బీఆర్ఎస్‌లో ఆ 40 మంది.. కేసీఆర్ కు సెగ!
posted on Jun 21, 2023 @ 5:10PM
చూస్తూ ఉండగానే నాలుగేళ్లు గిర్రున తిరిగిపోయాయి. నిన్నకాక మొన్న కేసీఆర్ ప్రభుత్వాన్ని రద్దు చేసి ఎన్నికలకు వెళ్లినట్లుగా ఉన్నా.. అప్పుడే నాలుగున్నరేళ్ళు గడిచి మళ్ళీ ఎన్నికల సమయం వచ్చేసింది. మళ్ళీ ఈసారి కూడా ఎలాగైనా తానే అధికారం దక్కించుకోవాలని ఆరాటపడుతున్న సీఎం కేసీఆర్.. అందుకు తగ్గ అన్ని అవకాశాలను వినియోగించేసుకుంటున్నారు. నిండా ఆరు నెలలే ఎన్నికలకు సమయం ఉండడంతో బీఆర్ఎస్ పార్టీలో క్యాండిట్ల ఎంపికపై కసరత్తులు చేస్తున్నారు. ఈసారి కూడా సిట్టింగులకే అవకాశం ఇస్తానని గులాబీ బాస్ ఎమ్మెల్యేకు హామీ ఇచ్చినా.. బీఫామ్ చేతిలో పడే వరకు నమ్మలేమంటూ చాలా మంది టెన్షన్ పడుతున్నారు. సిట్టింగులకే టికెట్లు అని చెప్పినా కొందరిపై మాత్రం అధిష్టానం స్పెషల్ ఫోకస్ పెట్టి గమనిస్తున్నట్లు పార్టీలో అంతర్గత సమాచారం.
ఇప్పుడున్న రాజకీయాలలో ఎన్నికలంటే ముందుగా గుర్తొచ్చేది సర్వేలు. ఏ పార్టీకి ఆ పార్టీ అవకాశాలను అంచనా వేసేందుకు ఈ సర్వేలు చేయిస్తుండగా, బీఆర్ఎస్ మాత్రం రెండేళ్ల ముందు నుండే ఈ సర్వేల పని మొదలు పెట్టింది. ఇప్పటికే రెండు మూడు సార్లు ప్రతి ఎమ్మెల్యే పనితీరుపై సర్వేలు చేయించిన కేసీఆర్.. వర్కింగ్ స్కోర్ తక్కువగా ఉన్న ఎమ్మెల్యేలకు హెచ్చరికలు కూడా చేశారు. ఎన్నికలకు ఏడాది ముందే కేసీఆర్.. నెగటివ్ మార్క్ ఎమ్మెల్యేలకు డెడ్లీ వార్నింగ్ కూడా ఇచ్చారట. పనితీరు మెరుగు పరుచుకోలేకపోతే మీ స్థానంలో వేరేవాళ్లని దింపాల్సి వస్తుందని గట్టి హెచ్చరికలే చేశారని పార్టీ వర్గాలే చెప్పుకున్నాయి. వారిలో కొందరు బాస్ చెప్పినట్లే నిత్యం ప్రజల మధ్య ఉండేలా ప్లాన్ చేసుకుంటే మరికొందరు మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు ఉండిపోయారు.
అలా పనితీరు సరిగా లేని ఎమ్మెల్యేలు, పథకాల అమలును పట్టించుకోని ఎమ్మెల్యేలు, ప్రజలలో వ్యతిరేకత మూటగట్టుకున్న ఎమ్మెల్యేల ప్రభావం ఇప్పుడు ఏకంగా అధిష్టానాన్ని తాకుతుందా అనిపిస్తుంది. ఎమ్మెల్యే తీరు నచ్చక ప్రజలు తిరుగుబాటు చేసినా అది బీఆర్ఎస్ పార్టీపైనే చూపిస్తుంది కదా. ఇప్పుడు అలాగే ప్రభుత్వ కార్యక్రమాలు, పథకాలు అందని ప్రజలు నిరసనలు చేస్తూ సూటిగా అధిష్టానాన్ని ప్రశ్నిస్తున్నారు. మొన్నటికి మొన్న తెలంగాణ ఉత్సవాలలో పలుచోట్ల ప్రజలు రకరకాల అంశాలపై నిరసనలు వ్యక్తం చేయగా.. నిన్నటికి నిన్న తాగునీటి ఉత్సవాలు జరుగుతుంటే.. కొన్ని చోట్ల ఖాళీ బిందెలతో రోడ్డెక్కి మాకు మిషన్ భగీరథ నీళ్లు ఎందుకు రావంటూ ధర్నాలకు దిగారు. ధరణి పోర్టల్ నుండి దళిత బంధు వరకు పలు చోట్ల ప్రభుత్వ వ్యతిరేకత వ్యక్తమవుతుండగా.. ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేలు ప్రజలను గాలి కొదిలేసినట్లే అధిష్టానం భావిస్తోంది. ఇలాంటి వారిలో ఇప్పటికే 40 మందితో ఒక జాబితా కూడా సిద్దమైనట్లు తెలుస్తుంది.
ఇలా అసమర్ధ ఎమ్మెల్యేలుగా గుర్తించిన ఈ 40 మంది వలన ఇప్పుడు అధిష్టానానికి కూడా తలనొప్పులు కాగా.. ఈసారి ఈ 40 మందికి సీట్లు కేటాయించే పరిస్థితి ఉండదని రాజకీయ వర్గాల భావన. అందుకోసమే ఇప్పటికే కేసీఆర్ వాళ్ళపైన ప్రత్యేక నిఘా పెట్టించారట. వాళ్ళ కదలికల నుండి సమావేశాల వరకు ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్న అధిష్టానం.. వీరు టికెట్ దక్కకపోతే ఏ పార్టీలోకి జంప్ అయ్యే ఛాన్స్ ఉందో కూడా అంచనాలు సిద్ధం చేసి అటాక్ చేసేందుకు సిద్దమవుతున్నట్లు తెలుస్తుంది. జూలై లేదా ఆగస్టులో మొదటి విడత జాబితాను విడుదలచేయాలని కూడా డిసైడ్ అయిన గులాబీ బాస్.. సుమారు 60-70 మంది అభ్యర్ధులతో మొదటి జాబితాను విడుదల చేయాలని అనుకుంటున్నట్లు సమాచారం.
తొలి జాబితా ప్రకటనతో పాటు ఈ 40 మంది అసమర్ధ ఎమ్మెల్యేల స్థానంలో ఇంచార్జిలకు అనధికారికంగానే హామీలు ఇచ్చే అవకాశం ఉండగా.. ఆయా స్థానాలలో ఆశావహుల జాబితా కూడా భారీగానే ఉండనుంది. వీలైనంత త్వరగా ఈ 40 మంది ప్రభావాన్ని తగ్గించేందుకు సిద్ధపడిన కేసీఆర్.. వీరు రేపు రెబల్స్ గా మారితే ఎలా ఎదుర్కోవాలనే దానిపై కూడా ముమ్మర కసరత్తులు చేస్తున్నట్లు తెలుస్తుంది.