ఏవరా 19 మంది..ఏమా కథ!
posted on Jun 23, 2023 7:26AM
తన పార్టీలో అసమర్ధ ఎమ్మెల్యేకు సీఎం జగన్ మోహన్ రెడ్డి తీవ్ర హెచ్చరికలు చేశారు.. మీ పనితీరు మెరుగు పరుచుకోవాలి.. లేదంటే నా నిర్ణయం తీసుకుంటా. మీరందరూ మళ్ళీ గెలవాలి.. ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవాలనే నా భావన. కానీ, మీ పనితీరు బాగాలేకపోతే నేనేం చేయలేను.. ఆ మాటకొస్తే నా చేతిలో కూడా ఏమీ లేదు. మీ పనితీరు బాగుంటే సర్వేలలో మంచి మార్కులు వస్తాయి. ఆ మార్కులే మీకు టికెట్లు తెస్తాయి. పనితీరు బాగాలేని ఎమ్మెల్యేలకు టికెట్లు ఇచ్చి నేను కార్యకర్తలకు అన్యాయం చేయలేను. కనుక మీ పనితీరు మెరుగు పరుచుకొని టికెట్లు తెచ్చుకోండి. ఇదీ సీఎం జగన్ మోహన్ రెడ్డి గడపగడపకు కార్యక్రమం సమీక్షా సమావేశంలో ఎమ్మెల్యేకు చెప్పిన మాట. పనితీరు సరిగా లేని ఎమ్మెల్యేల జాబితా ప్రకారం ఓ 19 మంది ఎమ్మెల్యేలకు జగన్ ఈ అల్టిమేటం ఇచ్చారు. అయితే, మీకు టికెట్లు ఇచ్చి కార్యకర్తలకు అన్యాయం చేయలేనని జగన్ చెప్పినా దాని అర్ధం మీరు ఓడిపోతే పార్టీకి, నాకు నష్టమనే.
గడపగడపకు కార్యక్రమం సమీక్షా సమావేశం అనంతరం కొందరు ఎమ్మెల్యేలు బయటకి వచ్చి మీడియా ముందే జగన్ అల్టిమేటం గురించి చెప్పగా.. మరికొందరు నియోజకవర్గాలలో నేతలకు ఈ సమాచారాన్ని చేరవేశారు. ఈ సమావేశాన్ని ఒక్కసారి తేరిపార చూస్తే ఏపీలో ప్రశాంత్ కిషోర్ ఆపరేషన్ మొదలైందని అనిపించకమానదు. నా చేతిలో ఏమీ లేదు.. సర్వేల ఫలితాలే మీకు టికెట్లు తెస్తాయని చెప్పారంటే దాని అర్ధం తెలియనిదేమీ కాదు. ఆ మాటకొస్తే ఒక్క వైసీపీ మాత్రమే కాదు చాలా వరకు రాజకీయ పార్టీలు ఇప్పుడు ఈ సర్వేల ఆధారంగానే టికెట్లు కేటాయిస్తున్నాయి. తెలంగాణలో ఈ మధ్యనే కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా ఇదే విషయాన్ని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. ఈ మధ్యనే కర్ణాటకలో జరిగిన ఎన్నికలలో కూడా వ్యూహకర్త సునీల్ కనుగోలు చెప్పిన వారికే కాంగ్రెస్ టికెట్లు ఇచ్చింది. ఇప్పుడు ఏపీలో కూడా జగన్ మోహన్ రెడ్డి అదే చెప్పారు. ప్రశాంత్ కిషోర్ ఐ ప్యాక్ ఎవరికి చెప్తే వారికే టికెట్లు దక్కనున్నాయి.
