అది లేకుంటే సీను సితారే

ఏదైనా తప్పు చేయాలంటే.. మనిషికి గుండె ధైర్యం ఒక్కటే ఉంటే సరిపోదు. ఓ వేళ మనం నేరం చేసినట్లు వెలుగులోకి వచ్చినా.. పోలీసులు అరెస్ట్ చేసి.. జైల్లో పెట్టినా.. బెయిల్ ఇచ్చి బయటకు తీసుకు వచ్చే అండ దండా అయిన వారు బలంగా.. బలగంగా.. ఎవరో ఒకరు ఉండాలి. అలా కాకుంటే హత్య కేసులోనో, దాడి కేసులోనో మనం అరెస్ట్ అవుతామని ముందే తెలిస్తే... పనులన్నీ పక్కన పెట్టి.. ఆగ మేఘాల మీద ప్రత్యేక విమానంలో దేశ రాజధాని హస్తినకు వెళ్లి కేంద్రంలోని పెద్దలకు శాలువా కప్పి.. తిరుమల శ్రీవారి చిత్రపటంతోపాటు.. స్వామిలోరి కల్యాణం లడ్డు ప్రసాదంగా ఇస్తే.. ఆ దేవదేవుడి చిత్ర పటం సాక్షిగా అడిగిన కోరికలే కాదు.. మన మనస్సులోని కోరికలు సైతం వాళ్ల మనస్సుతోనే తెలుసుకొని.. మనకు, మనవారికి రక్షణగా చక్రం అడ్డు వేస్తారనేందుకు తెలుగు రాష్ట్రాల్లో చోటు చేసుకొంటున్న పరిణామాలే సజీవ సాక్ష్యం.  ఇంకా క్లియర్ కట్‌గా చెప్పాలంటే.. అటు ఏపీలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ సొంత చిన్నాన్న వైయస్ వివేకా హత్య కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డి.. నేటికి అరెస్ట్ కాలేదు. అలాగే ఢిల్లీ మద్యం కుంభకోణంలో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ చీఫ్, తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పలుమార్లు ఢిల్లీలో ఈడీ విచారణకు సైతం హాజరయ్యారు. కానీ ఆమె నేటికి అరెస్ట్ కాకపోవడం గమనార్హం.   ఉంటే గింటే ఈ విధంగా ఉండాలి. అలా అయితేనే మీడియాలో హైప్ ఉంటుంది. అందుకు తగ్గట్లుగా ప్రచారం సైతం ఊపందుకొంటుంది.  అయితే 2019 ఎన్నికలకు ముందు విశాఖ ఎయిర్ పోర్ట్ సాక్షిగా నాటి ప్రతిపక్ష నేత వైయస్ జగన్‌పై శ్రీను అనే వ్యక్తి కోడి కత్తితో దాడి చేశాడు. ఆ కేసు విచారణ ఎన్ఐఏ కోర్టులో ఈ రోజు అంటే జూన్ 15వ తేదీన జరగనుంది. ఈ సందర్బంగా కోడికత్తి శ్రీను.. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌కు లేఖ రాసినట్లు తెలుస్తోంది. తాను 1,610 రోజులుగా బెయిల్ లేకుండా జైల్లోనే ఉన్నట్లు పేర్కొన్నాడు. అలాగే తాను ఇంకా ఎంత కాలం.. ఈ జైలు జీవితం గడపాలో తెలియడం లేదని.. విముక్తి కలిగించాలని విన్నవించుకొన్నాడు. అదేవిధంగా తనకు న్యాయం చేయాలని అనేక మార్లు కోర్టును కోరినా.. ఫలితం లేకపోయిందని.. అందుకే మీకు లేఖ రాయాల్సి వచ్చిందని సదరు లేఖలో కోడికత్తి శ్రీను పేర్కొన్నట్లు సమాచారం. అయితే కోడికత్తి శ్రీనుకు బెయిల్ రాకపోవడంపై ఇప్పటికే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సీఎం వైయస్ జగన్.. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయానికి ఎన్ఐఏ కోర్టు... 10 కిలో మీటర్ల దూరం కూడా ఉండదని.. కానీ ఆయన ఈ కేసులో కోర్టుకు హాజరు కారనే ఆరోపణలు సైతం పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. కేవలం 15 నిమిషాలు.. సీఎం వైయస్ జగన్ సమయం కేటాయిస్తే.. సరిపోతోందని వాదనలు సైతం వస్తున్నాయి. అయితే వైయస్ జగన్ ఉద్దేశ పూర్వకంగానే తన న్యాయవాదులతో పిటిషన్లు వేయించి.. కాలయాపన చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఈ కేసులో ఎటువంటి కుట్ర కోణం లేదని ఇప్పటికే ఎన్ఐఏ అధికారుల సుస్పష్టం చేసిన విషయం విధితమే.     వైయస్ఆర్ తనయుడు వైయస్ జగన్.. ముఖ్యమంత్రి కావడం కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఆయన ముఖ్యమంత్రి అయితే రాజన్న రాజ్యం వస్తుందని భావించి.. ఆ క్రమంలో వైయస్ జగన్‌పై దాడి చేస్తే.. ఆయనకు ప్రజల్లో సింపతి వస్తుందని భావించి.. ఆ క్రమంలో దాడి చేసిన.. ఎరక్కపోయి దాడి చేసి జైల్లో ఇరుక్కుపోయిన శీను బాబు లాంటి వారు.. జీవిత కాలం బెయిల్ రాకుండా... జైల్లోనే ఉండిపోయినా.. ఏ మాత్రం ఆశ్చర్యపడనక్కర్లేదేనే ఓ చర్చ సైతం పోలిటికల్ సర్కిల్‌లో ఊపందుకొంది.

బెడిసికొట్టిన ఉమ్మడి వ్యూహం

బీజేపీ, బీఆర్ఎస్ లు ఒకే గూటి పక్షులు అన్న విమర్శ తెలంగాణ ఆవిర్భావం నుంచీ వినిపిస్తూనే ఉంది. రాష్ట్రం ఏర్పడిన తరువాత వరుసగా రెండు ఎన్నికలలో కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్( ఇప్పుడు బీఆర్ఎస్) విజయం సాధించేంత వరకూ కూడా ఇరు పార్టీల మధ్యా చక్కటి స్నేహ సంబంధాలు వెల్లివిరిశాయి.  అయితే ఆ తరువాతే కారణాలేమైనా బీజేపీ, బీఆర్ఎస్ ల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుందా అన్నట్లుగా విభేదాలు తలెత్తాయి. బీజేపీ ముక్త భారత్ నినాదాన్ని అందుకున్న కేసీఆర్ బీజేపీకి వ్యతిరేకంగా విపక్షాల ఐక్యతకు తన శక్తికి మించిన ప్రయత్నం చేశారు.  ఇతర రాష్ట్రాలకు వెళ్లి, కేంద్ర ప్రభుత్వం పై నిప్పులు చెరిగారు.మోడీ ప్రభుత్వం మహా డేంజర్ అంటూ కాలికి బలపం కట్టుకుని మరీ ఒక్కో రాష్ట్రంలో పర్యటించి ప్రచారం చేశారు. తెలంగాణలో ముఖ్యమంత్రిగా దాదాపు ఏడేళ్ల పాటు కేంద్రంలోని బీజేపీ సర్కార్ తీసుకున్న ప్రతి నిర్ణయానికి తలూపి హఠాత్తుగా ప్లేటు ఫిరాయించారు. దేశానికి గుజరాత్ మోడల్ కాదు తెలంగాణ మోడల్ కావాలంటూ.. జాతీయ రాజకీయాలలోకి అర్జంటుగా దూకేశారు. తన ఐక్యతా యత్నాలకు స్పందన కరవు కావడంతో  తానే సొంతంగా జాతీయ పార్టీని ప్రారంభించేశారు. అందుకోసం తనకు ఇన్నేళ్లుగా అధికారాన్ని ఇచ్చిన తెలంగాణ సెంటిమెంటుకు గండి కొట్టేశారు. తెలంగాణ అన్న పదాన్ని పార్టీ పేరులోంచి తీసేసి భారత రాష్ట్ర సమితిగా టీఆర్ఎస్ ను మార్చేశారు.   ధనిక రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేయడమే కాకుండా, ప్రభుత్వ ఉద్యోగులకు ఏ నెలకు ఆ నెల జీతాలు ఇవ్వలేని, ‘తెలంగాణ మోడల్’ దేశానికి ఏం చేస్తుందంటూ బీజేపీ కూడా విమర్శలు ఎక్కుపెట్టింది.  అదే సమయంలో ముఖ్యమంత్రి కేసేఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుట్ల కవిత, ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఆరోపణలు ఎదుర్కొనడమే కాకుండా ఈడీ, సీబీఐ విచారణకు కూడా హాజరయ్యారు.  మిగులు బడ్జెట్‌తో ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని.. ఎనిమిదేళ్లలో సీఎం కేసీఆర్‌ అప్పుల కుప్పగా మార్చారంటూ కేసీఆర్ పై బీజేపీ రాష్ట్రనాయకత్వం, కేంద్ర నాయకత్వమే కాదు.. కేంద్ర మంత్రులు కూడా విమర్శల దాడి  చేశారు.  అయితే ఇదంతా గతం ఇటీవల కొంత కాలంగా కేసీఆర్ బీజేపీ మాటెత్తడం లేదు. బీజేపీ కూడా కేసీఆర్ పై విమర్శల తీవ్రతను ఒకింత తగ్గించింది. కర్నాటక ఎన్నికల ఫలితమే.. ఈ ప్లేట్ ఫిరాయింపునకు కారణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. రాష్ట్రంలో క్షేత్ర స్థాయిలో బలం ఉన్న కాంగ్రెస్ ను బలహీనం  చేయడమనే వ్యూహంలో భాగంగా ఇంకా స్పష్టంగా చెప్పాలంటే.. మోడీ కాంగ్రెస్ ముక్తభారత్ లక్ష్యం కోసం కేసీఆర్ తెలంగాణలో బీజేపీకి హైప్ ఇచ్చి బలోపేతం చేశారు. కర్నాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితం తరువాత కాంగ్రెస్, బీజేపీలు తెలంగాణలో  కాంగ్రెస్ ను ఇగ్నోర్ చేయడం ద్వారా బలహీనపరుద్దామన్న తమ వ్యూహం బెడిసి కొట్టిందని తెలుసుకున్నారు. దీంతో రెండు పార్టీలకూ ఇప్పుడు కాంగ్రెస్సే ప్రధాన వైరిపక్షమైపోయింది. దీంతో ఇప్పటి వరకూ పరస్పర విమర్శలు ఆరోపణలతో రక్తికట్టించిన డ్రామాకు తెరతీసి ప్రధాన శత్రువైపై జమిలిగా విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. మొత్తం మీద తెలంగాణలో   బీఆర్ఎస్, బీజేపీల ఉమ్మడి వ్యూహం బెడిసికొట్టిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

