జగన్ అసహనం పీక్స్.. కారణం అదేనా?
posted on Jun 22, 2023 6:27AM
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిలో ఫ్రస్ట్రేషన్ పీక్స్ కు చేరిందా? ఆయన నడకలో తడబాటు , మాటల్లో తొట్రుపాటు అందుకేనా? అంటే, వైసీపీ నాయకులే అవునని అంటున్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మొదటి నుంచి కూడా, గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం పై గంపెడు ఆశలు పెట్టుకున్నారు. కానీ, పార్టీ ఎమ్మెల్యేలలో మాత్రం ఆ విశ్వాసం ఉన్నట్లుగా లేదు. అందుకే, మెజారిటీ ఎమ్మెల్యేలు ఏదో ఒక వంకన గడపగడపకు దండం పెట్టి తప్పుకుంటున్నారు
అందుకే ఆయన ప్రతి మూడు నాలుగు నెలకు ఒకసారి, గడపగడపకు మన ప్రభుత్వం వర్క్ షాప్ నిర్వహిస్తున్నారు, ప్రతి వర్క్ షాప్ లో ఎమ్మెల్యేలను పేరు పేరునా పిలిచి పని తీరు బాగాలేదని హెచ్చరిస్తున్నారు.ఎమ్మెల్యేలనే కాదు. మంత్రులను హెచ్చరిస్తున్నారు. అయినా చాలా వరకు ఎమ్మెల్యేలు జగన్ రెడ్డి హేచ్చరికలను అంతగా పట్టించుకోవడం లేదు. అందుకు వారి కుండే కారణాలు వారికున్నాయి. మీటలు నొక్కడం తప్ప ప్రజలకు ఏమి మంచి చేశామని, గడపగడపకు వెళ్లి తలుపు కొడతామని ప్రశ్నిస్తున్నారు.
కాగా తాజాగా బుధవారం(జూన్ 21) నిర్వహించిన గడపగడపకు మన ప్రభుత్వం వర్క్ షాప్‌లో జగన్మోహన్ రెడ్డి ఓ 20 మంది ఎమ్మెల్యేల పని తీరుపై పెదవి విరిచారు. అలాగని మిగిలిన ఎమ్మెల్యేల పని తేరు అద్భుతంగా ఉందని కాదని కూడా ఆయనే వివరణ ఇచ్చారు. నిజానికి , గడపగడప మన ప్రభుత్వం పరీక్షలో సగం మంది ఎమ్మెల్యేలకు పాస్ మార్కులు రాలేదని అన్నారు. అలాగే మిగిలిన సగం మందిలో సగం మందికి పైగానే, అత్తెసరు మార్కులతో పాసయ్యారని... అన్నారని సమాచారం.
అంతేకాదు. ఇలా అయితే లాభం లేదు. పరీక్ష తప్పిన 20 మందికి ప్రత్యేక తరగతులుంటాయి, వీరందరినీ త్వరలోనే వ్యక్తిగతంగా పిలిచి చెబుతాను. అప్పటికీ పనితీరు మార్చుకోపోతే నా నిర్ణయం నేను తీసుకుంటాను. మిగతా వాళ్లలో కూడా దాదాపుగా సగం మంది పనితీరు మెరుగుపరుచుకోవాల్సిందే. పని తీరు బాగుంటేనే ఎమ్మెల్యేలను కొనసాగిస్తాం. పనితీరు బాగోలేకపోతే కొనసాగించడం పార్టీకి నష్టమవుతుంది. ఇప్పటి వరకూ చేసిన సర్వేల వివరాలన్నీ నా వద్ద ఉన్నాయి. ఇక్కడి నుంచి చేసే సర్వేలో మీ గ్రాఫ్‌లు పెరగాల్సిందే. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని మీరు గ్రాఫ్ పెరిగేందుకు ఉపయోగించుకోండి. మీరు ప్రతి ఇంటికీ వెళితే గ్రాఫ్ పెరుగుతుంది.... లేకపోతే మీ గ్రాఫ్ పెరగదు. మీరు బాగా పనిచేస్తే పార్టీకి ఉపయోగం ఉంటుంది. అలా జరగకపోతే మిమ్మల్ని మార్చడం మినహా నాకు వేరే ప్రత్యామ్నాయం ఉండదు. మీ పనితీరు బాగోలేని పక్షంలో టిక్కెట్లు ఇవ్వను.... చివరిలో మీరు నన్ను బాధ్యుడిని చేయవద్దు అని గతంలో లానే మరోమారు, నేరం నాది కాదు మీదే అన్నట్లు ‘ఛీ’..వాట్లు పెట్టినట్లు చెపుతున్నారు.
