వైసీపీ పాపాలలో బీజేపీకీ భాగం?!

జగన్  పాలన అంతా  అవినీతి,అరాచకం,అప్పులేనంటూ ఇప్పుడు మన్నూ మిన్నూ ఏకం చేస్తూ విమర్శలు గుప్పించిన బీజేపీ అగ్రనేతలు అమిత్ షా, జేపీ నడ్డాలు.. అందుకు ఈ నాలుగేళ్లూ అండగా, దండగా నిలిచినందుకు మాత్రం ఇసుమంతైనా విచారం కానీ, పశ్చాత్తాపం కానీ వ్యక్తం చేయలేదు.  కేంద్ర పథకాలపై జగన్‌ తన బొమ్మ వేసుకుని ప్రచారం చేసుకుంటున్నారని ఆరోపణలు గుప్పించిన ఆ నేతలు ఇంత కాలం ఎందుకు నోరు మెదపలేదన్న జనం ప్రశ్నకు సమాధానం చెప్పేందుందుకు ఎందుకు సిద్ధంగా లేరు.  పేదల కోసం ఇచ్చిన బియ్యాన్ని అమ్ముకుంటున్నారని, విశాఖపట్నాన్నిభూ రాబందుల కేంద్రంగా మార్చారని తీవ్ర స్థాయిలో జగన్ సర్కార్ ను దుయ్యబట్టిన ఆయ నాయకద్వయం.. అందుకు అన్ని విధాలుగా సహకరించినా.. తాము మాత్రం నిజాయితీపరులమని చెప్పుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక ఈ తొమ్మిదేళ్లలో రూ.5 లక్షల కోట్లకి పైగా  రాష్ట్రానికి ఇచ్చామనీ, ఆ డబ్బంతా ఏమైందనీ ఇంత కాలం ప్రశ్నించకుండా ఇప్పుడు నిలదీయడంలోని ఆంతర్యమేమిటని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు. కేంద్రం ఇచ్చిన డబ్బుకు సరిపడా అభివృద్ధి కనిపించడం లేదని చెబుతున్న అమిత్ షా.. అభివృద్ధి కనిపించడం లేదని ఇప్పుడే తెలిసిందా? ముందే తెలిస్తే.. ఎందుకు జగన్ సర్కర్ ను నిలదీయలేదని అంటున్నారు.   మైనింగ్‌, భూ మాఫియా, గంజాయి స్మగ్లింగ్ ఇలా అన్నిటిలోనూ వైసీపీ నాయకులే ఉన్నారంటూ కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా జగన్ పరిపాలనపై ఇప్పుడు నిప్పులు చెరుగుతున్నారు. కానీ ఒక మాజీ మంత్రి, మాజీ సీఎం కు స్వయానా సోదరుడు, ముఖ్యమంత్రి జగన్ కు సొంత బాబాయ్ వివేకా హత్య జరిగి నాలుగేళ్లయినా పురోగతి కనిపించకపోవడాన్ని ఎందుకు నిలదీయలేదంటున్నారు. గొడ్డలి పోటును గుండెపోటుగా చిత్రీకరించి, వివేకా శరీరంపై గాయాలకు కుట్లువేసి బ్యాండేజీలు వేసినా, అందుకు పాల్పడిన వారిని, పోనీ ఆక్రతువునంతా దగ్గరుండి చేయించిన వారినీ కూడా కేంద్ర దర్యాప్తు సంస్థ కనిపెట్టలేకపోవడం వెనుక ఉన్న హస్తం ఎవరిదన్న విషయంపైనా కేంద్ర హోంమంత్రి అయిన అమిత్ షా ఎందుకు మౌనంగా ఉన్నారని ఏపీ జనం నిలదీస్తున్నారు. ఇక అన్నిటికంటే స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీ భూమి పూజ చేసి ఏపీ రాజధానిగా ప్రకటించిన అమరావతిని నిర్వీర్యం చేసేందుకు ఈ నాలుగేళ్లుగా జరిగిన అన్ని ప్రయత్నాలనూ  ప్రేక్షకుల్లా చూస్తూ ఉండిపోవడం వెనుక ఉన్న కారణాలేమిటని ప్రశ్నిస్తున్నారు. జగన్ రెడ్డి పాలనలో ఏపీ రాజధాని లేని రాష్ట్రంగా మారిందని ధ్వజమెత్తిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు ఇప్పుడే ఆ విషయం గుర్తుకు వచ్చిందా అని ప్రశ్నిస్తున్నారు.   ఇప్పటికైనా జగన్ రెడ్డి పాలన దౌర్భాగ్యంగా ఉందని కేంద్ర హోంమంత్రి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు గుర్తించడం సంతోషమే కానీ, ఇంత కాలం ఏపీలో జగన్ అరాచక పాలనను అన్ని విధాలుగా సమర్ధిస్తూ, ఆర్థిక అరాచకత్వాన్ని మరింత ప్రోత్సహించే విధంగా నిబంధనలను తుంగలో తొక్కి మరి అప్పులిచ్చి ఏపీని అధ్వాన స్థితికి తేవడంలో కేంద్రంలోని మోడీ సర్కార్ పాత్ర ఎంత ఉందో పరిశీలకులు సోదాహరణంగా చేస్తున్న విశ్లేషణలకు  షా, నడ్డా ద్వయం సమాధానం చెప్పాలని ఏపీ జనం కోరుతున్నారు.   నాలుగేళ్లుగా పరస్పర ప్రయోజనాల పరిరక్షణ కోసం అంటకాగిన వైసీపీ, బీజేపీలు ఇప్పుడు ఎన్నికల ముందు ప్రజలను మరో సారి మోసం చేయడానికి తెరతీసిన కొత్త డ్రామాగా అమిత్ షా, నడ్డాల విమర్శలను పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   గత నాలుగేళ్లుగా  జగన్ రెడ్డి దుష్టపాలనకు వెన్నుదన్నుగా నిలిచి,   ఆర్ధిక అరాచకానికి అండగా నిలుస్తూ జగన్ సర్కార్ ఎప్పుడు అడిగితే అప్పుడు అప్పులు తెచ్చుకునేందుకు అనుమతులు ఇచ్చిన కేంద్రం, ఇప్పుడు విమర్శల దాడికి దిగడం వెనుక రాజకీయ ప్రయోజనాభిలాషను పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  జగన్ పాలన అంతా అవినీతి, అక్రమాలు, కుంభకోణాల మయం అంటూ గగ్గోలు పెట్టిన అమిత్ షాకు (ఆయన కేంద్ర హోంమంత్రి) జగన్ పై వున్న 16 చార్జి షీట్ల పై విచారణ  నిలిచిపోయిందన్న సంగతి తెలియదా. ఆయన కోర్టుకు హాజరు కాకుండా సాధించుకున్న వెసులుబాటు వెనుక ఎవరు ఉన్నదో ప్రజలకు అర్ధం కాదనుకుంటున్నారా అని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు.  

వైసీపీతో అనుబంధ సంఘాల బంధం పుటుక్కుమందా?