ఈ మధ్యనే సీఎం జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీలో ప్రశాంత్ కిషోర్ తో సమావేశమైనట్లు ఆ పార్టీ ముఖ్యనేతలు సన్నిహితుల వద్ద పేర్కొన్నట్లు విషయం బయటకి వచ్చింది. పార్లమెంట్ భవనం ప్రారంభం సమయంలో కూడా ప్రశాంత్ కిషోర్ తో జగన్ భేటీ అయినట్లు కథనాలొచ్చాయి. రాష్ట్రంలో ఐ ప్యాక్ టీం ఇప్పటికే నాలుగు దఫాలుగా నియోజకవర్గాలలో సర్వేలు నిర్వహించింది. ఇప్పుడు కూడా మరో సర్వే జరుపుతోంది. వీటన్నిటి ఫలితాల ఆధారంగానే టికెట్ల జాబితాలు సిద్ధం కానున్నాయి. క్యాండిడేట్ల మీద యాంటీ ఇన్ కంబినెన్సీ పార్టీకి సోకకుండా జాగ్రత్తలు మొదలు పెట్టిన జగన్ త్వరలోనే తదుపరి పీకే మార్క్ ప్రణాళికలను అమలు చేసేందుకు సిద్దమవుతున్నట్లు కనిపిస్తుంది.
మూడు రాజధానుల అంశం దగ్గర నుండి ఇంగ్లీష్ మీడియం చదువుల వరకు ఇకపై ఓటర్లను ఎమోషనలైజ్ చేసే దేన్నైనా వదిలే అవకాశం ఉండదు. ఇప్పటికే చంద్రబాబు కుప్పం సహా వై నాట్ 175 అంటూ నినాదం అందుకున్న వైసీపీ.. ఇప్పుడు ఆ టార్గెట్ గా వ్యూహాలు మొదలు పెట్టడం ఖాయంగా కనిపిస్తుంది. అమరావతిని నాశనం చేయడం దగ్గర నుండి ఎక్కడ వరకు వచ్చిందో తెలియని పోలవరం నిర్మాణం.. నెల్లూరు పెద్దారెడ్లు పార్టీలో రగిల్చిన చిచ్చు, ఉండవల్లి శ్రీదేవి ఎమ్మెల్సీ ఎన్నికలలో వేసిన వ్యతిరేక ఓటు వరకు.. నాలుగేళ్ళలో ఒక్కటంటే ఒక్కటి కూడా రాష్ట్రానికి రాని చెప్పుకోదగిన కంపెనీలు, వైజాగ్ నుండే పరిపాలన అని డజను సార్లు చెప్పినా జగన్ తాడేపల్లి నుండి కదలకపోవడం.. ఇలా చెప్పుకుంటూపోతే కోకొల్లుగా వ్యతిరేక అంశాలు ఉన్న నేపథ్యంలో వీటన్నిటినీ ఓవర్ కమ్ చేసేలా ఐ ప్యాక్ టీమ్ ఎలాంటి ప్రణాళికలు రచిస్తుందో చూడాల్సి ఉంది.
అదలా ఉంచితే జగన్ అల్టిమేటమ్ ఇచ్చిన ఆ 19 ఎమ్మెల్యేలు ఎవరన్న చర్చ జోరుగా సాగుతోంది.
పార్టీ వర్గాలలో ఆ ఎమ్మెల్యేల పేర్లు కూడా చక్కర్లు కొడుతున్నాయి. గూడూరు ఎమ్మెల్యే వరప్రసాదరావు, పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు, పెనుగొండ ఎమ్మెల్యే శంకర్ నారాయణ, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, కళ్యాణదుర్గం ఎమ్మెల్యే, మంత్రి ఉషశ్రీ చరణ్, బద్వేలు ఎమ్మెల్యే దాసరి సుధ దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్, సంతనూతలపాడు ఎమ్మెల్యే సుధాకర్ బాబు, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, పొన్నూరు ఎమ్మెల్యే కిలారు రోశయ్య, నందిగామ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు, ఆచంట ఎమ్మెల్యే చెరుకువాడ శ్రీరంగనాథరాజు, చింతలపూడి ఎమ్మెల్యే ఎలీజా, ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్రప్రసాద్, భీమిలి ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్, పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావు, బొబ్బిలి ఎమ్మెల్యే శంబంగి చినఅప్పలనాయుడు, ఎచ్చెర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్, రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులు పేర్లు వినిపిస్తున్నాయి. వీరెవరి పేర్లూ జగన్ బయట పెట్టలేదు. కానీ పార్టీలో అంతర్గత సంభాషణల్లో ఈ పేర్లు గట్టిగా వినిపిస్తున్నాయి. అయితే మొత్తం 151 మంది ఎమ్మెల్యేలలో బహిష్కృత ఎమ్మెల్యేలను తీసివేయడా.. పని చేయని ఎమ్మెల్యేలు 19 మంది మాత్రమేనా అన్న మీమాంస అందరిలోనూ వ్యక్తమౌతోంది.