చర్యలెప్పుడు.. కేంద్రాన్ని నిలదీసిన బాబు

ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ సమీకరణాల గురించి ఇటీవలి కాలంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. తెలుగుదేశం, జనసేనల మధ్య పొత్తు దాదాపు ఖరారైపోయిందని ఆయా పార్టీల అధినేతల మాటలను బట్టి అర్ధమౌతోంది. అయితే ఇరు పార్టీల మధ్యా పొత్తుకు సంబంధించి అధికారిక ప్రకటన రాలేదు. కానీ క్షేత్ర స్థాయిలో జనసేన శ్రేణుుల తెలుగుదేశం శ్రేణులు కలిసి పని చేయడం కనిపిస్తోంది. నారా లోకేష్ యువగళం పాదయాత్రలో రెపరెపలాడిన జనసేన జెండాలే ఇందుకు సాక్ష్యంగా నిలుస్తున్నాయి. సరే అది అలా ఉంచితే.. ఇప్పుడు తాజాగా తెలుగుదేశం, జనసేనలకు బీజేపీ కూడా జత కలుస్తుందా అన్న చర్చ జోరుగా  సాగుతోంది. అయితే బీజేపీతో పొత్తు విషయంలో తెలుగుదేశం నుంచి కానీ, బీజేపీ నుంచి కానీ ఎటువంటి ప్రకటనా రాలేదు. ఏపీలో ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చనివ్వను అన్న జనసేనాని శపథం నెరవేర్చుందుకు ఆ పార్టీకి మిత్రపక్షంగా ఉన్న బీజేపీ తెలుగుదేశం, జనసేన కూటమికి చేరువ అవుతుందా? ఈ మేరకు దాదాపు ఒక నిర్ణయానికి వచ్చేసిందా అంటే పరిశీలకులు అనుమానమే అంటున్నారు. అయితే ఇటీవల ఏపీలో పర్యటించిన జేపీ నడ్డా, అమిత్ షాలు తమతమ ప్రసంగాల్లో జగన్ ప్రభుత్వ అవినీతి, కుంభకోణాలపై విమర్శలు గుప్పించారు.  దీంతో బీజేపీ.. వైసీపీల మధ్య ఇంతకాలం కొనసాగుతూ వచ్చిన బంధం పుటుక్కుమందన్న విశ్లేషణలు వెల్లువెత్తాయి. అయితే బీజేపీ, తెలుగుదేశం పొత్తు పై మాత్రం రెండు పార్టీల నుంచీ ఒక్కటంటే ఒక్క మాట  కూడా బయటకు రాలేదు. అయితే చంద్రబాబును హస్తినకు పిలిపించుకుని మరీ అమిత్ షా, నడ్డాలు చర్చించిందేమిటన్న దానిపై ఆసక్తికర చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు కుప్పం పర్యటనలో బీజేపీకి సూటి ప్రశ్నలు సంధించారు. గత నాలుగేళ్లుగా బీజేపీని పల్లెత్తు మాట అనని చంద్రబాబు ఇప్పుడు ఆ పార్టీకి సూటి ప్రశ్నలు సంధించారు. తన కుప్పం పర్యటనలో భాగంగా నేరుగా కేంద్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పడు సంచలనంగా మారాయి. అయితే ఆయన కేంద్రం విధానాలను విమర్శించలేదు. నడ్డా, షాలు ఏపీలో తమతమ పర్యటనల సందర్భంగా జగన్ సర్కార్ అవినీతి, అక్రమాలు, కుంభకోణాలపై చేసిన విమర్శలపైనే చంద్రబాబు కేంద్రంపై ప్రశ్నలు సంధించారు. విమర్శలు సరే చర్యలు తీసుకుంటారా? అని నిలదీశారు.   సీఎం జగన్ అంత అవినీతి పరుడు దేశంలో ఎవరూ లేరని సాక్ష్యాత్తు కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. సీఎం అవినీతిపై కేంద్ర మంత్రులు ప్రకటన చేయడం కాదు జగన్ పై చర్యలు ఎప్పుడు తీసుకుంటారో చెప్పాలి? అని నిలదీశారు. తన సొంత నియోజకవర్గమైన కుప్పంలో గ్రానైట్ దోపిడీని ప్రస్తావించారు. బ్రాందీ షాపుల్లో రెండు వేల రూపాయల నోట్లను వైసీపీ నేతలు మార్చుకుంటున్న సంగతినీ ఎత్తి చూపుతూ చర్యలు ఉంటాయా ఉండవా అని కేంద్రాన్ని ప్రశ్నించారు.   కుప్పం ప్రసంగంలో చంద్రబాబు జగన్ సర్కార్ పై  చేసిన విమర్శలూ ఘాటుగానే ఉన్నాయి. అయితే పొత్తుల చర్చ వేళ జగన్ సర్కార్ పై చర్యలెప్పుడు అంటూ కేంద్రాన్ని చంద్రబాబు నిలదీయడం రాజకీయంగా అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. పోత్తుల కోసం, ప్రయోజనాల కోసం కాకుండా ప్రభుత్వ దోపిడీని అరికట్టాలంటూ చంద్రబాబు కేంద్రాన్ని డిమాండ్ చేయడం తెలుగురాష్ట్రాలలో హాట్ టాపిక్ గా మారింది. దక్షిణాదిలో నిన్నటి దాకా అధికారంలో ఉన్న ఏకైక రాష్ట్రం కర్నాటకలో బీజేపీ అధికారం కోల్పోవడం, నిన్న మొన్నటి దాకా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో విజయం సాధించి అధికారంలోకి వస్తామన్న కమలనాథుల ధీమా ఇప్పుడు కాగడా పెట్టి వెతికినా కనిపించని పరిస్థితుల నేపథ్యంలో ఇటీవల హస్తినలో  అమిత్ షా, నడ్డా లు చంద్రబాబుతో భేటీ కావడానికి రాజకీయ ప్రాముఖ్యత ఏర్పడింది. ఆ సందర్భంగా వారి మధ్య ఏం చర్చ జరిగిందన్న విషయంలో కుప్పం చంద్రబాబు ప్రసంగం ఒక క్లారిటీని ఇచ్చింది. ఏపీలో బీజేపీకి ఉన్న స్టేక్ దాదాపు జీరో అనే చెప్పాలి. అయితే ఆ పార్టీకి తెలంగాణలో ఎంతో కొంత హోప్ ఉంది. స్కోప్ ఉంది. తెలుగుదేశం సహకారం అందితే.. అక్కడ అధికారం దక్కే అవకాశం ఉందన్న అభిప్రాయమూ కమలం  టాప్ బ్రాస్ లో వ్యక్తం అవుతోంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణలో తెలుగుదేశం సహకారం విషయంలోనే బీజేపీ అగ్రనేతలు చంద్రబాబుతో చర్చలు జరిపారని అంటున్నారు. అయితే తెలంగాణలో  బీజేపీకి మద్దతు ఇవ్వాలంటే ఏపీలో బీజేపీ అధికార పక్షం అవినీతిపై చర్యలు తీసుకోవాలన్న షరతు చంద్రబాబు షా, నడ్డాల ముందు పెట్టినట్లు పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అందుకు బీజేపీ సానుకూలంగా స్పిందించిందనడానికి తార్కానమే ఇటీవల ఏపీ పర్యటనలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలు జగన్ సర్కార్ అవినీతి, కుంభకోణాలను నేరుగా ఎత్తి చూపుతూ విమర్శలు గుప్పించారని అంటున్నారు. ఆ విమర్శలను ఆసరాగా తీసుకునే మాటలు కాదు చేతలెప్పుడని చంద్రబాబు కేంద్రాన్ని సూటిగా ప్రశ్నించారన్నది పరిశీలకుల విశ్లేషణ. 

