బండి సంజయ్ హస్తినకు పిలిస్తేనే వెళ్ళారా?
posted on Jun 22, 2023 @ 10:24AM
బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రెండు రోజులు ఢిల్లీలో పర్యటించారు. సోమవారం ఢిల్లీ వెళ్లిన సంజయ్ రెండు రోజులుగా అక్కడ పార్టీ అగ్ర నేతలతో వరుసగా భేటీ అయ్యారు. దీంతో ఢిల్లీలో ఏం జరుగుతోంది? రాష్ట్రంలో ఏం జరగబోతుందన్నది ఆసక్తిగా మారింది. ఎన్నికలకు ఆరు నెలలే సమయం ఉండగా బీజేపీ అధిష్టానం తెలంగాణపై ఈసారి భారీ ఆశలే పెట్టుకుంది. ఈ క్రమంలోనే తెలంగాణ నేతలు ఏది అడిగినా కేంద్రం కాదనకుండా చేస్తుంది. సహజంగానే ఎన్నికలకు ముందు ఎలక్షన్ మేనేజ్మెంట్ పగడ్బందీగా రాసుకొనే బీజేపీ తెలంగాణలో ఏం చేయబోతుందన్నది ఆసక్తిగా ఉండగా.. ఈ లోగా బండి సంజయ్ మూడు రోజులుగా ఢిల్లీలోనే మకాం వేయడం మరింత ఆసక్తికరంగా మారింది.
ఒకవైపు రాష్ట్రంలో రాష్ట్ర పార్టీ పగ్గాలు చేతులు మారనున్నాయని.. బండి సంజయ్ ను పక్కకి తప్పించి ఈటల రాజేందర్ కు అధ్యక్ష పదవికి కట్టబెడతారన్న ప్రచారం జరుగుతుండగానే బండి సంజయ్ ఢిల్లీలో అగ్ర నేతలను కలిశారు. దీంతో సహజంగానే అందరి చూపు ఈ వ్యవహారంపైనే ఉంటుంది. సహజంగా ఒక రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు ఇలా ఢిల్లీ పర్యటనకు వెళ్తుంటే కనీసం రాష్ట్ర శాఖకి సమాచారం ఉంటుంది. కానీ ఈసారి బండి రాష్ట్రంలో ఉన్న పార్టీ నాయకులకు కనీసం మాట మాత్రంగా కూడా ఈ పర్యటనకు సంబంధించి ఏమీ చెప్పకుండా వెళ్లడం ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
మొత్తంగా బండి ఆకస్మిక ఢిల్లీ పర్యటన ఉత్కంఠగా మారింది. రెండు రోజులుగా బండి ఢిల్లీలో ఏం చేస్తున్నారు? ఇంకా ఎన్ని రోజులు అక్కడే ఉండనున్నారు? ఇప్పటి వరకు ఎవరెవరిని కలిశారు? ఇంకా ఎవరిని కలవనున్నారు? బండి సంజయ్ ను పార్టీ పెద్దలే హుటాహుటిన ఢిల్లీకి రమ్మన్నారా? లేక ఆయనే స్వయంగా వెళ్లి పెద్దలతో భేటీ అవుతున్నారా? గత నెల రోజులుగా ప్రచారం జరుగుతున్నట్లు బండి సంజయ్ ను అధ్యక్ష పదవి నుండి తప్పిస్తారా? ఈటల రాజేందర్ కు పార్టీ పగ్గాలు అప్పగిస్తారా? రాష్ట్ర పార్టీలో ఏ ఇద్దరు కలిసినా ఇదే చర్చ జరుగుతుంది.
నిజానికి రాష్ట్రంలో అధ్యక్ష మార్పు తప్పదని సంకేతాలు తరచుగా వస్తున్నాయి. మరో ఆరు నెలల్లోనే ఎన్నికలు ఉండడంతో.. ఈ ఎన్నికలపై ఎన్నో ఆశలు పెట్టుకున్న అధిష్టానం ఇక్కడ నుండి కేసీఆర్‌ను ఢీ కొట్టాలంటే అంతే బలంగా వ్యవహరించే నాయకుడి కోసం చూస్తున్నది. ప్రస్తుతం పార్టీలో ఉన్న వారిలో చూస్తే ఏ రకంగా చూసినా అధిష్టానం అంచనాలకు తగ్గట్లు కనిపిస్తున్నది ఒక్క ఈటల రాజేందర్ మాత్రమే. కేసీఆర్ కు మాజీ సన్నిహితుడిగా.. కేసీఆర్ వ్యూహ రచనను దగ్గర నుండి చూసిన వ్యక్తిగా కూడా ఈటల బెస్ట్ అప్షన్ గా కనిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ చీఫ్ బండి సంజయ్ ఆకస్మిక ఢిల్లీ పర్యటన ఆసక్తిగా మారింది. మూడు రోజుల పర్యటన అనంతరం బండి సంజయ్ ఢిల్లీ నుండి తిరిగి కూడా వచ్చేశారు. మరి ఇక ప్రచారానికి తగ్గట్లే మార్పులు ఉంటాయా? లేక ఊరించి ఊరించి ఉసూరుమనిపిస్తారా అన్నది చూడాల్సి ఉంది.