వచ్చే ఎన్నికలలో వైసీపీకి అధికారం, జగన్ మరో సారి ముఖ్యమంత్రి అంటే జనం రియాక్షన్ ఎలా ఉందన్నది పక్కన పెడితే సొంత పార్టీ క్యాడర్ అయితే మాత్రం పెద్ద ఉత్సాహం చూపడంలేదు. నాలుగేళ్లకు పైగా అధికారంలో ఉన్న జగన్ రాష్ట్రానికి, ప్రజలకే కాదు.. పార్టీ కోసం సర్వం ఒడ్డి పని చేసిన తమను కూడా పట్టించుకోలేదన్న ఆగ్రహం వారిలో వ్యక్తం అవుతోంది. పార్టీ అనుబంధ సమావేశాల పేరిట వైసీపీ ఎంపీ విజయసాయి ఇటీవలి కాలంలో వరుసగా నిర్వహిస్తున్న సమావేశాలకు వస్తున్న స్పందనే అందుకు తార్కానం. నాలుగేళ్లుగా ఉన్నామా? చచ్చామా పట్టించుకోని పార్టీ హై కమాండ్ మళ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుంటే మేం గుర్తుకొచ్చామా అని వైసీపీ శ్రేణులు అంతర్గతంగా రగిలిపోతున్నాయి. ఆ ఎఫెక్ట్ విజయసాయి నిర్వహిస్తున్న పార్టీ అనుబంధ సంఘాల సమావేశాల్లో ప్రస్ఫుటమౌతోంది. గత కొంత కాలంగా పార్టీలో తన ఉనికే ప్రశ్నార్ధకంగా మారిన విజయసాయి.. ఇప్పుడు ఏదో బాధ్యత అప్పగించారని నిర్వహిస్తున్న అనుబంధ సంఘాల సమావేశాలలో ఆయన ప్రసంగాలు కూడా మొక్కుబడిగానే సాగుతున్నాయి. నాలుగేళ్లలో పార్టీ సాధించిన ఘనతల గురించి చెప్పకుండానే.. జగన్ మరో సారి ముఖ్యమంత్రి కావాలనీ, ఇందుకు అందరూ కష్టించి పని చేయాలని మాత్రమే చెప్పి మమ అనిపిస్తున్నారు. ఆయన ఎంత మొక్కుబడిగా సమావేశాలను నిర్వహిస్తున్నారో..అంతే మొక్కుబడిగా వచ్చిన వారు కూడా వచ్చామా, చెప్పింది విన్నామా, వెళ్లిపోయామా అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. దీంతో గత ఎన్నికల ముందు ఎంతో క్రియాశీలంగా ఉన్న అనుబంధ సంఘాలు ఇప్పుడు అంతే నిర్వీర్యంగా మారిపోయాయి. పార్టీకి క్యాడరే అవసరం లేదు.. వాలంటీర్ల వ్యవస్థ ఒక్కటి చాలు అన్నట్లుగా.. ఆ వ్యవస్థను ఏర్పాటు చేసి అన్ని బాధ్యతలూ (పార్టీ, ప్రభుత్వ) అప్పగించేసి నాలుగేళ్ల పాటు క్యాడర్ ను పట్టించుకోని పార్టీ అధినేత.. ఇప్పుడు ఎన్నికల ముందు వారిని కలిసేందుకు ముఖం చెల్లక చెల్లని కాణీలా ఇంత కాలం పక్కన పెట్టేసిన విజయసాయికి ఆ బాధ్యతలు అప్పగించి ఎన్నికలకు క్యాడర్ ను సమాయత్తం చేయాలని ఆదేశించడంతో ఈ పరిస్థితి ఎదురైందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అనుబంధ సంఘాల సమావేశాలనైతే విజయసాయి నిర్వహిస్తున్నారు. పార్టీ కోసం పని చేయాలని వారికి ఉపదేశాలు, ఉపన్యాసాలూ ఇస్తూ దిశా నిర్దేశం చేస్తున్నారు. అయితే ఆయన గత ఎన్నికల ముందు క్యాడర్ కు చేసిన ఉపదేశాలకూ, ఇప్పుడు చేస్తున్న ఉద్బోధలకూ నక్కకూ నాగలోకానికీ ఉన్నంత తేడా ఉందని క్యాడరే చెబుతున్నారు. ఏదో రాసుకొచ్చిన ప్రసంగం గడగడ చదివేసినట్లుగా విజయసాయి తీరు ఉంటే.. హమ్మయ్య ఆయన ప్రసంగం అయిపోయిందన్నట్లుగా సమావేశానికి హాజరైన వారి తీరు ఉందని అంటున్నారు.    అనుబంధ సంఘాల నేతలెవరూ ఇప్పడు క్షేత్ర స్థాయిలో పార్టీ కోసం పని చేయడానికి సిద్ధంగా లేరు.  గత ఎన్నికలలో సర్వం ఒడ్డి పార్టీని అధికారంలోకి తీసుకువచ్చిన తమకు ఏం ఒరిగిందని వారు రగిలిపోతున్నారు.  ఆ విషయాన్ని గుర్తించినందునే అందుకే విజయసాయి  పార్టీ కోసం పని చేయాలని అని చెప్పగలుగుతున్నారే కానీ, పార్టీ కోసం పని చేస్తే జరిగే మేలు గురించి ఒక్కటంటే ఒక్క మాట కూడా చెప్పడం లేదు. ఇప్పటికే సమాజిక మాధ్యమంలో గతంలో ఎంతో చురుకుగా ఉన్న విజయసాయి ఇప్పుడు దాదాపుగా దానికి దూరం అయ్యారు. ఒక వేళ అడపాదడపా ఏదైనా పోస్టు చేసినా.. అది పార్టీ గురించి కానీ, విపక్షాలపై విమర్శల గురించి కానీ కాకుండా జన్మదిన శుభాకాంక్షలు చెప్పడానికి, కేంద్రంలోని మోడీ సర్కార్ ఘనతలను ప్రశంసించడానికే పరిమితం చేస్తున్నారు. అటువంటి విజయసాయి.. విపక్షాల విమర్శలను గట్టిగా ఖండించాలనీ, ప్రభుత్వ ఘనతలను ప్రజలకు వివరించాలని అనుబంధ సంఘాల నేతలకు ఎలా చెప్పగలుగుతారని పరిశీలకులు అంటున్నారు. అందుకే విజయసాయి సమావేశాలకు ఎటువంటి స్పందనా రావడం లేదనీ, పైపెచ్చు ఈ సమావేశాలతో వైసీసీ క్యాడర్ కు పార్టీకి మధ్య ఏర్పడిన అఘాధం జనానికి కూడా తెలిసిపోయేలా ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ప 

మోదీ మళ్ళీ గెలిస్తే రాజ్యాంగానికి ఎసరే ?

కేంద్రంలో మళ్ళీ మరోమారు బీజేపీ అధికారంలోకి వస్తే  ఏం జరుగుతుంది? రాజ్యాంగాన్ని మార్చేస్తుందా? ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్‌ లా రాజ్యాంగాన్ని మార్చేసి  జీవితకాల ప్రధానిగా ప్రకటించు కుంటారా? అంటే, అవుననే అంటున్నారు  ఢిల్లీ మంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ నేత.. సౌరభ్ భరద్వాజ్.   2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే  శాశ్వతంగా అధికారంలో  ఉండేలా  రాజ్యంగాన్ని మార్చి రాజరిక వ్యవస్థను ప్రవేశ పెడుతుందని ఆయన హెచ్చరించారు. అందుకే దేశాన్ని ఈ విపత్తు నుంచి కాపాడేందుకు  విపక్ష పార్టీలు అన్నీ కలిసి పోటీ చేయాలని, లేదంటే, 2024 ఎన్నికల్లో బీజేపీ హ్యాట్రిక్ ను అడ్డుకోవడం అయ్యే పనికాదని ఆయన విపక్ష పార్టీలకు హిత బోధ చేశారు. విపక్షాల మధ్య ఎన్ని విభేదలున్నా, అవన్నీ పక్కన పెట్టి బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు ఐక్యం కావాల్సిన అవసరాన్ని ఆయన గుర్తు చేశారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు దేశంలోని రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.  నిజానికి, 2024 ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు ప్రతిపక్షాలు ఏకం కావలసిన అవసరాన్ని  ఒక్క ఆప్ మాత్రమే కాదు, కాంగ్రెస్ సహా ప్రతిపక్ష పార్టీలన్నీ ఎప్పుడో  గుర్తించాయి. 2024 ఎన్నికల్లో ప్రధాని మోడీని ఓడించాలంటే.. విపక్షాలన్నీ ఐక్యంగా పోటీ చేయాలని... కాంగ్రెస్ మొదలు కమ్యూనిస్టుల వరకు ప్రయత్నాలు సాగిస్తూనే ఉన్నాయి.  విపక్ష పార్టీలు తరచూ పిలుపునిస్తూనే ఉన్నాయి. ఆ దిశగా ప్రయత్నాలు సాగుతున్నాయి. నిజానికి, ప్రతిపక్షాల ఐక్యత అవసరాని గుర్తించడంలో ఆప్  కొంత ఆవెనక బడింది. ఢిల్లీ ప్రభుత్వ అధికారుల నియామక  నియంత్రణలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం అర్దినెన్సు  తెచ్చే వరకు ఆప్  ప్రతిపక్షాల ఐక్యత ప్రయత్నాలను     అవహేళ చేసింది. ఇంత వరకు సాగిన ఐక్యతా ప్రయత్నాలకు ఆప్  దూరంగా ఉంటూ వచ్చింది. అయితే ఇప్పడు, విపక్షాల ఐక్యత కోసం ఆప్  అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ కాలికి బలపం కట్టుకుని దేశాన్ని చుట్టి వస్తున్నారు. రాజ్యసభలో ఢిల్లీ ఆర్డినెన్సు వీగి పోయేలా చేయాలని, ప్రతిపక్ష పార్టీల చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నారు. ఈ నేపద్యంలోనే ఆప్  నేత భరద్వాజ ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదలా ఉంటే విపక్షాలను ఐక్యం చేసేందుకు బిహార్ ముఖ్యమంత్రి, జేడీయూ అధినేత నితీష్ కుమార్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.  ఆయన నేతృత్వంలో జూన్ 23న బిహార్ రాజధాని పాట్నాలో ప్రతిపక్షాల సమావేశం జరగనుంది. జూన్ 23న జరిగే సమావేశంలో 2024 లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి వ్యూహరచన చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ భేటీకి కాంగ్రెస్ సహా ఎన్సీపీ, శివసేన, ఆప్ వంటి ప్రధాన పార్టీలు హాజరుకానున్నాయి.అయితే, తెలుగు రాష్ట్రాలలో అధికారంలో ఉన్న, వైసేపీ, బీఆర్ఎస్  సహా తెలుగు దేశం హాజరావుతాయా లేదా అనేది ఇంకా స్పష్టం కాలేదు.

ప్రజలు‘ముందస్తు’గానే నిర్ణయించేశారా?

