షర్మిల పార్టీ ప్రయాణం ఎటు ?
posted on Jun 22, 2023 @ 10:12AM
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తె, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సోదరి.. వైఎస్ షర్మిల కారణాలు ఏవైనా, రెండేళ్ళ క్రితం తెలంగాణ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. వైఎస్సార్ తెలంగాణ పార్టీ ( వైఎస్సార్ టీపీ) పేరిట పార్టీని ఏర్పాటు చేశారు. తెలంగాణలో వైఎస్ పాలన అందిస్తామని ప్రజల్లోకి వెళుతున్నారు.
అయితే, అప్పటి నుంచీ... ఆమె ఏపీని వదిలి తెలంగాణ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడానికి కారణం ఏమిటన్నది సమాధానం లేని ప్రశ్నగానే మిగిలిపోయింది. జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ తో విభేదించి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స్థాపించిన సమయంలో షర్మిల అన్నకు అండగా ఉన్నారు. అక్రమాస్తుల కేసులో జగన్ రెడ్డి జైలుకు వెళ్ళినప్పుడు... ఆమె ‘నేను జగనన్న వదిలిన బాణం’ అంటూ మూడు వేల కిలోమీటర్ల పాద యాత్ర చేశారు. వైసీపీని బతికించారు. అయితే, ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగనన్న వదిలిన బాణాన్ని జగనన్న వదిలేశారో .. ఆమే జగనన్నను వదిలేశారో తెలియదు కానీ పుట్టింటిని వదిలి మెట్టి నింటికి చేరుకున్నారు. తెలంగాణలో వైఎస్సార్ జెండా ఎగరేశారు. అప్పటి నుంచి ఆమె తెలంగాణ రాజకీయాల్లో ముఖ్యంగా బీఆర్ఎస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసేఆర్ కుటుంబ పాలనకు వ్యతిరకంగా ప్రత్యేక పంథాలో పోరాటం సాగిస్తున్నారు. పాదయాత్రలు చేశారు.
అయితే, ఇప్పుడు షర్మిల త్వరలోనే వైఎస్సార్టీపీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ఇంత కష్టపడి నడిపించిన పార్టీని ఎందుకు కాంగ్రెస్ లో విలీనం చేస్తానంటూ షర్మిల పేర్కొంటున్నారు. అలంటి ఆలోచనే లేదని విలీనం ప్రచారాన్ని కొట్టిపారేస్తున్నారు. అయినా ఇటు మీడియా అటు రాజకీయ వర్గాల్లో, ముఖ్యంగా పీసీసీ నేతల్లో షర్మిల పార్టీలో చేరడం చర్చనీయాంశంగా మారింది.
కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత ఆ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి డి.కె.శివకుమార్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపిన తర్వాత కొద్ది రోజులు సాగిన ఈ ప్రచారం మధ్యలో కొంత బ్రేక్ తీసుకుంది. కానీ ఇప్పడు తాజాగా నాలుగు రోజుల క్రితం ఆ పార్టీకి చెందిన ఇద్దరు ముఖ్యులు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ను కలిసి చర్చించినట్లు వార్తలు బయటకు పొక్కడంతో మళ్ళీ మరోమారు షర్మిల తమ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తున్నారనే ప్రచారం జోరందుకుంది. అంతేకాదు విలీన ముహూర్తం కూడా ఖరారైందనే ప్రచారం జరుగుతోంది.
ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్న రాహుల్‌గాంధీ దేశానికి తిరిగి వచ్చిన తర్వాత దీనిపై చర్చిస్తానని వేణుగోపాల్ చెప్పినట్లు సమాచారం. రాహుల్‌గాంధీ విదేశీ పర్యటనకు వెళ్లక ముందే తెలంగాణకు చెందిన కొందరు ముఖ్యనాయకులతో చర్చించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అటు ఏఐసీసీ, ఇటు పీసీసీ నాయకుల మధ్య కూడా ఈ అంశంపై చర్చ జరిగినట్లు తెలిసింది. కాంగ్రెస్‌లోకి రావడానికి ఎలాంటి అభ్యంతరం లేదని ఏపీ నాయకత్వ బాధ్యతలు అప్పగిస్తే అక్కడ పార్టీ కొంతవరకు తేరుకోవడానికి ఉపయోగపడుతుందనే అభిప్రాయాన్ని రేవంత్ వర్గానికి చెందిన తెలంగాణ నాయకులు వ్యక్తం చేసినట్లు తెలిసింది.