ఏపీలో అందరి నోటా ఇదే మాట..జగన్ కు నో సెకండ్ చాన్స్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి వైనాట్ 175 ధీమా సంగతి దేముడెరుగు కానీ.. రాష్ట్రం అంతటా మాత్రం ఒకే మాట వినిపిస్తోంది.  నో సెకండ్ చాన్స్ టు జగన్ అన్నదే ఆ మాట. ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సెకండ్ ఛాన్స్ కోసం, స్కెచ్ సిద్దం చేసుకుంటున్నారు. అది కూడా అలాగా ఇలాక్కాదు.. 175 కు 175 అనే మైండ్ గేమ్  తో దూసుకు పోతున్నారు.  మరో సారి అధికారం ఖాయమన్న ధీమాను వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో ప్రభుత్వ కా ర్యక్రమమా, పార్టీ కార్యక్రమమా అన్న తేడా కూడా తెలియని విధంగా అవకాశం ఉన్నా లేకున్నా కల్పించుకుని మరీ విపక్ష నేత చంద్రబాబుపై విమర్శలు గుప్పిస్తున్నారు.  ఇదంతా నాణేనికి ఒక వైపు అయితే మరో వైపు   రాష్ట్ర ప్రజలు జగన్ రెడ్డికి మరో ఛాన్స్ ఇచ్చేందుకు సిద్దంగా లేమని జగన్ సభల నుంచే  వాకౌట్లు చేయడం ద్వారా  చెప్పకనే చెబుతున్నారు.  పైగా తమ పార్టీకి మరో చాన్స్ అనుమానమేనని వైసీపీ నాయకులే అంతర్గత సంభాషణల్లో అంగీకరించేస్తున్నారు. జగన్ మైండ్ గేమ్ ఆడుతూ పోతే చివరకు బొక్కబోర్లా పాడడం ఖాయమని అంటున్నారు.  ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఆశలన్నీ నవరత్నాల మీదనే ఉన్నాయి. అలాగే, సంక్షేమ పథకాల పేరిట  ప్రజల ఖాతాల్లో . పైసలు వేస్తున్నాము కాబట్టి, ప్రజలు   మళ్ళీ  తమకే ఓటేస్తారని, తమనే గెలిపిస్తారని ఇప్పటికీ జగన్ పగటి కలలు కంటున్నారని అంటున్నారు. అయితే క్షేత్ర స్థాయిలో పరిస్థితి అందుకు పూర్తి భిన్నగా ఉందని వైసీపీ నాయకులు చెబుతున్నారు. ప్రజలు ఇచ్చిందేదో పుచ్చుకుంటున్నారు కానీ వారు సంతృప్తి చెందిన దాఖలాలు  ఇసుమంతైనా లేవని వైసీపీ శ్రేణులు కూడా చెబుతున్నాయి. గడపగడపకూ మన ప్రభుత్వం, మా నమ్మకం నువ్వే జగన్ కార్యక్రమాల అట్టర్ ప్లాప్ నే ఇందుకు ఉదాహరణగా చెబుతున్నారు. ఆయా కార్యక్రమాలలో భాగంగా ప్రజల వద్దకు వెళ్లి భంగపాటుకు గురైన  వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు, వైసీపీ జెండా మోసిన, మోస్తున్న కార్యకర్తలు కూడా కాడి వదిలేయడానికి సిద్ధమైపోతున్నారు.  ప్రజల వద్దకు వెళ్లి వన్ మోర్ చాన్స్ అంటే జనం నో నో అంటున్నారని వైసీపీ వర్గాలే చెబుతున్నాయి.   మాట తప్పను, మడమ తిప్పాను అంటే నిజమే అనుకుని, అయన వెంట నడిచిన జనాలే ఇప్పడు, జగన్ రెడ్డి మాట తప్పడం మడమ తిప్పడం మాత్రమే కాదు, ప్రజల విశ్వాసాన్ని పూర్తిగా కోల్పోయారని   అంటున్నారు.   రాష్ట్రంలో చిన్నా పెద్ద పనులు వేటికి టెండర్లు పిలిచినా  కాంట్రాక్టర్లు ఎవరూ, ముందుకు రావడం లేదు. ఒకసారి కాదు, రెండు మూడుసార్లు, టెండర్ ప్రకటనలు ఇచ్చినా, పత్రికల ఆఫీసుల నుంచి  అడ్వర్టైజ్మెంట్ బిల్లులు వస్తున్నాయే తప్ప టెండర్లు వేసేందుకు, కాంట్రాక్టర్లు మాత్రం ముందుకు రావడం లేదు.   ప్రభుత్వం మీద కాంట్రాక్టర్లకు విశ్వాసం లేదనడానికి ఇదే నిదర్శనం అని పరిఇశీలకులు అంటున్నారు.  రాష్ట్రంలో కాంట్రాక్టర్లకు చెల్లించవలసిన బకాయిలు, కొండలా  పెరిగిపోతున్నాయి. అప్పులు, వడ్డీలు కట్టలేక, కాంట్రాక్టర్లు ఆందోళనలు  చేయడమే కాదు, ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలు జరిగినా ప్రభుత్వానికి చీమకుట్టినట్లైనా లేదని వైసీపీ ఎమ్మెల్యేలే సొంత ప్రభుత్వంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.  కాంట్రాక్టర్లు మాత్రమే కాదు, పార్టీ క్యాడర్ కు ఏదో మేలు చేసేందుకు అన్నట్లు  నామినేషన్ పనులు కేటాయించినా  క్షేత్ర స్థాయి నాయకులు, క్యాడర్ సున్నితంగా తిరస్కరిస్తున్నారు. ఇప్పటికే చేసిన పనులకు బిల్లులు రాక అప్పులు, వడ్డీలు కట్టలేక ఉన్న ఆస్తులు అమ్ముకున్న పార్టీ నాయకులు, నామినేషన్ పనులంటే వద్దు పొమ్మంటున్నారు. జగన్ పై పార్టీ క్యాడర్, నేతలే విశ్వాసం కోల్పోయారనడానికి ఇదే నిదర్శనమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   ఇక వైసీపీ  సర్పంచ్‌ లు కూడా, పదవులు వదిలి పెట్టి పారి పోతున్నారు. గ్రామాల్లో చేసిన అభివృద్ది పనులకు బిల్లులు రాకపోవడంతో అప్పులు పాలైన సర్పంచ్‌ లు మీరిచ్చిన పదవికో దండం, వైసీపీకి ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి రెండు దండాలు అని చెప్పి, పొరుగు రాష్ట్రాలకు పోయి, కూలి పనులు, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటున్నారు.  ఇవన్నీ ఒకెత్తు అయితే  ప్రభుత్వ భూములు  ప్లాట్స్ వేసి అమ్ముదామంటే కొనే నాధుడే కనిపించడం లేదంటే ప్రభుత్వం జనాలలో ఎంతగా నమ్మకం కోల్పోయిందో ఇట్లే అవగతమౌతుంది.    ముఖ్యమంత్రి జగన్ రెడ్డి డ్రీమ్ కాపిటల్  వైజాగ్ మహానగరంలో ప్రభుత్వ ప్లాట్లు కొనేందుకు ప్రజలు ముందుకు రావడం లేదు.  వైజాగ్ నగరంలో జగన్ రెడ్డి ప్రభుత్వం, జగనన్నస్మార్ట్ టౌన్ షిప్ లో  సుమారు 2000 ప్లాట్లను ఇటీవల వేలం ద్వారా అమ్మకానికి పెట్టింది. ఆయినా, స్పందన లేదు. చివరకు చేసేది  లేక  దరఖాస్తు  గదువును రెండు సార్లు పొడిగించింది, పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. అయినా ఫలితం లేదు.నో రెస్పాన్స్.. ముఖ్యమత్రి తన గ్రాఫ్ బ్రహ్మాండంగా వుందని .. మురిసి పొతున్నారు.. ఆయన గ్రాఫ్ ఎంత బ్రహ్మాండగా వుందో, అయన మీద ప్రజల విశ్వసం ఎ స్థాయిలో వుందో జగనన్నస్మార్ట్ టౌన్ షిప్  ప్లాట్స్ కథే చెప్పేసిందని పార్టీ నేతలే చెప్పుకుంటున్న పరిస్థితి.  రెండు వేల ప్లాట్లకు కనీసం రెండు వందల మంది కూడా ఆన్‌లైన్‌లో అప్లయ్ చేయలేదు.చివరికి తొలి విడతగా కట్టాల్సిన సొమ్మును కట్టిన వారు కేవలం 70 మంది మాత్రమే. నిజానికి ప్రభుత్వం నేరుగా అమ్ముతోందంటే దానికో క్రేజ్ ఉంటుంది. భవిష్యత్‌లో ఎలాంటి సమస్యలు రావు. క్లియర్ టైటిల్ ఉంటుంది. అదే సమయంలో ప్రభుత్వం  మౌలిక సదుపాయాలు కల్పిస్తుందని ఎవరైనా భావిస్తారు.  గత  తెలుగుదేశం ప్రభుత్వం అమరావతిలో హ్యాపీనెస్ట్ అనే ప్రాజెక్ట్ చేపడితే గంటల్లో బిజినెస్ క్లోజ్ అయింది.  కానీ ఈ ప్రభుత్వం మాత్రం ఏం చేసినా కనీస స్పందన రావడం లేదు.  నిజానికి,  రేపో మాపో రాజదాని అయ్యే నగరంలో స్థలం అంటే, ప్రజలు క్యూ కట్టి ఎగరేసుకు పోతారు.. కానీ వైజాగ లో పరిస్థితి అందుకు పూర్తి భిన్నగా వుంది.. అంటే.. జగన్ రెడ్డి  మీద విశ్వాసం లేకపోవడమే కారణమని అంటున్నారు. జగన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి రారు, వైజాగ్ ఎప్పటికీ రాజధాని కాదు అందుకే జనం జగన్  ను జనం నమ్మడం లేదని  వైసీపీ నాయకులే అంటున్నారు.   ఇలా ఒకరని కాదు, అన్ని వర్గాల ప్రజలు, చివరకు సంక్షేమ పథకాల ప్రయోజనాలను పొందుతున్న సామాన్య జనం కూడా  ముఖ్యమంత్రి జగన్ రెడ్డి మరో ఛాన్స్ ఇచ్చేందుకు సిద్దంగా లేరని అంటున్నారు.  మీటలు నొక్కి నోట్లు  వేశాం.. ఓట్లేందుకు  వేయరు  అంటూ జగన్ రెడ్డి తమను కట్ట బానిసల కంటే హీనంగా చూపుతున్నారని, పేదరికాన్ని పరిహాసం చేస్తున్నారని. అందుకే జగన్ రెడ్డికి సెకండ్ ఛాన్స్ ఇచ్చేదే లేదని  అంటున్నారని  వైసేపీ క్యాడర్ అంటున్నారు. అందుకే, జగన్ రెడ్డికి సెకండ్ ఛాన్స్ .. అంటే ఇచ్చేదే లే.. అనే సమాధానమే ఏపీ అంతటా వినిపిస్తోంది.

