సంక్షిప్తం 11 AM
posted on Jun 22, 2023 @ 10:54AM
1. గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో మంత్రులు , ఎమ్మెల్యేలు, రీజనల్ కోఆర్డినేటర్లతో సీఎం జగన్ నిన్న సమీక్ష నిర్వహించారు. పనితీరు లేని ఎమ్మెల్యేలకు వచ్చే ఎన్నికలలో టికెట్ ఇచ్చేది లేదని హెచ్చరించారు.
2. నకిలీ ఔషధాలపై కేంద్రం సీరియస్ అయ్యింది. కలుషిత దగ్గు మందు కారణంగా విదేశాలలో పిల్లలు ప్రాణాలు కోల్పోయారన్న నివేదికల నేపథ్యంలో కేంద్ర మంత్రి మాండవీయ 18 కంపెనీల మూసివేతకు ఆదేశాలు జారీ చేశారు.
3. తమిళనాడు రాష్ట్రంలో డీఎంకే పాలనలో అవినీతి రాజ్యమేలుతోందని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ విమర్శించారు. తాంబరంలో జరిగిన బీజేపీ పార్టీ బహిరంగ లో మాట్టాడిన ఆయన ఒక సారి బీజేపీకి అధికారం ఇస్తే అవినీతి రహిత పాలన ఎలా ఉంటుందో చూపుతామని పేర్కొన్నారు.
4. ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఒంటిమిట్టలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో దాతల సహకారంతో రూ.4 కోట్లతో అన్నదాన భవనం నిర్మించేందుకు టిటిడి పాలకమండలి ఆమోదం తెలిపింది.
5. కడప నగరానికి బ్రహ్మంసాగర్ జలాశయం నుంచి మంచినీటిని తరలించడానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బ్రహ్మంసాగర్-కడప నీటి ప్రాజెక్టు రూ.462 కోట్ల వ్యయం అవుతుందని అధికారులు అంచనా వేశారు.
6. కేరళలోని కొట్టాయం జిల్లాలో శబరిమల గ్రీన్ ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలకు కేంద్ర పర్యావరణశాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రూ.3,411 కోట్ల వ్యయంతో ఎరుమలి ప్రాంతంలో 2,570 ఎకరాల్లో ఈ విమానాశ్రయాన్ని నిర్మించనున్నారు.
7.మహబూబ్ నగర్ సమీపంలోని అప్పన్నపల్లి వద్ద రెండో రైల్వే ఓవర్ బ్రిడ్జిని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి.శ్రీనివాస్ గౌడ్ నిన్న ప్రారంభించారు. 30 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన రెండో రైల్వే ఓవర్ బ్రిడ్జిని కేవలం 12 నెలల్లోనే పూర్తి చేశామని మంత్రి చెప్పారు.
8. తెలంగాణ కోసం జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు జయశంకర్ అని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి అన్నారు. జయశంకర్ వర్ధంతి సందర్భంగా బుధవారం ఆయన విగ్రహానికి ఎమ్మెల్యే గండ్ర పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.
9. విపక్షాల ఐక్యత కోసం వివిధ రాష్ట్రాలకు చెందిన 15 మంది ప్రతిపక్షాల నేతలు రేపు పాట్నాలో భేటీ కానున్నారు. బీహార్ సీఎం నితీశ్ కుమార్ ఇంట్లో జరగనున్న ఈ సమావేశానికి కాంగ్రెస్, టీఎంసీ, ఆప్, ఎన్సీపీ, ఎస్పీ, ఎన్సీ తదితర పదిహేను పార్టీల అధినేతలు హాజరు కానున్నారు.
10. ఒడిశా రైలు ప్రమాదం సమయంలో స్వచ్ఛందంగా స్పందించిన గ్రామస్థులు వందలాది మంది ప్రయాణికుల ప్రాణాలు కాపాడారు. ఇప్పుడు ఆ గ్రామాభివృద్ధికి రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ రూ.2 కోట్ల నిధులు ప్రకటించారు.