.
పెద్ద ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించడం కోసం.. చిన్న ఎన్టీఆర్ వస్తుండడం పట్ల ఆయన ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈ రోజు శ్రీకృష్ణుడి రూపంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహాన్ని లకారం ట్యాంక్ బండ్ కు చేర్చారు. ఈ నెల 28 వ తేదీన సినీ హీరో జూనియర్ ఎన్టీఆర్ చేతుల మీదుగా ఈ విగ్రహావిష్కరణ జరుగుతుంది.