ధర్మాన మాటల మర్మమేంటి?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి  జగన్ రెడ్డిలో వైనాట్ 175 ధీమా పూర్తిగా అడుగంటిపోయింది. అయినా బింకంగా ఈ తొమ్మది నెలలూ కష్టపడి పని చేద్దాం.. విజయం మనదే అని పార్టీ నేతలకు, క్యాడర్ కు చెప్పుకుంటూ వస్తున్నారు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే పని చేయండంటూ వారిని బతిమలాడుకుంటున్నారు. అయితే ఆయన కేబినెట్ లో మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలూ, నాయకుల మాటలు మాత్రం పార్టీ పరాజయం ఇప్పటికే ఖరారైపోయిందన్నట్లు మాట్లాడుతున్నారు. తాజాగా  రాష్ట్ర స్టాంప్లు, రిజిస్ట్రేషన్ల శాఖ మంత్రి ధర్మన ప్రసాదరావు   శ్రీకాకుళంలో  చేసిన వ్యాఖ్యలు పార్టీ పరువును నిలువుగా గంగలో ముంచేశాయి. ఇంతకీ ఆయనేమన్నారంటే గత నాలుగేళ్లుగా వైసీపీ కార్యకర్తలు  ఆర్థికంగా బాగా చితికిపోయారు. జగన్  అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి పార్టీ కార్యక్రమాల కోసం.. స్థానిక నేతలు, కార్యకర్తలు సొంత సొమ్ము ఖర్చు చేస్తూ వచ్చారు. ప్రభుత్వం కానీ, పార్టీ కానీ వారిని కనీసం పట్టించుకోలేదని  ధర్మాన ప్రసాదరావు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఎక్కడి నుంచో వస్తున్న నగదుతో  స్థానికంగా సమావేశాలు పెట్టడం లేదని.. కార్యకర్తల చేతి చమురు వదుల్చుకుని కార్యక్రమాలను చేపడుతున్నారని అన్నారు.     మరోవైపు గత మార్చిలో శ్రీకాకుళంలో వైఎస్ఆర్ ఆసరా పథకం కింద నిధుల పంపిణీ కార్యక్రమంలో ఇదే ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ.. మగాళ్లు పోరంబోకులని.. తినేసి వెళ్లిపోతారని, ఇంటిని నడిపేది ఇల్లాలేనని.. అందుకే ఆమె పేరుతో ప్రభుత్వం పథకాలు అందిస్తోందని చెప్పారు.  ఇటీవల కాలంలో మంత్రి ధర్మాన ప్రసాదరావు ఏం మాట్లాడినా  వార్తల్లో  నిలుస్తున్నారు. ఎందుకంటే ఆయన మాటలు పార్టీని ఇబ్బందుల్లోకి నెట్టేలా  ఉంటున్నాయి.    అయితే ధర్మాన లాంటి సీనియర్ రాజకీయ నాయకుడు ఏదో యథాలాపంగా, నోరు జారీ పార్టీకి నష్టం చేసేలా మాట్లడడమేమిటన్న ఆశ్చర్యం పార్టీ వర్గాల్లో వ్యక్తమౌతోంది. అదే సమయంలో వారిలో  తనలో పార్టీ పట్ల, పార్టీ అధినేత పట్ల పేరుకున్న అసంతృప్తిని ఈ విధంగా వెళ్లగక్కుతున్నారా అన్న అనుమానాలూ వ్యక్తమౌతున్నాయి.  అదీ కాక తన రాజకీయ వారసుడిగా తనయుడు మనోహర నాయుడికి పార్టీ టికెట్ కోసం ధర్మాన చేసిన విజ్ణప్తిని సీఎం, పార్టీ అధినేత జగన్ నిరాకరించడం వల్లే ధర్మాన ప్రసాదరావు  పార్టీకి చేటు కలిగేలా వ్యాఖ్యలు చేస్తున్నారన్న సందేహమూ వైసీపీ శ్రేణుల్లో వ్యక్తమౌతోంది. 

ప్రజాస్వామ్య విలువలకు బాబు పట్టం!

హత్యా రాజకీయాలే రాజ్యమేలుతున్న నేటి రోజులలో వాటికి దూరంగా ఉంటూ రాజకీయాలలో విలువలకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్నారు తెలుగుదేశం అధినేత చంద్రబాబు. ప్రత్యర్థులపై ప్రతీకార దాడులకు పాల్పడాలని కోరుకునే సొంత పార్టీ నేతలను సైతం మందలిస్తూ తన ఔన్నత్యాన్ని చాటుకుంటున్నారు. అందుకు సంబంధించి కొండా మురళి, కొండా సురేఖ దంపతులు ఇటీవల ఓ టెలివిజన్ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పిన విషయం ఇప్పుడు సోషల్ మీడియాలోనూ, ప్రసారమాధ్యమాలలోనూ వైరల్ అయ్యింది. చంద్రబాబు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్  ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తెలుగుదేశం కీలక నేత, ఎమ్మెల్యే ఒకరు చంద్రబాబును తన నియోజకవర్గంలో ప్రత్యర్థిగా ఉన్న ఒక విపక్ష నేత ఎలిమినేషన్ ప్రతిపాదన చేశారు. దీనిపై చంద్రబాబు చాలా సీరియస్ గా స్పందించారు. ఏం తమాషాగా ఉందా.. హత్యా రాజకీయాలు ప్రజాస్వామ్యంలో ఉండవు. అటువంటి ఆలోచనలనే నీ మనసులోంచి తుడిచేయ్ అని మందలించారు. ఈ విషయాన్ని స్వయంగా ఆ ప్రత్యర్థే తన నోటితో చెప్పారు. ఇంతకీ తన ప్రత్యర్థిని ఎలమినేట్ చేయాలన్న అప్పటి తెలుగుదేశం ఎమ్మెల్యే ఎవరంటే ప్రస్తతం బీఆర్ఎస్ నాయకుడు, తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు. ఆయన హత్య చేయమన్నది ఎవరినంటే.. అప్పట్లో ఎమ్మెల్యే అయిన కొండా సురేఖ భర్త కొండా మురళిని. ఈ విషయాన్ని కొండా సురేఖ దంపతులు స్వయంగా ఒక టీవీ ఇంటర్వ్యూలో తమ నోటితో చెప్పారు. ఇంతకీ కొండ మురళీ, కొండ సురేఖ.. సదరు ఇంటర్వ్యూలో  ఏమన్నారంటే..  ప్రస్తుతం చంద్రబాబు పాలనతో వైయస్ జగన్ పాలన పోల్చుకుంటే. చంద్రబాబు పాలన వంద శాతం గుడ్  అని వారు స్పష్టం చేశారు. అలాగే తనను ఎన్‌కౌంటర్ చేయాలన్నప్పుడు..ఓ ఎమ్మెల్యే భర్త విషయంలో తాను అలా చేయలేనని చంద్రబాబు కరాఖండీవగా చెప్పారని.. అదే వీరైతే.. అంటే వైయస్ జగన్ ప్రభుత్వం  తనను వందశాతం ఎన్ కౌంటర్ చేయించేదని కొండా మురళి వివరించారు. సరిగ్గా అదే సమయంలో కొండా సురేఖ జోక్యం చేసుకుని ఎర్రబెల్లి దయాకర్ పోయి.. సీఎం చంద్రబాబు కాళ్ల మీద పడితే.... ఆయన స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా  ఎం మాట్లాడుతున్నావ్ దయాకర్.. దేనికైనా ఓ లిమిట్ ఉంటుంది.. ఓ ఎమ్మెల్యే భర్తను చంపడం అంటే అంత ఈజీ అనుకున్నావా? ఇంకా ఏమైనా మాట్లాడు కానీ.. ఇది కుదరదని  ముఖం మీదే చంద్రబాబు క్లియర్ కట్‌గా చెప్పారని.. ఆ సమయంలో అక్కడ ఉన్నవారు.. ఆ తర్వత తమతో  ఈ విషయం చెప్పారని కొండా సురేఖ స్వయంగా స్పష్టం చేశారు. ఇదే అంశంలో వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి  జగన్ అయితే... మురళిని ఎన్ కౌంటర్ చేసేసేవారని కొండ సురేఖ అదే ఇంటర్వ్యూలో చెప్పారు.  తెలుగుదేశం అధినేత , విపక్ష నేత చంద్రబాబు నాయుడు అంటే.. హైదరాబాద్‌లో ఐటీ రంగం అభివృద్ధికి, సైబరాబాద్ నిర్మాణానికి దోహదపడిన వ్యక్తిగా అంతా భావిస్తారు. ఇక ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి  జగన్ మోహన్ రెడ్డి అండ్ కో అయితే ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుపై గత నాలుగేళ్లుగా విమర్శలు గుప్పిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అందుకోసం.. జగన్ తొలి కేబినెట్‌లోని మంత్రులే కాదు.. జగన్ మలి కేబినెట్‌లోని మంత్రులు సైతం.. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపై తమ మాటలతో విరుచుకుపడిపోతారన్న విషయం విదితమే.  అలాంటి వేళ.. టీడీపీ అధినేత చంద్రబాబు, ఫ్యాన్ పార్టీ అధినేత  జగన్ వ్యవహార శైలినే కాదు.. వీరిద్దరి మధ్య తారతమ్యాలను సైతం కొండ మురళి దంపతులు వివరించిన విషయం ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

టీ ‘కాంగ్రెస్’ కప్పులో షర్మిల తుపాను!

