బీజేపీపై పవన్ సుత్తి మెత్తని విమర్శల మర్మమేంటో?!
posted on Jun 22, 2023 6:59AM
జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం తన ఎన్నికల ప్రచార రథం వారాహీలో విజయయాత్ర కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ యాత్ర కోనసీమ జిల్లా ముమ్ముడివరంలో కొనసాగుతుండగా అక్కడ బుధవారం(జూన్ 21) భారీ బహిరంగ సభ కూడా నిర్వహించారు. యధావిధిగా ఈ సభ నుండి వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. తనకి మద్దతు తెలిపి ఆశీర్వదించి అసెంబ్లీకి పంపించమని జన సైనికులను, ప్రజలను కోరారు. అధికార వైసీపీపై పవన్ కళ్యాణ్ విమర్శలు చేయడం సహజమే కాగా.. ఇప్పటికే పొత్తులో ఉన్న బీజేపీపై కూడా పవన్ సుతిమెత్తని విమర్శలు చేసేస్తున్నారు. ఈ వారాహీ విజయయాత్ర మొదలైనప్పటి నుండి అప్పుడప్పుడు బీజేపీకి పవన్ చురకలంటిస్తూనే ఉన్నారు.
తాజాగా కాకినాడలో జనసేన సభలో మాట్లాడిన పవన్ కళ్యాణ్ బీజేపీ మీద కొన్ని హాట్ కామెంట్స్ చేశారు. తాను బీజేపీని ఏ విషయంలోనూ గుడ్డిగా సపోర్ట్ చేయడం లేదని అన్నారు. వైసీపీకి పాతికకు 22 లోక్ సభ సీట్లు ఇచ్చి పార్లమెంటుకి పంపిస్తే.. ఆ పార్టీ వెళ్లి బీజేపీకి ప్రతీ విషయంలో మద్దతు తెలియ చేస్తోందని.. దీన్ని ముస్లిం సోదరులు గుర్తించాలన్న పవన్.. ముస్లిం ఓట్లతో అధికారంలోకి వచ్చిన వైసీపీ బీజేపీకి లొంగిపోయిందని సంచలన కామెంట్స్ చేశారు. ఈ వ్యాఖ్యలు ఏదో రాజకీయ విమర్శల మాదిరే ఉన్నా లోతుగా వెళ్లి చూస్తే ఈ వ్యాఖ్యలు బీజేపీకి విమర్శలే అవుతాయి. ప్రజలు నమ్మి వైసీపీకి ఓటేస్తే.. వాళ్ళు వెళ్లి బీజేపీకి కొమ్ముకాస్తున్నారన్న పవన్.. ఇది ముస్లిం సోదరులు గమనించాలని నొక్కి చెప్పారు. ఎంత కాదనుకున్నా ముస్లిం ప్రజానీకం మత పార్టీగా చూస్తున్న బీజేపీని అంత సులభంగా నమ్మరన్న విషయం తెలిసిందే. అయితే, వైసీపీ కూడా ఆ మత పార్టీలకే వత్తాసు పలుకుతోందని పవన్ విమర్శల అర్ధం. ఇక్కడ వైసీపీనే పవన్ విమర్శించినా అందులో బీజేపీని కలపడం ఆసక్తికరంగా మారింది.
అంతేకాదు, బీజేపీని నేను గుడ్డిగా నమ్మనని చెప్పడం మరికాస్త ఆసక్తి కలిగించింది. బీజేపీకి జనసేన మిత్రపక్షం. ఎన్నిసార్లు ఈ దోస్తీ తెగదెంపులు అవుతుందని ప్రచారం జరిగినా పవన్ మాత్రం బీజేపీని వదులుకోలేదు. ఎన్నికలకు ఈ రెండు పార్టీలు కలిసే వెళ్లనున్నాయి. ఆ విషయంలో రెండు పార్టీలూ మీడియా ముందుకు వచ్చి అదే చెబుతూంటాయి.ఇప్పుడు ఈ రెండు పార్టీలూ కలిసి తెలుగుదేం పార్టీకి చేరువయ్యే అవకాశాలూ కనిపిస్తున్నాయి. అయితే పవన్ తాజా పవన్ వ్యాఖ్యలను చూస్తే మాత్రం ఆ మిత్ర బంధం పై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. గతంలో బీజేపీ రూట్ మ్యాప్ కోసం ఎదురుచూస్తున్నా అని ప్రకటించిన పవన్ ఇప్పుడు ఆ రూట్ మ్యాప్ వచ్చిందో రాలేదో కానీ వారాహి యాత్ర మొదలు పెట్టి తెగ చుట్టేస్తున్నారు. పైగా బీజేపీ మీద ఇలా సుతిమెత్తని విమర్శలు చేస్తూ వస్తున్నారు. దీంతో పవన్ ఆంతర్యం ఏమిటో విశ్లేషకులకు సైతం అంతుచిక్కడం లేదు.
అయితే నిజానికి పవన్ రాజకీయంగా రాటుదేలుతున్నారు. ఒకవైపు ఢిల్లీ పెద్దలు నాకు జిగిరీ దోస్తులు అంటూనే.. అంత గుడ్డిగా వాళ్ళని నమ్మలేనని రాష్ట్రంలో ప్రజలకు చెప్తున్నారు. జగన్ మోహన్ రెడ్డిని నమ్మి ముస్లిం సోదరులు ఓటేస్తే.. ఆయన మంచీ చెడు అనేది లేకుండా కేంద్రం తీసుకొనే అన్ని నిర్ణయాలకు జై కొడుతున్నారని.. కానీ, తాను అలా నమ్మను.. మంచీ చెడు అలోచించి ప్రజలకు పనికొచ్చే వాటికే మద్దతు ఇస్తానని చెప్పారు. ఒకవిధంగా చెప్పాలంటే బీజేపీతో మితృత్వం ఉన్నా అది మీ కోసమే అన్నట్లు పవన్ ప్రజల వద్ద చెప్పకనే చెప్తున్నారు. అదే సమయంలో ఏపీ సర్కార్ విషయంలో బీజేపీ తన వైఖరిని తేల్చేయాలన్న ఒత్తిడీ తీసుకు వచ్చారు. దీనిని బట్టి చూస్తే జనసేనుడికి సైతం ఆంధ్రా రాజకీయాలు అంతు బట్టాయనిపిస్తుంది.