వీధికుక్కల దాడులు పెరుగుతున్నాయ్
posted on May 19, 2023 @ 1:43PM
వీధికుక్కల దాడిలో తెలంగాణలో మరో బాలుడు మరణించాడు. ఖాజీ పేటలో ఆద మరచి నిద్రపోతున్న 8 ఏళ్ల బాలుడిని వీధికుక్కలు అతిదారుణంగా దాడి చేసి చంపి వేసాయి. వీధికుక్కల దాడిలో బాధితుడు అక్కడికక్కడే చనిపోయాడు. మండే ఎండల నుంచి ఉపశమనం పొందడానికి ఈ బాలుడు చెట్టు క్రింద ఆదమరచి నిద్రపోతున్న సమయంలో ఈ దాడి జరిగింది. హన్మకొండ జిల్లా ఖాజీపేట రైల్వే క్వార్టర్స్ లో శుక్రవారం ఉదయం ఈ సంఘటన చోటు చేసుకుంది.
పొట్ట చేత పట్టుకుని వచ్చిన ఉత్తర ప్రదేశ్ నుంచి నగరానికి వచ్చిన కూలీ కొడుకు చోటు కుక్కల దాడిలో అనంత లోకాలకు వెళ్లిపోయాడు. గత నెల తుర్కపల్లిలో దాదాపు 100 వీధికుక్కలు దాడి చేసి ఒక వ్యక్తిని చంపేసాయి. హైదరాబాద్ లో కూడా వీధికుక్కల దాడిలో బాలుడు చనిపోయిన సంఘటన ఇంకా మరవక ముందే ఖాజీ పేటలో ఈ దాడి జరగడం కలచివేసింది. ఫిబ్రవరి 19న జరిగిన ఈ సంఘటన అప్పట్లో చర్చనీయాంశమైంది.
నాలుగేళ్ల బాలుడిని మూడు వీధి కుక్కలు దాడి చేసి చంపేసాయి. మార్చి నెలలో దేశ రాజధాని ఢిల్లీలో వీధికుక్కల దాడిలో 70 మంది చనిపోయారు.
భారత్ లో వీధికుక్కల దాడిలో చనిపోయిన వారి సంఖ్య తీవ్రవాదుల చేతిలో చనిపోతున్న వారికంటే ఎక్కువేనని అంర్జాతీయ వార్తా సంస్థ బీబీసీ ఒక అధ్యయనంలో వెల్లడించింది.
కుక్క కాటు వల్ల రేబిస్ వ్యాధి వస్తుంది. ఇది అంటు వ్యాది. ఒక వేళ కుక్క కాటు వేస్తే రేబిస్ ను అరికట్టడానికి ప్రభుత్వ యంత్రాంగం వద్ద నివారణా చర్యలు లేకపోవడం శోచనీయం.