తెలంగాణ రాజకీయాలు రోజురోజుకు వేడెక్కుతున్నాయి. కొత్త ఎత్తులు, కొత్త పొత్తులు తెరపై కొస్తున్నాయి. సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ముఖ్యంగా కర్ణాటక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అద్భుత విజయంతో లెక్కలు మారిపోయాయి. అంత వరకు తెలంగాణ రాజకీయాల్లో మూడవ స్థానంలో ఉందని అనుకున్న హస్తం పార్టీని విశ్లేషకులు  పై మెట్టుకు తీసుకుపోయారు. బీజేపీని మూడవ స్థానంలోకి నెట్టేశారు. అదే సమయంలో బీజేపీలో అంతవరకు కొంత గుంభనంగా ఉన్న అంతర్గత విభేదాలు, ఒక్కసారిగా భగ్గుమన్నాయి. అలకలు,లుకలుకలు బయట కొచ్చాయి. అన్నిటికంటే ముఖ్యంగా పార్టీ అధ్యక్షడు బండి సంజయ్, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మధ్య పార్టీ నేతలు గీతలు గీసుకున్నారు. రెండుగా విడిపోయారు. రహస్య భేటీలు, నాయకుల ఢిల్లీ యత్రాలతో మీడియా కథనాలు, మేథావుల విశ్లేషణలతో బీజేపీ ఇమేజ్  డ్యామేజైంది. దీనికి తోడు గత నాలుగైదు నెలలకు పైగా, ఇటా అటా అని ఊగిసలడుతున్న బీఆర్ఎస్ బహిష్కృత నాయకులు  మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి శ్రీనివాస రావు  చివరకు హస్తంతో చేతులు కలిపేందుకు  సిద్దమవడంతో కాంగ్రెస్ పార్టీ ఇమేజ్ ఇంకొంత పెరిగింది. బండిని మార్చేది లేదని బీజేపీ నేతలు స్పష్టం చేసినా  రాష్ట్రకార్యవర్గాన్ని విస్తరించినా, ఫలితం కనిపించడం లేదు.    అయితే  కర్ణాటక విజయంతో మంచి ఊపు మీదున్న కాంగ్రెస్ పార్టీలో అంతా బాగుందా?  విభేదాలు తొలిగి పోయాయా?  అంటే  లేదనే సమాధానమే వస్తోంది. నిజానికి, కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం కనిపిస్తున్న ప్రశాంతత తుపాను ముందు ప్రశాంతత మాత్రమే, అనే మాటలు వినిపిస్తున్నాయి. కర్ణాటక ఫలితాలు తెలంగాణ కాంగ్రెస్ లో జోష్ ను పెంచాయి కానీ  అదే సమయంలో తెలంగాణ పార్టీ వ్యవహారాల్లో కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు, ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ప్రమేయం పెరగడం టీ పీసీసీ అధ్యక్షడు రేవంత్ రెడ్డి వర్గాన్ని ఆందోళనకు గురిచేస్తోందని అంటున్నారు. ముఖ్యంగా వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు  దివంగత కాంగ్రెస్ నాయకుడు వైఎస్సార్ కుమార్తె వైఎస్ షర్మిల తమ పార్టీని ని కాంగ్రెస్ లో విలీనం చేస్తున్నారని వస్తున్న వార్తలు పార్టీలో దుమారం రేపుతున్నాయి. నిజానికి  కర్ణాటక ఎన్నికలకు ముందు బీజేపీలో కనిపించిన ప్రశాంతతే ఇప్పడు కాంగ్రెస్ లో కనిపిస్తోందని అంటున్నారు. షర్మిల విషయంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వ్యక్తం చేసిన అభ్యంతరం  పార్టీలో ఇప్పడు చర్చనీయాంశంగా మారింది. కాగా  కర్ణాటక ఫలితాలు వెలువడిన వెంటంటే షర్మిల బెంగుళూరు వెళ్ళారు. డీకే శివకుమార్ ను కలిసి అభినందనలు తెలిపారు. అలాగే  అది జరిగిన వారం పదిరోజుల వ్యవధిలో  ఆమె మరో మారు బెంగుళూరు వెళ్లి  డీకే శివకుమార్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఇక అక్కడి నుంచి షర్మిల వైఎస్సార్ – టీపీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తున్నారని  టీపీసీసీ పగ్గాలు చేపట్టనున్నారనే ప్రచారం మొదలైంది. అయితే ఆమె ఆ వార్తలను ఖండిచారు. అయినా షర్మిల విషయంలో కాంగ్రెస్ పార్టీలో  గందరగోళం కొనసాగుతూనే వుంది. ఆమెను పార్టీలోకి ఆహ్వానించే విషయంలో అభిప్రాయ బేధాలు భగ్గుమంటున్నాయి. వైఎస్సార్ తో కలిసి పనిచేసిన సీనియర్ నాయకులు షర్మిలకు స్వాగతం పలుకుతున్నారు.  షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరితే స్వాగతిస్తామని టీపీసీసీ మాజీ అధ్యక్షడు  ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా ప్రకటించారు. మరోవైపు డీకే శివకుమార్  ద్వారా రేవంత్ రెడ్డికి చెక్ పెట్టేందుకు షర్మిలను అస్త్రంగా ప్రయోగిస్తున్నారని రేవంత్ రెడ్డి వర్గం ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి, తాజాగా తాను పీసీసీ అధ్యక్షునిగా ఉన్నంతవరకు తెలంగాణలో షర్మిల రాజకీయాలు సాగనీయనని తేల్చి చెప్పారు.  ఒక విధంగా శపథమే చేశారు. ప్రత్యేక రాష్ట్రం తెచ్చుకున్నదే ఆంధ్ర పాలన నుంచి విముక్తి కోసం. ఇప్పుడు రాష్ట విభజనకు వ్యతిరేకంగా పనిచేసిన ఆంధ్ర పాలకులను ఎలా పార్టీలో చేర్చుకుంటాం  అని ప్రశ్నిస్తున్నారు. ఏపీకి చెందిన షర్మిల వచ్చి తెలంగాణలో నాయకత్వం వహిస్తానంటే ఎలా ఊరుకుంటామంటూ నిప్పులు చెరిగారు. షర్మిల ఏపీ కాంగ్రెస్‌కి పని చేస్తే స్వాగతిస్తానంటూ హితవు పలికారు. షర్మిల ఏపీసీసీ చీఫ్‌గా పని చేస్తే.. సహచర పీసీసీ అధ్యక్షునిగా వెళ్లి ఆమెను మర్యాదపూర్వకంగా కలుస్తానని చెప్పుకొచ్చారు. అంతే కానీ.. తెలంగాణలో ఆమె నాయకత్వంలో పనిచేసేది లేదని కుండబద్దలు కొట్టేశారు.  తాను కాంగ్రెస్ లో   ఉన్నంత వరకు  షర్మిల నాయకత్వం తెలంగాణలో రానివ్వనని రేవంత్ రెడ్డి స్పష్తం  చేశారు. అదలా ఉంటే  రాహుల్ గాంధీ, ప్రధానంగా 2024 లోక్ సభ ఎన్నికలపై దృష్టిని కేద్రీకరించినందున, ఈ సవత్సరం చివర్లో  తెలంగాణ సహా జరిగే ఐదు రాష్త్రాల అసెంబ్లీ ఎన్నికల బాధ్యతలను కాంగ్రెస్ అధిష్టానం ప్రియాంకా వాద్రా అప్పగించినట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే ఆమె ఇప్పటికే మధ్య ప్రదేశ్ లో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. అలాగే త్వరలో తెలంగాణలోనూ ప్రియాంక పర్యటించనున్నారు. ముఖ్యంగా జూపల్లి, పొంగులేటి సహా మరికొందరు ముఖ్య నాయకుల చేరికలు ఆమె సమక్షంలో అదీ కూడా నల్గొండ వేదికగా జరగనున్నాయని అంటున్నారు. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీతో ఉన్న  సన్నిహిత సంబంధాలతో ఇంతకాలం సీనియర్ నాయకులపై పైచేయి, సాధిస్తూ వచ్చిన రేవంత్ రెడ్డిపై  ఇక   సీనియర్ నాయకులు  పైచేయి సాధించే  అవకాశం లేక పోలేదని అంటునారు. అందుకే  రేవంత్ రెడ్డి తాను పీసీసీ చీఫ్ గా ఉన్నంత వరకు షర్మిలను గాంధీ భవన్ మెట్లు ఎక్కనీయనని శపధం చేశారని అంటున్నారు.

అమిత్ షా తెలంగాణ పర్యటన రద్దు

తెలంగాణలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా పర్యటన రద్దు అయింది. బిఫోర్ జాయ్ తుఫాన్ నేపథ్యంలో అమిత్ షా పర్యటన రద్దు అయినట్లు.. బీజేపీ వర్గాలు తెలిపాయి. ఖమ్మంలో భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు అన్నీ పూర్తి అయినప్పటికీ.. రాజకీయాల కంటే ప్రజలను కాపాడుకోవడం ముఖ్యమని .. ఈ తుపాన్ తీవ్రత గుజరాత్, మహారాష్ట్రలో తీవ్రంగా ఉందని.. అందుకే ఖమ్మం సభను వాయిదా వేసినట్లు బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వెల్లడించారు.   ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం అమిత్ షా బుధవారం  (జూన్ 14)  రాత్రి హైదరాబాద్ చేరుకోవాల్సి ఉంది. గురువారం (జూన్ 15)  ఖమ్మంలో జరిగే సభకు ఆయన హాజరుకావాల్సి ఉంది. అదే రోజు ఉదయం  తెలంగాణకు చెందిన బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులతో ఆయన భేటీ కావాల్సి ఉంది.  అలాగే టాలీవుడ్ ప్రముఖ నటుడు ప్రభాస్‌, ప్రముఖ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి, అలాగే ఒక పత్రికాధిపతితో  సమావేశం కావాల్సి ఉంది. అయితే అమిత్ షా పర్యటన రద్దు కావడంతో.. ఈ భేటీలు, సమావేశాలన్నీ రద్దయ్యారు.   అమిత్ తెలంగాణ పర్యటన ఎప్పుడు అనేది బీజేపీ మరికొద్ది రోజుల్లో ప్రకటించే అవకాశం ఉంది.      ఈ ఖమ్మం వేదికగా జరిగే సభలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితోపాటు ఆయన అనుచరులు భారీ సంఖ్యలో కమలం తీర్థం పుచ్చుకొనేందుకు ఇప్పటికే రంగం సిద్దమైంది. కానీ అమిత్ షా పర్యటన ఆగిపోవడంతో.. వీరి చేరికలు సైతం ఆగాయి. అయితే సాధ్యమైనంత త్వరలో ఖమ్మం వేదికగా బీజేపీ భారీ సభ నిర్వహించి.. వారికి పార్టీ కండువా కప్పే కార్యక్రమం ఉంటుందని సమాచారం.