వైసీపీ అధినేత‌, ముఖ్యమంత్రి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి, గ‌త కొంత కాలంగా 175 సీట్ల జపం చేస్తున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో 151 సీట్లు సాధించాం..ఈ సారి 175 సాధించ‌టం పెద్ద క‌ష్ట‌మేమీ కాదు అని పార్టీ స‌మావేశాల్లో త‌ర‌చూ వ్యాఖ్యానిస్తున్నారు. అయితే, ఇటీవల కాలంలో అయన స్వరంలో మార్పు కనిపిస్తోంది.  వై నాట్ 175, వై నాట్ కుప్పం .. అంటూ బీరాలు పోయిన జగన్ రెడ్డి ఇప్పుడు  అంత  ధీమాగా లేరు. నిజానికి నిజం ఏమిటో ఆయనకు తెలుసు  తెలుగుదేశం యువ తేజం నారా లోకేష్  సాగిస్తున్న యువగళం పాదయాత్రకు  రాయలసీమలో లభించిన ప్రజాదరణ వైసీపీ వెన్నులో వణుకు పుట్టించింది. ముఖ్యంగా ముఖ్యమంత్రి జగన్ రెడ్డి సొంత గడ్డ కడప జిల్లాలో యుగళం పాదయాత్రలో  గళమెత్తి గర్జించిన ప్రజాగళం వైసీపీలో ప్రకంపనలు సృస్తిస్తోంది. అవును  స్థానిక వైసీపీ నాయకుల్లోనే కాదు  ఏకంగా జగన్ రెడ్డి గుండెల్లోనే  యువగళం గుబులు పుట్టిస్తోంది. నిజానికి  క్షేత్ర స్థాయి పరిస్థతి ఏమిటో  జగన్ రెడ్డికి తెలుసు  అయినా పార్టీ క్యాడ‌ర్ లో ఉత్సాహం  నింపేందుకో..నేత‌ల్లో స్పీడ్ పెంచేందుకో కుప్పంలోనూ గెలుస్తామని గొప్పలు పోతున్నారు. అయితే క్షేత్ర‌స్థాయిలో మాత్రం అందుకు భిన్న‌మైన పరిస్థితులు ఉన్నాయ‌నే విష‌యం ఆ పార్టీ నేత‌లు కూడా అంగీక‌రిస్తున్నారు.   తాజాగా, తెలుగుదేశం పార్టీ అధినేత మూడు రోజుల కుప్పం పర్యటనలో ప్రజలు ఆయనకు మరో మరు బ్రహ్మరధం పట్టారు. కాంగ్రెస్, వైసేపీ నాయకులు,  క్యాడర్ క్యూకట్టి మరీ టీడీలో చేరారు.  మూడు రోజుల  పర్యటనలో భాగంగా రెండో రోజు చంద్రబాబు సమక్షంలో కుప్పం నియోజకవర్గానికి చెందిన కీలక నేత, కాంగ్రెస్ చిత్తూరు జిల్లా అధ్యక్షుడు డాక్టర్ సురేష్ తన అనుచరులతో కలిసి టీడీపీలో చేరారు. అలాగే వైఎస్సార్‌సీపీ, కాంగ్రెస్ నుంచి వందలాది మంది కార్యకర్తలు టీడీపీ కండువాలు కప్పుకున్నారు. మరోవంక  నాలుగు పదులకు పైగా రాష్ట్ర, దేశ, అంతర్జాతీయ రాజకీయాలను అవపోసన పట్టిన తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తనదైన స్టైల్లో సమాధానమిచ్చారు. ‘రాబోయే ఎన్నికల్లో కుప్పంలో గెలుస్తామని జగన్‌ చెబుతున్నాడు. కుప్పంలో గెలవడం తర్వాత సంగతి ముందు పులివెందులను కాపాడుకో  అని సీఎం జగన్మోహన్‌రెడ్డికి చంద్రబాబు సూచించారు. పులివెందులలో టీడీపీ జెండా ఎగరడం ఖాయమని ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో తేలిపోయిందన్నారు. జగన్‌ ప్రజల బిడ్డ కాదని.. సమాజానికి కేన్సర్‌ గడ్డని చంద్రబాబు ఎప్పుడో  తేల్చి చెప్పారు.  నిజం. చంద్రబాబు నాయుడు చెప్పింది  అక్షర సత్యం. ఇప్పుడు రాష్ట్రంలో పరిస్థితులను గమనిస్తే, జగన్ రెడ్డి నమ్ముకున్న తాయిలాలు  తిరగబడుతున్నాయి. ఇంత కాలం కేంద్ర ప్రభుత్వం అందించిన ప్రత్యక్ష, పరోక్ష సహకారంతో నెట్టుకొచ్చిన జగన్ రెడ్డి కి ఇక పై కేంద్ర సహకరం మునుపటిలా ఉండదనే విషయం స్పష్టమైంది. ఇటీవల రాష్ట్రంలో పర్యటించిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఆ వెనక కేంద్ర హోం మంత్రి అమిత్ షా  ముఖ్యమంత్రి జగన్ రెడ్డి అరాచక, అవినీతి పాలనను ఎండగడుతూ చేసిన వ్యాఖ్యలు విమర్శలు,ముందున్నది క్రొకోడైల్ ఫెస్టివల్ అనే విషయాన్ని స్పష్టం చేశాయి. అంతే కాదు  ముఖ్యమంత్రి జగన్ రెడ్డి కూడా ఇక పై కేంద్ర ప్రభుత్వం, బీజేపీ సహకరం   ఉండక పోవచ్చని తమ గుండెల్లోని భయాన్ని బయట పెట్టుకున్నారు. ఈ పరిస్థితుల్లో మరో గత్యంతరం లేక జగన్ రెడ్డి ముందస్తు ఎన్నికలకు వెళతారనే ఊహగానాలు  వినిపిస్తున్నాయి.  అయితే ముందస్తుకు వెళితే  ముందుగా అధికారాన్ని కోల్పోవడం తప్ప ప్రయోజనం ఉందని పరిశీలకులు భావిస్తున్నారు. నిజానికి ప్రజలు ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చారని, ఒకసారి చేసిన ఒక్క ఛాన్స్  తప్పు రెండోసారి చేసిది లేదని ఎక్కడికక్కడ ప్రజలు, ఎవరికి వారు తీర్మానం చేసుకుంటున్నారని అంటున్నారు. అందుకే  ముందస్తుకు వెళ్లి ముందుగా  చేతులు కాల్చుకోవడం కంటే  గడవు వరకు బండి లాగించడమే మేలని వైసీపీ నేతలు భావిస్తున్నట్లు తెలుస్తోంది.  అలాగే  కుప్పం పర్యటనలో చంద్రబాబు నాయుడు పేర్కొన్నట్లుగా, రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులే కాదు  శాంతి భద్రతల పరిస్థితి కూడా అధ్వాన స్థితికి చేరింది. విశాఖలో ఎంపి కుటుంబ సభ్యులను కిడ్నాప్, ఇందుకు తాజా ఉదాహరణ.  సామాన్య ప్రజల సంగతి పక్కన పెట్టినా రాష్ట్రంలో ఎంపీ కుటుంబానికి రక్షణ లేని పరిస్థితిని చూస్తున్నాం. అందుకే ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ముందస్తు ఎన్నికలకు వెళతారా లేదా అనే విషయం ఎలా ఉన్నా అరాచక, అవినీతి పాలనకు పర్యాయపదంగా మారిన ముఖ్యమంత్రి జగన్ రెడ్డి పాలనకు ఉద్వాసన పలకాలనే ముందస్తు నిర్ణయం అయితే ప్రజలు తీసుకున్నారని పరిశీలకులు పేర్కొంటున్నారు.

షా సభ వాయిదా .. పొంగులేటి సైలెన్స్.. లింకేంటి?

