సంక్షిప్తం morning
posted on Jun 22, 2023 5:58AM
1.బీఆర్ఎస్ నేత, స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ మీడియా ముందుకొచ్చిన ధర్మసాగర్ మండలం జానకీపురం సర్పంచ్ నవ్య తాజాగా రాజయ్యపై ఆరోపణలు చేశారు. తన వద్ద ఉన్న ఆధారాలు ఇవ్వాలంటూ ఒత్తిడి చేస్తున్నారన్నారు.
2.హోండురస్ లోని ఓ మహిళా జైలులో చెలరేగిన అల్లర్లలో 41 మంది ప్రాణాలు కోల్పోయారు. పలువురు గాయపడ్డారు. 26 మంది మహిళలు అగ్నికి ఆహుతికాగా, మిగతా వారిలో కొందరిని కాల్చి, కత్తితో పొడిచి చంపేశారు.
3. దేశంలో జూన్ మూడో వారంలోనూ ఎండలు మండిపోతున్న వేళ వడగాల్పుల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్షుక్ మాండవీయ రాష్ట్రాల ఆరోగ్య శాఖ మంత్రులతో ఈ రోజు వర్చువల్ భేటీ నిర్వహించారు. ఎండలలో ప్రజారోగ్యం కాపాడే విషయంపై చర్చించారు.
4. జగన్ పాలనలో అన్ని రంగాల వారు బాధితులేనని లోకేష్ అన్నారు. జగన్ ఏ వర్గానికి న్యాయం చెయ్యలేదని, జగన్ పాలనలో సమాజంలో భయం ఏర్పడిందని తెలిపారు. పాదయాత్రలో భాగంగా ఆయన వెంకటగిరి లో నిన్న మాట్లాడుతూ ఏపీ బ్రాండ్ ను జగన్ దెబ్బతీశారని విమర్శించారు. (
5. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సర్కార్ కు సుప్రీం షాక్ ఇచ్చింది. పశ్చిమ బెంగాల్ పంచాయతీ ఎన్నికల్లో కేంద్ర బలగాలను మోహరించాలని హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్టు సమర్థించింది. జూలై 8న బెంగాల్ లో పంచాయతీ ఎన్నికలు ఉన్నాయి.
6.ఉండవల్లి కరకట్ట వద్ద ఉన్న ఇల్లు జప్తుకు సంబంధించి లింగమనేని రమేశ్ దాఖలు చేసిన పిటిషన్ ను విచారణకు స్వీకరించిన ఏపీ హైకోర్టు కౌంటర్ దాఖలు చేయాలని సీఐడీని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 28కి వాయిదా వేసింది.
7. మెగా ప్రిన్సెస్ కు జనసేనాని పవన్ కల్యాణ్ ఆశీస్సులు అందించారు. రామ్ చరణ్, ఉపాసన దంపతులకు నిన్న ఆడపిల్ల జన్మించిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా వారికి శుభాకాంక్షలు పాపకు ఆశీస్సులు అంటూ పవన్ కల్యాణ్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
8. రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ అధికార పార్టీకి కొమ్ము కాసేలా ఉండటం సరికాదని సోము వీర్రాజు అన్నారు. ప్రజలను రక్షించాల్సిన అధికార పార్టీ నేతలు పోలీసులు అడ్డుపెట్టుకొని రెచ్చిపోతున్నారన్నారు. బాపట్ల జిల్లా ఉప్పాలవారిపాలెంలో అమర్నాథ్ కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు.
9.బీఆర్ఎస్ బహిష్కృత నేతలు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావులతో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నేటి మధ్యాహ్నం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన వారిని పార్టీలోకి ఆహ్వానించారు.
10. ఆదిపురుష్ సినిమాపై రామాయణాన్ని వక్రీకరించారంటూ విమర్శలు కొనసాగుతున్నాయి. తాజాగా గతంలో దేశాన్ని ఉర్రూతలూగించిన మహాభారత్ సీరియల్ లో భీష్ముడి పాత్రను పోషించిన ముఖేశ్ ఖన్నా ఆదిపురుష్ మేకర్స్ ను తగలబెట్టాలని ఆగ్రహం వ్యక్తం చేశారు.