అవినాష్ ను జగన్ కాపాడుతున్నారు.. సుప్రీంలో సునీత

వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డికి  తెలంగాణ హైకోర్టు మధ్యంతర బెయిలు మంజూరు చేయడాన్ని సుప్రీం కోర్టు తప్పుపట్టింది. తెలంగాణ హైకోర్టు అవినాష్ కు మధ్యంతర బెయిలు మంజూరు చేయడంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. తొలుత అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు మధ్యంతర బెయిలు మంజూరు చేయడాన్ని సవాల్ చేస్తూ వివేకా కుమార్తె సునీత సుప్రీంను ఆశ్రయించగా గత ఏప్రిల్ 20 ఆమె పిటిషన్ ను సుప్రీం విచారించి.. ఆ మధ్యంతర బెయిలుపై స్టే విధించింది.  ఆ సందర్భంగా తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఇలాంటి తీర్పులు కూడా ఉంటాయా అని   వ్యాఖ్యానించింది. ఇది ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదని  పేర్కొంది. ఆ సందర్భంగా తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీం చేసిన వ్యాఖ్యలు వైఎస్ అవినాష్ రెడ్డికి గట్టి ఎదురుదెబ్బగానే భావించాల్సి ఉంటుంది. అయితే ముందస్తు బెయిలు పిటిషన్ తెలంగాణ హైకోర్టులో పెండింగ్ లో ఉందన్న సాంకేతిక అంశాన్ని ఆసరాగా చేసుకుని అవినాష్ అప్పట్లో అరెస్టును తప్పించుకున్నారు. అయితే  అప్పట్లో ఈ కేసు విచారణ సందర్భంగా సునీత సుప్రీం కోర్టు ఎదుట పలు కీలక అంశాలను ప్రస్తావించారు. తొలి సారిగా తన తండ్రి హత్య కేసు దర్యాప్తునకు ఏపీ సర్కార్ ఉద్దేశపూర్వకంగా అడ్డుకుంటోందని సునీత ఆరోపించారు. అవినాష్ రెడ్డిని ఏపీ సీఎం జగన్ కాపాడుతున్నారని కూడా సునీత తన పిటిషన్ లో పేర్కొన్నారు. అంతే కాకుండా తన పిటిషన్ లో ఏపీ సీఎం, తన సోదరుడు అయిన జగన్ పై కూడా సునీత ఆరోపణలు చేశారు. ఒక వైపు కేసు దర్యాప్తు జరగుతుండగానే సీఎం హోదాలో అసెంబ్లీలో జగన్ అవినాష్ రెడ్డికి క్లీన్ చిట్ ఇచ్చారని సునీత తన పిటిషన్ లో పేర్కొన్నారు. సాక్షాత్తూ ముఖ్యమంత్రే నిందితుడికి క్లీన్ చిట్ ఇవ్వడమేమిటని పేర్కొన్న ఆమె.. ఈ కేసు దర్యాప్తు సజావుగా సాగకుండా రాష్ట్ర ప్రభుత్వం సకల యత్నాలు చేసిందని ఆరోపించారు.  మొత్తం మీద హైకోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ సునీత దాఖలు చేసిన పిటిషన్ విచారణ సందర్భంగా   అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు ఇచ్చిన బెయిలు ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదని సుప్రీం కోర్టు విస్పష్టంగా తేల్చేసింది.  సరే ఆ తరువాత అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు షరతులతో కూడిన ముందస్తు బెయిలు లభించడం, ఆయనను అరెస్టు చేయాలనుకుంటే అరెస్టు చేసి వెంటనే పూచికత్తుపై విడుదల చేయాలని తెలంగాణ కోర్టు పేర్కొనడంతో సీబీఐ అవినాష్ ను అరెస్టు చేసి ఆ వెంటనే పూచీకత్తుపై విడుదల చేసింది అది వేరే సంగతి. అయితే సునీత సుప్రీంలో తన పిటిషన్ లో పేర్కొన్న అంశాలనే సీబీఐ తెలంగాణ హైకోర్టులో అవినాష్ ముందస్తు బెయిలు పిటిషన్ ను వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన అఫిడవిట్లో పేర్కొంది. ఈ కేసులో జగన్ పేరును సీబీఐ తొలిసారిగా  ప్రస్తావించింది. వివేకా హత్య సంగతి ఏపీ సీఎం జగన్ కు ముందుగానే తెలుసునన్నది తన దర్యాప్తులో తేలిందనీ, దానిని నిర్ధారించురకోవాలంటే అవినాష్ ను అరెస్టు చేసి విచారించాల్సిందేననీ కూడా ఆ అఫిడవిట్ లో స్పష్టం చేసింది. అయితే అవినాష్ కు తెలంగాణ హైకోర్టు ముందస్తు బెయిలు మంజూరు చేయడాన్ని సవాల్ చేస్తూ సునీత మళ్లీ సుప్రీంలో దాఖలు చేసిన పటిషన్ లో సీబీఐ ఇంప్లీడ్ కాలేదు. సునీత పిటిషన్ ఈ నెల 19న సుప్రీం ముందుకు రానున్న నేపథ్యంలో సీబీఐ ఏం చేస్తుందన్నదానిపై అందరి ఆసక్తి నెలకొని ఉంది. 

కూటములు.. కూడికలు.. తీసివేతలు

రాజకీయాలలో శాశ్వత మిత్రులు ఉండరు, శాశ్వత శతృవులు ఉండరు. కానీ శాశ్వత ప్రయోజనాలు ఉంటాయి. అందుకే రాజకీయ శతృ, మిత్ర సంబంధాలు ఎప్పటికప్పుడు మారి పోతుంటాయి. బీజేపీ విషయాన్నే తీసుకుంటే, ఒకప్పడు కమల దళం సారథ్యంలో ఏర్పడిన ఎన్డీఎ కూటమిలో భాగస్వామ్య పార్టీలుగా ఉన్న మిత్ర పక్షాలు చాలా వరకు ఇప్పుడు ఆ కూటమిలో లేవు. వాజ్ పేయి హయాంలో దాదాపు 30 వరకూ ఉన్న ఎన్డీయే భాగస్వామ్య పర్టీలలో చాలా పార్టీలు ఇప్పుడు బీజేపీతో కలిసి నడవడం లేదు. ఎన్డీయే నుంచి బయటకు వచ్చేశాయి. వాజ్ పేయి మిత్ర ధర్మాన్నీ, సంకీర్ణ ధర్మాన్నీ మనసా వాచా కర్మణా అనుసరించారు. అందుకే మధ్యమధ్యలో పొరపొచ్చాలు వచ్చినా ఎన్డీయే సర్కార్ కు ఆయన అయిదేళ్లూ సారథ్యం వహించి విజయవంతంగా నడిపించారు.   ఇక 2014లో సంపూర్ణ మెజారిటీ సాధించినా మోడీ కూడా సంకీర్ణ ప్రభుత్వమే ఏర్పాటు చేశారు. 2019 ఎన్నికలలో అంతకు మించి మెజారిటీ స్థానాలు సాధించినా మోడీ సంకీర్ణ ప్రభుత్వం వైపే మొగ్గు చూపారు. అయితే ప్రస్తుత మోడీ సర్కార్ లో బీజేపీయేతర పార్టీల కు చెందిన మంత్రుల సంఖ్య రెండూ మూడుకు మించలేదు. అలాగే మోడీ హయాం వచ్చిన తరువాత ఎన్డీయే నుంచి మిత్రపక్షాలు ఒక్కటొక్కటిగా బయటకు వెళ్లిపోయాయి.  ప్రస్తుతానికి మిగిలిన పార్టీలు చాలా చాలా తక్కువ.  వాజ్ పేయి హయాంలో బీజేపీకి అత్యంత విశ్వసనీయ మిత్రపక్షంగా గుర్తింపు పొందిన తెలుగుదేశం.. మోడీ ప్రధానిగా ఉన్న సమయంలో కూడా అదే పాత్ర పోషిస్తుందని భావించినా.. ఆ మైత్రి పూర్తిగా ఐదేళ్లూ సాగలేదు. ఇందుకు మోడీ వ్యవహారశైలి, అహంభావంతో వ్యవహరించడమే కారణం.  ఒకప్పుడు బీజేపీకి అత్యంత విశ్వసనీయ మిత్ర పక్షంగా ఉన్న తెలుగుదేశం మొదలు భావసారుప్యత ఉన్న శివసేన, అకాలీ దళ్ సహా అనేక పార్టీలు  బయటకు వెళ్లి పోయాయి. వెళ్లిపోయాయి అనడం కంటే  ఆయా పార్టీలకు మోడ్ షా జోడీ, పొమ్మన కుండా పొగబెట్టి బయటకు పంపారని  చెప్పాలి.  2014ఎన్నికల తర్వాత రెండేళ్ళకే మిత్రపక్షాలకు ఎన్డీయేలో ఉక్కపోత మొదలైంది. బీజేపీకి మిత్రపక్షంగా ఉంటే ఆ పార్టీ తమను కబలించేయడం తథ్యమని అవగతమైంది. ఇక  2019  ఎన్నికల్లో బీజేపీ సొంత బలం మరింతగా పెరిగి 303 కు చేరిన నేపధ్యంలో  మోడీ షా డబులింజన్ మిత్ర పక్షాలను మెల్ల మెల్లగా సాగనంపే వ్యూహానికి మరింత పదును పెట్టింది. 2019 ఎన్నికల్లో, శివసేన, రామ్ విలాస్ పాశ్వాన్ పార్టీ లోక్ జన శక్తి, అకాలీ దళ్, అన్న డీఎంకే, జేడీ(యు)తో పాటుగా అప్నా దళ్, ఆల్ ఝార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్ వంటి చిన్నాచితక పార్టీలు సహా మొత్తం తొమ్మిది పార్టీలు ఎండీఎ కూటమిలో ఉన్నాయి. ఎన్నికలో పోటీ చేసి, గెలిచాయి. అయితే ఆ తర్వాత రెండు సంవత్సరాలకే ప్రధాన మిత్ర పక్షాలు. శివసేన, అకాలీ దళ్, ఎల్జీపీ  ఇలా ఒకొక్క పార్టీ  బయటకు వెళ్లి పోయాయి. అలా వెళ్ళిపోయిన పార్టీలను అయినా, బీజేపీ వదిలేయలేదు. ఎల్జీపీని రెండు ముక్కలు చేసింది. ఒక వర్గాన్ని చేరదీసి రెండవ వర్గాన్ని నిర్వీర్యం చేసింది. ఇప్పుడు ఎల్జీపీ అస్తిత్వం కోల్పోయింది.  రేపో మాపో  బీజేపీలో విలీనం కావడమే తరువాయి అన్నట్లుగా పరిస్థితి ఉంది. ఇక మహారాష్ట్రలో శివసేన పరిస్థితి తెలిసిందే. బీజేపీ ప్లాన్ సంపూర్ణం అయితే  శివసేన సైతం త్వరలోనే  చరిత్రగా మిగిలిపోతుంది.   బీహార్ ముఖ్యమంత్రి  జేడీయు నేత నితీష్ కుమార్ కూ పొగపెట్టినా ఆయన తెలివిగా ముందే మేల్కొని ఎన్డీయే నుంచి బయటకు వచ్చి ముఖ్యమంత్రి పదవిని నిలబెట్టుకున్నారు.   ఇలా సంకీర్ణ ధర్మానికి తిలోదకాలిచ్చి, మిత్రధర్మాన్ని విస్మరించి భాగస్వామ్య పక్షాలను నిర్వీర్యం చేసే క్రతువును గత ఎనిమిదేళ్లుగా నిర్విఘ్ణంగా కొనసాగించిన బీజేపీకి 2024 సార్వత్రిక ఎన్నికల ముంగిట మరో సారి సంపూర్ణ అధికారంతో కేంద్రంలో అధికారం చేజిక్కించుకోవడం కష్టసాధ్యమన్న సంకేతాలు బలంగా కనిపించడంతో మళ్లీ మిత్రపక్షాల కోసం వల విసురుతోంది. స్వయంగా దూరం చేసుకున్న తెలుగుదేశం వంటి పార్టీలను దువ్వుతోంది. నీకిది..నాకిది అన్న చందంగా బేరసారాలు సాగిస్తోంది. అయితే  గత ఎనిమిదేళ్లుగా ఎన్డీయే భాగస్వామ్యపక్షాల విషయంలో బీజేపీ తీరును గమనించిన ప్రాంతీయ పార్టీలు బీజేపీకి దగ్గరై మరో సారి బలహీనమవ్వడానికి ముందుకు వస్తాయా అని పరిశీలకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మిత్రపక్షాల అస్థిత్వాన్ని దెబ్బతీసి, వాటిని నిర్వీర్యం చేసే ఎత్తుగడలను గత ఎనిమిదేళ్లుగా దగ్గర నుంచి చూసిన రాజకీయ పార్టీలు సాధ్యమైనంత వరకూ బీజేపీకి దూరంగా ఉండడమే మేలని భావిస్తున్నాయని విశ్లేషిస్తున్నారు. ఈ కారణంగానే బీజేపీ తనంత తానుగా స్నేహహస్తం చాచినా అందుకోవడానికి పార్టీలు ముందు వెనుకలాడు తున్నాయంటున్నారు. 