కేంద్ర హోం మంత్రి అమిత్ షా ... ఖమ్మం సభ రద్దయింది. సరే అది అసలు కారణం అయినా కాకున్నా, బిఫర్ జాయ్ తుపాను కమ్ముకొస్తున్న కారణంగానే అమిత్ షా తెలంగాణ రాష్ట్ర పర్యటన, ఖమ్మం సభ రద్దయ్యాయని బీజేపీ చెపుతున్న కారణం కొంత సహేతుకంగానే వుంది. కానీ, ఓ వంక మాజీ ఎంపీ పొంగులేటి ప్రహసనం నడుస్తున్న సమయంలో  ముఖ్యంగా ఆయన కాంగ్రెస్ లో చేరడం ఖాయమని మీడియా కథనాలు వండి వరుస్తున్న సమయంలో, అమిత్ షా పోయి పోయి ఖమ్మంలో సభ పెట్టడమే, ఓ పెద్ద పజిలింగ్  ప్రశ్న అయితే  ఆ సభ రద్దు కావడం దానితో పాటుగా పొంగులేటి సైలెంటైపోవడం రాజకీయ వర్గాల్లో కొత్త చర్చకు దారితీసింది.  నిజానికి, బీఆర్ఎస్  నుంచి సస్పెండ్  అయి నప్పటి నుంచి  ఇంకా మాట్లాడితే అంతకు ముందు నుంచీకూడా పొంగులేటి, ఆయనతో పాటుగా బీఆర్ఎస్  నుంచి సస్పెండ్ అయిన మాజీ మంత్రి జూపల్లి కృష్ణా రావు, వార్తల్లో వ్యక్తులుగా ప్రచారంలో ఉన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్  ప్రభుత్వాన్ని గద్దె దించడమే తమ లక్ష్యమని ప్రకటించిన ఆ ఇద్దరూ అందుకు తగిన వేదిక ఏది? కాంగ్రెస్, బీజేపీలలో ఏ పార్టీలో చేరితే తమ లక్ష్యం నెరవేరుతుంది? అనే దిశగా సమాలోచనలు  జరుపుతున్నారు. అలాగే తమవంటి  బీఆర్ఎస్ బాధితులను చేరదీసి కొత్త పార్టీ పెట్టే ఆలోచన కూడా చేశారు. అదే సమయంలో ఇటు కాంగ్రెస్  అటు బీజీపీ జాతీయ, రాష్ట్ర నాయకులు ఆ ఇద్దరికీ, రెడ్ కార్పెట్ స్వాగతం పలికేందుకు పోటాపోటీ ప్రయత్నాలు సాగించారు. దీనిపై ఎవరికి తోచిన రీతిలో వారు విశ్లేషణలు చేశారు. చివరాఖరుకు ఆ ఇద్దరు కాంగ్రెస్ చేరుతున్నారని మీడియా మేథావులు నిర్ణయానికి వచ్చారు. ముహూర్తం ఖరారు చేశారు..చివరకు పొంగులేటి, జూపల్లి కూడా  జూన్ 13 న తమ వెంట ఉన్న నాయకులు, కార్యకర్తలతో ఆఖరి ఆత్మీయ సమ్మేళనం నిర్వహించి, 14న హైదరాబాద్ లో మీడియా సమవేశంలో తమ నిర్ణయం ప్రకటిస్తామని చెప్పుకొచ్చారు. కానీ, అది జరగ లేదు. ఎందుకు? ఇప్పుడు ఇదే ప్రశ్న మీడియా మేథావుల బుర్రలు తొలిచేస్తోంది.  అమిత్ షా సభ వాయిదాకు, పొంగులేటి, జూపల్లి ప్రెస్ మీట్ వాయిదాకు లింక్ వుందా ..అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పొంగులేటి, జూపల్లి కాంగ్రెస్ లో చేరడం ఖరారు అయిందే నిజం అయితే, ఆ ఇద్దరు ప్రకటించిన విధంగా జూన్ 14న మీడియా సమావేశం ఎందుకు ఏర్పాటు చేయలేదు? ఎందుకు తమ నిర్ణయాన్ని ప్రకటించలేదు? ఎందుకు అప్పటి నుంచి మౌనంగా ఉన్నారు? అనే చర్చ జోరుగా సాగుతోంది. అయితే , నిజానికి పొంగులేటి మొదటి నుంచి బీజేపీ వైపే మొగ్గు చూపుతున్నారని, అయితే, ముఖ్యమంత్రి కుమార్తె, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత లిక్కర్ స్కాం  కేసులో చలనం లేక పోవడం, మరో వంక అంతవరకు బీజేపీపై ఒంటి కాలుపై లేచిన ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్,  బీఆర్ఎస్ మంత్రులు, నాయకులు  సైలెంట్ అయిపోవడంతో బీజేపీ, బీఆర్ఎస్ మధ్య లోపాయికారీ ఒప్పందం కుదిరిందనే అనుమానాలు వ్యక్తం కావడం, అదే సమయంలో కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం అదించడం వంటి పరిణామాలు చోటు చేసుకోవడంతో పొంగులేటి పునరాలోచనలో పడ్డారనే ప్రచారం జరిగింది.  కానీ, రేపటి ఎన్నికల్లో గెలిచినా, గెలవక పోయినా... బీఆర్ఎస్  ఎదుర్కునే సత్తా...బీజేపీకి మాత్రమే ఉందని,అందుకే ఆ ఇద్దరు.. ముఖ్య్మగా పొంగులేటి  చివరకు బీజేపీలో చేరేందుకు సిద్దమయ్యారని, అందుకే పొంగులేటి తమ నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నారని అంటున్నారు. అయితే, చివరకు కండువా కప్పుకునే వరకు.. ..ఆ ఇద్దరు ..ఏ పార్టీలోకి అన్న సస్పెన్స్ ఇలాగే కొనసాగుతుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.

టీడీపీలోకి లగడపాటి..!

విజయవాడ మాజీ లోక్‌సభ సభ్యుడు లగడపాటి రాజగోపాల్.. రాజకీయాల్లోకి మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చేందుక రంగం సిద్దమైందనే ఓ చర్చ అయితే ఏపీ పోలిటికల్ సర్కిల్‌లో ఊపందుకొంది. ఆ క్రమంలో ఆయన తెలుగుదేశం పార్టీలో చేరి.. మళ్లీ విజయవాడ లోక్‌సభ స్థానం నుంచి ఎన్నికల బరిలో దిగుతారని తెలుస్తోంది. అలాగే ఆయన తనయుడిని సైతం పోలిటికల్ ఎంట్రీ ఇప్పించేందుకు  ఆయన సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.  అయితే ప్రస్తుతం విజయవాడ లోక్‌సభ సభ్యుడు కేశినేని నానికి ఆయన సోదరుడు కేశినేని చిన్నికి మధ్య పైకి కనిపించని యుద్దం జరుగుతోన్న సంగతి ప్రతి ఒక్కరికీ తెలిసిందే. అందులో భాగంగా రాబోయే ఎన్నికల్లో విజయవాడ ఎంపీ సీటు ఎవరికి ఇచ్చుకున్నా తనకు అభ్యంతరం లేదని.. తాను స్వతంత్ర్య అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగినా గెలుస్తానంటూ ఇప్పటికే కేశినేని నాని స్వయంగా ప్రకటించారనే చర్చ సైతం వైరల్ అవుతోంది. అదీకాక.. వచ్చే ఎన్నికల్లో విజయవాడ ఎంపీ టీడీపీ అభ్యర్థిగా కేశినేని చిన్ని పోటీ చేస్తారనే ప్రచారం ఓ వైపు జోరుగా జరుగుతోన్నా.. అందుకు సంబంధించిన క్లారిటీ అయితే సైకిల్ పార్టీ ఇప్పటి వరకు ఇవ్వలేదని.. అయితే విజయవాడ ఎంపీ టికెట్ తన తమ్ముడు లేదా మరెవరికీ ఇచ్చినా.. కన్‌ఫార్మ్‌గా ఓడించి తీరుతానని కేశినేని నాని ఇప్పటికే మంగమ్మ శపథం స్టైల్‌లో చేశారనే ఓ ప్రచారం కూడా లోక్‌సభ పరిధిలో హల్‌చల్ చేస్తోంది.   అలాంటి వేళ రానున్న ఎన్నికల్లో కేశినేని బ్రదర్స్‌ను పక్కన పెట్టి.. ఆ స్థానాన్ని లగడపాటి రాజగోపాల్‌కి కట్టబెట్టే అవకాశం సైతం ఉందని సమాచారం. విజయవాడ లోక్‌సభ సీటుపై గట్టి పట్టు ఉన్న నాయకులు పసుపు పార్టీలో పలువురు ఉన్నా.. వచ్చే ఎన్నికల్లో గెలుపుపై ఆచితూచి అడుగులు వేయాల్సి ఉందని.. ఆ క్రమంలో లగడపాటి రాజగోపాల్ లాంటి వాళ్లు అయితేనే కరెక్ట్ అనే చర్చ సైతం పార్టీలో జోరందుకొన్నట్లు తెలుస్తోంది. అదీకాక గతంలో విజయవాడ నుంచి ఎంపీగా గెలుపొందిన లగడపాటికి స్థానికంగా మంచి ఫాలోయింగే కాదు.. ఆయనకంటూ సొంత కేడర్ సైతం చాలా బలంగా ఉందన్న సంగతి అందరికీ తెలిసిందే. మరోవైపు లగడపాటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గతంలో గెలుపొందినా.. ఆయనకు అన్ని పార్టీల నేతలతో మంచి సన్నిహిత సంబంధాలున్నాయన్న విషయం విదితమే. ఆయన రాజకీయాలకు గుడ్ బై చెప్పి.. పాలిటిక్స్‌కి దూరం జరిగినా.. స్నేహ సంబంధాలను మాత్రం ఎక్కడా ఎప్పుడు వదలు కోలేదని ఆయన సన్నిహితులే స్పష్టంగా చెబుతుంటారు.  2004లో లగడపాటి రాజగోపాల్.. విజయవాడ లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గెలుపొందరు. ఆ తర్వాత 2009 ఎన్నికల్లో సైతం ఆయన నెగ్గారు. కానీ 2014 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనను ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. అయినా రాష్ట్ర విభజన జరిగిపోయింది. ఆ క్రమంలో రాష్ట్ర విజభన బిల్లు.. పార్లమెంట్‌లో ప్రవేశపెట్టినప్పుడు.. లగడపాటి పెప్పర్ స్ప్రే చేయడం.. దేశ వ్యాప్తంగా తీవ్ర సంచలనమైంది. అంతేకాదు రాష్ట్ర విజభనకు వ్యతిరేకంగా.. హైదరాబాద్ నడిబొడ్డున సోమాజిగూడ ప్రెస్‌క్లబ్ వద్ద ఆందోళనకు దిగడమే కాదు.. ఇదే అంశంపై విజయవాడలో సైతం.. ఆ మరణ నిరాహార దీక్ష చేపట్టి.. భద్రతగా ఉన్న పోలీసుల కళ్లు కప్పి.. హైదరాబాద్‌లోని నిమ్స్  ఆస్పత్రికి చేరుకున్నారు. అదే సమయంలో విజయవాడ నగర పోలీస్ కమిషనర్‌గా ఉన్న ప్రస్తుత ఏపీ డీజీపీ కె.రాజేంద్రనాథ్ రెడ్డిపై ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసిన విషయం విధితమే. అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విజభన జరిగితే.. రాజకీయాలకు గుడ్ బై చెప్పేస్తానని ప్రకటించడమే కాదు.. విభజన అనివార్యం కావడంతో లగడపాటి రాజగోపాల్ రాజకీయాలకు బై బై గుడ్ బై చెప్పేసి.. తన పోలిటికల్ కేరీర్‌కి పుల్ స్టాప్ పెట్టేశారు. ఇక టీడీపీ అధినేత చంద్రబాబుతో ఆయన స్నేహాన్ని కొనసాగించారు. ఆ క్రమంలో 2014లో సీఎం పీఠం ఎక్కిన  చంద్రబాబుతో లగడపాటి పలుమార్లు భేటీ అయి.... విజభన హామీల కోసం కృషి చేయాలంటూ సీఎం చంద్రబాబుకి విన్నవించారీ లగడపాటి.    ఇక సార్వత్రిక ఎన్నికల్లో ఈ పార్టీ గెలవబోతోంది.. ఆ పార్టీ గెలువబోతుందంటూ ఆయన స్వయంగా సర్వేలు నిర్వహించి.. ఎన్నికల ఫలితాల ప్రకటన వెలువడక మందుకు వెల్లడించి.. ఆంధ్ర ఆక్టోపస్‌గా లగడపాటి రాజగోపాల్ పేరు ప్రఖ్యాతలు సంపాదించారు. అయితే 2018 తెలంగాణ ఫలితాలు, అలాగే 2019 ఎన్నికల్లో ఆంధ్ర ఫలితాలపై ఆయన చెప్పిన ఫలితాలు తప్పు అని స్పష్టం అయింది. దీంతో ఆయన సర్వేలకు సాధ్యమైనంత దూరంగా ఉంటూ వస్తున్నారీ లగడపాటి. మరీ వచ్చే ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా లగడపాటి విజయవాడ నుంచి బరిలోకి దింపితే.. ఫ్యాన్ పార్టీ అభ్యర్థిగా ఆయనపై ఎవరిని నిలబెట్టనున్నారనే చర్చ సైతం పోలిటికల్ సర్కిల్‌లో ఓ చర్చ సైతం రచ్చ రంబోలా చేసి పారేస్తోంది.