అయితే తాను తెలంగాణ కోసం పార్టీ పెట్టానని తెలంగాణ కోడలిగా ఈ ప్రాంతానికే చెందిన వ్యక్తినంటూ షర్మిల పలు సందర్భాల్లో ప్రస్తావించడాన్ని కూడా కాంగ్రెస్ నాయకులు గుర్తు చేస్తున్నారు. ఖమ్మం జిల్లాలోని పాలేరు నియోజకవర్గం నుంచి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి వీలుగా ఆమె అక్కడ పలు కార్యక్రమాలను చేపడుతున్నారు.అలాగే ఖమ్మం రాజకీయాల్లో ప్రస్తుతం సంచలనంగా మారిన బీఆర్ఎస్ బహిష్కృత నేత వైసీపీ మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డితో కుటుంబ పరంగా ఆమెకు సన్నిహిత సంబంధాలున్నాయి.
ఒక దశలో ఆయన షర్మిల పార్టీలో చేరతారనే ప్రచారం కూడా జరిగింది. అలాగే కాంగ్రెస్ పార్టీలో తమ ప్రాబల్యాన్ని పెంచుకుని రేవంత్ రెడ్డికి చెక్ పెట్టేందుకు పావులు కడుతున్న.. భువనగిరి ఎంపీ కోమటి రెడ్డి వెంకటరెడ్డికి వైఎస్ ఫ్యామిలీపై ఉన్నగౌరవంతో షర్మిల కాంగ్రెస్ లోకి రావాలనే కోరుకుంటున్నారు. సో ..పొంగులేటి కాంగ్రెస్ లో చేరడం ఖరారైతే, షర్మిల వైఎస్సార్ టీపీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడం లేదంటే ఏదో ఒక అవగాహనకు రావడం ఖాయమనే ప్రచారం జరుగుతోంది.
అయితే కాంగ్రెస్ హైకమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకొంటుంది. దీనిపై తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఎలా స్పందిస్తారు అనేది తెలియ వలసి వుంది. అయితే పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తాను పీసీసీ అధ్యక్షునిగా ఉన్నంత వరకు షర్మిలను గాంధీ భవన్ మెట్లు ఎక్కనీయనని శపధం చేశారు. అయితే షర్మిల పైకి ఏమి చెప్పినా, నాలుగు దిక్కుల నుంచి గాంధీ భవన్ మెట్లు ఎక్కేందుకు చకచకా పావులు కదుపుతున్నారు. అంతే కాదు ఒక విధంగా రేవంత్ రెడ్డిని అష్ట దిగ్భంధనం చేసేందుకు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు.
కర్ణాటక పీసీసీ చీఫ్, ఉప ముఖ్యమంత్రి డీకే శివ కుమార్ మొదలు రాహుల్ గాంధీ వరకు, పొంగులేటి, కోమటి రెడ్డి మొదలు ఇతర సీనియర్ నాయకులు అందరితోనూ వైఎస్ కుటుంబ బంధాలను పునరుద్దరించే ప్రయత్నాలు సాగిస్తున్నారు. గతంలో బెంగుళూరు వెళ్లి మరీ డీకేకు అభినందనలు తెలిపిన షర్మిల గతంలో ఎప్పుడూ లేని విధంగా రాహుల్‌గాంధీ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేశారు. ఈ పరిణామాలను గమనిస్తే షర్మిల పాదయాత్ర ఎటుగా సాగుతోందో చెప్పకనే చెపుతోందని, కాంగ్రెస్ నాయకులు చెపుతున్నారు.