బీఆర్ఎస్ పై ఐటీ పంజా.. షా పర్యటన ముందు రాజకీయ హీట్

తెలంగాణ బీఆర్ఎస్ కీలక నేతల నివాసాలు, కార్యాలయాలపై ఇన్ కంట్యాక్స్ దాడులు కలకలం రేపాయి. వరుసగా ముగ్గురు కీలక నేతల ఇళ్లు, ఆఫీసులు, వ్యాపార సంస్థల్లో  ఐటీ దాడులతో ఒక్క సారిగా రాజకీయ వేడి రగులుకుంది. ఇటీవలి కాలంలో  రాష్ట్రంలో ఐటీ దాడుల సంఖ్య తగ్గిపోయింది. మరీ ముఖ్యంగా కొంత కాలం కిందట బీఆర్ఎస్ నాయకులే లక్ష్యంగా జరిగిన దాడుల తీవ్రత  పూర్తిగా తగ్గిపోవడం వెనుక బీజేపీ  కేసీఆర్ కూడా విమర్శలు బంద్ చేయడమే కారణమన్న చర్చ పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలోనే ఒకే సారి ముగ్గురు బీఆర్ఎస్ కీలక నేతలు లక్ష్యంగా ఐటీ దాడులు జరగడం సంచలనం సృష్టించింది.  భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి, నాగర్ కర్నూలు ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిల నివాసాలు, కార్యాలయాలలో  దాదాపు 50 ఐటీ బృందాలు సోదాలు చేపట్టారు. వీరి  నగదు లావాదేవీలపైన ఐటీ అధికారులు దృష్టి పెట్టారు. ఈ  ముగ్గురూ   బీఆర్ఎస్ కి చెందిన నగదును తమ వ్యాపార సంస్థల ద్వారా సర్క్యూలేట్ చేస్తున్నారన్న ఆరోపణలతో సోదాలు జరుగుతున్నట్లు చెబుతున్నారు. మర్రి జనార్ధన్ రెడ్డికి.. వస్త్ర, జ్యూయలరీ వ్యాపారాలు ఉన్నాయి.  కొత్త ప్రభాకర్ రెడ్డి సీఎం నియోజకవర్గం గజ్వేల్ ను చూసుకుంటున్నారు. సీఎం తరపున ఆయనే అన్నీ చక్క బెడుతూ ఉంటారు. పైళ్ల శేఖర్ రెడ్డికి రియల్ ఎస్టేట్ కంపెనీలతో పాటు కంపెనీలు కూడా ఉన్నాయని చెబుతున్నారు.  ఈ నేపథ్యంలోనే ఈ ముగ్గురి నివాసాలు కార్యాలయాలపై ఐటీ దాడులు బీఆర్ఎస్ లో కలకలం రేపుతున్నాయి.  రాష్ట్రంలో బీఆర్ఎస్ నేతలపై దర్యాప్తు సంస్థలు నజర్ ఇటీవలి కాలంలో  బీజేపీతో ఆ పార్టీ  ఒక అవగాహనకు వచ్చిందన్న ప్రచారం ఇటీవలి కాలంలో  జోరుగా సాగుతుండటం అదీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. కమలం  పార్టీకి ఒకింత ఇబ్బందికరంగా మారింది. ఒక వైపు కేసీఆర్ మోడీ, బీజేపీ లక్ష్యంగా విమర్శలకు చుక్క పెట్టేయడం, అదే సమయంలో ఢిల్లీ మద్యం కుంభకోణంలో తెలంగాణ సీఎం కల్వకుంట్ల  చంద్రశేఖరరావు కుమార్తె కవితపై దర్యాప్తు  సంస్థల విచారణ వేగం మందగించడంతో బీజేపీ, బీఆర్ఎస్ లు ఒక గూటి పక్షులే అన్న భావన పొలిటికల్ సర్కిల్స్ లో వ్యక్తం అయ్యింది.   అయితే ఇప్పుడు ఐటీ అధికారులు ముగ్గురు బీఆర్ఎస్ నేతల నివాసాలూ , కార్యాలయాల్లో  సోదాలు  నిర్వహిస్తుండటం, ఆ సోదాలు  చేస్తున్న ఐటీ అధికారులు కేంద్ర బలగాలను భద్రతగా  తెచ్చుకోవడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. పైగా ఈ సోదాలు కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటనకు సరిగ్గా  ఒక్క రోజు ముందు జరగడం ఆ ప్రాధాన్యతను మరింత పెంచింది.  కొండాపూర్ లోని లుంబిని ఎస్ఎల్ఎన్ స్ప్రింగ్స్ విల్లాస్ లోని కొత్త ప్రభాకర్ రెడ్డి నివాసంలో  బుధవారం (జూన్14) తెల్లవారుజాము నుంచే సోదాలు జరుగుతున్నాయి. అదే సమయంలో ఆయన కార్యాలయాలలో కూడా  సోదాలు జరుగుతున్నాయి. అలాగే జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 36లోని మర్రి జనార్దన్ రెడ్డి ఇంటికి వెళ్లిన ఐటీ అధికారులు సోదాలను నిర్వహిస్తున్నారు. బీఆర్ఎస్ నేతలతో పాటు నగరంలోని వివిధ రియలెస్టేట్ సంస్థల కార్యాలయాలు, షాపింగ్ మాల్స్ లో కూడా రెయిడ్స్ జరుగుతున్నాయి.  

లేదు లేదంటూనే జగన్..!

ఏపీలో ముందస్తుకు అవకాశం లేదని వరుసగా జరుగుతున్న పరిణామాలతో తేటతెల్లమౌతున్నాయి. ఇదే విషయాన్ని స్వయంగా ఏపీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి కుండబద్దలు కొట్టినట్లు చెప్పేశారు. అన్నిటికీ మించి కేంద్ర ఎన్నికల సంఘం ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలలో  సన్నాహాలు ప్రారంభించేయడమే కాకుండా ఆయా రాష్ట్రాలలో వివిధ రాజకీయ పార్టీలతో సమావేశాల ప్రక్రియ షురూ కూడా చేసేసింది. ఈ పరిస్థితుల్లో ఒక వేళ వద్దు వద్దు అంటున్న జగన్ ముందస్తుకు మొగ్గు చూపినా ప్రయోజనం ఉండదని పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు. ఇంత జరుగుతున్నా.. కూడా  ఏపీలో ముందస్తు చర్చకు తెరపడటం లేదు. ఒకరి తరువాత మరొకరుగా రాజకీయ పార్టీల నేతలే కాదు, పరిశీలకులు కూడా ముందస్తు చర్చను సజీవంగా ఉంచుతున్నారు. తొలుత  వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు, ఆ వెంటనే ఒక రోజు వ్యవధిలో జనసేన అధినేత పవన్ కల్యాణ్.. మళ్లీ మంగళవారం రచ్చబండలో రఘురామకృష్ణం రాజు కూడా ఏపీలో ముందస్తు ఎన్నికలు జరిగే అవకాశాలు కొట్టి పారేయలేమని అన్నారు. సాంకేతికంగా ఏపీలో ముందస్తుకు అవకాశాలు లేవని విస్పష్టంగా తెలుస్తున్నా.. రాజకీయ నాయకులు, పరిశీలకులు, చివరాఖరికి సామాన్య జనం కూడా ముందస్తు చర్చను పదే పదే ముందుకు తీసుకురావడం విశేషం.   ఇందుకు వారు చెబుతున్న కారణం రాష్ట్రంలో అమలు చేస్తున్నది  అభివృద్ధి రహిత  సంక్షేమం. ఒక్కసారి ఈ సంక్షేమ కార్యక్రమాలు నిలిచిపోయాయంటే, మళ్లీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చే అవకాశం ఇసుమంతైనా ఉండదు. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితికి..మంత్రి వేణుగోపాలకృష్ణ వ్యక్తిగత సిబ్బంది చాంబర్ కు తాళం వేయడమే నిలువెత్తు నిదర్శనం. గత ఆరు నెలలుగా జీతాలు అందని కారణంగా వారీ పని చేశారు. మంత్రి వ్యక్తిగత సిబ్బందికే వేతనాలు అందడం లేదంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థమవుతుంది. రాష్ట్ర ప్రభుత్వ పనితీరు పట్ల ఆగ్రహంతో ఉన్న కేంద్రం, దొంగ అప్పులను నివారిస్తే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏమిటన్నది తేలిపోతుందన్నారు. ఇప్పటి వరకూ  ఏదో కేంద్రం దయతో, కరుణతో అప్పులు తెచ్చుకుంటూ, తిప్పలు పడుతూ బండి లాక్కొస్తున్న జగన్  కు ముందు ముందు ఆ పరిస్థితి ఉండదు. దీంతో  సంక్షేమ పథకాలు కొనసాగించి మళ్లీ అధికారంలోకి వస్తామన్న ఆశ ముఖ్యమంత్రి రోజు రోజుకూ కొడిగడుతోంది. ఈ నేపథ్యంలోనే ఆయన ముందస్తు లేదు లేదంటూనే అందుకే మొగ్గు చూపుతారని, ఆయన కాదు లేదు అన్నారంటే ఔను, ఉంది అనే అర్ధమని అంటున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ఈ ఏడాదిలో జరిగే రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఏర్పాట్లను షురూ చేసినా.. కేంద్రం పెద్దల వద్ద తన పలుకుబడిని ఉపయోగించుకుని జగన్ అనుకున్నది సాధించుకుంటారని పరిశీలకులు చెబుతున్నారు. ఇందుకు గత నాలుగేళ్లుగా అడుగు కూడా ముందకు పడని జగన్ అక్రమాస్తుల కేసులను, ఎవరికీ లభించని విధంగా వివేకా హత్య కేసు విషయంలో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డికి లభిస్తున్న వెసులు బాట్లను ప్రస్తావిస్తున్నారు. వివేకానంద రెడ్డి హత్య కేసులో ఎనిమిదవ నిందితుడిగా అభియోగాలను ఎదుర్కొంటున్న కడప ఎంపీ  అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసి రెండు వారాలైనా సిబిఐ ఇంత వరకూ సుప్రీం కోర్టుకు అప్పీల్ కు వెళ్లకపోవడమే కాకుండా  అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్ ను సవాలు చేస్తూ వివేకా కుమార్తె  సునీత   సుప్రీం కోర్టును ఆశ్రయించినా,  సిబిఐ ఇంప్లిడ్ కాకపోవడం వెనుక ఉన్న రహస్యం జగన్ పలుకుబడేనన్నది పరిశీలకుల విశ్లేషణ. ఈ నేపథ్యంలోనే  ముందస్తు నిర్ణయం విషయంలో సమయం మించిపోయినా కావాలనుకుంటే జగన్ కేంద్రం ద్వారా కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఇన్ఫ్లయెన్స్ చేసి సాధించుకోగలరని, అందుకే ముందస్తు దారులు ముగిసిపోయినా ఏపీలో మాత్రం ఆ చర్చకు తెరపడటం లేదనీ అంటున్నారు. 