ఒక్క రోజే 71 తీర్పులతో సరికొత్త రికార్డు 

తెలంగాణా హైకోర్టు   న్యాయమూర్తి సూరేపల్లి నంద  కొత్త రికార్డు సృష్టించారు. ఏకంగా ఒక్క రోజు 71 తీర్పులను వెలువరించి చరిత్ర తిరగరాశారు.  హైకోర్టు చరిత్రలో నందా ఇచ్చిన తీర్పులు  అసమానమైనవిగా భావిస్తున్నారు.  వేసవి సెలవుల  తర్వాత హైకోర్టు పున: ప్రారంభం రోజునే అనేక తీర్పులు వెల్లడించారు. ఈ కేసులు న్యాయమూర్తి ప్రస్తావించిన అంశాలు చోటుచేసుకున్నాయి.  మరో వైపు  న్యాయమూర్తి సూరేపల్లి నందా కోర్టులో తీర్పులు చెప్పడం ద్వారా న్యాయ ప్రక్రియలో పారదర్శకతను పెంచాయి. ఒకేసారి  గణనీయ సంఖ్యలో తీర్పులు వెలువరించారు.  దీంతో నిస్సందేహంగా కేసుల బ్యాక్‌లాగ్‌ను కొంతమేరకు తగ్గించందనడంలో ఎలాంటి సందేహం లేదు.  కోర్టులో పేరుకుపోతున్న కేసుల నేపధ్యంలో బ్యాక్‌లాగ్‌లను క్లియర్ చేయడం ద్వారా న్యాయస్థాన వ్యవస్థపై నమ్మకం పెరుగుతుంది. వ్యాజ్యదారులకు సకాలంలో న్యాయాన్ని అందించడంలో సహాయపడుతుంది న్యాయవ్యవస్థ యొక్క సమర్థవంతమైన పనితీరును ప్రోత్సహిస్తుంది. జడ్జి సూరేపల్లి నందా ఒకేసారి పెద్ద ఎత్తున తీర్పులతో న్యాయ వ్యవస్థ పై ప్రభావం పడి విశ్వసనీయతకు దోహదం చేస్తాయి. 1969లో జన్మించిన సూరేపల్లి నందా 28 ఏళ్లపాటు హైకోర్టులో సివిల్‌, క్రిమినల్‌ సహా అన్ని విభాగాల్లో ప్రాక్టీస్‌ చేశారు. బీఏ ఇంగ్లీష్‌ లిటరేచర్‌, ఎల్‌ఎల్‌బీ విద్యను పూర్తిచేశారు. 1993లో హైకోర్టు న్యాయవాదిగా నమోదు చేయించుకున్నారు. లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ, బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా తరఫున అనేక కార్యక్రమాల్లో సేవలు అందించారు. ఇటీవలే హైకోర్టు ఆమెను డిజిగ్నేటెడ్‌ సీనియర్‌ న్యాయవాదిగా గుర్తించి న్యాయమూర్తిగా అవకాశం ఇచ్చారు.

వరుణుడు కరుణించేనా? 

తెలంగాణలో మరో మూడు రోజుల పాటు ఎండ, వడగాల్పుల ప్రభావం ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్, కొమరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో వడగాల్పులు వీస్తాయని ఎల్లో హెచ్చరిక జారీ చేసింది. అదే సమయంలో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ నెల 19 నుంచి కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. ప్రస్తుతం రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో 40 డిగ్రీలపైనే గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మృగ శిరకార్తె వచ్చి వారం రోజులు గడిచినా వర్షాలు పడటం లేదని రైతాంగం ఆందోళన వ్యక్తం చేస్తోంది. 

వివేకా కేసులో నిందితులకు రిమాండ్

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద హత్య కేసులో ఉన్న ఆరుగురు నిందితులకు హైదరాబాద్ లోని సీబీఐ కోర్టు రిమాండ్ ను పొడిగించింది. రిమాండ్ ను ఈ నెల 30 వరకు పొడిగిస్తూ ఆదేశాలను కోర్టు జారీ చేసింది. తరుపరి విచారణను జూన్ 30కి వాయిదా వేసింది. ఈ ఆరుగురు నిందితుల్లో ఎర్ర గంగిరెడ్డి, ఉమాశంకర్ రెడ్డి, సునీల్ యాదవ్, దేవిరెడ్డి శంకర్ రెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డిలు ఉన్నారు. వీరి రిమాండ్ ముగియడంతో పోలీసులు వీరిని ఈరోజు సీబీఐ కోర్టులో ప్రవేశపెట్టారు. విచారణ సందర్భంగా కోర్టు రిమాండ్ ను పొడిగించింది. మరోవైపు ఈ కేసులో మరో నిందితుడైన కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి బెయిల్ పై బయట ఉన్నారు. తెలంగాణ కోర్టు ఆదేశాల మేరకు ప్రతి శనివారం సీబీఐ అధికారుల ముందు విచారణకు హాజరవుతున్నారు.ఈ కేసు విచారణను ఈనెల 30కి వాయిదా వేసిన నేపథ్యంలో ఏం జరుగుతుందా అనేదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

సంక్షేమ పథకాలు గట్టెక్కించేనా?

