గోదావరి ‘కుల’ పాలిటిక్స్.. ఇది ఆరంభం మాత్రమే!
posted on Jun 22, 2023 6:44AM
ఎవరు ఔనన్నా కాదన్నా రాజకీయాల నుండి కులాలను విడదీసి చూడలేం. కులం చూడం.. మతం చూడం అని మన నేతలు ఎన్ని చెప్పినా ఓట్లు పడాలంటే కులాల సమీకరణాలు, కులాల బేరీజు తప్పదని వాళ్ళకి కూడా తెలుసు. అందునా మన తెలుగు రాష్ట్రాలలో మరీ ముఖ్యంగా ఏపీలో కులమే రాజకీయాలను శాసిస్తుంది. ఒకరిని అందలం ఎక్కిచాలన్నా.. ఒకరిని గద్దె దింపాలన్నా సొంత కులం నుండి మద్దతు ఉంటేనే సాధ్యం. ఏపీ విషయానికి వస్తే ఆ మధ్య అధికారంలో ఉన్న వైసీపీ నేతలు ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేసేందుకు కమ్మ కులాన్ని హైలెట్ చేసిన సంగతి అందరూ చూశారు. అలాంటిది ఇప్పుడు ఎన్నికల ఏడాది మొదలైంది కనుక ఈ కుల రాజకీయాలు మరింతగా పుంజుకుంటున్నాయి.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆ మధ్య తనకు కులం లేదని ప్రకటించి తాను అందరి వాడినని చాటి చెప్పుకొనే ప్రయత్నం చేశారు. అయితే, ఈ మధ్య కాలంలో ఈ టోన్ చాలా మారింది. ఈ మధ్య పవన్ కళ్యాణ్ ప్రసంగాలలో మళ్ళీ ఇలాంటి ప్రస్తావన లేనే లేదు. పైగా ఓ ఆరు నెలల క్రితం కాపు నేతలు, కుల సంఘాలు, చివరికి ప్రజలతో కూడా తానే స్వయంగా సమావేశాలు నిర్వహించారు. ఈ సమావేశాలలో ఏం జరిగిందో పబ్లిక్ లో చెప్పలేదు కానీ.. తాను మీ వాడినేనని.. నాకు మీ సంపూర్ణ మద్దతు కావాలని పవన్ కళ్యాణ్ కాపు పెద్దలను కోరినట్లు సమాచారం బయటికొచ్చింది.
ఏపీలో కాపులు జనసేనకు ఎంతవరకు మద్దతు ఇస్తారు? ఎంతవరకు పవన్ కళ్యాణ్ కోసం పనిచేస్తారన్నది ఇప్పుడే మనం తేల్చే అంశం కాదు. కానీ.. పవన్ ఎప్పుడైతే కాపులను తన వైపుకు తిప్పుకొనేందుకు ప్రయత్నం మొదలైందో.. అధికార పక్షమైన వైసీపీ దాన్ని అడ్డుకొనే ప్రయత్నం మొదలుపెట్టింది. ఈ క్రమంలోనే వైసీపీలోని కాపు నేతలను మీడియా ముందుకు పంపించి తిట్టించడం మొదలు పెట్టారు. కాపులకు ఐకానిక్ గా తనకి తానుగా చెప్పుకొనే ముద్రగడ పద్మనాభం లాంటి వాళ్ళని ఉసిగొల్పి కౌంటర్లు మొదలు పెట్టారు. నిజానికి ఈసారి ఎన్నికలలో కాపు సామజిక వర్గ ఓట్ బ్యాంక్ పై పవన్ కళ్యాణ్ భారీ ఆశలు పెట్టుకున్నట్లు కనిపిస్తుంది. దీంతో దానిని ఎలాగైనా నిలువరించేందుకు వైసీపీ రకరకాల ఎత్తులు వేస్తోంది. మొత్తంగా ఇప్పుడు కాపు రాజకీయం తారాస్థాయికి చేరుకుంటుంది.
అయితే, ఏపీలో మొదలైన ఈ కాపు రాజకీయం ఆరంభం మాత్రమే.. కాగా ముందు ముందు పెద్ద సినిమానే చూడాల్సి ఉంటుంది ఏపీ ప్రజలు. ఇప్పటికే కాపులలో చీలిక తెచ్చేందుకు వైసీపీ ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగా కాపు సామజిక వర్గం అధికంగా ఉండే ఉమ్మడి గోదావరి జిల్లాలపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఈ జిల్లాల నుండి ప్రజలను పార్టీలకు మద్దతు ఇచ్చే శాతంతో లెక్కేస్తే 40 నుండి 60 ఏళ్ల వయసు మధ్య వారిలో కొంత భాగం వైసీపీకి మద్దతు ఉంటుంది. ఆ తర్వాత 20 నుండి 40 ఏళ్ల వారిలో ఎక్కువ శాతం తెలుగుదేశం అనుకూల వర్గమై ఉంటుంది. వీరిలో యువత ఎక్కువ శాతం పవన్ కళ్యాణ్ అభిమానులై ఉండడం సహజం. ఈ యువతను రాజకీయాలు పెద్దగా ప్రభావితం చేయలేవు. అయితే, ఇప్పుడు పవన్ వృద్ధులు, నడి వయసు ఓటర్లను కూడా తన వైపుకు తిప్పుకొనే ప్రణాళికలు అమలు చేస్తున్నట్లు కనిపిస్తుంది.
ఈ క్రమంలోనే పవన్ ప్రయత్నాన్ని అడ్డుకొనేలా వైసీపీ కాపుల ఆత్మగౌరవం అంటూ కొత్త నినాదాన్ని ఎత్తుకుంది. పవన్ కళ్యాణ్ చంద్రబాబుకు అధికారం కట్టబెట్టడం కోసమే పనిచేస్తున్నాడు తప్ప కాపులకు అధికారం కోసమే కాదనే ఆరోపణలని ప్రజలలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. అందుకే ప్రతిసారి పవన్ దమ్ముంటే 175 స్థానాలలో పోటీ చేయాలని సవాల్ విసురుతున్నారు. ప్రతిసారి కాపుల ఆత్మగౌరవాన్ని చంద్రబాబు వద్ద తాకట్టు పెడుతున్నారనే విమర్శలతో చీలిక తెచ్చే ప్రయత్నం చేస్తుంది. ఈ ప్రయత్నాలలో ఎవరు ఎంత సక్సెస్ అవుతారన్నది తెలియదు కానీ.. ఎన్నికలు దగ్గరపడే కొద్దీ ఈ కాపు పాలిటిక్స్ మరింత రసకందాయంగా మారతాయన్నది మాత్రం వాస్తవం.