ఎందుకంటే గతంలో కూడా జగన్ పలుమార్లు గడపగడపకు వర్క్ షాప్ నిర్వహిం మ్మెల్యేలను పేరు పేరున పిలిచి పని తీరు బాగాలేదని హెచ్చరించారు.ఎమ్మెల్యేలనే కాదు. మంత్రులను హెచ్చరించారు. అయినా వారి పనితీరు మెరుగుపడిన దాఖలాలేం లేవు. ఎమ్మెల్సీ ఎన్నికల పరాభవం తరువాత జగన్ తీరు పూర్తిగా మారిపోయింది. వైసీపీ మానవసంబంధాలకు విలువ నిచ్చే పార్టీ అన్నారు. ఎవరినీ దూరం చేసుకోవడం తనకు ఇష్టం లేదని చెప్పారు. అందరం కష్టపడి పని చేసి మళ్లీ అధికారంలోకి వద్దామన్నారు. అంతేనా తనకు ఎవరి మీద ఆగ్రహం లేదనీ, ఎమ్మెల్యేలు, మంత్రులూ అంతా బాగా పని చేస్తున్నారనీ కూడా చెప్పారు. పనితీరును మరింత మెరుగుపరుచుకోవాలనే తాను చెబుతున్నానన్నారు. అలా చెప్పిన జగన్ మళ్లీ ఇప్పుడు మాట మార్చారు.
ఓ 19 మంది పని తీరు అస్సలు బాగాలేదనీ, ఇలా చెప్పడమంటే మిగిలిన వారంతా బ్రహ్మాండంగా పని చేస్తున్నారని కాదనీ అన్నారు. దీంతో జగన్ ఓ సంఖ్య చెప్పి మొత్తం పార్టీ ఎమ్మెల్యేలందరిపైనా గన్ గురిపెట్టారా? అన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. ఎందుకంటే.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలలో తెలుగుదేశం అభ్యర్థి పంచుమర్తి అనూరాధ విజయం సాధించిన సమయంలో జగన్ పార్టీలో 60 మందికి పైగా ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారన్న వార్తలు వైసీపీ శ్రేణుల నుంచే వినవచ్చాయి. దాదాపుగా అదే సంఖ్యను జగన్ కూడా పలు సందర్భాలలో చెప్పారు. రోజులు గడిచే కొద్దీ అధికార పార్టీ ఎమ్మెల్యేలలో అసంతృప్తి పెరుగుతున్న సంకేతాలే కనిపిస్తున్నాయి.జగన్ ప్రభుత్వంపై రోజు రోజుకూ తీవ్రమౌతున్న ప్రజావ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తున్న నేపథ్యంలో పలువురు ఎమ్మెల్యేలు జనం వద్దకు వెళ్లడానికి జంకుతుంటే.. మరి కొందరు తాము పోటీకి సిద్దంగా లేమంటూ వారసులకు టికెట్టివ్వాలని జగన్ ను కోరుతున్నారు. మొత్తంగా జగన్ హెచ్చరికలను ఎమ్మెల్యేలు లెక్క చేసే పరిస్థితి లేదని, జగన్ గాంభీర్యం అంతా మేడిపండు చందమేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.