త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి గెలిచే సత్తా ఉన్నవారికి మాత్రమే కాంగ్రెస్ పార్టీ టికెట్లు ఇస్తుందని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ స్పష్టం చేశారు. ఎన్నికలకు రెండు నెలల ముందు అభ్యర్థులను ప్రకటిస్తామని చెప్పారు. రాజకీయాల్లో సక్సెస్ కావాలనుకునే వారికి సహనం ఉండాలని అన్నారు. రాజస్థాన్ యూత్ కాంగ్రెస్ సమావేశంలో ప్రసంగిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. టికెట్ రాలేదని నిరాశపడొద్దని, పార్టీ కోసం కష్టపడి పని చేయాలని, సహనంతో ముందడుగు వేసేవారే రాజకీయాల్లో సక్సెస్ అవుతారని గెహ్లాట్ అన్నారు. ఎన్నికల్లో మనం గెలవాలంటే... విజయం సాధించే సత్తా ఉన్నవారికే టికెట్ ఇవ్వాల్సి ఉంటుందని చెప్పారు. టికెట్ల కోసం ఢిల్లీలో తిరిగినా ఉపయోగం ఉండదని... ఎన్నికలకు రెండు నెలల ముందు మాత్రమే అభ్యర్థులను ఖరారు చేస్తామని తెలిపారు. రెండు నెలల ముందు అభ్యర్థులను ప్రకటించడం వల్ల వారు వారి నియోజకవర్గాల్లో కష్టపడి పనిచేయడానికి వీలు కలుగుతుందని చెప్పారు. గత కొన్ని రోజుల నుంచి గెహ్లాట్  అనేక సంక్షేమ పథకాలను ప్రకటిస్తోంది. ఇందులో ఉచితాలు ఎక్కువగానే ఉంటున్నాయి.  తన తిరుగుబాటుదారుడైన మాజీ డిప్యూటీ సచిన్ పైలట్‌తో ఇప్పటికే నష్టపోయిన  రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ మరో సారి అధికారం చేజిక్కించుకోవడానికి యత్నిస్తున్నారు.  వచ్చిన అవకాశాన్ని చేజార్చుకోవద్దని ఆయన ప్రయత్నిస్తున్నారు. రాజస్థాన్ లో అనేక సంక్షేమ పథకాలను అనౌన్స్ చేస్తున్నారు. తన ప్రభుత్వం ప్రారంభించిన సంక్షేమ పథకాలు ఆయువు పట్టు అని అశోక్ గెహ్లాట్ ప్రచారం చేసుకుంటున్నారు. 

తిరుపతిలో భారీ అగ్ని ప్రమాదం

తిరుపతిలో భారీ అగ్ని ప్రమాదం  సంభవించింది.  గోవింద రాజస్వామి ఆలయం వద్ద ఉన్న లావణ్య ఫోటో ఫ్రేమ్ షాపు లో అగ్ని ప్రమాదంలో భారీ ఎత్తున ఎగసి పడుతున్న మంటలు, చుట్టు పక్కల దుకాణాలకు  మంటలు వ్యాపించాయి. సంఘటన స్థలానికి చేరుకుని మంటలను ఫైర్ సిబ్బంది అదుపు చేస్తోంది.  తిరుపతి ఫోటో ఫ్రేమ్స్ తయారీ షాపులో  మంటలు     చెల రేగాయి. మంటలు   భారీగా ఎగిసి పడుతున్నాయి.ఘటనస్థలికి సమీపంలో గోవిందరాజు స్వామి ఆలయ రథం   ఉంది. మాడ వీధిలో రాకపోకలు నిలిపివేసారు.   మంటల్లో  పలు బైకులు    దగ్దమయ్యాయి.  తిరుపతి రైల్వే స్టేషన్ సమీపంలోనే ఈ  అగ్నిప్రమాదం సంభవించింది.మంటల్లో నాలుగు అంతస్తుల భవనం  కూడా ఉంది. సమీప భవనాలకు  మంటలు  వ్యాపిస్తున్నాయి. స్థానికులు భయాందోళనలకు గురయ్యారు.  గోవిందరాజు స్వామి రధం మండపానికి మంటలు వ్యాపించాయి

వైఎస్ఆర్ బాటలోనే భట్టి విక్రమార్క

అప్పట్లో గ్రెస్ లెజిస్లేచర్ పార్టీ నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి రాష్ట్రంలోని కరువు సంబంధిత సమస్యలను ఎత్తిచూపడానికి 60 రోజుల 1,500 కి.మీ పాదయాత్ర చేపట్టారు.  డాక్టర్ రాజశేఖరరెడ్డి పాదయాత్ర రంగారెడ్డి, మెదక్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, పశ్చిమ, తూర్పుగోదావరి, విశాఖపట్నం, విజయనగరం జిల్లాల మీదుగా 11 జిల్లాల్లో పర్యటించి శ్రీకాకుళంలోని ఇచ్ఛాపురంలో ముగిసింది.తన యాత్రలో పెద్ద సంఖ్యలో బహిరంగ సభలలో ప్రసంగించారు, వివిధ వ్యక్తులను కలుసుకున్నారు మరియు వారి సమస్యలను విన్నవించారు. కరువు సహాయక చర్యలు చేపట్టడంలో టీడీపీ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించిన ఈ పాదయాత్ర హైలైట్ చేయడమే కాకుండా, రాష్ట్రంలో కాంగ్రెస్ అదృష్టాన్ని పునరుద్ధరించింది. ప్రజానీకంలో ఆయన కొట్టిన తీగ ఎంత శక్తివంతమైందంటే, 2004లో పార్టీ అధికారంలోకి రావడంతో డాక్టర్ వైఎస్ఆర్‌ బాటలోనే మల్లు భట్టి విక్రమార్క  పీపుల్స్ మార్చ్ 1000 కిలో మీటర్లు పూర్తి చేసుకుంది. 9 ఏళ్ల బిఆర్ఎస్ ప్రభుత్వ పాలనను ప్రజలు ఎండగట్టారు. తెలంగాణ రాష్ట్ర సాధనకు కారణమైన సోనియా గాంధీ కుమారుడు రాహుల్ గాంధీ దృష్టిలో పడ్డ మల్లు భట్టి విక్రమార్క ఆయన జయంతిని పురస్కరించుకుని  విషెస్ చెప్పారు. ఆదిలాబాద్ లో ప్రారంభమైన పీపుల్స్ మార్చ్ విజయవంతంగా కొనసాగుతుంది. తెలంగాణలో  అధికారంలో రావడానికి చేరువవుతోంది. 

కోడి కత్తి కేసులో కొత్త మలుపు

ఒక మాజీ మంత్రి, మాజీ ఎంపీ మర్డర్ కేసులో నిదితుడిగా  ఉన్న ఒక ఎంపీకి, ముందస్తు బెయిల్  లభిస్తుంది. కానీ,  కోడి కత్తి కేసులో నిందితుడు, శ్రీనివాసరావు ఐదేళ్లుగా  జైలులో మగ్గుతున్నా, ఎన్ని సార్లు కోర్టును వేడుకున్నా, అతనికి మాత్రం బెయిల్  దక్కదు. కేసు విచారణ ముందుకు సాగదు. ఇదెక్కడి న్యాయం అని న్యాయ దేవతను అడగవచ్చునో లేదో కానీ, అడగడమే న్యాయం అనిపిస్తుంది.  2019 ఎన్నికలకు ముందు పాదయాత్ర సమయంలో.. విశాఖ ఎయిర్‌పోర్టులో వైఎస్ జగన్‌పై దాడి జరిగిన సంగతి తెలిసిందే. శ్రీనివాసరావు కోడి కత్తితో దాడి చేడంతో జగన్‌కు గాయం అయ్యింది. ఈ కేసు దర్యాప్తును ఎన్ఐఏ చేపట్టింది.. నాలుగేళ్లుగా ఈ కేసు విచారణ కొనసాగుతోంది. అడ్వొకేట్‌ కమిషనర్‌ను నియమించి స్టేట్‌మెంట్‌ తీసుకోవాలని, కేసును మరింత లోతుగా విచారణ చేయాలని కోరుతూ సీఎం జగన్‌ ఎన్‌ఐఏ కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. గతంలో పిటిషన్లపై వాదనలు వినిపించారు. అయితే న్యాయమూర్తి బదిలీపై వెళ్లి.. నూతన న్యాయమూర్తి రావటంతో మరోసారి పూర్తి స్థాయి వాదనలు వినిపించాల్సిన అవసరం ఉంది. ఈ నేపధ్యంలో తాజగా ఈ కేసుపై విజయవాడ ఎన్‌ఐఏ కోర్టులో విచారణ జరిగింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ తరఫు లాయర్ వాదనలు వినిపించాల్సి ఉంది. కానీ, ఇందుకు ఆయన సమయం కావాలని కోరారు. దీంతో కోర్టు కేసును తదుపరి వాదనల నిమిత్తం జులై 4కు వాయిదా వేశారు. ఇదిలా ఉంటే కోడి కత్తి కేసులో నిందితుడిగా ఉన్న శ్రీనివాసరావు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ)కి లేఖ రాశారు. తన ఇబ్బందుల్ని ప్రధానంగా ఆ లేఖలో ప్రస్తావించారు. రాజమండ్రి సెంట్రల్ జైలులో గత 1,610 రోజులుగా విచారణ ఖైదీగా మగ్గుతున్నానని లేఖలో పేర్కొన్నారు. కోడికత్తి కేసును త్వరితగతిన విచారణ చేయాలని.. ఒకవేళ లేని పక్షంలో తనకు బెయిల్‌ అయినా ఇవ్వాలని గతంలోనే కింది కోర్టుకు పలుసార్లు విన్నవించుకున్నా ఫలితం లేకపోయిందని పేర్కొన్నాడు. న్యాయం చేయాలని తన తల్లి కూడా అర్జీ పెట్టారని.. అయినా పురోగతి లేదన్నాడు. కేసు నమోదై ఐదేళ్లు అవుతున్నా కింది కోర్టు పదేపదే తన రిమాండ్‌ కాలాన్ని పొడిగిస్తోందని చెప్పాడు. తమది పేద కుటుంబం, వృద్ధులు కావడంతో పై కోర్టుల్లో అప్పీల్‌కు వెళ్లలేని పరిస్థితి ఉందన్నారు. జైలులో ఎంతో మానసిక వేదనను అనుభవిస్తున్నాని.. వీటిని పరిగణనలోకి తీసుకుని కేసు త్వరగా విచారణ జరిగేలా చూడాలని శ్రీనివాసరావు కోరారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి గురువారం లేఖ రాశారు. మరి శ్రీనివాసరావు రాసిన ఈ లేఖపై సీజేఐ ఎలా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. సుప్రీం సీజేఐకి లేఖ పంపిస్తామని నిందితుడి తరఫు లాయర్ తెలిపారు. ఈ కేసులో కుట్ర కోణం లేదని ఎన్‌ఐఏ అధికారులు చెప్పినా కొత్తగా పిటిషన్‌ వేయడం వెనక వేరే కారణాలు ఉన్నాయన్నారు. విచారణను వేగవంతం చేసి కేసుకు ముగింపు పలకాలని, లేదంటే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామన్నారు.  కాగా, న్యాయం జరగడమే కాదు, న్యాయం జరుగుతుందనే విశ్వాసం కల్పించడం కూడా న్యాయ వ్యవస్థ కర్తవ్యమని, న్యాయనిపుణులు పేర్కొంటున్నారు. అలాగే,  ‘,Justice delayed is justice denied’… ఆలస్యంగా జరిగే న్యాయం అన్యయంతో సమానం ..న్యాయాన్ని తిరస్క్రించడమే, అని న్యాయకోవిదులు గుర్తు చేస్తున్నారు.

