రెబల్‌కు పోటీగా రెబల్ స్టార్ భార్య..!
posted on Jun 22, 2023 7:07AM
టాలీవుడ్ ప్రముఖ నటుడు, రెబల్ స్టార్ దివంగత కృష్ణంరాజు భార్య శ్యామలాదేవి రాజకీయాల్లోకి రానున్నారనే ఓ చర్చ పోలిటికల్ సర్కిల్‌లో తెగ వైరల్ అవుతోంది. రానున్న ఎన్నికల్లో ఆమెను ఎన్నికల బరిలో దింపేందుకు అధికార జగన్ పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఆ క్రమంలో అందుకు సంబంధించిన బాధ్యతలు పార్టీలోని కీలక నేత, ఓ ఎంపీ భుజస్కందాలపై సీఎం జగన్ పెట్టినట్లు సమాచారం.
అయితే ఇప్పటికే శ్యామలా దేవితో సదరు ఎంపీ భేటీ అయి... ఈ అంశంపై చర్చించినట్లు తెలుస్తోంది. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని నరసాపురం లోక్‌సభ అభ్యర్థిగా బరిలోకి దింపితే.. ఆమె గెలుపు నల్లేరు మీద నడక అవుతోందనే ఆలోచనలో సీఎం జగన్ ఉన్నట్లు సమాచారం.
ఇక రెబల్ స్టార్ కృష్ణంరాజు గతేడాది అంటే 2022 సెప్టెంబర్ 11న మరణించారు. దీంతో ఆయన మరణించి.. ఇంకా ఏడాది పూర్తి కాలేదు. అలాగే సార్వత్రిక ఎన్నికలు వచ్చే ఏడాది మొదటి మూడు మాసాల్లో జరగనున్నాయి కనుక శ్యామలాదేవి ఎన్నికల బరిలో దిగేందుకు అవకాశాలు మెండుగా ఉన్నాయనే చర్చ పోలిటికల్ సర్కిల్‌లో వాయువేగంతో సాగుతోంది.
అదీకాక శ్యామలాదేవి భర్త కృష్ణంరాజు,.. పలుమార్లు లోక్‌సభకు ఎన్నిక కావడమే కాదు.. వాజ్‌పాయి ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా కూడా పని చేశారు. అటు నరసాపురం నుంచి.. ఇటు కాకినాడ నుంచి ఆయన లోక్‌సభ సభ్యుడిగా గెలుపొందారు. అలాగే ఆయన మంచి నటుడుగా ప్రేక్షకుల ఆదరాభిమానాలనే కాకుండా.. తనదైన శైలిలో ఆయన ప్రజాసేవ చేసి మంచి రాజకీయ నాయకుడిగా ప్రజల మనన్నలు అందుకొన్నారు.
అదీకాక నరసాపురంలో కృష్ణంరాజు సామాజికవర్గం ఓట్లు.. అక్కడ బరిలో నిలిచిన అభ్యర్థి గెలుపులో కీలక పాత్ర పోషిస్తాయన్న విషయం అందరికీ తెలిసిందే. గత ఎన్నికల్లో అంటే 2019లో ఆదే సామాజిక వర్గానికి చెందిన రఘురామకృష్ణం రాజు అలియాస్ ట్రిపుల్ ఆర్ వైసీపీ నుంచి గెలుపొందారు. ఆ తర్వాత... పార్టీ విధానాలను వ్యతిరేకిస్తూ. రెబల్‌గా మారిపోయారు. ప్రతీరోజు ఆయన ప్రెస్‌మీట్ పెట్టి రచ్చబండ కార్యక్రమం ద్వారా సొంత పార్టీ అధినేత జగన్‌తోపాటు ఆయన ప్రభుత్వ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై తీవ్ర ఆరోపణలు గుప్పిస్తూ.. రచ్చ రచ్చ చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.
అయితే వచ్చే ఎన్నికల్లో ఆయన నరసాపురం నుంచి మరో పార్టీ తరఫున పోటీ చేసేందుకు రంగం సిద్దం చేసుకొంటున్నట్లు ప్రచారం అయితే జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో పార్టీలో రెబల్ క్యాండెట్‌పై రెబల్ స్టార్ భార్య శ్యామలా దేవిని బరిలోకి దింపితే.. అసలు సిసలు రాజకీయం నరసాపురం వేదికగా జరుగుతోందనే ఓ చర్చ సైతం పోలిటికల్ సర్కిల్‌లో ఊపందుకొంది.