డ్రగ్స్ కేసులో ప్రముఖ నిర్మాత అరెస్ట్!

అప్పట్లో డ్రగ్స్ కేసు టాలీవుడ్ లో ప్రకంపనలు సృష్టించిన సంగతి తెలిసిందే. పలువురు తెలుగు సినీ ప్రముఖులు డ్రగ్స్ వాడుతున్నట్లు ఆరోపణలు వచ్చాయి. తాజాగా డ్రగ్స్ కేసులో ఓ ప్రముఖ సినీ నిర్మాతను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేయడం సంచలనంగా మారింది. ఇటీవల ఓ డ్రగ్స్ ముఠాను సైబరాబాద్ పోలీసులు పట్టుకున్నారు. ఈ ముఠా నుంచి డ్రగ్స్ తీసుకుంటున్న వారి వివరాలను పోలీసులు సేకరించగా.. అందులో సినీ నిర్మాత కేపీ చౌదరి కూడా ఉన్నారు. కేపీ చౌదరి డగ్స్ వాడుతున్నట్టు తేలడంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అంతేకాదు ఆయన నుంచి కొకైన్ కూడా స్వాధీనం చేసుకున్నారు. కాగా సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన 'కబాలి' సినిమాను తెలుగులో కేపీ చౌదరి విడుదల చేశారు.

కదిలింది కదిలింది వారాహి!

వారాహి కదిలింది. ఉమ్మడి తూర్పుగోదావరి  జిల్లా అన్నవరం నుంచి జనసేనాని పవన్ కల్యాణ్ వారాహి యాత్ర మొదలైంది.  ప్రజాసమస్యలను ప్రస్తావిస్తూ తమ పార్టీ అజెండాను ప్రజల్లోకి తీసుకెళ్లడమే  కాకుండా, ఎన్నికల ప్రచార యాత్రగా కూడా పవన్ వారాహి ద్వారా బహుముఖ దండయాత్రకు ప్లాన్ చేశారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో నాలుగు నియోజకవర్గాలలో సాగే ఈ యాత్రలో భాగంగా కత్తిపూడి,  ఉప్పాడ బస్టాండ్‌ సెంటర్‌, సర్పవరం మీదుగా సాగుతుంది. పైన చెప్పిన మూడు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభల్లో జనసేనాని మాట్లాడతారు. పర్యటన సాగిన ప్రాంతాల్లో ఉదయం పూట సమస్యలపై అర్జీలు స్వీకరిస్తారు. ప్రతి రోజు ఉదయం జనవాణి కార్యక్రమం ఉంటుంది.  స్థానికంగా ఎక్కువ ఇబ్బంది పెట్టే సమస్యపై నేరుగా క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలిస్తారు.  పిఠాపురం, కాకినాడ, నర్సాపురంలో  క్షేత్రస్థాయి సందర్శనలు ఉంటాయి.   ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఈ యాత్రను గ్రాండ్ సక్సెస్ చేయాలని జనసేన శ్రేణులు కృత నిశ్చయంతో ఉన్నారు.  కాగా విడదల వారీగా  సాగే జనసేనాని వారాహియాత్ర తొలి విడత ఈ నెల24 వరకు యాత్ర సాగనుంది. బుధవారం (జూన్ 13) కత్తిపూడిలో బహిరంగ సభలో పవన్ మాట్లాడతారు. 16న పిఠాపురం, 18న కాకినాడ, 20 ముమ్మిడివరం, 21న అమలాపురం, 22న రాజోలులో  బహిరంగ సభల్లో పవన్ ప్రసంగిస్తారు. యాత్రలో రోజూ మేధావులు, విద్యావేత్తలు, ఎన్జీవోలు, కార్మికులు, రైతులు, చేతి వృత్తుల వారితో పవన్ మాట్లడబోతున్నారు.  తెలుగుదేశం పార్టీతో జనసేన పొత్త దాదాపుగా ఖరారైందని భావిస్తున్న నేపథ్యంలో ఈ యాత్ర విజయవంతానికి క్షేత్ర స్థాయిలో జనసేన, తెలుగుదేశం శ్రేణులు  కలిసి పని చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

చిగురుటాకులా వణకుతున్న గుజరాత్ తీరం

బిపర్ జోయ్ ప్రళయ భీకరంగా దూసుకొస్తోంది. ఆ తుపాను ధాటికి గుజరాత్ తీరం చిగురుటాకులా వణికి పోతోంది. బిపర్ జోయ్ గుజరాత్ లోని ఖజౌ వద్ద గురువారం (జూన్14) సాయంత్రం తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. తుపాను ప్రభావం అప్పుడే గుజరాత్ పై తీవ్రంగా కనిపిస్తోంది. ఇప్పటికే సౌరాష్ట్ర, కచ్ తీరాల్లో అలలు 6 కిలోమీటర్ల ఎత్తులో ఎగసిపడుతున్నాయి. తుపాను తీరం దాటే సమయంలో గంటకు 150 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీచే అవకాశం ఉందనీ, వీటి వల్ల తీవ్ర విధ్వంసం సంభవించే అవకాశం ఉందన్న ఆందోళణ వ్యక్తమౌతోంది. ఇప్పటికే తీరం వెంబడి గాలుల తీవ్రత కారణంగా పలు చోట్ల చెట్లు విరిగిపడ్డాయి. తుపాను కారణంగా ఇప్పటికే ముగ్గురు మరణించారు. పెద్ద సంఖ్యలో ప్రజలను సురక్షిత స్ధావరాలకు  తరలిస్తున్నారు. కేంద్ర హోంమంత్రి హస్తిన నుంచి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. 

సీమ నేలకు లోకేష్ వందనం

తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేష్ యువగళం పాదయాత్ర రాయలసీమ జిల్లాలలో ముగిసింది. సీమలో లోకేష్ ను అడుగుపెట్టనీయం అంటూ సవాళ్లు చేసిన వైసీపీ నాయకులకే దిమ్మతిరిగేలా ఆయన పాదయాత్ర కు సీమ జిల్లాల్లో జనం నీరాజనాలు పలికారు.   తనదీ సీమేననీ, తనలో ప్రవహించేదీ సీమ రక్తమేననీ లోకేష్ బద్వేల్ సభలో వైసీపీ నేతల చెవుల్లో మారుమ్రోగేలా చెప్పారు.   తనను సవాల్ చెయ్యాలన్నా, అడ్డుకోవాలన్నా దమ్ముండాలి... ఆ దమ్ము వైసీపీకి లేదని లోకేష్ సీమ జిల్లాల్లో జన ప్రభంజనంలా సాగిన తన పాదయాత్ర ద్వారా నిర్ద్వంద్వంగా రుజువు చేశారు. క్లైమోర్ మైన్లకే భయపడని కుటుంబం మాది... కోడికత్తి బ్యాచ్ కి భయపడతామా అంటూ  ఎద్దేవా చేశారు. సీమ జిల్లాల్లో లోకేష్ యువగళం పాదయాత్ర మంగళవారం (జూన్ 13)తో ముగిసి నెల్లూరు జిల్లాలోకి అడుగుపెట్టింది. నెల్లూరు జిల్లాలో లోకేష్ కు ఘన స్వాగతం లభించింది. అంతకు ముందు అంటే లోకేష్ పాదయాత్ర నెల్లూరు జిల్లాలోకి ప్రవేశించడానికి ముందు ఆయన రాయలసీమ నేలకు శిరస్సు వంచి నమస్కరించారు.  

పడవ బోల్తా పడి నైజీరియాలో 103 మంది మృతి

నైజీరియాలో పెను విషాదం సంభవించింది. అక్కడి క్వారా రాష్ట్రంలో నైగర్ నదిలో పడవ బోల్తాపడి 103 మంది మరణించారు. ఓ పెళ్లి వేడుకకు వెళ్లి తిరిగివస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. దాదాపు వంద మందిని అధికారులు రక్షించారు. గల్లంతైన మరి కొందరి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాదం జరిగిన సమయంలో పడవలో మూడు వందల మంది వరకూ ఉన్నారని చెబుతున్నారు. సామర్థ్యానికి మించి జనం పడవలో ఎక్కడం వల్లే అది బోల్తాపడిందని అధికారులు చెబుతున్నారు.   నైజీరియాలో పడవ ప్రమాదాలు సర్వసాధారణంగా మారిపోయాయి. చాలా వరకూ ఇక్కడ ప్రయాణాలకు పడవలనే ఉపయోగిస్తారు. సామర్థ్యానికి మించి ప్రయాణీకులను అనుమతించడం, పడవల నిర్వహణాలోపం కారణంగా తరచుగా ప్రమాదాలు జరుగుతుంటాయి. గత నెలలో కట్టెలు, వంట చెరకు కోసం పడవలో వెళ్లిన వారిలో 15 మంది మరణించగా, పాతిక మంది వరకూ గల్లంతయ్యారు.