పేర్ని నాని చేతిలో చెప్పుల జత

ఓ వైపు ఎన్నికలు సునామీలా దూసుకొచ్చేస్తున్నాయి...  మరోవైపు  సైకిల్ పార్టీతో జనసేన పార్టీ కలిసి అడుగులు వేస్తోంది.. దీంతో అధికార ఫ్యాన్ పార్టీ అగ్రనేతల్లో ఫ్రస్ట్రేరేషన్ పీక్స్ ‌చేరిందా? ఆ క్రమంలోనే మచిలీపట్నం ఎమ్మెల్యే, మాజీ మంత్రి పేర్ని నాని.. జూన్ 15వ తేదీ ప్రెస్‌మీట్ పెట్టి.. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌పై తన మాటల తూటాలతో చెలరేగిపోయాడనే ఓ చర్చ అయితే పోలిటిలక్ సర్కిల్‌లో వాడి వేడిగా ఊపందుకొంది. వచ్చే ఎన్నికల్లో 175కి 175 అసెంబ్లీ స్థానాల్లో గెలుపొందాలనే లక్ష్యంతో ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైయస్ జగన్.. వ్యూహాత్మకంగా అడుగులు వేసుకొంటూ వెళ్తున్నారని.. అలాగే అదే టార్గెట్‌గా పెట్టుకొని పని చేయాలంటూ.. పార్టీ శ్రేణులకు ఆయన ఓ దిశానిర్దేశాన్ని కూడా చేశారని సదరు సర్కిల్‌లో వైరల్ అవుతోంది.  అయితే పసుపు పార్టీతో జననసే పార్టీ అడుగులో అడుగు వేసుకొంటూ.. ఎన్నికలకు వెళ్లితే.. తమ బతుకు బందరు బస్టాండేనని ఫ్యాన్ పార్టీ నేతలకు క్లియర్ కట్‌గా అర్థమైందని.. ఆ క్రమంలోనే బందరు ఎమ్మెల్యే పేర్ని నాని అప్పటికప్పుడు ప్రెస్ మీట్ పెట్టి.. చెప్పులు చూపించాడనే చర్చ సైతం పోలిటికల్ సర్కిల్‌లో వాయివేగంతో వైరల్ అవుతోంది. అంతేకాదు గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల క్లిప్లింగులను సైతం ఈ ప్రెస్ మీట్‌లో పేర్ని నాని ప్రదర్శించడం ద్వారా ఫ్యాన్ పార్టీ నేతలు తమ కక్ష తీర్చుకొన్నారనే అబిప్రాయం సైతం వ్యక్తమవుతోంది.   అయితే అర్థం కానీ విషయం ఏమిటంటే.. దొంగల పడ్డ ఆరు నెలలకు కుక్కలు మొరిగినట్లు.. జనసేనాని పవన్ కల్యాణ్.. నాడు ఎప్పుడో వైసీపీ నేతలకు చెప్పు చూపిస్తే.. దానికి ప్రతిగా నేడు పేర్ని నాని రెండు చెప్పులు చూపించారని.. దీనిని బట్టే ఫ్యాన్ పార్టీ నేతల్లో ఓ విధమైన భయం, ఆందోళన గూడు కట్టుకోన్నాయనే విషయం అర్థమవుతోందని చర్చ సైతం కొన.. సాగుతోంది.  2014 ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ కలిసి పోటీ చేస్తే.. జనసేన పార్టీ బయట నుంచి మద్దతు ప్రకటించిందని.. సదరు ఎన్నికల్లో ఈ కూటమి తన.. సత్తా చాటడంతో ఏపీలో టీడీపీ ప్రభుత్వం ఏర్పడిందని... అయితే 2019 ఎన్నికల్లో టీడీపీ, జనసేన పార్టీలు విడివిడిగా బరిలోకి దిగడంతో ఓట్లు భారీగా చీలిపోయి.. జగన్ పార్టీకి గెలుపునకు కలిసి వచ్చిందని.. దీంతో జగన్ గద్దెనెక్కారని గుర్తు చేసుకొంటున్నారు. అయితే 2024 ఎన్నికల్లో జనసేన, టీడీపీ కలిసి పోటీ చేస్తే.. 2014 నాటి ఎన్నికల ఫలితాల కంటే మరింత మెరుగైన ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని ఇప్పటికే ప్రజల్లో ఓ స్పష్టతతో కూడిన అభిప్రాయం వ్యక్తమవుతోందని... అలాంటి వేళ పేర్ని నాని ప్రెస్‌మీట్ పెట్టి.. ఈ తరహా వ్యాఖ్యలు చేశారనే చర్చ సైతం పోలిటికల్ సర్కిల్‌లో నడుస్తోంది.  మరోవైపు జగన్ ప్రభుత్వం ఈ నాలుగేళ్ల పాలనలోని లోపాలను ఇప్పటికే ప్రజలు స్పష్టంగా గుర్తించారని.. అలాగే జగన్ తొలి మలి కేబినెట్‌లోని మంత్రులు న భూతే న భవిష్యత్త్ అన్నట్లుగా వారు మాట్లాడుతోన్న బూతు పురాణం, అదే విధంగా మూడు రాజధానులు అంటూ ప్రకటించి.. మూడేళ్లు గడిచినా.. ఎక్కడ అభివృద్ధి మాత్రం వీసమెత్తు కూడా జరగకపోవడం.. ఇక రాష్ట్రాభివృద్ధిపైనే కాకుండా రాష్ట్ర ఆర్థికాభివృద్ధిపైన సైతం ఈ ముఖ్యమంత్రి  వైయస్ జగన్ కనీస అవగాహన లేదని స్పష్టం కావడం.. ఇంకోవైపు విభజన సమస్యలతో రాష్ట్రం సతమతమవుతోందని.. విభజన సమస్యల పరిష్కారించే దిశగా ఈ ప్రభుత్వం చర్యలు చేపట్టక పోవడం తదితర అంశాలపై ప్రజలు పక్కా క్లారిటీతో ఉన్నారనే విషయం వీరికి అర్థమైందని.. అలాగే గత ఎన్నికల వేళ వైయస్ జగన్‌ వెంట మద్దతుగా ఆయన తల్లి వైయస్ విజయమ్మ, చెల్లి వైయస్ షర్మిల ఉన్నారని కానీ నేడు ఆ పరిస్థితి అయితే లేదని.. ఇక సీఎం వైయస్ జగన్ సొంత చిన్నాన్న వైయస్ వివేకా హత్య కేసులో అందరి  చూపులే కాదు..వేళ్లని కడప ఎంపీ, సోదరుడు వైయస్ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి వైయస్ భాస్కరరెడ్డి వైపే చూపిస్తున్నాయని.. ఆ క్రమంలో ముఖ్యమంత్రిగానే కాక. వైయస్ ఫ్యామిలీలోని మనిషిగా వైయస్ జగన్ వ్యవహర శైలిని సైతం ప్రజలు ఆసక్తిగా గమనిస్తున్నారని.. అలాగే ఈ హత్య కేసులో న్యాయ పోరాటం కోసం వైయస్ జగన్ సోదరి వైయస్ సునీత తీవ్రంగా శ్రమిస్తున్నారు. దీంతో ఈ టోటల్ ఎపిసోడ్‌లో వైయస్  జగన్ ప్రభుత్వంపై ప్రజల్లో ఓ విధమైన వ్యతిరేకత ఉందని ఫ్యాన్ పార్టీలోని అగ్ర నాయకత్వం ముందే ఊహించిందని.. దాంతో చంద్రబాబు, పవన్ కల్యాణ్ కలిస్తే.. వచ్చే ఎన్నికల ఫలితాల్లో ఫ్యాన్ పార్టీ మొత్తానికి మోత మోగిపోవడం ఖాయమనే ఓ క్లియర్ కట్ ఇండికేషన్ ఇప్పటికే ఫ్యాన్ పార్టీ లక్కీ ప్యాక్.. ఐ ప్యాక్ నివేదిక ఇచ్చి ఉంటుందని ... ఈ నేపథ్యంలో పేర్ని నాని ప్రస్ట్రేషన్‌లో ప్రెస్ మీట్ పెట్టి చేలరేగిపోయి ఉంటారనే చర్చ పోలిటికల్ సర్కిల్‌లో యమరంజుగా కొన...సాగుతోంది.