11. ప్రధాని మోడీపై ట్విట్టర్, టెస్లా, స్పేస్ ఎక్స్ కంపెనీల అధినేత ఎలాన్ మస్క్ ప్రశంసలు కురిపించారు. బుధవారం (జూన్ 21)న మోడీతో భేటీ అయిన మస్క్ వచ్చే ఏడాది తాను భారత్ లో పర్యటించనున్నట్లు చెప్పారు. స్టార్‌లింక్ ఇంటర్నెట్ సర్వీస్ లను భారత్ లోకి తెస్తామన్నారు.
12. తెరాస బహిష్కృత నేతలు పొంగులేటి, జూపల్లిలు వచ్చే నెల రెండో తేదీన ఖమ్మంలో జరగనున్న బహిరంగ సభలో రాహుల్ గాంధీ సమక్షంలో వీరు కాంగ్రెస్ కండువా కప్పుకుంటారు. అంతకు ముందు ఈ నెల 25న వారు ఢిల్లీలో రాహుల్ తో భేటీ అవుతారు.
13. హైదరాబాద్ ఎల్బీ నగర్ లో నిర్మాణంలో ఉన్న ఫ్లై ఓవర్ లో కొంత భాగం కూలి పది మంది గాయపడ్డారు. రెడీ మిక్సర్ తయారు చేసే లారీ రివర్స్ తీసుకునే సమయంలో ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. రెండు పిల్లర్లకు మధ్య నిర్మిస్తున్న ఓ స్లాబ్ కూలిపోయింది.
14. వచ్చే ఎన్నికల్లో అధికార వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడనివ్వకూడదనేదే తన ఉద్దేశమనీ, అది నెరవేరాలంటే తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలవాలని జనసేనాని పవన్ కల్యాణ్ అన్నారు. త్వరలోనే ఈ విషయంలో స్పష్టత వస్తుందని చెప్పారు.
15. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి భవన్ లో నిర్వహించిన యోగా వేడుకల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేశ ప్రజలకు యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.యోగా అనేది మన నాగరికత సాధించిన గొప్ప విజయాల్లో ఒకటని చెప్పారు.
16. పేదల ఇళ్లు కూల్చేస్తారా అంటూ మహారాష్ట్ర మీరా భయందర్ నియోజకవర్గం ఎమ్మెల్యే గీతా భరత్ జైన్ ప్రజల ముందే జూనియర్ సివిల్ ఇంజినీర్ కాలర్ పట్టుకుని చెంప ఛెళ్లుమనిపించారు. నిర్మాణాలను ఎలా ధ్వంసం చేస్తారంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.
17. కరీంనగర్ లో మానేరు నదిపై రూ.224 కోట్లతో పూర్తి విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన కేబుల్ బ్రిడ్జిని మంత్రి కేటీఆర్ ఈ రోజు ప్రారంభించారు. హైదరాబాద్ లోని దుర్గం చెరువు తర్వాత రాష్ట్రంలో నిర్మించిన రెండో కేబుల్ బ్రిడ్జి ఇదే కావడం గమనార్హం.
18. దేశ రాజధానిలో తెలంగాణ బోనాల సంబరాలు మంగళవారం ప్రారంభమయ్యాయి. న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్ నుంచి ఇండియా గేట్ వరకు తెలంగాణ బోనాలతో మహిళలతో ఊరేగింపు జరిగింది. 19. ఏపీలో అధికార పార్టీ అండతో భారీగా దొంగ ఓట్లు నమోదౌతున్నాయంటూ ఆ పార్టీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు.
20. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన డ్రగ్స్ కేసులో రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన కబాలీ తెలుగు నిర్మాత కేపీ చౌదరిని పోలీసులు తమ కస్టడీకి తీసుకున్నారు. రెండు రోజుల పాటు ఆయనను విచారించనున్నారు.