ఇక మిగిలుంది తొమ్మిది నెలలే .. ఈ తొమ్మిది నెలలు జగనన్న సుర్క్షలో భాగంగా ఇంటింటికి వెళ్ళాలని , ఈకార్యక్రమాన్ని ప్రతి ఎమ్మెల్యే ఛాలెంజ్ గా తీసుకోవాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఈ తోమ్మిది నెలలు అత్యంత కీలకం, ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. సోషల్ మీడియాని పెద్ద ఎత్తున వినియోగించుకోవాలని పిలుపు నిచ్చారు.
అయితే, ముఖ్యమంత్రి ఉపన్యాసాన్ని ‘శ్రద్ద’ గా విన్న ఎమ్మెల్యేలు బయటకు వచ్చి ఇంకా ఇప్పటికీ క్షేత్ర స్థాయిలో పరిస్థితులు ముఖ్యమంత్రికి అర్థం కావడం లేదని పెదవి విరవడం..విశేషంగా పరిశీలకులు పేర్కొంటున్నారు. ఓ వంక విద్యుత్ చార్జీల మోత మరో వంక విద్యుత్ కోతలతో సతమతమవుతున్న ప్రజలు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక పోతున్నామని అంటున్నారు.
ఒక విద్యుత్ చార్జీలు మాత్రమే కాదు, అన్ని చార్జీలు మంట పుట్టిస్తున్నాయి. నిత్యావసరాల ధరలు మండి పోతున్నాయి. ఇక ప్రజలు ఏకరువు పెడుతున్న తాగు నీరు, సాగు నీరు సమస్యలు , రోడ్ల అధ్వాన స్థితి గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని అంటున్నారు. ఈ సమస్యలు ఏవీ పరిష్కరించకుండా ప్రజల్లోకి వెళితే ప్రజాగ్రహం చవి చుడడం మినహా మరో ప్రయోజనం ఉండదని అంటున్నారు. అందుకే ప్రజల్లోకి వెళ్ళలేక పోతున్నామని అంటున్నారు. అందుకే ముఖ్యమంత్రిలో ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతోందని, అంటున్నారు.
అంతే కాదు, ముఖ్యంత్రి వాస్తవాలు తెలుసుకుని, విధానాలను మార్చుకోకుండా ఎన్ని సార్లు ఎన్ని గడపలు తొక్కినా ఫలితం ఉందని కొందరు ఎమ్మెల్యేలు అంటున్నారు. అలాగే, ముఖ్యమంత్రి మారకుండా మరో సారి అధికారాన్ని ఆశించలేమని అధికార పార్టీఎమ్మెల్యేలే గుసగుసలు పోతున్నారంటే ..పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవచ్చని పరిశీలకులు భావిస్తున్నారు. అలా ముఖ్యమంత్రి ఏ ధీమాతో 175 కు 175 అంటున్నారో కానీ, అందులో సగం, ఆ సగంలో సగం సీట్లు వచ్చిన వైసీపీ పండగ చేసుకోవచ్చునని రాజకీయ పండితులు పరిస్థితిని విశ్లేషిస్తున్నారు.