ఫ్యామిలీ సేఫ్

విశాఖ ఎంపీ తన ఫ్యామిలీ కిడ్నాప్‌నకు గురైన వ్యవహారంపై విశాఖపట్నం ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ స్పందించారు. విశాఖ ఎయిర్‌పోర్టులో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తన ఫ్యామిలీ, తన స్నేహితుడు సేఫ్‌గా ఉన్నారన్నారు. కిడ్నాప్‌పై ఫిర్యాదు చేసిన మూడు గంటల్లోనే పోలీసులు ఈ కేసును ఛేదించారని చెప్పారు. ఈ సందర్భంగా విశాఖ నగర పోలీసులకు ఆయన కృతజ్జతలు తెలిపారు. కిడ్నాపర్ హేమంత్‌తో తనకు ఎలాంటి పరిచయం లేదని స్పష్టం చేశారు. అయితే కేవలం డబ్బు కోసమే అతడు ఈ కిడ్నాప్‌కి పాల్పడ్డాడన్నారు.   అయితే 3 రోజుల క్రితం కిడ్నాపర్ హేమంత్ ఋషికొండలో తన కుమారుడు నివాసంలోకి చొరబడి, అతడ్ని నిర్బంధించాడని.. అనంతరం తన కుమారుడితో ఫోన్ చేయించి.. తనకు ఒంట్లో బాగోలేదంటూ.. తన భార్యను.. కుమారుడి ఇంటికి కిడ్నాపర్ రప్పించాడని.. అలా తన భార్యని కూడా నిర్బంధించాడని చెప్పారు. ఆ తర్వాత తన భార్య, కొడుకు చేత తన స్నేహితుడు గన్నమనేని వెంకటేశ్వరరావుని సైతం ఇంటికి పిలిపించి.. అతడ్ని కూడా కిడ్నాప్ చేశాడని పేర్కొన్నారు. వీరి ముగ్గురిని చిత్రహింసలకు గురి చేస్తూ.. డబ్బులు కోసం డిమాండ్ చేశాడన్నారు. అయితే ఈ కిడ్నాప్ జరిగినప్పుడు తాను హైదరాబాద్‌లో ఉన్నానన్నారు.  మరోవైపు ఆనందపురం పోలీస్ స్టేషన్‌లో కిడ్నాపర్లను పోలీసులు విచారిస్తున్నారు. అలాగే పోలీస్‌స్టేషన్ పరిసర ప్రాంతాల్లోకి ఎవ్వరూ రాకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. మీడియాను కూడా పోలీసులు అనుమతివ్వలేదు. హేమంత్ ఈ కిడ్నాప్ ద్వారా రూ.50 కోట్లు డిమాండ్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ మాజీ కార్పొరేటర్ వీజారెడ్డి హత్య కేసులో హేమంత్ ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. హేమంత్‌ తరచూ రియల్ ఎస్టేట్ వ్యాపారులతో ఘర్షణకు దిగుతూ ఉంటాడని పోలీసులు వెల్లడించారు. అతడిపై ఇప్పటికే పలు కేసులు నమోదు అయి ఉన్నాయని పోలీసులు తెలిపారు.

జైల్లో ఏ7ని కలిసిన ఏ8 భేటీ

కడప ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డి గురువారం చంచల్‌గూడ జైలుకు వెళ్లారు. జైలులో ఉన్న తన తండ్రి వైయస్ భాస్కరరెడ్డిని పరామర్శించారు. తండ్రి ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిని ఆయనే స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా తండ్రికి ఆరోగ్యంపై అవినాష్ రెడ్డి పలు సూచనలు చేసినట్లు తెలుస్తోంది. ఆంధ్ర్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ సొంత చిన్నాన్న వైయస్ వివేకా హత్య కేసులో వైయస్ అవినాష్ రెడ్డితోపాటు ఆయన తండ్రి వైయస్ భాస్కరరెడ్డి తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఆ క్రమంలో ఈ హత్య కేసులో వైయస్ భాస్కరరెడ్డిని సీబీఐ అధికారులు గతంలోనే అరెస్ట్ చేసి.. హైదరాబాద్‌లోని చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఆయితే ఇటీవల ఆయన అస్వస్థతకు గురయ్యారు. ఈ నేపథ్యంలో తండ్రిని కలిసేందుకు వైయస్ అవినాష్ రెడ్డికి జైలు అధికారులు అనుమతి ఇచ్చారు.   మరోవైపు వివేకా హత్య కేసులో వైయస్ అవినాష్ రెడ్డిని సీబీఐ అధికారులు మరో సారి విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు ఇవ్వగా.. తన తల్లి తీవ్ర అనారోగ్యంతో ఉన్నారని.. ఆ క్రమంలో కర్నూలులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోన్నారని... ఆమెకు సహయంగా ఉండాల్సి ఉందంటూ కారణం చూపుతూ.. సీబీఐ విచారణను వాయిదా వేస్తూ వచ్చారు. ఆ క్రమంలో సీఎం వైయస్ జగన్ ఢిల్లీ పర్యటనకు వెళ్లి రావడం.. ఆ తర్వాత వైయస్ అవినాష్ రెడ్డికి కోర్టు నుంచి ముందస్తు బెయిల్ లభించడం చకచకా జరిగిపోయాయి. అయితే వివేకా హత్య కేసులో వైయస్ భాస్కరరెడ్డి ఏ7 ముద్దాయి కాగా, వైయస్ అవినాష్ రెడ్డి ఏ8 ముద్దాయిగా ఉన్న విషయం విదితమే.

రియల్ తగాదాలే  కిడ్నాప్ కు కారణం? 

విశాఖలో వైసీపీ ఎంపీ భార్యాపిల్లల కిడ్నాప్ కలకలం రేపింది. ప్రముఖ ఆడిటర్, మాజీ స్మార్ట్ సిటి చైర్మన్‌ జీవీతో పాటు ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కుమారుడు చందు, భార్య జ్యోతి కిడ్నాప్ అయ్యారు. ఈ విషయం క్షణాల్లో మీడియాలో వైరల్ అయ్యింది. రంగంలోకి దిగిన పోలీసులు క్షణాల్లో ఎంపీ భార్య, కుమారుడు, ఆడిటర్ ఆచూకీని కనుగొన్నారు. కిడ్నాపైన ముగ్గురూ క్షేమంగా ఉన్నారని ఎంపీ తెలిపారు. విశాఖ-ఏలూరు రోడ్డులో ఎంపీ భార్య, కుమారుడి ఆచూకీని పోలీసులు కనుగొన్నారు. కిడ్నాపర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. కిడ్నాప్‌నకు ముగ్గురు వ్యక్తులు పాల్పడినట్టు పోలీసులు చెబుతున్నారు. ఈ ముగ్గురిలో రౌడీషీటర్‌ హేమంత్ కీలకంగా వ్యవహరించినట్టు తెలిపారు. హేమంత్‌పై గతంలో పలు కిడ్నాప్ కేసులు నమోదు అయ్యాయి. కాంగ్రెస్ మాజీ కార్పొరేటర్ వీజారెడ్డిని హత్య చేసిన కేసులో హేమంత్ ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. కిడ్నాప్ అనంతరం రూ.50 కోట్లు డిమాండ్ చేసినట్టు సమాచారం. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్న ఎంవీవీ విషయం తెలియగానే హుటాహుటిన వైజాగ్‌కు బయలుదేరారు. ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే కిడ్నాపర్లలో ఒకరైన హేమంత్ కు నేర చిట్టా ఉంది. రియల్టర్ ను కిడ్నాప్ చేసిన కేసులో ఈ సంవత్సరం ఫిబ్రవరిలో హేమంత్ అరెస్ట్ చేశారు. వైసీపీ ఎంపీ, భార్య కిడ్నాప్ కేసులో కూడా మూలాలు రియల్ ఎస్టేట్ తగాదాలు ఉన్నట్లు తెలుస్తోంది. అధికార పార్టీ ఎంపీ కుటుంబానికే రక్షణ లేకుంటే సామాన్యులకు రక్షణ ఎక్కడ అని పలువురు చర్చించుకుంటున్నారు. తొలుత కిడ్నాప్ వ్యవహారం రహస్యంగా ఉంచిన పోలీసులు కిడ్నాప్ వార్త వైరల్ అవడంతో సినిమాల్లో పోలీసులు లేట్ గా ఎంట్రీ ఇచ్చినట్టు ఉంది విశాఖ కిడ్నాప్ వ్యవహారం.