తాడేపల్లి వర్క్ షాప్‌లో జగన్ రిపేర్లు.. ఎమ్మెల్యేలలో గుబులు
posted on Jun 22, 2023 @ 2:54PM
ఏపీలో కూడా ఎన్నికలకు సమయం ఆసన్నమైంది. నిండా ఏడాదిలోనే ఎన్నికలు జరగనున్నాయి. ఈ నాలుగేళ్లు ఒక లెక్క.. ఈ ఏడాది ఇంకో లెక్క. అందుకే రాజకీయ పార్టీలు.. పార్టీల అధినేతలు బుర్రలకు పదును పెట్టడం మొదలు పెడుతున్నారు. తమ పార్టీలో ఏం జరుగుతుంది? రానున్న ఎన్నికలలో మళ్ళీ గెలవాలంటే ఏం చేయాలి? ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉంది? గెలుపు గుర్రాలు ఎవరు? తమ పార్టీకి నష్టం తెచ్చిపెట్టే ఎమ్మెల్యేలు ఎవరనే దానిపై ఫోకస్ మొదలు పెట్టారు. ఇప్పటికే ఎన్నోసారి ఎమ్మెల్యేల పనితీరు, నియోజకవర్గాలలో పరిస్థితిపై సర్వేలు తెప్పించుకున్న సీఎం జగన్ మోహన్ రెడ్డి.. అప్పుడే ఆ ఎమ్మెల్యేలకు క్లాసులు కూడా పీకారు. వారిలో కొందరు ఆ దెబ్బకు మారితే మరికొందరు మాత్రం షరామామూలే అన్నట్లు లైట్ తీసుకున్నారు. ఇప్పుడు అలాంటి వారందరికీ తాడేపల్లి ప్యాలెస్ లో సీఎం జగన్ వర్క్ షాప్ మొదలు పెట్టినట్లు తెలుస్తుంది.
తాజాగా తాడేపల్లిలోని సీఎం నివాసంలో గడప గడపకు మన ప్రభుత్వం సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలువురు ఎమ్మెల్యేల పనితీరుపై సీఎం వైఎస్ జగన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సమావేశానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ సమన్వయకర్తలు, జిల్లా అధ్యక్షులు, రీజనల్ కోఆర్డినేటర్ లు హజరైయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పని తీరుపై సమీక్షించిన సీఎం.. కొందరు ఎమ్మెల్యే తమ పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. వారి ప్రొగ్రెస్ రిపోర్టు వ్యక్తిగతంగా పంపుతాననీ, అప్పటికీ పని తీరు మార్చుకోకపోతే నా నిర్ణయం నేను తీసుకుంటానని జగన్ హెచ్చరించారట. 20 నుండి 25 మందితో తయారైన ఈ జాబితాలోని ఎమ్మెల్యేలు సాధ్యమైనంత త్వరగా పద్ధతి మార్చుకోకపోతే వారిని కొనసాగించడం పార్టీకి మరింత నష్టం వాటిల్లుతోందని నిర్ణయానికి వచ్చిన జగన్.. ప్రస్తుతం ఆ ఎమ్మెల్యేలకు రిపేర్లు మొదలు పెట్టగా.. వీలు కుదరకపోతే వారిని తప్పించేందుకు కూడా రెడీ అయ్యారు.
ఇప్పటి వరకు ఎలా ఉన్నా.. ఇక నుంచి ఎమ్మెల్యేల గ్రాఫ్ పెరగాల్సిందేనని, దాని కోసం ఎమ్మెల్యేలు ఏం చేస్తారో మీ ఇష్టం.. లేకపోతే అనర్ధాలు తప్పవని జగన్ తేల్చి చెప్పినట్టు తెలిసింది. అయితే, గతంలో కూడా ఇలానే పలుమార్లు హెచ్చరించిన సీఎం.. ఎమ్మెల్యేలను ప్రజలలోకి పంపేందుకు గడపగడపకు అనే కార్యక్రమాన్ని మొదలు పెట్టారు. కానీ, ఈ కార్యక్రమానికి వెళ్లిన ఎమ్మెల్యేలకు పలుచోట్ల వ్యతిరేకత కనిపించింది. ఎక్కడిక్కడ ప్రజలు నిలదీస్తుండడంతో ఎమ్మెల్యే ఈ కార్యక్రమానికి వెళ్లేందుకు వెనక్కి తగ్గారు. మరికొందరు తూతూమంత్రంగా ముగించారు. ప్రజా వ్యతిరేకత వీడియోలు సోషల్ మీడియాలో రచ్చ చేస్తుండడంతో అది మరింత నష్టం తెచ్చిపెట్టే ఛాన్స్ ఉందని కొందరు ఎమ్మెల్యేలు అధిష్టానానికి కూడా చెప్పే ప్రయత్నం చేసినా వారు పట్టించుకోలేదని ఆరోపణలు ఉన్నాయి.
అయితే, ఇప్పుడు సీఎం జగన్ మరోసారి ఇలా ప్రజల మధ్యకి వెళ్లాలని అల్టిమేటం జారీచేయడంతో ఎమ్మెల్యేలలో గుబులు మొదలైంది. వదలమంటే పాముకి కోపం కరవమంటే కప్పకి కోపం అనేలా తమ పరిస్థితి తయారైందని మదనపడిపోతున్నారు. తమ అధినేత చెప్పినట్లు ప్రజల మధ్యకి వెళ్తే నాలుగేళ్లు ఏం చేశారని నిలదీస్తున్నారని.. సంక్షేమం గురించి మేము ఎంత ప్రగల్భాలు పలికినా.. ఎక్కడికక్కడ ఆగిపోయిన అభివృద్ధి గురించి ప్రజలు ప్రశ్నిస్తున్నారని.. సంక్షేమ పథకాలు దక్కని వారి ఆగ్రహాన్ని పేస్ చేయడం కూడా కష్టంగా ఉందని సన్నిహితులతో చెప్పుకుంటున్నారట. ఇందులో కొందరైతే.. ప్రతిపక్షాలపై ఘాటు విమర్శలకు దిగుతూ అధిష్టానానికి తమపై ఉన్న అభిప్రాయాన్ని కవర్ చేసుకొనే ప్రయత్నంలో ఉండగా.. వారు టికెట్ దక్కించుకోవడంలో ఎంతవరకు సక్సెస్ అవుతారో చూడాల్సి ఉంది.