కాంగ్రెస్సా.. బీజేపీనా.. బీఆర్ఎస్కు పోటీ ఎవరు?
posted on Jun 22, 2023 @ 4:58PM
తెలంగాణలో ఎన్నికల కసరత్తులు మొదలయ్యాయి. ఎన్నికల కమిషన్ గురువారం రాష్ట్ర పర్యటనకు వచ్చింది.. కానీ రాష్ట్రంలో రాజకీయ పార్టీలైతే ఎన్నికల హడావుడి ఎప్పుడో మొదలు పెట్టేశాయి. ఇప్పటికే పార్టీలు గెలుపు గుర్రాలెవరో లెక్కలేసుకొనే పనిలో పడితే.. తమకి టికెట్ వస్తుందా లేక మరో పార్టీని చూసుకోవాలా అని ఆశావహులు ఆలోచనలు చేస్తున్నారు. పార్టీల నుండి కాస్త క్లారిటీ వస్తే ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు గోడ దూకే కార్యక్రమం మొదలైపోతుంది. ఇప్పటికే దాదాపుగా అన్ని పార్టీలూ మేనిఫెస్టోల తయారీపై కసరత్తులు మొదలు పెట్టగా సాధ్యమైనంత త్వరలోనే ఈ వాటిని విడుదల చేయనున్నారు.
అయితే, తెలంగాణ రాజకీయ పార్టీలు.. వాటి మధ్య పోటీ అనే అంశాన్ని పరిశీలిస్తే ముందుగా అందరికీ తట్టే ప్రశ్న అసలు బీఆర్ఎస్ కి పోటీ ఎవరు?. తెలంగాణలో ప్రస్తుతానికి బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ హైపర్ యాక్టివ్ గా ఉండగా టీడీపీ, కమ్యూనిస్టులు, ఎంఐఎం, జనసేన, వైఎస్ఆర్టీపీ, కోందండరాం టీజెఎస్ తో పాటు బీఎస్పీ లాంటి పొరుగు రాష్ట్రాల పార్టీలు కూడా ఉన్నామా అంటే ఉన్నాం అన్నట్లున్నాయి. అవి కాకుండా కనీసం పేరు కూడా తెలియని పార్టీలు డజనుకు పైగా రిజిస్టర్ అయి ఉన్నాయి. అయితే, అవేవీ బీఆర్ఎస్ పార్టీకి పోటీ కి రావు.. రాలేవు కూడా. తెలంగాణలో ఓ వెలుగు వెలిగిన తెలుగుదేశం సైతం ఇప్పుడు బీఆర్ఎస్ కు పోటీ ఇచ్చే పరిస్థితి లేదు. ఏవో కొన్ని నియోజకవర్గాలలో టీడీపీ సానుభూతిపరులు గెలుపును ప్రభావితం చేసే అవకాశం ఉండగా.. మిగతా పార్టీలో ఆ పరిస్థితి కూడా కనిపించడం లేదు.
ఇక మిగిలింది.. ఇప్పుడు పొలిటికల్ సినారియో ప్రకారం చెప్పుకోవాల్సింది బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మధ్యనే పోటీ. అయితే, వీటిలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ కు అసలైన పోటీ దారుఎవరు? ఇదే ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా రాజకీయ వర్గాలలో జరుగుతున్న చర్చ. నిన్న మొన్నటి వరకు బీఆర్ఎస్ కు తామే ప్రత్యామ్నాయం అన్నట్లు బీజేపీ గట్టిగా కలరింగ్ ఇచ్చింది. ఆ ప్రయత్నంలో కొంతవరకు ఆ ప్రయత్నంలో సక్సెస్ కూడా అయింది. దుబ్బాక, హుజూర్ నగర్, నాగార్జున సాగర్ ఎన్నికల నుండి జీహెచ్ఎంసీ ఎన్నికల వరకు ఫలితాలతో ఇక రాష్ట్రంలో రాజకీయ యుద్ధం బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అన్నట్లే సాగుతుందని ఫిక్సయి పోయారు. ఉప ఎన్నికలలో కాంగ్రెస్ ను వెనక్కు నెట్టేసిన బీజేపీ బీఆర్ఎస్ తో తలపడి గెలవడం ఆ పార్టీకి ఎక్కడలేని జోష్ తెచ్చింది.
కానీ, రాజకీయాలలో ఎప్పుడు ఏం జరగబోతుందో చెప్పడం కష్టం. కర్ణాటక ఎన్నికల ఫలితాల రూపంలో తెలంగాణలో బీజేపీకి అనుకోని కష్టం వచ్చిపడింది. అనూహ్యంగా కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపుతో ఇక్కడ కూడా ఆ పార్టీలో కదలిక వచ్చింది. దీంతో ఇప్పుడు జాతీయ పార్టీలో కూడా తమ ఆట తామే ఆడుకోవాలని, హైకమాండ్ తమపై పరిమితి పెత్తనం మాత్రమే ఉండాలని భావించే వారు కాంగ్రెస్ వైపు అడుగులు వేస్తున్నారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు లాంటి సీనియర్ నేతలు రేపో మాపో ఢిల్లీ సాక్షిగా కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకునేందుకు సిద్ధమవుతున్నారు. వీరితో పాటు మరికొందరు మాజీలు కూడా టికెట్ల హామీతో జతకట్టనున్నారు. ఏ స్థాయికి కాంగ్రెస్ బలపడుతుందన్నది ఇప్పుడే చెప్పలేని అంశం కానీ.. ఎంతో కొంత బలపడుతుందన్నది మాత్రం వాస్తవంగా చెప్పుకోవచ్చు.
మరోవైపు బీజేపీకి ఇప్పటికే బండి సంజయ్, ఈటల రాజేందర్, డీకే అరుణ నుండి.. రఘునందన్, ధర్మపురి అర్వింద్ వరకు మహాముహులు అండదండగా ఉన్న సంగతి తెలిసిందే. వీరికి తోడు ఎన్నికల సమయానికి మరికొందరిని చేర్చే పనిలో జాతీయ అధిష్టానం కసరత్తులు చేస్తున్నది. దీనిని బట్టి చూస్తే అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ ఎవరు బీఆర్ఎస్ కు అసలైన పోటీ ఇస్తారన్నది ఆసక్తికరంగా మారింది. తెలంగాణలో రాబోయే ఎన్నికల ఫలితాలు రాష్ట్రంలో అధికారం ఎవరిదో తేల్చడం ఒక్కటే కాదు.. ప్రతిపక్షం ఎదో కూడా తేల్చనుండడం మరింత ఆసక్తి కలిగిస్తున్నది.